'పాంథర్ ఎప్పుడో మా వెనక్కు వచ్చింది, ఏదో వాసన వస్తుందని తిరిగి చూసేసరికి..', చిత్ర జీవితంలో ఇలాంటివెన్నో..

- రచయిత, తులసీప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
''పాంథర్ నుంచి తప్పించుకున్నప్పుడు చాలా భయపడ్డాను. ఏనుగులు, ఎలుగుబంట్లు, స్మగ్లర్ల బారి నుంచి త్రుటిలో తప్పించుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి'' అని గుర్తు చేసుకున్నారు పారెస్ట్ బీట్ అధికారి చిత్ర.
పనబాకం ఫారెస్ట్ రేంజ్‌లోని చంద్రగిరి సెక్షన్‌లో భీమవరం బీట్ ఆఫీసర్‌గా చిత్ర పనిచేస్తున్నారు.
ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు. భర్త కన్నుమూసినప్పటికీ ముగ్గురు ఆడపిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఆమె ఎంతో కఠినమైన అటవీ సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
చిత్ర, తిరుపతి జిల్లాలోని తాటితోపుకు చెందినవారు. ఇంటర్ పూర్తి కాగానే సమీప బంధువుతో 1998లో ఆమె వివాహం జరిగింది. ఆమె భర్త టైలరింగ్ చేసేవారు.


పెళ్లి తర్వాత చదువు, ఉద్యోగం
పెళ్లి తర్వాత కూడా సొంతకాళ్లపై నిలబడాలనే తపనే తనను పైచదువులు చదివేలా, ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా ముందుకు నడిపించిందని బీబీసీతో చెప్పారు చిత్ర.
ఉద్యోగంలో, తన జీవితంలో ఎదురైన అనుభవాల గురించి బీబీసీతో పంచుకున్నారు.
ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో కరెస్పాండెంట్ డిగ్రీ పూర్తి చేశారు చిత్ర. తర్వాత ఐటీఐ పూర్తి చేసి, ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేస్తూ, ప్రైవేటు కంపెనీలో కూడా పనిచేశానని చెప్పారు.
చివరకు, 2008లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. ఆ తర్వాత మూడేళ్లకే, అంటే 2011లో భర్త చనిపోవడంతో ముగ్గురు ఆడపిల్లల బాధ్యతతో పాటు ఉద్యోగంలో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని చెప్పారు చిత్ర.
''ముగ్గురు ఆడపిల్లలకు మంచి జీవితాన్ని అందించాలనే లక్ష్యంతో నేను చదువుకోవడం మొదలుపెట్టాను. దూరవిద్యలో డిగ్రీ చేశాను. ఐటీఐ చదివాను. అప్పట్లో గ్రామంలో ఉండేవాళ్లం. పంటపొలాల్లో, పశువుల పాకలో పనిచేసేదాన్ని. ఈ పనులతో పాటు ముగ్గురు పిల్లలను చూసుకుంటూ రాత్రి గం.12:30 వరకు చదువుకునేదాన్ని. తెల్లవారుజామున 4 గంటలకు లేచి చదివేదాన్ని.
నాకు జాబ్ వచ్చిన తర్వాత మా ఆయన చనిపోయారు. ఉద్యోగంతో పాటు ముగ్గురు పిల్లల్ని చూసుకోలేక, చిన్న పాపను నాతో ఉంచుకొని ఇద్దరు పెద్ద పిల్లల్ని హాస్టల్‌లో వేశాను. విధుల్లో భాగంగా రాత్రిపూట కూడా వెళ్లాల్సి ఉంటుంది. పాపను ఇంట్లో ఉంచి, తినడానికి స్నాక్స్ ఉంచి, గడియ వేసి ఫీల్డులోకి వెళ్లిపోయేదాన్ని. వచ్చి చూసేసరికి ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయి ఉండేవి బిడ్డకు'' అని చిత్ర తలుచుకున్నారు.

విధుల్లో సవాళ్లు
తిరుపతి జిల్లాలో చాలా ప్రాంతాల్లో పని చేసిన చిత్ర, విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఏనుగుల దాడులు జరుగుతున్న భీమవరంలో బీట్ ఆఫీసర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తూ పైఅధికారుల ప్రశంసలు పొందుతున్నారు. కానీ, విధి నిర్వహణలో మొదట్లో తాను చాలా సవాళ్లను ఎదుర్కొన్నానని చిత్ర చెప్పారు.
''జాబ్ వచ్చిన కొత్తలో చాలా భయపడ్డాను. అడవిలో తిరగాలి, మగవాళ్లతో కలిసి పనిచేయాలి. మొదట నేను వైల్డ్ లైఫ్‌లో జాయిన్ అయ్యాను. ఆఫీసర్స్ మాకు మంచి శిక్షణ ఇచ్చారు. స్మగ్లర్లను ఎలా ఎదుర్కోవాలి, ఎలా పట్టుకోవాలి అనే శిక్షణ ఇచ్చారు. రెండుమూడు సార్లు మేం స్మగ్లర్లను పట్టుకున్నాం.
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కు అడవిలో ఒక ఏరియాను అప్పగిస్తారు. కొన్ని హెక్టార్లు ఉండే ఆ భూభాగాన్ని మేమే చూసుకోవాలి. అడవులు తగలబడినా, ఆక్రమణలు జరిగినా మాదే పూర్తి బాధ్యత. ఏ సమయంలో అయినా అందుబాటులో ఉండాలి. మనం మన ఇంటిని ఎలా కాపాడుకుంటామో, అలా మాకు ఇచ్చిన ఏరియాను కూడా రక్షించుకుంటూ ఉండాలి'' అంటారామె.

కూతుళ్లు మంచి స్థానంలో…
చిత్ర ప్రస్తుతం తిరుపతి శివార్లలోని తాటితోపులో ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఆమె పెద్దకూతురు ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుండగా, రెండో కూతురు ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చేస్తున్నారు. మూడో కూతురు బీటెక్ చదువుతున్నారు.
ప్రకృతిని కాపాడుతున్నాననే భావనే తనను ముందుకు నడిపిస్తోందని చిత్ర అన్నారు.
ఇటీవల ఏనుగుల దాడులు తమకు సవాలుగా మారాయని, ప్రస్తుతం తను ఉన్న బీట్‌లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందన్నారు చిత్ర. ఫీల్డులో ఒక్కోసారి రోజుల తరబడి కూడా ఉండాల్సి వస్తోందని చెప్పారు.
''ఇప్పుడు ఏనుగుల సమస్య పెరిగింది. కార్చిచ్చు చెలరేగకుండా కూడా మేమే చూసుకోవాలి. స్మగ్లర్ల నుంచి కూడా అడవిని కాపాడటంతో పాటు మమ్మల్ని మేం రక్షించుకోవాలి. నా బీట్‌లో ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఏనుగులు వచ్చినప్పుడు 15 రోజులు మేం ఫీల్డ్ లోనే ఉన్నాం. ఆ 15 రోజులు పిల్లల ముఖం చూడలేదు'' అని చిత్ర తన ఉద్యోగం గురించి వివరించారు.

''సెలవులు, పండుగలు మర్చిపోయాం''
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా విధుల్లో చేరిన తర్వాత సెలవులు, పండగలు వంటివి మర్చిపోవాల్సి వస్తుందని చిత్ర అన్నారు. తన ఉద్యోగం వల్ల మొదట్లో ఇబ్బందులకు గురైన పిల్లలు ఇప్పుడు అలవాటు పడిపోయారని చిత్ర చెప్పారు.
''మాకు సెలవులు, వీక్లీ ఆఫ్ అంటూ ఏమీ ఉండదు. వర్క్ ఏమీ లేకపోతే తీసుకోవచ్చు. కానీ, కాల్ వచ్చిందంటే వెళ్లాల్సిందే. ఆదివారం సెలవు అని, పండుగలు అని ఏం ఉండదు. పిల్లలు కూడా ఆ పండుగల గురించి మర్చిపోతారు. మేం ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడే మాకు పండగ అని అనుకుంటాం'' అన్నారు.
ప్రస్తుతం ఏనుగుల సంచారం ఉన్న ఏరియాలో బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న చిత్ర ఏనుగుల దాడుల నుంచి త్రుటిలో తప్పించుకున్నానని చెప్పారు.
''చాలాసార్లు ఏనుగుల నుంచి తప్పించుకున్నా. మొదటిసారి మా బీట్‌లోకి వచ్చినపుడు వాటి గురించి మాకు ఎక్కువ తెలీదు. అప్పుడు ఒక ఏనుగు వచ్చింది. మగవాళ్లు పరుగెత్తి చెట్టు ఎక్కారు. కానీ, నేను ఆ చెట్టు ఎక్కలేకపోయాను. ఒక చిన్న చెట్టు ఎక్కి కూర్చున్నాను. అలా నా ప్రాణాలు కాపాడుకున్నా.
ఇంకొకసారి మేం వెళ్తుంటే చెరుకు తోటలో ఏనుగు కనిపించింది. మేం వెంటనే వెనక్కి పరిగెత్తాం. మరోసారి ట్రెంచ్‌లో దూకేశాను. ఏనుగు తొండంకి అందకుండా కిందికి వంగి తప్పించుకున్నాం. అలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. చీకట్లో కనిపించకుండా అవి మన ముందుకే వచ్చేసి ఉంటాయి'' అని అడవిలో తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితుల గురించి చిత్ర తెలిపారు.

''పాంథర్‌ను చూశాక ప్రాణాలు పోయాయి''
అడవిలో ఏనుగుల నుంచే కాకుండా చిరుతపులులు, ఎలుగుబంట్ల నుంచి కూడా తప్పించుకున్నానని, పాంథర్ బాగా భయపెట్టిందని ఆమె చెప్పారు.
''పాంథర్ తిరుగుతుందని మమ్మల్ని చూసుకోమన్నారు. చీకటి పడిన తర్వాత వస్తుందేమో అని తిన్నెలా ఉంటే ఒకచోట కూర్చున్నాం. అది ఎప్పుడో మా వెనకకు వచ్చింది. వెనక నుంచి ఏదో వాసన వస్తుందనే తిరిగి చూసేసరికి పాంథర్ మా వెనకే నిల్చుంది. గట్టిగా కేక వేయడంతో పైకి ఎగిరి, పక్కన దూకింది. ప్రాణాలు పోయినంత పనైంది. అక్కడ నుంచి తప్పించుకొని ఎలా పరిగెత్తుకొచ్చానో నాకు తెలీదు. ఇప్పటికీ ఆ ఘటన గుర్తొస్తే భయమేస్తుంది'' అని చిత్ర చెప్పారు.
కొండల్లో, గుట్టల్లో, దట్టమైన అడవుల్లో తిరగాల్సి ఉంటుందని, జంతువుల నుంచి తప్పించుకునే సమయంలో చాలాసార్లు గాయపడినట్లు చిత్ర తెలిపారు.

''ఫోన్ వస్తే రాత్రయినా, పగలైనా మేం డ్యూటీకి వెళ్లాల్సిందే. జంతువుల నుంచి తప్పించుకునే సమయంలో రాళ్లూరప్పలు తగులుతుంటాయి. ఒకసారి మోకాలికి గాయమై తీవ్ర రక్తస్రావం అయింది. పడిపోవడంతో ఒకసారి డ్రెస్ చిరిగిపోయింది. అయినా ఇవన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్లాలి. కొండలెక్కడం చాలా కష్టం. మగవాళ్లతో సమానంగా పనిచేయగలమనే ఆత్మవిశ్వాసంతో ఈ విధుల్లోకి వచ్చాం. అప్పుడు వాళ్లతో సమానంగా నడవాలి, పరిగెత్తాలి, అన్నీ చేయాలి. ఒక కేసు విషయంలో అడవిలోకి వెళ్లినపుడు మా వల్ల ఆ పని నిలిచిపోకూడదు. ఎక్కడా మగవాళ్లకు తగ్గకుండా, వాళ్లతో పాటు స్పీడ్‌గా నేను వెళ్తాను'' అని చిత్ర తనక ఎదురయ్యే సవాళ్ల గురించి వివరించారు.
బీట్ ఆఫీసర్‌గా బిజీగా ఉండే తల్లి యోగక్షేమాలు గురించి చాలా భయం వేస్తుందని ఆమె కుమార్తె హారిక అన్నారు.
''మేం ముగ్గురం అమ్మాయిలం. నాన్న లేడు. అమ్మ అడవిలోకి వెళ్లినప్పుడు సిగ్నల్స్ లేకపోతే, ఆమె మళ్లీ ఫోన్ చేసేంతవరకు ఆమెకు ఏమైందోననే భయం వెంటాడుతుంది. ఇంటికి వచ్చేవరకు టెన్షన్‌గా ఉంటుంది. మేం ఎక్కువగా హాస్టల్‌లోనే ఉన్నాం. అయినా ఇంటికి వచ్చినప్పుడు కూడా అమ్మ మాతో ఉండరు. ఆఫీస్ అని వెళ్లిపోతారు. మా ముగ్గురికీ చిన్నప్పటి నుంచి ఇది అలవాటు అయిపోయింది'' అని ఆమె చెప్పారు.

''చిత్ర సమర్థురాలు''
చిత్ర సామర్థ్యం గురించి ఆమె విధుల్లో చేరిన తొలిరోజే గుర్తించామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మాధవి చెప్పారు.
''రెండు నెలల ముందు పుత్తూరు రేంజ్ నుంచి ఆమె ఇక్కడికి వచ్చారు. ఆమె వచ్చిన తర్వాత రోజే ఏనుగుల సమస్య మొదలైంది. నువ్వు చేయగలవా, లేక వెళ్లిపోతావా అని చిత్రను నేను అడిగాను. తను చాలా ఆత్మవిశ్వాసంతో నేను ఈ పనిచేయగలనని చెప్పింది. తర్వాత ఆమె తన మాటకు కట్టుబడింది. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు, మానిటరింగ్ లాంటి వాటిలో చాలా చురుగ్గా పాల్గొంది'' అని ఆఫీసర్ మాధవి తెలిపారు.
విధులు, కుటుంబ బాధ్యతలను బాలెన్స్ చేస్తున్నప్పటికీ ఒంటరి మహిళ పట్ల సమాజం చూపించే వైఖరి అప్పుడప్పుడూ బాధ కలిగిస్తుందని చిత్ర చెప్పారు.
''ఒంటరిగా తిరుగుంటామని చుట్టుపక్కల అనే వాళ్లు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. రకరకాల మాటలు మా చెవిన పడతాయి. కానీ, వాటిని పట్టించుకోను. నా పిల్లల్ని పోషించుకోవడానికి నేను నా విధుల్ని నిర్వర్తించాల్సిందే'' అని చిత్ర వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














