చంద్రుడిపై అణుబాంబు పేల్చాలని అమెరికా ఎందుకు ప్లాన్ వేసింది?

చంద్రుడిపై అణుబాంబు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మార్క్ పెయిసింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇది 1950ల నాటి మాట. అంతరిక్ష పరిశోధనలో సోవియట్ యూనియన్ (నేటి రష్యా) ముందుంజలో ఉన్న రోజులవి. ఆ సమయంలో అమెరికా శాస్త్రవేత్తలు ఒక విచిత్రమైన ప్రణాళిక రూపొందించారు. సోవియట్లను భయపెట్టడానికి చంద్రుడి ఉపరితలాన్ని ధ్వంసం చేయాలని ప్లాన్ చేశారు.

1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టిన క్షణం చరిత్రలో మరపురాని క్షణాలలో ఒకటి. కానీ, ఆర్మ్‌స్ట్రాంగ్ అడుగుపెట్టిన చంద్రుడు అగ్నిపర్వతాలు పేలిన మచ్చలతో, అణుబాంబు దాడి ప్రభావంతో విషపూరితమైనదైతే ?

'ఎ స్టడీ ఆఫ్ లూనార్ రీసెర్చ్ ఫ్లైట్స్, వాల్యూం 1' - అన్న ఈ హెడింగ్ చదివితే సాదాసీదాగా అనిపిస్తుంది. చంద్రుడిపై వచ్చిన పరిశోధనా పత్రాల్లో ఒకటి అనుకుని పక్కన పడేసే అవకాశం కూడా ఉంది.

కానీ, అట్టపై ఉన్న బొమ్మ చూస్తే సందేహం మొదలవుతుంది. ఒక అణుబాంబు దాని చుట్టూ పుట్టగొడుగుల్లా మబ్బులు. న్యూ మెక్సికోలోని కిర్ట్‌ల్యాండ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఎయిర్ ఫోర్స్ స్పెషల్ వెపన్స్ సెంటర్ చిహ్నం అది. అణ్వాయుధాల అభివృద్ధి, పరీక్షలో కీలక పాత్ర పోషించిన సెంటర్ ఇది.

బొమ్మ కింద రచయిత పేరు ఉంది..ఎల్ రీఫిల్ లేదా లియోనార్డ్ రీఫిల్. అమెరికాకు చెందిన ప్రముఖ అణు భౌతిక శాస్త్రవేత్తలలో ఒకరు. ప్రపంచంలో మొట్టమొదటి అణు రియాక్టర్ సృష్టికర్త ఎన్రికో ఫెర్మీతో కలిసి పనిచేశారు ఆయన. ఎన్రికో ఫెర్మీని "అణుబాంబు రూపకర్త" అని కూడా పిలుస్తారు.

'ప్రాజెక్ట్ ఏ119'.. అనేది చంద్రునిపై హైడ్రోజన్ బాంబును పేల్చడానికి చేసిన అత్యంత రహస్య ప్రతిపాదన.

1945లో హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే హైడ్రోజన్ బాంబులు చాలా ఎక్కువ విధ్వంసకరం. ఆ సమయంలో తయారవుతున్న అణ్వాయుధాల్లో సరికొత్తవి కూడా.

ఎయిర్ ఫోర్స్‌లోని సీనియర్ అధికారులు ప్రాజెక్ట్‌ను వేగవంతం చేయమని కోరడంతో, ఎల్ రీఫిల్ 1958 మే, 1959 జనవరి మధ్య ఈ ప్లాన్‌కు సంబంధించిన సాధ్యసాధ్యాలపై అనేక రిపోర్టులు అందించారు.

క్షిపణి సాంకేతికత.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్షిపణి సాంకేతికతలో సోవియట్ యూనియన్ వేగంగా దూసుకుపోతోందని, ఈ రేసులో తాము వెనుకబడిపోయామని అమెరికా ఆందోళన చెందింది.

నమ్మశక్యం కాని విషయం ఏమిటంటే, ప్రముఖ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ ఈ ప్రాజెక్ట్ సృష్టికర్తల్లో ఒకరు.

ఈ రహస్య ప్రాజెక్ట్ గురించి 1990ల వరకు ఎవరికి తెలీదు. 1990లలో సాగన్ ఒక ప్రముఖ యూనివర్సిటీలో ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించారు. అలా ప్రపంచానికి ఈ నిజం తెలిసింది.

ప్రాజెక్ట్ ఏ119 ప్రాథమిక లక్ష్యం, శక్తి ప్రదర్శన, సత్తా చాటుకోవడం. ప్లాన్ ఏంటంటే.. చంద్రుడి వెలుగు, చీకటి మధ్య సరిహద్దుగా ఉన్న టెర్మినేటర్ లైన్‌పై అణుబాంబు పేలుతుంది. సోవియట్ యూనియన్‌కు కళ్లు మిరిమిట్లు గొలిపే కాంతిని వెదజల్లుతూ విస్ఫోటనం జరుగుతుంది.

అటువంటి భయంకరమైన ప్రణాళికను ప్రతిపాదించడానికి నమ్మదగిన వివరణ ఒక్కటే.. అభద్రత, నిరాశల మధ్య ఊగిసలాడుతున్న ఆలోచనలు.

1950లలో అమెరికా ప్రచ్ఛన్న యుద్ధాన్ని గెలుస్తుందన్న నమ్మకం కనిపించలేదు. అణ్వాయుధాల తయారీలో సోవియట్ యూనియన్ ముందంజలో ఉందని అమెరికా రాజకీయనాయకులు, ప్రజలు కూడా భావించారు.

1952లో అమెరికా తొలి హైడ్రోజెన్ బాంబును పరీక్షించింది. మూడేళ్ల తరువాత సోవియట్ యూనియన్ సొంతంగా తయారుచేసుకున్న అణుబాంబు పరీక్ష జరిపింది. ఇది అమెరికాకు ఆశయాలకు విఘాతం కలిగించింది.

అక్కడితో ఆగకుండా 1957లో 'స్పుత్నిక్ 1' ప్రయోగించి అంతరిక్ష పరిశోధనలో కూడా దూసుకెళ్లింది. భూమి నుంచి విశ్వంలోకి పంపిన తొలి కృత్రిమ ఉపగ్రహం ఇదే.

మరోవైపు, అమెరికా ప్రయోగించిన "కృత్రిమ చంద్రుడు" ప్రయోగం దారుణంగా విఫలమైంది. అంతరిక్షంలోకి చేరే ముందే పేలిపోయింది.

ఇది అమెరికాకు మింగుడుపడలేదు.

1957లో సోవియట్ యూనియన్ స్పుత్నిక్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది పశ్చిమ దేశాలను కలవరపెట్టింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1957లో సోవియట్ యూనియన్ స్పుత్నిక్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది పశ్చిమ దేశాలను కలవరపెట్టింది.

మరోపక్క, సోవియట్ యూనియన్ అణ్వాయుధ రాకెట్‌ను సమీప దేశంపై ప్రయోగించేందుకు సిద్ధమవుతోందని నిఘా వర్గాల ద్వారా సమాచారం అందినట్టు అమెరిక వార్తాపత్రికల్లో రిపోర్టులు వచ్చాయి. ఈ వదంతులు ఎక్కడ, ఎలా మొదలయ్యాయో చెప్పడం కష్టం.

అయితే, విచిత్రంగా ఇదే భయాన్ని ఆసరాగా చేసుకుని సోవియట్ యూనియన్ 'కోడ్‌నేమ్డ్ ఈ4' అనే బాంబును తయారుచేసింది. కానీ, దాని ప్రయోగాన్ని నిలివేసింది. బాంబు విఫలమై సోవియట్ ప్రాంతంలోనే పడితే తీరని నష్టం వాటిల్లుతుందని భావించి, ప్రయోగాన్ని ఆపింది.

దీని కన్నా చంద్రుడిపై అడుగుపెట్టడం అమెరికాకు మరింత పెద్ద షాక్ ఇస్తుందని సోవియట్ యూనియన్ భావించి ఉండవచ్చు.

ప్రాజెక్ట్ ఏ119 ప్రణాళిక ఉనికిలోకి వచ్చి ఉంటే, పనిచేసేది.

2000లో రీఫిల్ దీని గురించి మాట్లాడుతూ, "ఆ ప్రాజెక్ట్ సాంకేతికంగా సాధ్యమేనని", ఆ విధ్వంసం భూమిపై ఉన్నవారికి కనిపించి ఉండేదని చెప్పారు.

దీనివల్ల చంద్రుడి వాతావరణం నాశనం అయిపోతుందన్న చింత యూఎస్ ఎయిర్ ఫోర్స్‌కు లేదు. కానీ, శాస్త్రవేత్తలు కొంత ఆందోళన వ్యక్తంచేశారు.

1957లో అమెరికా ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు ప్రయత్నించింది. కానీ, దానిని మోసుకెళ్లిన వాన్‌గార్డ్ రాకెట్ ప్రయోగించిన వెంటనే పేలిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1957లో అమెరికా ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు ప్రయత్నించింది. కానీ, దానిని మోసుకెళ్లిన వాన్‌గార్డ్ రాకెట్ ప్రయోగించిన వెంటనే పేలిపోయింది.

"స్పుత్నిక్ ప్రయోగానికి ప్రతిస్పందనగా వెల్లువెత్తిన అనేక ఆలోచనల్లో ప్రాజెక్ట్ ఏ119 ఒకటి. స్పుత్నిక్‌ను పేల్చేయాలన్న ఆలోచన కూడా రూపుదిద్దుకుంది. ప్రజలను ఆకర్షించడానికి చేసిన స్టంట్స్ ఇవన్నీ. చివరికి సొంత ఉపగ్రహాన్ని ప్రయోగించడమే మార్గమని తెలుసుకున్నారు. దానికి కొంత సమయం పట్టింది. కానీ, ప్రాజెక్ట్ ఏ119ను కొంత సీరియస్‌గానే తీసుకున్నారు. 1950ల చివరకు వరకూ దానిపై పనిచేశారు" అని సైన్స్ అండ్ న్యూక్లియర్ టెక్నాలజీ చరిత్రకారుడు అలెక్స్ వెల్లర్‌స్టెయిన్ చెప్పారు.

"ఆ కాలంలో అమెరికా ఆలోచనలు ఎలా ఉండేవన్న దానికి ఇదొక ఉదాహరణ. అది ఎంత భయానకంగా ఉన్నా, పోటీ పడడమే ముఖ్యం అనుకున్నారు. శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి ప్రణాళికకు వెనుకాడలేదు. ఆరోజుల్లో ఫిజిక్స్ చాలా రాజకీయమైపోయింది" అని ఆయన అన్నారు.

"1950, 1960లలో స్పేస్ మానియా అలా ఉండేది. ఇప్పుడు అలాంటి ఆలోచన మళ్లీ ఊపిరి పోసుకుంటే, అది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అవుతుంది" అని అంతరిక్షంలో అంతర్జాతీయ సంబంధాలలో నిపుణుడు బ్లెడిన్ బోవెన్ అన్నారు.

ప్రాజెక్ట్ ఏ119కి సంబంధించిన అనేక అంశాలు ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయాయి. వాటిలో చాలావాటిని నాశనం చేశారు కూడా.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)