బలూచిస్తాన్‌లో రైలుపై దాడి జరిగితే పాకిస్తాన్ భారతదేశంపై ఎందుకు ఆరోపణలు చేస్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశం తన సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని పాకిస్తాన్ ఆరోపించింది.
ముఖ్యంగా పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి తర్వాత పాకిస్తాన్ భారతదేశం వైపు వేలు చూపిస్తోంది.
పాకిస్తాన్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో భారత్ ప్రమేయం ఉందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి షఫాకత్ అలీ ఖాన్ ఆరోపించారు. దీనితో పాటు, అఫ్గానిస్తాన్‌లోని కొన్ని శక్తుల ప్రమేయం ఉందని కూడా ఆయన అన్నారు.
"ముఖ్యంగా జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లోని ఉగ్రవాదులు అఫ్గానిస్తాన్‌లోని వారి గ్రూప్ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు" అని షఫాకత్ అలీ ఖాన్ అన్నారు.
పాకిస్తాన్ ఆరోపణలపై భారత్ స్పందించింది.
శుక్రవారం, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, "పాకిస్తాన్ చేస్తున్న నిరాధార ఆరోపణలను మేం తిరస్కరిస్తున్నాం. ఉగ్రవాదం ఎక్కడ దాగి ఉందో ప్రపంచం మొత్తానికి తెలుసు. పాకిస్తాన్ తన అంతర్గత సమస్యల గురించి ఇతరులపై నిందలు వేసి, వేలెత్తి చూపకుండా తన గురించి తాను చూసుకోవాలి’’ అని పేర్కొన్నారు.
జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై జరిగిన దాడిలో 21 మంది ప్రయాణికులు, నలుగురు సైనికులు మరణించారని పాకిస్తాన్ చెబుతోంది. ఈ రైలు బలూచిస్తాన్‌లోని క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళుతోంది.
ఈ దాడికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత వహించింది. ఇటీవలి నెలల్లో అనేక ప్రాణాంతక దాడులు జరిగాయి, వీటిలో చాలా వరకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ తమ పనేనని ప్రకటించుకుంది.


ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌లో ఏం చర్చ జరుగుతోంది?
బలూచిస్తాన్ నుంచి వస్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి గురించి పాకిస్తాన్ మీడియాలో చాలా కథనాలు వెలువడుతున్నాయి. అక్కడి మాజీ దౌత్యవేత్తలు, జర్నలిస్టులు ఈ దాడిని చాలా రకాలుగా చూస్తున్నారు.
భారత్‌లో పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు.
"బలూచిస్తాన్‌లో చాలా కాలంగా అశాంతి నెలకొంది. గత కొంత కాలంగా చేసిన ప్రకటనలను పరిశీలిస్తే, బీఎల్ఏ... చైనా, పాకిస్తాన్ మధ్య స్నేహాన్ని విమర్శిస్తోంది. గ్వాదర్ ఓడరేవుకు సంబంధించి బెదిరింపులు కూడా వస్తున్నాయి. నేను గత రెండు-మూడు రోజులుగా భారతీయ మీడియాను కూడా చూస్తున్నాను. భారతదేశం భారీ విజయాన్ని సాధించినట్లు కనిపిస్తోంది’’ అని అబ్దుల్ బాసిత్ అన్నారు.
"పాకిస్తాన్ వ్యతిరేక బలూచ్ తిరుగుబాటుదారులంతా భారత వార్తా చానళ్లలో ఉన్నారు. అన్ని రకాల విషయాలు చెబుతున్నారు. పాకిస్తాన్ వ్యతిరేక గ్రూపుల వెనుక ఎవరున్నారో దీనిద్వారా రుజువు అవుతోంది. భారతదేశం సీపీఈసీ( చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్)ని వ్యతిరేకిస్తోంది. అమెరికా కూడా దీనిని కోరుకోవడం లేదు. భారత వార్తా చానళ్లలో బలూచిస్తాన్, కశ్మీర్‌లను పోల్చి చూపుతున్నారు. రెండింటి మధ్య పోలిక లేదని నేను నమ్ముతున్నాను. బలూచిస్తాన్ పాకిస్తాన్‌లో అంతర్భాగం’ అని ఆయన అన్నారు.
"2014లో, అజిత్ డోభాల్ బలూచిస్తాన్ విషయంలో పాకిస్తాన్‌ను స్పష్టంగా బెదిరించారు. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి మోదీ బలూచిస్తాన్ గురించి ప్రస్తావించారు. దీని వల్ల భారతదేశం ఏమి కోరుకుంటుందో స్పష్టమవుతుంది’’ అని అబ్దుల్ బాసిత్ అన్నారు.
2014లో మోదీ ప్రభుత్వంలో జాతీయ భద్రత సలహాదారుగా బాధ్యతలు చేపట్టడానికి మూడు నెలల ముందు అజిత్ డోభాల్, ఫిబ్రవరి 21, 2014న తమిళనాడులోని తంజావూరులో మాట్లాడుతూ, "పాకిస్తాన్ మనకంటే చాలా సున్నితమైన పరిస్థితిలో ఉంది. భారతదేశం డిఫెన్సివ్ మోడ్ నుంచి డిఫెన్సివ్-అఫెన్సివ్ మోడ్‌కి వెళితే, వారు దానిని తట్టుకోలేరని వారికి తెలుసు. మీరు ఒకసారి ముంబయిని ఓడించగలరేమో కానీ బలూచిస్తాన్‌ను కోల్పోతారు" అన్నారని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బలూచ్‌లు ప్రధాన స్రవంతిలో ఎందుకు లేరు?
పాకిస్తాన్‌కు చెందిన ప్రసిద్ధ చరిత్రకారుడు ఇష్తియాక్ అహ్మద్ ఒక వీడియోను పోస్ట్ చేసి , "బలూచిస్తాన్ నుంచి చాలా అరుదుగా సంతోషకరమైన వార్తలు వస్తాయి. పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి ఇలాగే జరుగుతుంది. బలూచిస్తాన్ ఖనిజ సంపద పరంగా చాలా గొప్పది కానీ పాకిస్తాన్, బలూచిస్తాన్ మధ్య సంబంధం ఎప్పుడూ అపనమ్మకమైనదే’’ అన్నారు.
''కలాత్ రాష్ట్రం స్వతంత్రంగానే ఉంది. పాకిస్తాన్‌లో చేరడానికి ఇష్టపడలేదు. జిన్నా కూడా దానిపై తన ముద్ర వేశారు. కానీ పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత బలూచిస్తాన్‌ను కూడా పాకిస్తాన్‌లో కలిపారు. అయితే, పాకిస్తాన్ ప్రభుత్వంలో బలూచ్‌ల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది’’ అన్నారు.
"నేను పాకిస్తాన్‌లో బోధించేటప్పుడు బలూచ్ విద్యార్థులను కలిసే అవకాశం నాకు లభించింది. పాకిస్తాన్ సైన్యంలో, బ్యూరోక్రసీలో బలూచ్‌ల ఉనికి చాలా తక్కువ. అదేవిధంగా, గ్వాదర్ ఓడరేవు కూడా బలూచ్‌ల నుంచి వేరు చేశారు. ఇప్పుడు పాకిస్తాన్‌లో అనేక కొత్త ప్రావిన్సులు( ప్రాంతాలు) సృష్టిస్తారని చర్చ జరుగుతోంది. ఇన్ని సంవత్సరాలుగా బలూచ్‌ను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ఎందుకు ఎటువంటి ప్రయత్నం జరగలేదు?’’ అని ఇష్తియాక్ అహ్మద్ ప్రశ్నించారు.
"బలూచిస్తాన్ జనాభా చాలా తక్కువ. ఆ ప్రాంతం చాలా పెద్దది. జనాభా కూడా చెల్లాచెదురయ్యారు. బలూచిస్తాన్‌లో ఒకవైపు పఖ్తూన్ మాట్లాడే ప్రజలు ఉండగా, మిగిలిన వారు బలూచ్ జనాభా.
బలూచ్‌లలో రెండు గ్రూపులు కూడా ఉన్నాయి. ఒక సమూహం బలూచి భాష మాట్లాడే ప్రజలు, మరొక సమూహం బ్రాహు మాట్లాడే ప్రజలు. బ్రాహు ఒక ద్రవిడ భాష.
"బలూచ్‌లు, సింధీలు, పఖ్తూన్‌లను బలవంతంగా ఉంచాలని చూస్తే మీరు అంతర్గతంగా బలంగా ఉండలేరు. కానీ బలూచిస్తాన్ విడిపోతుందని, పాకిస్తాన్ ముక్కలవుతుందని మనం ఇప్పుడే చెప్పలేం. పాకిస్తాన్ గురించి పంజాబీలదే చివరి నిర్ణయం అనే అభిప్రాయం ఇలాగే కొనసాగితే, పాకిస్తాన్ ఒక దేశంగా ఎప్పటికీ విజయం సాధించదు అని ఇష్తియాక్ అహ్మద్ అన్నారు.
"ప్రజలు తమతోనే ఉండాలనుకుంటే, వారిలో ఇక్కడే ఉండాలన్న ఆసక్తిని రేకెత్తించాలని పాకిస్తాన్ భావించాలి. బలూచ్‌ల ఆస్తులపై పంజాబీలకు హక్కులు ఉండకూడదు. పాకిస్తాన్ ఒక సమాఖ్య అయితే బలూచ్‌లకు కూడా వారి హక్కులు ఉండాలి’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతోంది?
పాకిస్తాన్‌కు చెందిన జర్నలిస్ట్ నజామ్ సేఠీ పాకిస్తానీ వార్తా చానల్ సమా టీవీతో మాట్లాడుతూ, "జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై బీఎల్ఏ దాడి చేసిన విధానం పూర్తిగా ప్రణాళిక ప్రకారం జరిగింది. ఇది ఒక రోజులో జరిగిన విషయం కాదు. ఇందులో విదేశీ జోక్యం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. పాకిస్తాన్ కశ్మీర్‌పై దాడి చేస్తే బలూచిస్తాన్‌ను పాకిస్తాన్ నుంచి వేరు చేస్తామని అజిత్ డోభాల్ 2014 లో స్పష్టంగా చెప్పారు’’ అని అన్నారు.
"పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన స్పష్టంగా చెప్పారు" అని నజామ్ సేఠీ అన్నారు.
"ఇప్పుడు పార్లమెంటు లోపల భారతదేశం గురించి చర్చ జరుగుతుంది. బలూచ్‌లు భారతదేశంలో శిక్షణ పొందుతున్నారని మనం చెబితే, దానికి మన దగ్గర రుజువు ఎక్కడ ఉంది?'' అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














