ది కేరళ స్టోరీ: ఇది వాస్తవాల ఆధారంగా తీసిన సినిమానా, లేక ప్రచారాస్త్రమా?

ఫొటో సోర్స్, THE KERELA STORY
- రచయిత, వందన
- హోదా, టీవీ ఎడిటర్, బీబీసీ ఇండియా
నేటి సమాజంలో సినిమా కూడా ప్రచార అస్త్రంగా మారిపోయిందా? తాజాగా ‘ది కేరళ స్టోరీ’ విడుదలతో ఈ అంశంపై మళ్లీ చర్చ జరుగుతోంది. ఇదివరకు కశ్మీర్ ఫైల్స్ సినిమా విడుదలైనప్పుడు కూడా ఈ చర్చ జరిగింది.
దీనికి సంబంధించి ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ‘‘కేరళ చాలా అందమైన రాష్ట్రం. అక్కడ ప్రజలు చాలా కష్టపడతారు, మంచి ప్రతిభావంతులు కూడా. అయితే, రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని ఉగ్రవాద కుట్రలను ‘ది కేరళ స్టోరీ’ వెలుగులోకి తీసుకొచ్చింది’’అని మోదీ వ్యాఖ్యానించారు.
అయితే, చాలా మంది ప్రతిపక్ష నాయకులు ఆ సినిమాను ‘‘ఇస్లామిక్ వ్యతిరేక ప్రచార అస్త్రం’’గా చెబుతున్నారు. వీటి ద్వారా కేంద్రంలో అధికారంలోనున్న బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటోందని వారు విమర్శిస్తున్నారు.
సినిమాలు రాజకీయ ప్రచార అస్త్రాలుగా మారుతున్నాయనే వాదనపై ప్రొఫెసర్ ఇరా భాస్కర్ బీబీసీతో మాట్లాడారు. ‘‘నేడు చాలా సినిమాలు మెజారిటీలకు మద్దతుగా తీస్తున్నారు. నేను ‘ది కేరళ స్టోరీ’ని చూడలేదు. కానీ, దీని గురించి చాలా వార్తలు చదివాను. ఇస్లాంపై భయాన్ని పుట్టించేందుకు ఈ సినిమా తీసినట్లుగా అనిపిస్తోంది. ఇదివరకు కూడా కశ్మీర్‌పై ‘మిషన్ కశ్మీర్’, ‘లమ్హా’ లాంటి కొన్ని సినిమాలు వచ్చాయి. వీటిలో ఇటు భారత్, అటు పాకిస్తాన్ రెండింటిపైనా విమర్శలు చేశారు’’అని భాస్కర్ అన్నారు.
దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భాస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఆ సినిమాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గళాన్ని వినిపించారు. కానీ, ఆ సినిమాలేమీ ఇస్లామోఫోబిక్ సినిమాలు కాదు. అక్కడ ఏం జరిగిందో చూపించారు. అటు హిందువులు, ఇటు ముస్లింలు ఇద్దరికీ ఇది ఆమోదయోగ్యంకాదని చెప్పారు. కానీ, నేటి రాజకీయ పరిస్థితుల్లో సినిమాను ప్రచార అస్త్రంగా మారుస్తున్నారు. ఇక్కడ చరిత్రను, పాఠ్య పుస్తకాలను కూడా తిరగారాసే ప్రయత్నం చేస్తున్నారు’’అని భాస్కర్ చెప్పారు.

ఫొటో సోర్స్, @ANUPAMPKHER
అయితే, ఈ విషయంలో వస్తున్న విమర్శలపై ది కేరళ స్టోరీ నిర్మాత విపుల్ షా మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చేసిన వ్యాఖ్యలను ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘ప్రజలే సమాధానం చెబుతున్నారు. శుక్రవారంతో పోలిస్తే, ఆ తరువాత సోమవారం వసూళ్లు పెరిగాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా మా సినిమా గురించి మాట్లాడారు. జాతీయ స్థాయిలో చాలా మంది నాయకులు దీనికి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది మా విజయం. మా సినిమా ఏ వర్గానికీ వ్యతిరేకం కాదు. ఇది ఉగ్రవాద వ్యతిరేక సినిమా’’అని అన్నారు.
ఈ సినిమాపై ప్రశ్నలు వేస్తున్న వారి ఉద్దేశాలపైనా విపుల్ షా అనుమానం వ్యక్తంచేశారు. ‘‘మీరు మళ్లీ మళ్లీ ప్రశ్నలు అడిగి మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. జేపీ నడ్డా మా సినిమా చూసి ప్రశంసించారు. అయితే, ఆయన చూశారు కాబట్టి, ఇది బీజేపీ ప్రచార అస్త్రం అని అనుకోవడం తెలివి తక్కువతనం అవుతుంది’’అని ఆయన చెప్పారు.
మరోవైపు ఈ సినిమా మరో నిర్మాత సందీప్ సింగ్ కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. ‘‘మన పాఠ్య పుస్తకాల్లో అంశాలను చూసి టిప్పు సుల్తాన్ చాలా గొప్పవాడని అనుకున్నాను. ఆయన వెనుక చీకటి కోణాన్ని భవిష్యత్ తరాలకైనా చూపించాలని అనుకుంటున్నాను’’అని ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘‘టైగర్ ఆఫ్ మైసూర్’’గా పిలుచుకునే టిప్పు 1799లో చనిపోయేవరకూ ఈస్ట్ ఇండియా కంపెనీతో పోరాడారు.

ఫొటో సోర్స్, Rahulpandita
ఇక్కడ కొత్తగా ఏమైనా కనిపిస్తోందా?
సినిమాను ప్రచార అస్త్రంగా ఉపయోగించడం గురించి లోతుగా అర్థం చేసుకోవాలంటే మనం గతంలోకి తొంగిచూడాలి. 1975లో భారత్‌లో అత్యయిక స్థితి కొనసాగేటప్పుడు ప్రముఖ హిందీ నటుడు మనోజ్ కుమార్ ‘‘న్యాయ భారత్’’ పేరుతో ఇందిరా గాంధీ కోసం ఒక సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. కానీ, అత్యయిక స్థితిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ సినిమా పట్టాలపైకి వెళ్లలేదు.
అయితే, ఆ తర్వాత మనోజ్ కుమార్ సినిమా ‘శోర్’ను విడుదలకు ముందే దూరదర్శన్‌లో ప్రదర్శించారు. దీంతో థియేటర్లలో విడుదలైనప్పుడు ఆ సినిమాకు ఆశించినంతగా డబ్బులు రాలేదు.
ఇందిరా గాంధీ చెప్పినట్లు సినిమాను అత్యయిక స్థితిలో తీసి ఉంటే అది ప్రచార అస్త్రంగా ఉపయోగపడి ఉండేదా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం అంత కష్టమేమీకాదు.

ఫొటో సోర్స్, Rahulpandita
సినిమాలతో రాజకీయాలు..
‘ది కేరళ స్టోరీ’, ‘కశ్మీర్ ఫైల్స్’ లాంటి సినిమాలను ప్రచారాల కోసం రాజకీయ నాయకులు ఉపయోగించుకోవచ్చా? సినీ ప్రముఖు ప్రచార అస్త్రాల్లాంటి సినిమాలను తీయొచ్చా? అనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.
ఈ చర్చలపై రచయిత రాహుల్ పండిత బీబీసీతో మాట్లాడారు. ‘‘కశ్మీరీ పండితులను అణచివేశారని వారితోపాటు చాలామంది భావిస్తుంటారు. అందుకే కశ్మీర్ ఫైల్స్ సినిమా అంతలా విజయవంతమైంది. ఇప్పుడు నేను కూడా కశ్మీరీ పండితుల పేరును ఉపయోగిస్తే చాలా మంది ప్రశంసిస్తారు. నేను దీనిపై పుస్తకం ప్రచురించి దాదాపు పదేళ్లు గడుస్తోంది. అయితే, ఇప్పటికీ నాకు మెయిల్స్ వస్తుంటాయి’’అని ఆయన అన్నారు.
మరోవైపు కశ్మీర్‌పై రెండు పుస్తకాలు రాసిన అశోక్ కుమార్ పాండే మాట్లాడుతూ.. ‘‘కశ్మీరీ పండిట్లు వేదన అనుభవించారనేదాన్ని ఎవరూ కాదనలేరు. అయితే, ముస్లింలు కూడా అక్కడ ఉగ్రవాదానికి బాధితులుగా ఉన్నారు. వారు చెప్పేది పట్టించుకోకుండా తీసిన ఏకైనా సినిమా కశ్మీర్ ఫైల్స్‌గా చెప్పుకోవచ్చు. కశ్మీర్ లోయలో మరణించిన వారిలో ముస్లింల సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. కానీ, వారితో ఆ సినిమాకు ఎలాంటి సంబంధమూ లేదు. కేవలం హిందూ బాధితుల గురించే వారు ప్రధానంగా చూపించాలని అనుకున్నారు’’అని అన్నారు.
‘‘ఆ సినిమాలో ముస్లింలందరినీ విలన్లుగా చూపించారు. కానీ. నిజం ఏమిటంటే, చాలా మంది కశ్మీరీ పండిట్లను పొరుగునుండే ముస్లింలు రక్షించారు’’అని ఆయన చెప్పారు.
అయితే, కశ్మీర్ ఫైల్స్ వాస్తవాలను కళ్లుకు కట్టిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు బీజేపీలోని సీనియర్ నాయకులు చాలా మంది చెప్పుకొచ్చారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
అలానే ఇప్పుడు ‘‘ది కేరళ స్టోరీ’’ సినిమాకు కూడా కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ట్యాక్స్ నుంచి మినహాయింపులు ఇస్తున్నాయి. అప్పట్లో హరియాణా, గుజరాత్, మధ్యప్రదేశ్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కశ్మీర్ ఫైల్స్‌కు కూడా ఇలాంటి మినహాయింపులు ఇచ్చారు.
నిజానికి నెహ్రూతోపాటు కొందరు ప్రధాన మంత్రుల కాలంలోనూ సైద్ధాంతిక పరమైన సినిమాలు తీశారని, అయితే, వాటిని ‘క్రిటికల్స్ ఫిల్మ్స్’గా పిలిచేవారని ప్రొఫెసర్ ఇరా భాస్కర్ అన్నారు.
1950, 60ల కాలంలో నెహ్రూ గురించి చాలా గొప్పగా చెప్పుకునేవారు. ఆయన తీసుకొచ్చిన విధానాలపై కొన్ని సినిమాలూ కూడా వచ్చాయి.

ఫొటో సోర్స్, THE KASHMIR FILES
ఎలాంటి ప్రచారం ఇది?
అయితే, ఈ సిమాలను సిద్ధాంతాల నుంచి స్ఫూర్తి పొంది తీసారా? లేదా ఇవి పూర్తి ప్రచార అస్త్రాలా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
దీనిపై ఇరా భాస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఇదివరకు సినిమాలు ఏ వర్గానికి వ్యతిరేకంగా తీసేవారు కాదు. అభివృద్ధి, వర్గాల మధ్య సంబంధాల పెంపొందించడమే లక్ష్యంగా సినిమాలు వచ్చేవి. 1950ల నాటి సినిమాలను సెక్యులర్ సినిమాలుగా చెప్పుకోవచ్చు. వాటిలో భిన్నత్వం కనిపించేది. వాటిలో ఒక వర్గంపై విద్వేషం ఎప్పుడూ ఉండేది కాదు. అత్యయిక స్థిలోనూ దానికి మద్దతుగా చాలా సినిమాలు తీసినట్లు ఎప్పుడూ నేను వినలేదు’’అని అన్నారు.
వివేక్ అగ్నిహోత్రి సినిమా కశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడుతూ.. ‘ఇది సమాజాన్ని రెండు వర్గాలుగా విభజించింది’’అని అన్నారు. కశ్మీర్ ఫైల్స్ అనేది ఒక యూనివర్సిటీ విద్యార్థికి చెందిన కాల్పనిక కథ. కశ్మీరీ పండిట్లయిన తన తల్లిదండ్రులను ఇస్లామిక్ ఉగ్రవాదులు హత్య చేశారని అంశం చుట్టూ ఆ కాల్పనిక కథ తిరుగుతుంది’’ అని ఇరా భాస్కర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలు మోదీ ఎందుకు ప్రస్తావించారు?
తన ప్రసంగంలో కశ్మీరీ ఫైల్స్ గురించి అప్పట్లో మోదీ ప్రస్తావించారు. ‘‘ఎన్నాళ్ల నుంచో అణచివేస్తున్న నిజాలను కశ్మీరీ ఫైల్స్‌లో చూపించారు. కొంత మంది భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడతారు. మీరు అత్యయిక స్థితిని చూసే ఉంటారు. అది చాలా పెద్ద పరిణామం. కానీ, దాని గురించి ఒక్క సినిమా కూడా రాలేదు. ఇలా నిజాల గొంతు నొక్కేందుకు నిత్యం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆగస్టు 14ను దేశ విభజన దినంగా జరపాలని మేం భావించినప్పుడు చాలా మంది అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అసలు మన దేశాన్ని మనం ఎలా మరచిపోగలం? దేశ విభజన గురించైనా ఏదైనా మంచి సినిమా వచ్చిందా?’’అని ఆయన ప్రశ్నించారు.
ఇదివరకటి వివేక్ అగ్నిహోత్రి సినిమా ‘ద తాష్కెంట్ ఫైల్స్’పైనా అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. దీనిలో చూపించినవి అబద్ధాలని శాస్త్రి మనవడు అగ్నిహోత్రికి లీగల్ నోటిసులు కూడా పంపించారు.
అయితే, ఇలాంటి వివాదాస్పద సినిమాలను ప్రధాన మంత్రి తన ప్రసంగాల్లో మళ్లీ మళ్లీ ప్రస్తావించడం ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది.

ఫొటో సోర్స్, THE KERALA STORY
‘ది కేరళ స్టోరీ’ ట్రైలర్‌లో కేరళకు చెందిన 32,000 మంది జిహాద్‌లో చేరడానికి వెళ్లారని ప్రస్తావించడంతో పెద్ద వివాదమే చెలరేగింది. అసలు ఈ సంఖ్య ఎక్కడి నుంచి వచ్చిందని ఆ సినిమా నిర్మాతలను కోర్టు ప్రశ్నించినప్పుడు.. మొత్తంగా ఆ సంఖ్యను తొలగించాలని నిర్ణయించారు.
సినీ విమర్శకుడు అర్ణబ్ బెనర్జీ దీనిపై మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి సినిమాల దర్శకులు, నిర్మాతలు తమ సినిమాను వాస్తవాల ఆధారంగా తెరకెక్కించామని చెబుతుంటారు. నిజానికి ఈ ఘటనలు ఇప్పుడు జరిగినవి కాదు. అంటే ఎవరో చెప్పిన దానిపై వీరు ఆధారపడాలి. వారు చెప్పేదే పూర్తిగా నమ్మాలి. ఈ సినిమాల అంతిమ లక్ష్యం ఏమిటంటే ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందేలా చేయడమే. వీటిలో చూపించే నిజాలన్నీ అసంపూర్తిగా పుంటాయి. వీటికి కాషాయ రంగు పులిమేందుకు వెనుక ప్రయత్నాలు జరుగుతుంటాయి. వీటిలో విలన్లు మాత్రం ముస్లింలే’’అని అన్నారు.
కేరళ ప్రజలు ఎక్కువగా జీవించే దుబాయికి చెందిన సినీ విమర్శకుడు రోనక్ కోటెచా మాట్లాడుతూ.. ‘‘ఇక్కడకు వచ్చే భారతీయుల ఎకైక లక్ష్యంగా ప్రశాంతంగా జీవనోపాధి పొందడమే. ఇక్కడి ప్రజలు పెద్దగా దేనిపైనా స్పందించరు. ఇక్కడి మీడియాలోనూ ‘ది కేరళ స్టోరీ’ గురించి పెద్దగా కథనాలు కనిపించవు’’అని అన్నారు.

ఫొటో సోర్స్, @ADAH_SHARMA
సినిమా, రాజకీయాల మధ్య సంబంధం..
సినిమా, రాజకీయల మధ్య సంక్లిష్టమైన సంబంధం ఉంటుంది. కొన్ని సినిమాలను రాజకీయ అస్త్రాలుగా చూస్తుంటే, మరికొన్ని అధికారానికి సవాల్ విసురుతుంటాయి.
సినిమా, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, ప్రచార అస్త్రాలు.. ఈ అంశాలన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకున్నట్లు కనిపిస్తాయి.
మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అడ్వాణీలకు సినిమాలంటే బాగా ఇష్టం. ‘‘కోయి మిల్ గయా’’ సినిమాను వాజ్‌పేయీ కోసం రాకేశ్ రోషన్ ప్రత్యేకంగా ప్రదర్శించారు.
మరోవైపు అడ్వాణీ కోసం ‘తారే జమీన్ పర్’’ను కూడా 2007లో ఇలానే స్క్రీన్ చేశారు. ఈ సినిమా చూసి అడ్వాణీ ఏడ్చేశారని అప్పట్లో చాలా కథనాలు కూడా వచ్చాయి.
అయితే, 2006లో నర్మదా బచావో ఆందోళన్‌లో పాల్గొనందుకు ఆమిర్ ఖాన్‌ను సంఘ్ పరివార్ సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఆ తర్వాత ఆమిర్ సినిమా ‘‘ఫనా’’ను గుజరాత్‌లో నిషేధించారు కూడా.
ప్రచారం వర్సెస్ వినోదం
కొన్ని సంవత్సరాలుగా ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశాలు, ప్రభుత్వ విధానాలను సినిమా కథలుగా ఎంచుకుంటున్నారు.
‘‘మతపరమైన చీలికలు కనిపిస్తున్న తరుణంలో కొందరు హిందూ చక్రవర్తులను గొప్ప హీరోలుగా చూపించడం, ముస్లింలను దురాక్రమణ దారులుగా చూపించడం ఎక్కువైంది’’అని అర్ణబ్ అన్నారు.
గతంలోనూ మతం, కులాల ఘర్షణలు, హింసపై సినిమాలు వచ్చాయి. అయితే, వీటిలో చాలా సినిమాలను ప్రచార అస్త్రాలుగా ఉపయోగించినట్లు ఆరోపణలు రాలేదు. కానీ, నేడు ఈ తేడా తగ్గిపోతోంది. దీంతో అసలు ఏ సినిమా నిజాలను చూపిస్తోంది? ఏది తప్పుడు ప్రచారం చేపడుతోంది? లాంటి అంశాలను తెలుసుకోవడం కష్టం అవుతోంది.
కశ్మీర్ ఫైల్స్‌పై డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్ సిద్ధార్థ్ కాక్ మాట్లాడుతూ.. ‘‘కశ్మీరీ ఫైల్స్‌లో కథ వాస్తవమైనదని చెప్పారు. కానీ, కశ్మీర్‌లో గత 30 ఏళ్ల చరిత్ర చెప్పకుండా కశ్మీరీ పండిట్ల కథను చెప్పలేం. అందుకే ఇంత సంక్లిష్టమైన కథను చూపించేందుకు ఎవరూ సాహసం చేయలేదు. ఈ కథల్లో చాలా కోణాలు ఉంటాయి. అన్నింటినీ ఒక్కక్కటిగా చెప్పుకుంటూ వెళ్లాలి’’అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మణిపుర్: ‘ప్రాణాలు కాపాడుకోవాలంటే పరిగెత్తాల్సిందే... మరో దారి లేదు’
- ఐపీఎల్ 2023: ప్లే ఆఫ్స్‌కు చేరేదెవరు? ఇంటి ముఖం పట్టేదెవరు?
- కరీంనగర్ - ఆశ: ఒకప్పుడు భిక్షాటనతో బతికిన హిజ్రా.. ఇప్పుడు ఫొటోగ్రాఫర్ ఎలా అయ్యారు?
- తెలియని అంతర్జాతీయ నంబర్ల నుంచి పోటెత్తుతున్న వాట్సాప్ కాల్స్ .. ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీకు ముప్పే
- పాకిస్తాన్లో ‘డర్టీ హ్యారీ’ ఎవరు, ఇమ్రాన్ ఖాన్ పదే పదే ఆ పేరెందుకు చెబుతున్నారు?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















