ఇండియా Vs పాకిస్తాన్: ఇప్పటికీ గుర్తుండిపోయే 5 ఉత్కంఠభరిత మ్యాచ్‌లు

షోయబ్ అక్తర్, సచిన్ తెందూల్కర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ సందర్భంగా ఉత్కంఠ తారస్థాయికి చేరుతుంది
    • రచయిత, విధాన్షు కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"మ్యాచ్‌కు ముందురోజు నాకసలు నిద్రపట్టలేదు, మేం ఎంత ఒత్తిడికి గురయ్యామో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు"

2003 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు పరిస్థితి గురించి భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ చెప్పిన మాటలివి.

ఆ మ్యాచ్‌లో భారత్ సులువుగా గెలిచింది. సచిన్ 98 పరుగులతో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, సచిన్ మాటలు భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఆటగాళ్లపై ఎంత ఒత్తిడి ఉంటుందో అభిమానులు అర్థం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది.

అదే సమయంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ 2006లో కరాచీ టెస్టులో జరిగిన ఒక సంఘటనను 2022లో మీడియాతో పంచుకున్నారు. మ్యాచ్ సమయంలో సచిన్‌ను బంతితో కొట్టి గాయపర్చాలని అనుకున్నట్లు షోయబ్ చెప్పారు.

భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ సందర్భంగా ఉత్కంఠ తారస్థాయికి చేరుతుంది. అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటారు. ఓడిపోయిన వారి ఇళ్లలో టీవీ సెట్లు పగులుతుంటాయి, విజేతల ఇళ్లలో టపాసులు పేలుతుంటాయి.

అలాంటి ఐదు మ్యాచ్‌లను చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కరాచీలో తొలి వన్డే మ్యాచ్‌

ఫొటో సోర్స్, Getty Images

కరాచీ వన్డే, 2004

ముందుగా కరాచీలో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌ గురించి తెలుసుకుందాం. దాదాపు 25 ఏళ్ల తర్వాత 2004లో భారత్ జట్టు పూర్తి సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్‌కు రావడంతో ఉత్కంఠ నెలకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 349 పరుగులు చేసింది. వీరేంద్ర సెహ్వాగ్ 79, రాహుల్ ద్రవిడ్ 99 పరుగులు చేశారు.

లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ 34 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. అయితే ఇంజమామ్ ఉల్-హక్ సెంచరీ పాకిస్తాన్‌ను మ్యాచ్‌లో నిలిపింది.

ఆఖరి ఓవర్‌లో పాకిస్తాన్‌కు 9 పరుగులు అవసరం. చివరి ఓవర్ వేసిన ఆశిష్ నెహ్రా మొదటి 5 బంతుల్లో 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

మ్యాచ్ చివరి బంతికి మొయిన్ ఖాన్ సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నించగా, జహీర్ ఖాన్ బౌండరీ వద్ద క్యాచ్ అందుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.

జావేద్ మియాందాద్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షార్జా మ్యాచ్‌లో జావేద్ మియాందాద్ చివరి బంతి వరకు క్రీజులో ఉన్నాడు.

షార్జా వన్డే, 1986

ఆస్ట్రేలియా-ఏసియా కప్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 245 పరుగులు చేసింది. సునీల్ గవాస్కర్ అత్యధికంగా 92 పరుగులు చేయగా శ్రీకాంత్, వెంగ్‌సర్కార్ హాఫ్ సెంచరీలు చేశారు.

246 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ఒక ఎండ్‌లో వికెట్లు పడుతుండగా, మరో ఎండ్‌లో జావేద్ మియాందాద్ నిలదొక్కుకొని బ్యాటింగ్ చేశాడు. చివరి ఓవర్ బౌలర్ చేతన్ శర్మ వేశారు. ఆఖరి బంతికి పాకిస్తాన్‌కు 4 పరుగులు కావాలి. మియాందాద్ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. ఎక్స్‌ట్రాలు మాత్రం ఇవ్వొద్దని శర్మకు కెప్టెన్ కపిల్ దేవ్ సూచించారు.

యార్కర్‌ను వేయడానికి ప్రయత్నించాడు శర్మ. అయితే బంతి ఫుల్ టాస్‌గా వెళ్లింది. మియాందాద్ మిడ్‌వికెట్‌పై భారీ సిక్సర్ కొట్టాడు.

భారత్‌, పాకిస్తాన్‌

ఫొటో సోర్స్, Getty Images

ఢాకా వన్డే, 1998

ఇండిపెండెన్స్‌ కప్‌లో నిర్ణయాత్మకమైన మూడో ఫైనల్‌లో భారత్‌, పాకిస్తాన్‌లు తలపడ్డాయి. ఈ 48 ఓవర్ల మ్యాచ్‌లో సయీద్ అన్వర్ 140, ఇజాజ్ అహ్మద్ 117 పరుగులు చేయడంతో పాకిస్తాన్ జట్టు 314 పరుగులు సాధించింది.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. సౌరవ్ గంగూలీ, సచిన్‌ల 71 పరుగుల భాగస్వామ్యంతో నిలదొక్కుకుంది. తర్వాత రెండో వికెట్‌కు రాబిన్ సింగ్‌తో కలిసి 179 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు సౌరవ్.

124 పరుగులు చేసిన సౌరవ్ 43వ ఓవర్‌లో ఔటయ్యాడు. భారత్ ఇంకా 5 ఓవర్లలో 40 పరుగులు చేయాల్సి ఉంది. చివరి ఓవర్లలో మైదానంలో వెలుతురు కూడా సరిగ్గా లేదు, దీంతో భారత్‌కు పరుగులు చేయడం కష్టంగా మారింది. కానీ, మ్యాచ్ చివరి ఓవర్ ఐదో బంతికి కనిత్కర్ ఫోర్ కొట్టి భారత్‌కు ట్రోఫీని అందించాడు.

వీరేంద్ర సెహ్వాగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డర్బన్ మ్యాచ్‌ ఫలితాన్ని 'బౌల్ అవుట్' ద్వారా నిర్ణయించాల్సి వచ్చింది.

డర్బన్ టీ20, 2007

2007లో డర్బన్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్ తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ కూడా 141 పరుగులే చేయగలిగింది. దీంతో మ్యాచ్ టై అయింది.

మ్యాచ్‌ ఫలితాన్ని 'బౌల్ అవుట్' ద్వారా నిర్ణయించాల్సి వచ్చింది. ఫుట్‌బాల్‌లో ఇది పెనాల్టీ షూట్-అవుట్ వంటిది. ఇందులో బౌలర్ నేరుగా వికెట్లకు బౌలింగ్ చేసి, వికెట్ పడగొట్టాలి. అక్కడ బ్యాటర్ ఉండడు.

భారత తరఫున వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, రాబిన్ ఉతప్పలు వికెట్లను పడగొట్టారు. పాకిస్తాన్‌ ప్లేయర్లు యాసిర్ అరాఫత్, ఉమర్ గుల్, షాహిద్ అఫ్రిదీలు టార్గెట్ మిస్ అయ్యారు. దీంతో భారత్ 3-0తో బౌల్ అవుట్‌లో విజయం సాధించింది.

మహేంద్ర సింగ్ ధోని

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేసిన ధోని 123 బంతుల్లో 148 పరుగులు చేశాడు

విశాఖపట్నం వన్డే, 2005

2005లో పాకిస్తాన్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్ విశాఖపట్నం వేదికగా జరగగా, ఈ మ్యాచ్‌లో భారత్‌కు కొత్త హీరో దొరికాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 356 పరుగులు చేసింది. యువ వికెట్ కీపర్-బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని ఆ ఇన్నింగ్స్ హీరో.

మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేసిన ధోని 123 బంతుల్లో 148 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 4 సిక్సర్లు, 15 ఫోర్లు బాదిన ధోని, తొలి సెంచరీ సాధించాడు. తర్వాత పాకిస్తాన్ ఇన్నింగ్స్ 298 పరుగులకే పరిమితమైంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)