ఐఎస్ఎస్: అంతరిక్షంలో వ్యోమగాములు ఎలా పడుకుంటారు, ఎప్పుడు లేస్తారు, వారి దినచర్య ఎలా ఉంటుంది?

నాసా

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, సునీతా విలియమ్స్, బారీ విల్‌మోర్ 2024 జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్షనౌకలో ఐఎస్ఎస్‌కి వెళ్లారు.

ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ - ఐఎస్ఎస్) వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు తొమ్మిది నెలలుగా అక్కడే చిక్కుకుపోయారు.

సునీతా ('సుని') విలియమ్స్, బ్యారీ 'బుచ్' విల్‌మోర్ 2024 జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష‌నౌకలో ఐఎస్ఎస్‌కి వెళ్లారు.

అయితే, అంతరిక్ష నౌకలో తలెత్తిన సమస్యల కారణంగా ప్లాన్ ప్రకారం తిరిగి రాలేకపోయారు.

స్టార్‌లైనర్ భూమికి వెళుతుండగా చూడటం కష్టంగా ఉందని, ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి శిక్షణ పొందామని వ్యోమగాములు ఆ సమయంలో పాత్రికేయులతో చెప్పారు.

అలా తొమ్మిది నెలలు గడిచాయి.

తాజాగా స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ ఐఎస్ఎస్‌కి చేరుకుంది. అందులో సునీతా విలియమ్స్, విల్‌మెర్ భూమికి తిరిగి రానున్నారు.

అయితే, ఎనిమిది రోజుల మిషన్‌పై వెళ్లిన ఈ ఇద్దరు వ్యోమగాములు ఇన్ని రోజులు అక్కడ ఏం చేశారు? వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారా? వారికి ఆహారం ఎలా? ఇంతకీ ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ఎలా ఉంటుంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఐఎస్ఎస్‌లో ప్రత్యేక జిమ్ ఉంది.

ఐఎస్ఎస్‌లో వారి దినచర్య ఏంటి?

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) బకింగ్‌హామ్ ప్యాలెస్ పరిమాణంలో ఉంటుంది, వ్యోమగాములు ఉండే ప్రదేశం ఆరు పడక గదుల ఇల్లు లాంటిది.

సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లు ఐఎస్ఎస్‌లో మరో 10 మందితో కలిసి ఉన్నారు. అందులో నలుగురు అమెరికా వ్యోమగాములు, ముగ్గురు రష్యన్ వ్యోమగాములు, ముగ్గురు చైనీస్ టైకోనాట్స్ ఉన్నారు.

ఈ ఇద్దరు వ్యోమగాములకు పడుకోవడానికి స్థలం ఉంటుంది. అక్కడి నుంచే ఈమెయిల్‌లు, కాల్‌ల ద్వారా వారి కుటుంబాలతో మాట్లాడటానికి రెండు ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి.

సునీత, విల్‌మోర్ ఊహించిన దానికంటే ఎక్కువ సమయం అంతరిక్షంలో ఉన్నప్పటికీ, వారు అక్కడ రోజువారీ కార్యక్రమాలను నిర్వహించారు. బుచ్ విల్‌మోర్ 04:30 గంటలకు, సునీతా విలియమ్స్ 06:30 గంటలకు మేల్కొనేవారు.

వారు సెలవులో కూడా లేరు, అక్కడ వారు చేయాల్సిన పని షెడ్యూల్ వారికి ఉంది. ఈ పనులలో ఐఎస్ఎస్ భాగాలను సరిచేయడం, సైన్స్ ప్రయోగాలు చేయడం (కొన్నిసార్లు తలకిందులుగా) కూడా ఉన్నాయి.

అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడంతో వారి కండరాలు, ఎముకలు బలహీనపడతాయి. అందువల్ల వ్యోమగాములు ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చాలా ముఖ్యం.

నాసా రూపొందించిన పరికరాలతో ఐఎస్ఎస్‌లో ప్రత్యేక జిమ్ ఉంది. ఇందులో వెయిట్ లిఫ్టింగ్ కోసం అడ్వాన్స్‌డ్ రెసిస్టివ్ ఎక్సర్‌సైజ్ డివైస్ (ఏఆర్ఈడీ) అనే యంత్రం, వ్యోమగాములు పరిగెడుతున్నప్పుడు గాల్లోకి లేవకుండా పట్టీలతో కూడిన ట్రెడ్‌మిల్‌లు ఉన్నాయి.

నాసా, ఐఎస్ఎస్

ఫొటో సోర్స్, NASA

మూత్రాన్ని రీసైకిల్ చేసి తాగునీటిగా..

రోజూ రెండు లేదా అంతకంటే ఎక్కువ గంటలు వ్యాయామం చేయడాన్ని ఆస్వాదిస్తామని సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ తెలిపారు.

గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల ఒక ప్రయోజనం కూడా ఉందన్నారు వ్యోమగాములు.

"మీ కీళ్లు నొప్పిగా ఉండవు. ఎందుకంటే, వాటిపై ఎటువంటి ఒత్తిడి ఉండదు, ఇది నిజానికి చాలా బాగుంది" అని విల్‌మోర్ అన్నారు.

సామర్థ్యానికి మించి ఎక్కువ మంది స్టేషన్‌లో ఉన్నప్పుడు, వారు టాయిలెట్‌కి వెళ్లాలంటే ఎలా?

సాధారణంగా వ్యోమగాముల చెమట, మూత్రాన్ని రీసైకిల్ చేసి తాగునీరుగా మారుస్తారు. కానీ, ఒక సమస్య కారణంగా సిబ్బంది మూత్రాన్ని నిల్వ చేయాల్సి వచ్చింది.

సునీ, బుచ్‌లు ఐఎస్ఎస్‌కు వెళ్లేటపుడు ప్లంబింగ్ వ్యవస్థను సరిచేయడానికి కొత్త పరికరాలను తీసుకెళ్లారు.

నాసా, ఐఎస్ఎస్

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, బుచ్ విల్‌మోర్, సునీత విలియమ్స్ తొమ్మిది నెలలు మంచి ఉత్సాహంతో ఉన్నారు కానీ, వారి కుటుంబాలతో గడిపే క్షణాలను కోల్పోయారు.

భూమి గురించే ఆలోచన, మనకి ఆ ఒక్కటే ఉంది: సునీతా

వ్యోమగాముల దగ్గర తగినంత ఆహారం, నీరు ఉన్నాయి. ఇటీవలి సరఫరా మిషన్ ద్వారా ఇంకా ఆహారం వెళ్లింది. ఇద్దరు వ్యోమగాములకు అమెరికా ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కూడా కల్పించారు. 'అంతరిక్షం నుంచి ఓటు వేయడం చాలా బాగుంది' అని సునీత అన్నారు.

ఈ వ్యోమగాములు భూమిపై తమ బంధువులకు దూరమవుతున్నారు.

సునీత విలియమ్స్ తన కుటుంబాన్ని, స్నేహితులను, తన రెండు పెంపుడు కుక్కలనూ మిస్ అవుతున్నట్లు చెప్పారు.

"వారు అర్థం చేసుకుంటారని తెలుసు. అది వారికి కష్టమనీ నాకు తెలుసు" అని ఆమె అన్నారు.

"కానీ అందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. మేం తిరిగి వచ్చే వరకు వేచిచూస్తున్నారు" అని సునీత అన్నారు.

తన కుమార్తె హైస్కూల్ చివరి సంవత్సరంలో ఉందని, తనను మిస్ అవుతున్నందుకు బాధగా ఉందని బుచ్ చెప్పారు.

అంతరిక్షంలో ఉండటం వల్ల భూమి గురించే ఎక్కువగా ఆలోచనలు వస్తాయని సునీత విలియమ్స్ అన్నారు.

"ఇది చాలా విషయాలను భిన్నంగా చూసేలా చేస్తుంది. మనకు ఒకే ఒక గ్రహం ఉంది. దానిని జాగ్రత్తగా చూసుకోవాలి" అని ఆమె చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)