అంతరిక్షం నుంచి పడిపోయి మరణించిన వ్యోమగామి, ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోనో నమరా
- హోదా, బీబీసీ రీల్
అంతరిక్షంలో చనిపోయిన మొట్టమొదటి మనిషి వ్లాదిమిర్ కొమరోవ్.
సోయజ్ -1 ప్రయోగం విఫలమైందని తెలిసిన తరువాత కొమరోవ్ మృతికి సోవియెట్ యూనియన్ యావత్తు దిగ్బ్రాంతికి గురైంది.
స్పేస్ ఫ్లైట్ కూలిపోతుందని ఈ మిషన్ ప్రారంభానికి ముందే కొమరోవ్‌కు తెలుసున్నది కొందరి వాదన..ఇంతకీ అప్పుడు ఏం జరిగింది? ఈ కొమరోవ్ ఎవరు ?

వ్లాదిమిర్ కొమరోవ్ మాస్కోలో 1927 మార్చ్ 16న జన్మించారు.
ఆయన తండ్రి ఒక సాధారణ కార్మికుడు. చిన్నప్పటి నుంచే కొమరోవ్‌కు గణితం అంటే ఇష్టం ఉండేది. దాంతోపాటు వైమానిక సంబంధిత అంశాలపైనా ఆయనకు విపరీతమైన ఆసక్తి ఉండేది.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తరువాత కొమరోవ్ యూనియన్ ఆఫ్ సోవియెట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్(యూఎస్ఎస్ఆర్) టాప్ టెస్ట్ పైలట్లలో ఒకరయ్యారు.
స్పేస్ బాఫిన్స్ పాడ్‌కాస్ట్‌కు చెందిన విలేఖరి రిచర్డ్ హోలింగ్‌హామ్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘సోవియెట్ యూనియన్ లెక్కల్లో కొమరోవ్ గొప్ప ప్రతిభావంతుడు. ఆయన గొప్ప దేశభక్తుడు, గొప్ప పైలట్ కూడా. అందుకే రెండు ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రాజెక్టులకు ఆయన్ను ఎంపిక చేశారు’’ అనిచెప్పా

ఫొటో సోర్స్, Getty Images
1960 ప్రాంతాల్లో అమెరికా, సోవియెట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుండేది. వైమానిక సాంకేతికతలు అభివృద్ధి చెందడం స్పేస్ రేస్‌కీ దారి తీసింది.
ఈ క్రమంలోనే అమెరికా, సోవియెట్ యూనియన్‌లు రెండూ చంద్రుడిపైకి మనిషిని పంపించడానికి పోటీపడ్డాయి.
తమ దేశం నుంచే చంద్రుడిపై తొలి మనిషిని అడుగు పెట్టించాలన్న పట్టుదల రెండు దేశాలకూ ఏర్పడింది.
అంతరిక్ష ప్రయోగాలలో మొట్టమొదట కొన్ని విషయాలలో సోవియెట్ యూనియన్ ఆధిపత్యం సాధించింది. భూ కక్ష్యలోకి మొట్టమొదట ఉపగ్రహం పంపించింది సోవియెట్ యూనియన్. ఆ తొలి ఉపగ్రహం పేరు స్పుత్నిక్.
అంతేకాదు...కక్ష్యలోకి లైకా అనే కుక్కను కూడా పంపించింది సోవియెట్ యూనియన్.
దాంతో అప్పటికి అమెరికన్లు ఈ స్పేస్ రేస్‌లో వెనుకబడినట్లే అయింది.
అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మనిషి యూరీ గగారిన్, వ్లాదిమిర్ కొమరోవ్ వంటివారు అనేక రకాలుగా శిక్షణ పొందారు.
ఆ శిక్షణ చాలా కఠినంగా ఉండేది. ఐసోలేషన్ చాంబర్లలో వారిని ఉంచి అక్కడ జీఫోర్స్(గ్రావిటేషన్ ఫోర్స్) కు గురి చేసేవారు. అలాగే, దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక గొడ్డలి, కొన్ని అగ్గిపుల్లలు మాత్రమే ఇచ్చి వదిలేసేవారు. ఎలాంటి అవకాశాలు లేని కఠిన పరిస్థితులలో ఎలా బతికిబట్టకడతారో పరిశీలించడానికి వారికి అలాంటి కఠిన శిక్షణలు ఇచ్చేవారు.
ఒకవేళ వారు ప్రయాణించే స్పేస్ క్రాఫ్ట్ అటవీ ప్రాంతంలో కూలిపోతే ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి వీలుగా అలాంటి శిక్షణ ఇచ్చారు.
1964లో వ్లాదిమిర్ కొమరోవ్ తన మొట్టమొదటి అంతరిక్ష యాత్ర ‘వాషడ్-1’ను విజయవంతంగా పూర్తిచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ముగ్గురు మనుషులతో అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి స్పేస్ క్రాఫ్ట్ వాషడ్-1.
‘వాషడ్‌కు సంబంధించి ఒక కథనం ప్రచారంలో ఉంది. వాషడ్-1 మిషన్ కోసం పనిచేసిన ఇంజినీర్‌ను కూడా అందులో పంపించాలనుకున్నారని.. అలా చేయడం వల్ల దానికి ఎలాంటి నాణ్యతా సమస్యలు తలెత్తకుండా పక్కాగా తయారుచేస్తారన్నది ఆలోచన.
తన ప్రాణం నిలవడం కూడా దాని పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎక్కడా లోపం తలెత్తకుండా తయారుచేస్తారన్న ఆలోచనతో ఆ ఇంజినీరును కూడా అందులో పంపించాలని తలపోశారని చెప్తారు’ అని రిచర్డ్ హోలింగ్‌హామ్ చెప్పారు.
‘కొమరోవ్ చరిత్రాత్మక అంతరిక్ష యానం మొదలైన మరుసటి రోజు కమ్యూనిస్ట్ పార్టీ చైర్మన్‌గా లియోనిడ్ బ్రెజ్నెవ్ ఎన్నికయ్యారు.
సోయజ్ స్పేస్ ప్రోగ్రామ్ పేరుతో మరో కొత్త ప్రాజెక్టుకు బీజం వేశారు. సోయజ్-1లో కొమరోవ్‌ను భూకక్ష్యలోకి పంపించాలనుకున్నారు. అనంతరం మరో రాకెట్లో మరో ఇద్దరిని పంపించాలన్నది ప్రణాళిక.
వీరు వేర్వేరు వెళ్లి భూకక్ష్యలో కలుసుకోవాలన్నది ప్లాన్. అప్పుడు కొమరోవ్ రెండో స్పేస్ క్రాఫ్ట్‌లోకి రావాలన్నది ఆ ప్రాజెక్ట్ ఉద్దేశం.
అలా ముగ్గురూ రెండో స్పేస్ క్రాఫ్ట్‌లో భూమికి తిరిగి వచ్చేలా మిషన్ రూపొందించారు. అయితే, లాంచ్ డేట్ దగ్గరపడేసరికి సోయజ్-1లో లోపాలున్నట్లు గుర్తించారు.
దాంతో 1967లో తలపెట్టిన ఆ ప్రాజెక్ట్ గందరగోళంగా మారింది. స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగానికి అనుమతి దొరకలేదు.
అయితే, 1967కి సోవియెట్ రివల్యూషన్‌కు 50 ఏళ్లు పూర్తవడంతో ఆ ఏడాది ఎలాగైనా సోయజ్ స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి పంపించాలన్న ఒత్తిడి పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
కానీ, అప్పుడు అమెరికాను చూస్తే అక్కడ కూడా అపోలో మిషన్ విషయంలో అలాంటి పరిస్థితే ఉండేది.
అపోలో కోసం పనిచేసిన అనేక మంది ఇంజినీర్లతో నేను మాట్లాడాను. అప్పటికి అపోలో పూర్తిగా సిద్ధం కాలేదు. లాంచ్‌ప్యాడ్‌పైనే ముగ్గురు ఆస్ట్రోనాట్స్ అందులో చిక్కుకుపోయారు. ఆ కేప్సుల్ మంటల్లో చిక్కుకోవడంతో ముగ్గురూ చనిపోయారు’ అని రిచర్డ్ చెప్పారు.
అయితే అనేక ఆందోళనల నడుమ 1967 ఏప్రిల్ 23న సోయజ్-1ను అంతరిక్షంలోకి పంపించారు.
‘‘సోయజ్-1 అంతరిక్షంలోకి పంపించినప్పుడు అందులో వెళ్తున్న కొమరోవ్‌కు కూడా దానికి నాణ్యతా సమస్యలు ఉన్నాయని తెలుసు. ఆయన భూకక్ష్యలోకి ప్రవేశించిన తరువాత మిషన్‌లో యంత్రాలు ఒక్కటొక్కటిగా విఫలం కావడం మొదలైంది. ముఖ్యంగా స్పేస్‌క్రాఫ్ట్‌కు పవర్ సప్లయ్ చేసే సౌరఫలకాల వ్యవస్థ పనిచేయలేదు’’ అని చెప్పారు రిచర్డ్.
అనంతరం సోయజ్ -2 లాంచ్ రద్దయింది. తిరిగి భూకక్ష్యలోకి రావాలని కొమరోవ్‌కు ఆదేశాలు వెళ్లాయి.
‘‘కొమరోవ్ భూమివైపు తిరిగి వస్తుండగా పారాచ్యూట్లు విఫలమయ్యాయి. గురుత్వాకర్షణ శక్తి మొదలైన చోటి నుంచి ఆయన నేల మీదకు పడడం ప్రారంభమై ఉండొచ్చు. ఆయన నేలపై పడగానే స్పేస్ క్రాఫ్ట్ మంటల్లో కాలిపోయింది. రెట్రో రాకెట్లలో లోపాల కారణంగా స్పేస్ క్రాఫ్ట్‌కు మంటలు అంటుకున్నాయి’’ అని రిచర్డ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భూమిపైకి తిరిగి వస్తున్న సమయంలో కొమరోవ్ గ్రౌండ్ కంట్రోల్‌తో కమ్యూనికేషన్ జరిపారని, వారిపై తీవ్రమైన విమర్శలు చేశారన్న వాదన ఒకటి ప్రచారంలో ఉంది.
‘‘కొమరోవ్ సోవియెట్ యూనియన్‌ను తిట్టిపోశారని, పాఠాలు నేర్వాలని చెప్పారని అంటుంటారు. కానీ అది వాస్తవం కాకపోవచ్చు. భూవాతావరణంలోంచి వస్తున్నందున ఆయన మాట్లాడేది వినపడే అవకాశం చాలా తక్కువ. పైగా భూమివైపు దూసుకొస్తున్న సమయంలో, ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్నానని తెలిసినప్పుడు శాపనార్థాలు పెట్టే పరిస్థితిలో ఆయన ఉండకపోవచ్చు’’ అని రిచర్డ్ అభిప్రాయపడ్డారు.
కొమరోవ్ మృతదేహపు అవశేషాలపైనా వివాదం ఉంది. కొమరోవ్ మృతదేహపు అవశేషాలు ఏమయ్యాయయన్న విషయంలో భిన్న వాదనలున్నాయి.
అయితే, 1967 ఏప్రిల్ 26న మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో అధికారిక లాంఛనాల నడుమ అంత్యక్రియలు జరిపారు.
‘‘అంతరిక్ష యాత్రల విషయంలో 1967 అత్యంత కీలక సంవత్సరంగా చెప్పాలి. ఆ ఏడాది జనవరిలో అపోలో-1 మంటల్లో చిక్కుకుని ముగ్గురు చనిపోయారు. ఆ తరువాత సోయజ్-1లో వెళ్లిన కొమరోవ్ ప్రాణాలు కోల్పోయారు. అంతరిక్షంలోంచి పడిపోయి చనిపోయిన మొట్టమొదటి మనిషి కొమరోవ్. ఆయన మరణం తరువాత రెండు దేశాలూ స్పేష్ మిషన్ల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి’’ అని రిచర్డ్ చెప్పారు.
కాగా అమెరికాకు చెందిన అపోలో 15లో చంద్రుడిపైకి వెళ్లిన ఆస్ట్రోనాట్లు... అంతరిక్ష యాత్రలలో మరణించిన వ్యోమగాముల స్మారకార్థం ఉంచిన ఫలకంపై కొమరోవ్ పేరు కూడా ఉంది.
సోవియెట్ యూనియన్ కాస్మోనాట్‌కు అమెరికా ఆస్ట్రోనాట్‌లు అర్పించిన నివాళి అది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














