మహిళలకు సౌకర్యంగా ఉండే స్పేస్ సూట్, అసలు వ్యోమగాములు అంతరిక్షంలో ఏం తింటారు

అంతరిక్షం

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నానా ఒక కొత్త స్పేస్ సూట్‌ను సిద్ధంచేసింది. 2025లో చంద్రుడిపైకి వెళ్లేవారు దీన్ని ఉపయోగించబోతున్నారు.

ప్రస్తుతం అమెరికా వ్యోమగాములు ఉపయోగిస్తున్న స్పేస్ సూట్‌లలో 1981 తర్వాత పెద్దగా మార్పులు చేయలేదు.

తాజా స్పేస్ సూట్ మహిళలకు మరింత సౌకర్యవంతంగా ఉండబోతోంది.

అన్ని పరీక్షలు పూర్తయితే, ఆర్టెమిస్-3 మిషన్‌లో దీన్ని ఉపయోగించే అవకాశముంది.

గత ఐదు దశాబ్దాల్లో చంద్రుడిపై వ్యోమగాములు అడుగుపెడుతున్న తొలి మిషన్‌గా ఇది రికార్డు సృష్టించబోతోంది.

తాజా స్పేస్ సూట్ నేపథ్యంలో చాలా మంది నెటిజన్లు అసలు స్పేస్‌లో ఎలా గడుపుతారు? రోజూ ఆహారం ఎలా తీసుకుంటారు? లాంటి చాలా ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా సంధిస్తున్నారు.

ఈ విషయంపై నాసా వ్యోమగామిగా పనిచేసిన నికోల్ స్టాట్‌తో బీబీసీ ఫుడ్ చెయిన్ రేడియో ప్రోగ్రామ్ మాట్లాడి తాజా కథనాన్ని అందిస్తోంది.

నికోల్ స్టాట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నికోల్ స్టాట్

‘‘పిజ్జా తినాలని అనిపించేది’’

‘‘నేను పిజ్జా గురించి చాలా ఆలోచించే దాన్ని’’అని నికోల్ చెప్పారు.

రెండు మిషన్లలో మొత్తంగా వంద రోజులకుపైనే ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో గడిపారు. అప్పుడు వ్యోమగాముల కోసం ప్రత్యేకంగా సిద్ధంచేసిన ఆహారాన్ని ఆమె తీసుకునేవారు.

‘‘చక్కని కరకరలాడే పిజ్జా బేస్‌పై చీజ్, వేడివేడి సాస్‌లు వేసుకుని తింటున్నట్లుగా నాకు తరచూ అనిపించేది’’అని ఆమె వివరించారు.

అంతరిక్షంలో భూమి గురుత్వాకర్షణ శక్తి ఉండదు. దీనికి అనుగుణంగా ఆహారాన్ని పరిశోధకులు సిద్ధంచేస్తారు. ముఖ్యంగా అక్కడ రొట్టెలు ఉండవు. ఎందుకంటే రొట్టె ముక్కలు పరిసరాలోని గాల్లో తేలకూడదు. దీనికి బదులుగా పలుచగా ఉండే టోటియాజ్‌లను తీసుకోవాల్సి ఉంటుంది.

‘‘ఉదాయం మీరు స్క్రాంబుల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చు. కావాలంటే ఆమ్లెట్ కూడా తినొచ్చు’’అని నికోల్ చెప్పారు.

ఐఎస్ఎస్‌కు భిన్న దేశాల ప్రజలు వస్తుంటారు. దీంతో మనం స్కూలు పిల్లల తరహాలో భోజనం డబ్బాలను మార్చుకోవచ్చని నికోల్ వివరించారు.

‘‘మధ్యాహ్నం కొన్ని సూప్‌లు ఉంటాయి. టోటియాజ్‌లలో ఏవైనా సాస్‌లు వేసుకొని తినొచ్చు. రాత్రికి భోజనంలో రుచికరమైన జాపనీస్ కర్రీస్ ఉంటాయి’’అని ఆమె చెప్పారు.

అంతరిక్షం

ఫొటో సోర్స్, Getty Images

అన్నీ గాల్లో తేలుతూ..

ఐఎస్ఎస్‌లో ప్లేట్లు లేదా గిన్నెలు ఉండవు. అన్నీ గాల్లో తేలుతూ ఉంటాయి.

అక్కడ వ్యోమగాములు తీసుకునే ఆహారం ‘‘హైలీ ప్రాసెస్డ్ ఫుడ్’’.

బరువు తక్కువగా ఉండేందుకు వీటిని ప్రత్యేకంగా తయారుచేస్తారు. వీటిలో నీరు లేకుండా ప్రత్యేక జాగ్రత్త వహిస్తారు.

వీటిని తినే ముందు, వ్యోమగాములు నీరు తాగుతారు.

ప్యాక్‌లలో ఆహారం వస్తుంది. ఈ ప్యాక్‌లనే ప్లేట్‌గా ఉపయోగిస్తారు. దీనిలోనే ఒక ప్రత్యేక స్పూన్ కూడా ఉంటుంది.

‘‘పొడుగైన హ్యాండిల్ ఉండే ఈ స్పూన్‌తో అన్నం, కూరలు తీసుకోవచ్చు. ఆ ఆహారం మొత్తం మన ముందు గాల్లో తేలుతూ ఉంటుంది’’అని నికోల్ వివరించారు.

గాల్లో తేలుతుంటే ఆహారం తినడం కాస్త కష్టంగా అనిపిస్తుంది కదా?

‘‘నిజానికి మనకు చాలా సరదాగా అనిపిస్తుంది. పక్కనుండే వారి ఆహారం కూడా ఒక్కోసారి మన ముందుకు వస్తుంటుంది. చాలా సరదాగా ఉంటుంది’’అని నికోల్ చెప్పారు.

అంతరిక్షం

ఫొటో సోర్స్, Getty Images

శుద్ధిచేసిన నీరు..

అంతరిక్షంలో ఉండేటప్పుడు శరీరంలో నీటి స్థాయిలు పడిపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. మరి వ్యోమగాములకు కావాల్సిన నీరు ఎక్కడి నుంచి వస్తుంది?

భూమి నుంచి వెళ్లేటప్పుడే కొంత నీరును వ్యోమగాములు తీసుకుని వెళ్తారు. మిగతా నీటిని రీసైక్లింగ్ నుంచి తీసుకుంటారు.

వ్యోమనౌక ఫ్యూయల్ సెల్స్‌ నుంచి వచ్చే నీటితోపాటు గాలిలోని తేమ, వ్యోమగాముల మూత్రం ఇలా చాలా రకాలుగా వచ్చే నీటిని రీసైక్లింగ్ చేస్తుంటారు.

ఇది మీకు కాస్త విచిత్రంగా అనిపించొచ్చు. అయితే, ఈ నీరు భూమిపై చాలా మంది తాగేదానికంటే శుభ్రంగా ఉంటుందని నాసా చెబుతోంది.

అంతరిక్షం

ఫొటో సోర్స్, Getty Images

ఆరోగ్య సమస్యలు..

వ్యోమగాములు తీసుకునే ఆహారం, వీటిలో పోషక స్థాయిలపై చాలా ప్రశ్నలు వస్తుంటాయి. అంతరిక్షంలో మన శరీరంపై కనిపించే కొన్నిరకలా ప్రతికూల ప్రభావాలకు సంతులిత ఆహారంతో చెక్ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు.

‘‘మన శరీరంలో వయసు పైబడిన లక్షణాలు అక్కడ చాలా వేగంగా కనిపిస్తుంటాయి’’అని నాసాలో చీఫ్ న్యూట్రీషనిస్టుగా పనిచేస్తున్న స్కాట్ స్మిత్ చెప్పారు. ముఖ్యంగా బరువు తగ్గడం, ఎముకల సమస్యలు వ్యోమగాములకు వచ్చే అవకాశముటుందని స్మిత్ వివరించారు.

‘‘అంతరిక్షానికి వెళ్లేవారు బరువు తగ్గుతారని మనకు తెలుసు. భూమిపై మనం తీసుకునే ఆహారం కడుపులో హాయిగా కూర్చున్నట్లు అంతరిక్షంలో ఉండదు. వాస్తవానికి మన కడపు నిండకముందే, ఇకచాలు తినడం ఆపండని కడుపు మెదడుకు సంకేతాలు పంపిస్తుంటుంది. అందుకే అక్కడ ఎంత తింటున్నారు అనేదాన్ని ట్రాక్ చేసేందుకు ప్రత్యేక యాప్‌లు కూడా ఉపయోగిస్తుంటారు’’అని స్మిత్ వివరించారు.

‘‘ఇక ఎముకల సమస్యల విషయానికి వస్తే, మెనోపాజ్ అనంతరం మహిళల్లో కనిపించే ఎముకలు సమస్యల కంటే పది రెట్లు ఎక్కువగా వ్యోమగాములకు ఎముకల సమస్యలు వచ్చే అవకాశముంటుంది’’అని స్మిత్ వివరించారు.

కాబట్టి మైక్రోన్యూట్రియంట్లు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ లాంటివి అన్నీ కలిసిన సంతులిత ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని స్మిత్ వివరించారు. వ్యోమగాములు తీసుకునే ఆహారం వారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పారు.

‘‘అంతరిక్ష కేంద్రానికి వ్యోమనౌక వెళ్లేటప్పుడు, మేం తాజా పళ్లు, కూరగాయలు పంపిస్తాం. వీటిలో నారింజలు, యాపిల్, బెర్రీలు, పెప్పర్‌లు ఉంటాయి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కానీ, వీటిని తీసుకునేటప్పుడు, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది’’అని స్మిత్ అన్నారు.

వీడియో క్యాప్షన్, సూర్యుడు నవ్వుతున్నట్టుగా ఎలా, ఎందుకు కనిపించాడు?

చాక్లెట్, వైన్

చాలా మంది ఊహించుకునే దానికంటే అంతరిక్ష భోజనం మెరుగ్గానే ఉంటుందని స్మిత్ చెప్పారు. నికోల్ కూడా దీనికి అంగీకరించారు.

‘‘ఆహారం విషయంలో విసుగెత్తినట్లు ఎప్పుడూ అనిపించలేదు’’అని నికోల్ చెప్పారు.

మరోవైపు వ్యోమగాముల కుటుంబ సభ్యులు కొన్నిసార్లు ప్రత్యేక ఆహార పదార్థాలను కూడా వ్యోమనౌకల్లో పంపేందుకు ప్రయత్నిస్తుంటారు.

ఒకసారి నికోల్ భర్త ఆమె కోసం లండన్ నుంచి తీసుకొచ్చిన చాక్లెట్లు పంపించారు. మరోవైపు నికోల్‌తోపాటు అక్కడకు వచ్చిన కొందరు వ్యోమగాములకు వారి కుటుంబ సభ్యులు వైన్, సాల్మన్ లాంటివి కూడా పంపించారు. వీటిని వారంతా కలిసి తిన్నారు.

ఒక్కోసారి ఏదైనా ఆహార పదార్థాలను బాగా తినాలని అనిపిస్తే, భూమిపైకి వచ్చిన వెంటనే వాటిని తినేలా ఏర్పాట్లు చేస్తారు. రష్యా వ్యోమగామి అలెక్సీ ఓవచినిన్ ఇలానే 2016లో కిందకు వస్తూనే పుచ్చకాయలు తినాలని భావించారు.

భవిష్యత్‌లో అంతరిక్ష యాత్రల కోసం నాసా ప్రత్యేక ఆహార పదార్థాలను తయారుచేస్తోంది. దీని కోసం కెనడియన్ స్పేస్ ఏజెన్సీ (ఎస్సీఏ)తో కలిసి నాసా పనిచేస్తోంది.

‘‘భవిష్యత్‌లో ఆహారం అనేది ఒక పిల్ లేదా చిన్న స్పాంజ్ ముక్కలా కూడా మారిపోవచ్చు. కొంచెం నీటిని కలిపి వీటిని మనం హాయిగా తీసుకోవచ్చు’’అని నికోల్ అంటున్నారు.

వీడియో క్యాప్షన్, శాస్త్ర పరిశోధన రంగంలో ఇదో పెద్ద విజయం అంటున్న శాస్త్రజ్ఞులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)