తెలంగాణ: నిరుద్యోగ సమస్యే వచ్చే ఎన్నికల్లో ప్రధాన అజెండా అవుతుందా?

కేసీఆర్

ఫొటో సోర్స్, KCR/FB

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నీళ్లు, నిధులు, నియామకాలు.. ఈ మూడు లక్ష్యాలపై ఏర్పాటైంది తెలంగాణ. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు కావొస్తున్న తరుణంలో నియామకాల అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

తెలంగాణలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు నియామకాల సమస్యనే ప్రధాన అజెండా తీసుకున్నాయి. గత కొన్ని నెలలుగా ప్రతిపక్షాలు సైతం ఇదే అంశంలో ప్రభుత్వంపై పోరాడుతున్నాయి.

మరో ఐదు నెలల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ నిరుద్యోగం, నియామకాల అంశం ప్రధాన ప్రచార అస్త్రంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇప్పుడు యువతను ఆకట్టుకునే పనిలో ఎవరు చాంపియన్ అవుతారనేది కీలకం కాబోతోందని అంటున్నారు.

నిరుద్యోగం

ఫొటో సోర్స్, Getty Images

ప్రతిపక్షాల అస్త్రంగా..

దాదాపు 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఏడాది కిందట రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

వరుస నోటిఫికేషన్లను టీఎస్పీఎస్సీ, పోలీసు నియామక మండలి విడుదల చేస్తున్నాయి.

ఈ క్రమంలో రెండు నెలల కిందట వెలుగు చూసిన టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం నియామకాల ప్రక్రియను కీలక మలుపు తిప్పింది.

దీని తర్వాత రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు నిరుద్యోగుల అంశం మీద ప్రభుత్వంపై గళమెత్తడం ప్రారంభించాయి.

కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీలు నిరుద్యోగుల అంశంపై మాట్లాడుతున్నాయి.

ఏప్రిల్ నుంచి ప్రాంతాల వారీగా నిరుద్యోగ మార్చ్‌లను నిర్వహిస్తోంది బీజేపీ.

ఇప్పటికే వరంగల్ , మహబూబ్‌నగర్‌లలో సభలు నిర్వహించింది. సంగారెడ్డిలో మరో సభ జరగనుందని ప్రకటించింది.

ప్రియాంకా గాంధీ

ఫొటో సోర్స్, ANI

కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్‌ ఆకట్టుకుంటుందా?

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో యువ సంఘర్షణ సభ నిర్వహించింది. దీనికి పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ హాజరయ్యారు.

ఇందులో కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది.

అధికారంలోకి వస్తే.. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ, జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి, సెప్టెంబరు 17లోపు నియామకాలు పూర్తి చేయడం, సెంట్రలైజ్డ్ ఆన్‌లైన్ రిజస్ర్టేషన్ పోర్టల్ ఏర్పాటు, ప్రతి జిల్లాలో ఎంప్లాయిమెంట్ ఎక్చేంజీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు, ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేటు కంపెనీల్లో తెలంగాణ యువతకు 75శాతం ఉద్యోగాలు.. ఇలా వివిధ అంశాలతో డిక్లరేషన్ ప్రకటించింది.

‘‘నిరుద్యోగుల డిక్లరేషన్ వెనుక ఓట్లు ఒక్కటే కాదు, నిరుద్యోగుల సమస్యలను ఎత్తి చూపాలనే అజెండా ఉంది.

తెలంగాణ ఏర్పాటు వెనుక మూడు ఉద్దేశాలు ఉన్నాయనుకుంటే.. నిధులన్నీ నీళ్ల కోసమే ప్రభుత్వం ఖర్చు చేసింది. కానీ నియామకాలను పట్టించుకోలేదు. దీనివల్ల నిరుద్యోగ యువత ఆందోళనలో ఉన్నారు. వారికి భరోసా కల్పించే ఉద్దేశంతోనే యూత్ డిక్లరేషన్ తీసుకువచ్చాం. దీన్ని నియోజకవర్గ, యూనివర్సిటీ, కళాశాల స్థాయిలకు తీసుకెళతాం’’ అని టీపీసీసీ అధికార ప్రతినిధవి అద్దంకి దయాకర్ బీబీసీకి చెప్పారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అన్ని పార్టీలు నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండటం రాజకీయంగానే వేడి రాజేస్తోంది.

నిరుద్యోగం

ఫొటో సోర్స్, Getty Images

ఎవరు చాంపియన్ అవుతారు?

ఎందుకు ఇంతలా నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి?

దీని వెనుక ఓట్లు సాధించాలనే వ్యూహం ప్రధానంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజీ తరఫున 2019లో జరిపిన సర్వే ప్రకారం 20 లక్షల మంది గ్రాడ్యుయేట్లు తెలంగాణలో ఉన్నట్లు అంచనా వేశారు.

ఇప్పుడు ఆ సంఖ్య 25లక్షలకు చేరిందని రాజకీయ పార్టీలు వేసుకుంటున్న అంచనా.

వీరితోపాటు ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ దశలో మరో 5లక్షల మంది ఉంటారు.

వీరిలో చాలా మంది కొత్తగా నమోదైన ఓటర్లే ఉంటారు.. కనుక వారి ఓట్లు రాబట్టేందుకు ప్రధాన పార్టీలు నిరుద్యోగుల అంశాన్ని ఎత్తుకున్నాయనే అంశంపై చర్చ నడుస్తోంది.

ఈ విషయంపై ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ బీబీసీతో మాట్లాడారు.

‘‘ప్రభుత్వం మీద ఏ అంశంపై అసంత్రప్తి ఉంది? ఏ సెక్షన్లలో వ్యతిరేకత ఉంది? లాంటి అంశాలను ప్రతిపక్షలు గుర్తిస్తాయి. ఆ వర్గానికి చాంపియన్ అయ్యే ప్రయత్నాలు కూడా చేస్తాయి. బీఆర్ఎస్ పట్ల విద్యార్థులు, యువత.. ముఖ్యంగా నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను తమ వైపు తిప్పుకొనేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఇలా ఓట్లు ప్రతిపక్షాల మధ్య చీలడంతో బీఆర్ఎస్‌కే లబ్ధి చేకూరుతుంది’’ అని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ చెప్పారు.

నిరుద్యోగం

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో నిరుద్యోగం ఎంత ఉంది?

తెలంగాణలో నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా 2022 గణాంకాల ప్రకారం తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 34 శాతంగా ఉంది. ఈ విషయంలో తెలంగాణ కంటే ఏపీ సహా 13 రాష్ట్రాలలో నిరుద్యోగ రేటు తక్కువగా ఉంది.

తెలంగాణలో పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి నిరుద్యోగ రేటు 65 శాతంగా ఉన్నట్లు ఆర్బీఐ అంచనా వేసింది. అంతకుముందు ఏడాది(2019-20) 97 శాతంతో పోల్చితే ఇధి తక్కువగా ఉంది. తెలంగాణ కంటే 16 రాష్ట్రాలల్లో నిరుద్యోగ రేటు తక్కువగానే ఉంది.

వీడియో క్యాప్షన్, ‘కేజీ టు పీజీ’ ఉచిత విద్య అమలు ఎంత వరకు వచ్చింది?

ప్రభుత్వ హామీ...

80,039 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నిరుడు మార్చి 9న అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

మరో 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫైలుపై ఇటీవల కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు.

ప్రకటించిన 80,039 ఉద్యోగాలల్లో ఏ మేరకు భర్తీ చేశారన్నది ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన ఏదీ రాలేదనే చెప్పాలి.

అయితే, ఇటీవల మంత్రి కేటీఆర్ ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ, "ప్ర‌భుత్వ రంగంలో 2.2 ల‌క్ష‌ల ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో 22 ల‌క్ష‌లకు పైగా ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నాం. గత తొమ్మిదేళ్లలో తెలంగాణ‌ను ఉపాధి కల్పనలో నంబర్ వన్ స్థానంలో నిలిపాం. నిరుద్యోగాన్ని పెంచి పోషించినందుకు కాంగ్రెస్, బిజెపీలే క్షమాపణలు చెప్పాలి." అని అన్నారు.

టీఎస్పీఎస్సీలో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం కారణంగా గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈ, డీఏవో పరీక్షలను రద్దు చేయగా.. మరికొన్ని పరీక్షలను వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికలలోగా పరీక్షల ప్రక్రియలను పూర్తి చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదే విషయంపై నిరుద్యోగ జేఏసీ ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీనివాస్ బీబీసీతో మాట్లాడారు. ‘‘తెలంగాణలో విద్యార్థులందరూ అప్పట్లో భాగస్వాములైంది నియామకాల కోసమే. ఏళ్ల తర్వాత జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చినా లీకేజీ వ్యహారంతో నియామకాలు సరిగా జరగడం లేదు. టీఎస్పీఎస్సీలో రాజకీయ జోక్యం ఉండకూడదు. పైరవీల అవకాశం లేకుండా శాశ్వత ఉద్యోగులను నియమించాలి.

అనుభవం ఉన్న వారిని నియమించి నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలను నిర్వహించాలి’’ అని చెప్పారు.

వీడియో క్యాప్షన్, కేసీఆర్: ‘తెలంగాణలో ఎకరం అమ్మి ఆంధ్రాలో ఐదెకరాలు కొంటున్నారు’

నిరుద్యోగ భృతి హామీ ఏమైంది?

2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో నిరుద్యోగులకు భృతి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రతి నిరుద్యోగికి రూ.3016 ఇస్తామని ప్రకటించారు.

దానికి తగ్గట్టుగా అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో 1810 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.

నిరుద్యోగుల ఎంపికలో జరిగిన జాప్యంతో హామీ అమలు కాలేదని నిరుద్యోగులు చెబుతున్నారు.

‘‘తల్లిదండ్రులు అప్పులు తెచ్చి పిల్లలను కోచింగ్‌కు పంపిస్తున్నారు. నిరుడు ప్రకటించిన ఉద్యోగ నియామక ప్రకటనల్లో దాదాపు 17వేల ఉద్యోగాలు పోలీసు శాఖవే ఉన్నాయి. అవి ముందుకు సరిగా సాగలేదు. నిరుద్యోగులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది’’ అని నిరుద్యోగ జేఏసీ ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)