ఈ పాకిస్తానీ 4 నెలలుగా ముంబయి పోలీస్ స్టేషన్‌లోనే ఉంటున్నాడు, ఎందుకు?

- రచయిత, దీపాలి జగ్తాప్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"నాది పాకిస్తాన్. కరాచీలో పుట్టాను, మా ఇల్లు అక్కడే ఉంది. మూడేళ్లయింది, నా పిల్లలను కూడా చూడలేదు. నా కుటుంబాన్ని చాలా మిస్ అవుతున్నా. రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు"
గత నాలుగు నెలలుగా దక్షిణ ముంబయిలోని క్రాఫోర్డ్ మార్కెట్ సమీపంలో ఉన్న ఎంఆర్ఏ మార్గ్ పోలీస్ స్టేషన్‌లోనే ఉంటున్న 65 ఏళ్ల నాదిర్ కరీం ఖాన్ మాటలివి.
ఈ పోలీస్ స్టేషనే ఆయన తాత్కాలిక నివాసం. తిండి, వసతి, నిద్ర, అన్నీ అక్కడే. నాదిర్ 2024 అక్టోబర్ 11న ఆర్థర్ రోడ్ జైలు నుంచి విడుదలయ్యారు. అప్పటి నుంచి ఈ పోలీస్ స్టేషన్‌లో ఉంటున్నారు.
"ఇన్ని రోజులుగా ఇక్కడి వారితో పరిచయం పెంచుకున్నాను. అందరూ నన్ను ఖాన్ భాయ్ అని పిలుస్తారు. బాగా చూసుకుంటారు. కానీ, ఇప్పుడు నాకు 65 ఏళ్లు. నాకేదైనా జరిగితే ఎలా? భయంగా ఉంది. త్వరగా నన్ను ఇంటికి పంపండి" అని కోరుతున్నారు నాదిర్ కరీం ఖాన్.

అవసరమైన పత్రాలు లేకుండా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించినందుకు, ఇక్కడ ఉంటున్నందుకు కోర్టు నాదిర్‌కు ఆరు నెలల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించింది.
అయితే, జైలు నుంచి విడుదలై 4 నెలలు కావొస్తున్నా ఆయన ఇంటికి వెళ్లడం సాధ్యపడలేదు.
నాదిర్ కరీం ఖాన్‌ను పంపించేయాలని కోర్టు ఆర్డర్ ఉందని, దీని కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పాకిస్తాన్ రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుగుతున్నాయని ఎంఆర్ఏ మార్గ్ పోలీస్ స్టేషన్‌లోని ఒక అధికారి చెప్పారు.

మీరు ఇండియా ఎలా వచ్చారు?
నాదిర్ కరీం ఖాన్ తెలిపిన సమాచారం ప్రకారం.. ఆయనఒక లెదర్ జాకెట్ వ్యాపారి. 2021 నవంబర్‌లో నేపాల్‌లోని కఠ్మాండూలో జరిగిన ఒక ఎక్స్‌పోలో నాదిర్ పాల్గొన్నారు. అక్కడ కొంతమంది వ్యాపారులను ఆయన కలిశారు.
వారికి నాదిర్ సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన జాకెట్లను ఇచ్చారు. అయితే, వారిచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని నాదిర్ అంటున్నారు.
దీనిపై కఠ్మాండూలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. తర్వాత, ఆ వ్యాపారులకు సంబంధించిన వ్యక్తులు తనపై దాడి చేసి, పాస్‌పోర్ట్ కూడా లాగేసుకున్నారని అన్నారు.
ఈలోగా, నేపాల్‌లో నాదిర్ వీసా గడువు ముగిసింది, అయినా కూడా నేపాల్‌లోనే ఉన్నందుకు 8 వేల నుంచి 9 వేల డాలర్ల జరిమానా విధించారు.
నాదిర్ ఖాన్ మాట్లాడుతూ "ఆ తర్వాత, నేపాల్ నుంచి భారత్ వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఇక్కడైతే భాష సమస్య ఉండదని అనుకున్నా. కాలినడకన సోనౌలీ బోర్డర్ దాటి భారత్‌లోకి ప్రవేశించా. అక్కడి నుంచి బస్సులో గోరఖ్‌పూర్ వెళ్లా. అక్కడి పోలీసు స్టేషన్‌కి వెళ్లి సాయం కోరా. వారు నన్ను దిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీకి వెళ్లమని సూచించారు" అని చెప్పారు.
గోరఖ్‌పూర్ నుంచి దిల్లీ చేరుకున్న నాదిర్ ఖాన్, పాకిస్తాన్ రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించారు.
అనంతరం, 2023 నవంబర్ 1న ముంబయికి చేరుకున్నానని, అవసరమైన పత్రాలు లేకపోవడంతో ఎక్కడా ఉండలేకపోయానని నాదిర్ చెబుతున్నారు.
ముంబయి పోలీసులకు మొత్తం సమాచారం చెప్పి, లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు నాదిర్ తెలిపారు.
తనను పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో దింపాలని దాదర్ రైల్వేస్టేషన్ దగ్గరి టాక్సీ డ్రైవర్‌ను కోరానని, కానీ, డ్రైవర్ సీఎస్ఎంటీ సమీపంలోని డిప్యూటీ కమిషనరేట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో దింపారని, అక్కడ జరిగినదంతా చెప్పానని ఆయన చెప్పారు.

పోలీసులు ఏమంటున్నారు?
ఈ విషయంపై ఎంఆర్‌ఏ మార్గ్ పోలీస్ స్టేషన్‌లోని ఏటీసీ (యాంటీ టెర్రరిజం సెల్) పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ అనిల్ రాథోడ్ మాట్లాడుతూ, ''విచారణలో తాను లెదర్ జాకెట్ల వ్యాపారం చేసేందుకు నేపాల్ వెళ్లానని, అక్కడ పెద్దమొత్తంలో సరుకు అప్పుగా ఇచ్చానని నాదిర్ చెప్పారు. డబ్బులు అందలేదని, ఈలోపు తన వీసా గడువు కూడా ముగిసిందని, నేపాలీ ప్రభుత్వం జరిమానా విధించిందని చెప్పారు. ఇక, సరుకు తీసుకెళ్లిన వారు కొట్టి పాస్‌పోర్ట్ ఎత్తుకెళ్లినట్లు ఆయన చెప్పారు" అని తెలిపారు.
''ఇండియాకు వచ్చిన తర్వాత దర్యాగంజ్ పోలీసులు నాదిర్‌ను పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి పంపించారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు వెళ్లమని సూచించారు. ఎవరూ సాయం చేయకపోవడం, ఎక్కడ ఉండాలో తెలియకపోవడంతో ఒక ఏజెంట్ ద్వారా సూరత్‌కు వెళ్లారు. అక్కడి నుంచి రైలులో ముంబయి సెంట్రల్‌కు వచ్చారు. తర్వాత గోవాకు వెళ్లి, తిరిగి దాదర్‌కు వచ్చారు. అనంతరం, ట్యాక్సీలో జోన్ 1 పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. సమాచారం అందుకున్న ఎంఆర్ఏ మార్గ్ పోలీసులు నాదిర్‌ను అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన నేరంపై అదుపులోకి తీసుకున్నారు. ఏటీసీ, ఏటీఎస్, ఆర్ఏడబ్ల్యూ, ఐబీ విభాగాలు ఆయన్ను విచారించాయి'' అని అనిల్ రాథోడ్ తెలిపారు.
"ఎంఆర్ఏ పోలీసులు నాదిర్‌పై కేసు నమోదు చేశారు. న్యాయస్థానం ఆయనకు అక్రమంగా దేశంలోకి ప్రవేశించడం, అక్రమ నివాసం కేసుల కింద 6 నెలల జైలు శిక్ష విధించింది. 2024 అక్టోబర్ 11న ఆయన విడుదలయ్యారు. నాదిర్‌ను వెనక్కి పంపించేయాలని కోర్టు ఆదేశించింది" అన్నారాయన.
నాదిర్‌ను పంపడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పాకిస్తాన్ రాయబార కార్యాలయంతో తదుపరి ప్రయత్నాలు జరుగుతున్నాయని అనిల్ తెలిపారు.
ముంబయిలోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, సివిల్ అథారిటీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, పాకిస్తాన్ పంపే వరకు ఎంఆర్ఏ మార్గ్ పోలీస్ స్టేషన్ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లడానికి నాదిర్ ఖాన్‌కు అనుమతి లేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
'మాజీ క్రికెటర్ సోదరుడిని'
నాదిర్ ఖాన్ తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. గత 4 నెలలుగా పోలీస్ స్టేషనే ఆయన ఇల్లు. స్టేషన్‌లోనే ఒక గదిలో నిద్రిస్తున్నారు. భోజనం, ఇతరత్రా కూడా స్టేషన్‌లోనే.
"వారు నన్ను కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారు. నన్ను ఖాన్ భాయ్ అని పిలుస్తారు. బాగా చూసుకుంటున్నారు. కానీ, నేను ఇంటికి వెళ్లాలనుకుంటున్నా. అందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి. విచారణ జరపాలి. కానీ, ఇలా ఎన్నిరోజులు? పాకిస్తాన్ ఎంబసీ చొరవ చూపాలి" అని నాదిర్ కోరారు.
కుటుంబంతో మాట్లాడుతున్నారా అని ఆయనను అడిగితే.. జైలుకు వెళ్లే ముందు మాట్లాడానని చెప్పారు.
"రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు. నాకు ఇద్దరు పిల్లలు. చిన్నోడికి 14 ఏళ్లు, ఇప్పుడు 17 వచ్చి ఉంటాయి. నేను చదువుకున్నా, కరాచీలో గ్రాడ్యుయేషన్, ఈజిప్ట్‌లో ఎంబీఏ చేశా. వ్యాపార నిమిత్తం ఇంతకుముందు చాలా దేశాలకు వెళ్ను. కానీ, ఎప్పుడూ ఇలా జరగలేదు" అని నాదిర్ చెప్పారు.
తన అన్న అన్వర్ ఖాన్ 1979లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడారని నాదిర్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














