యూఎస్ ఎయిడ్ నిలిపివేత: ‘నా భార్యకు సెక్స్ గురించి, నాకు ప్రాణం గురించి ఆందోళన’

అమెరికా విదేశీ సాయం, ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, యుగాండా, మలావి, కంపాలా

ఫొటో సోర్స్, Mike Elvis Tusubira

    • రచయిత, డోర్కాస్ వంగీర
    • హోదా, బీబీసీ ప్రతినిధి

విదేశాలకు అమెరికా అందిస్తున్న సాయాన్ని నిలిపివేస్తూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో యుగాండాలో మోటార్ సైకిల్ టాక్సీ నడుపుతున్న హెచ్ఐవీ బాధితుడు ఎల్విస్ టుసుబిరా జీవితం తలకిందులైంది.

35 ఏళ్ల టుసుబిరా యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. ట్రంప్ నిర్ణయంతో సురక్షితమైన సెక్స్‌లో పాల్గొనలేనందుకు తాను తన భార్య నుంచి విడిపోవాల్సి రావచ్చేమోనని ఆయన ఆందోళన చెందుతున్నారు.

టుసుబిరా పార్ట్‌నర్ హెచ్ఐవీ నెగటివ్. ఆమె తనకు హెచ్‌ఐవీ సోకకుండా నివారించే PrEP అనే ఔషధం మీద ఆధారపడుతున్నారు.

"దీనర్ధం ఏంటంటే నా వైవాహిక జీవితం ముగిసినట్లే. ఎందుకంటే నివారణ చర్యలు లేకుండా సెక్స్‌లో పాల్గొనేందుకు నా భార్య ఒప్పుకోదు. అలాంటప్పుడు ఆమె నాతో కలిసి ఉండదు" అని ఆయన బీబీసీకి చెప్పారు.

"కండోమ్‌లు ఉండవు, యాంటీ హెచ్ఐవీ లూబ్రికెంట్లు ఉండవు, PrEP ఔషధాలు ఉండవు. ఏమీ ఉండవు. మేం సెక్స్‌లో పాల్గొనకుండా వివాహ బంధంలో ఉండలేం. దీనర్థం నేను ఒంటరిగా జీవించాలి" అని టుసుబిరా ఆవేదన వ్యక్తం చేశారు.

అమెరికా నుంచి వచ్చే నిధులతోనే దంపతులకు అవసరమైన గర్భ నిరోధకాలు, ఔషధాలను సరఫరా చేస్తున్నారు.

ట్రంప్ ఒక్కసారిగా ఈ సాయాన్ని నిలిపి వేస్తూ నిర్ణయం తీసుకున్నారని టుసుబిరా సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నారు. ఇది ఆకస్మికంగా జరగడంతో ఆయన తనకు అవసరమైన మొత్తంలో ఔషధాలనను నిల్వ చేసుకోలేకపోయారు.

హెచ్ఐవీ సోకకుండా నిరోధించే PrEP ఔషధం ఆయన భార్య వద్ద పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు వాళ్లు కేవలం కండోమ్‌ల మీద మాత్రమే ఆధారపడాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. అవి కూడా కొన్నే ఉన్నాయి. అయినప్పటికీ కండోమ్‌ల వాడకం ప్రమాదకరం కావచ్చనేది వారి ఆందోళన.

రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజునే అమెరికా యూఎస్ ఎయిడ్ ద్వారా విదేశీ సంస్థలకు అందిస్తున్న సాయాన్ని 90 రోజుల పాటు నిలిపివేస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం మానవీయ కోణంలో కొన్ని ప్రాజెక్టులకు మినహాయింపులు ఇచ్చారు. అయితే అప్పటికే హెచ్ఐవీ కార్యక్రమం కింద టుసుబిరా సాయం పొందుతున్న మర్పీ క్లినిక్‌ను మూసి వేశారు. ఇది యుగాండా రాజధాని కంపాలాలో ఉంది.

దీంతో ఆయన ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కిష్వా హెల్త్ సెంటర్‌ త్రీ లోని తన కౌన్సిలర్‌కు ఫోన్ చేశారు.

"ఆ సమయంలో నా కౌన్సిలర్ గ్రామంలో ఉన్నారు. తాను క్లినిక్‌కు వెళ్లడం లేదని చెప్పారు" అని టుసుబిరా వివరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

టుసుబిరా ఓ బిడ్డకు తండ్రి. ఆయనకు 2022లో హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలింది. తన శరీరంలో వైరస్ ఏ స్థాయిలో ఉంది, తన రోగ నిరోధక శక్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే పరీక్షను ఆయన ఇప్పటి వరకు చేయించుకోలేక పోయారు.

"నేను చీకట్లో బతుకుతున్నాను, నా శరీరంలో వైరస్ తగ్గిపోయిందో లేదో నాకు తెలియదు. నాకు చాలా భయంగా ఉంది" అని ఆయన చెప్పారు.

ప్రస్తుతం ఆయన కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాల నుంచి బయటపడేందుకు బైక్ టాక్సీ డ్రైవర్‌గా తనకు వచ్చే సంపాదన సరిపోదని టుసుబిర భావిస్తున్నారు.

‘‘హెచ్ఐవీ నిరోధక ఔషధాలు ప్రైవేటు మందుల షాపుల్లో దొరుకుతాయని కొంతమంది చెబుతున్నారు. నాకంత డబ్బు ఎలా వస్తుంది?" అని ఆయన అన్నారు.

ట్రంప్ ఆదేశాలతో యూఎస్ ఎయిడ్‌ ద్వారా నడుస్తున్న ఎన్జీవోలు అందించే సేవలు కూడా ఆగిపోయాయి.

ఆయన భార్య మర్పీలో ఉన్న ఒక ఎన్జీవో నుంచి PrEP ఔషధాలు తెచ్చుకుంటున్నారు. పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారులకు స్కూళ్లలో ఇచ్చే ఆహారం ద్వారా వారి అయిదేళ్ల కొడుకుకు కొంత వరకు మంచి ఆహారం లభిస్తోంది.

"మా అబ్బాయి ఇప్పుడు స్కూలుకెళ్లడం లేదు" అని టుసుబిర చెప్పారు.

అమెరికా, యూఎస్ ఎయిడ్, యుగాండా, మలావి, కంపాలా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యాంటీ రిట్రో వైరల్ ఔషధాల్ని తీసుకోవడం ఆపేస్తే తీవ్ర అనారోగ్యానికి దారి తీసే అవకాశం ఉంది.

మూతపడిన క్లినిక్‌లు

యుగాండాలో ఆరోగ్య రంగం ఎక్కువగా దాతల సాయం మీదనే ఆధారపడి ఉంది. హెచ్ఐవీ బాధితుల్లో 70 శాతం మందికి ఈ నిధులే అండగా నిలుస్తున్నాయి.

ఆఫ్రికాలో యూఎస్ ఎయిడ్ లబ్ధిదారులైన మొదటి పది దేశాల్లో ఈ ఆఫ్రికా దేశం కూడా ఉంది. 2023లో వైద్య విరాళాల కింద యుగాండా 295 మిలియన్ డాలర్ల సాయం అందుకుందని అమెరికా ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి. యుగాండా కంటే ముందు నైజీరియా, టాంజానియా ఉన్నాయి.

యూఎస్ ఎయిడ్ మలేరియా, టీబీ, కుష్టు నివారణ కార్యక్రమాలకు కూడా నిధులు అందిస్తోంది. బాలింతలు, పిల్లల ఆరోగ్య సేవల, అత్యవసర వైద్య సేవలకు సాయం అందిస్తోంది.

నిధులు నిలిపివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వేలమంది ఆరోగ్య కార్యకర్తలపైనా ప్రభావం చూపింది.

డాక్టర్ షమిరా నకిట్టో ఒక క్లినిక్ నిర్వహిస్తున్నారు. విశ్వాసాల ఆధారంగా నడుస్తున్న రీచ్ అవుట్ ఎంబుయా అనే సంస్థ యుగాండాలో హెచ్ఐవీ బాధితులకు మానసిక, వైద్యపరమైన మద్దతు అందిస్తోంది. ఈ సంస్థ కంపాలాలోని ఓ మురికివాడలో కిన్సేయి హెల్త్ సెంటర్ ఫోర్ ద్వారా సేవలందిస్తోంది.

డాక్టర్ షమిరా సగటున 2 వందలమంది హెచ్ఐవీ, ఎయిడ్స్, టీబీ బాధితులను పరీక్షిస్తారు. అయితే యూఎస్ ఎయిడ్ నిధులు ఆగిపోవడంతో రీచ్ అవుట్ ఎంబుయా సంస్థ తన ఉద్యోగులను తొలగించింది.

కిన్సేయిలో సంస్థ నిర్వహిస్తున్న టీబీ యూనిట్ మూతపడింది. అనాథలు, బలహీనంగా ఉన్న చిన్నారుల విభాగాన్ని కూడా మూసేశారు. "మేము ఆ 90 రోజులు ఎప్పుడు పూర్తవుతాయా అని ఎదురు చూస్తున్నాం. ఈ నిర్బంధపు సెలవు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు" అని షమిరాహ్ చెప్పారు.

అంతరాయాల్ని వీలైనంత తగ్గించేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నట్లు యుగాండా ఆరోగ్య శాఖ తెలిపింది.

"దేశాన్ని దృష్టిలో ఉంచుకుని, లాభాపేక్షలేకుండా పని చేయడానికి ముందుకు వచ్చే వారు మమ్మల్ని సంప్రదించండి" అని ఆరోగ్య శాఖ కోరింది.

అమెరికా, యూఎస్ ఎయిడ్, యుగాండా, మలావి, కంపాలా

మలావిలోనూ యూఎస్ ఎయిడ్ నిధుల ద్వారా నడిచే కార్యక్రమాలు ఆగిపోయాయి..

2023లో యూఎస్ ఎయిడ్ నుంచి మలావీకి 154 మిలియన్ డాలర్లు అందాయి. అమెరికా అందిస్తున్న సాయం పొందుతున్న ఆఫ్రికన్ దేశాల్లో మలావీ పదో స్థానంలో ఉంది.

ఉత్తర మలావీలో ఎంజుజు నగరంలో ఆ ప్రాంతం మొత్తంలో హెచ్ఐవీ బాధితులకు సేవలు అందిస్తున్న వైద్య కేంద్రాన్ని మూసివేశారు. అక్కడి వాహనాలు మూలన పడ్డాయి. మాక్రో ఎంజుజు క్లినిక్ దగ్గర అలికిడి లేదు.

ఇందులో పని చేస్తున్న వారు 18 రోజుల క్రితమే క్లినిక్‌ను మూసేసి వెళ్లిపోయారు.

జనవరి 28న ఆంక్షల్ని కొంత వరకు పక్కన పెట్టి యాంటీ రిట్రో వైరల్ డ్రగ్స్ లాంటి వాటిని సరఫరా చేస్తున్నప్పటికీ యూఎస్ ఎయిడ్ ద్వారా నడుస్తున్న అనేక క్లినిక్‌లు మూత పడ్డాయి. వాటిల్లో కీలకమైన సిబ్బంది లేరు. దీంతో బాధితులకు మందుల్ని సరఫరా చేయడం సవాలుగా మారింది.

సేవల్ని పునురద్దరించేందుకు సాంకేతికంగా అనుమతులు ఇచ్చిన చోట కూడా , అనేక కాంట్రాక్టుల పరిస్ధితి అయోమయంగా ఉంది. తాము ఏం చేయాలో, ఏం చేయకూడదో హెల్త్ వర్కర్లకు తెలియడం లేదు.

యూఎస్ ఎయిడ్‌కు ప్రస్తుతం ఉన్న సిబ్బందిలో 90 శాతం కంటే ఎక్కువ మందిని తొలగించాలని ట్రంప్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

ఆఫ్రికాలో యూఎస్ ఎయిడ్ సిబ్బంది 14వేల నుంచి 294కి తగ్గిస్తారని, ఆఫ్రికాకు కేవలం 12 మందిని మాత్రమే కేటాయిస్తారని యూఎస్ ఎయిడ్ మాజీ గ్లోబల్ హెల్త్ అసిస్టెంట్ అడ్మిస్ట్రేటర్ అతుల్ గవాండే ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

నిధులను నిలిపివేయడం వల్ల మలావిలో 30కి పైగా ఎన్జీవోలపై ప్రభావం పడింది.

32 ఏళ్ల ఎద్దా సిమ్‌ఫుక్వే బండా వ్యవసాయం చేస్తుంటారు. 2017 నుంచి మేక్రో క్లినిక్ ద్వారా ఆమె యాంటీ రిట్రో వైరల్ డ్రగ్స్ అందుకుంటున్నారు. ఈ క్లినిక్ ద్వారా అనేక ఎన్జీవోలు హెచ్ఐవీ కార్యక్రమాల్ని అమలు చేస్తున్నాయి.

తన భవిష్యత్ ఏమవుతుందోనని ఆమె ఆందోళన చెందుతున్నారు. ఆమె వదిన కూడా దాతలు విరాళంగా ఇచ్చిన ఔషధాల మీద ఆధారపడుతున్నారు. తమకు దేవుడిని ప్రార్థించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చెబుతున్నారు.

"మలావీ వాసులుగా మేము ప్రార్థన చేయాలి. భగవంతుడు ఒక తలుపు మూసివేసినప్పుడు మరి కొన్ని తెరుస్తాడని మేము నమ్ముతాం" అని ఆమె బీబీసీతో చెప్పారు.

ఆమెకు ముగ్గురు పిల్లలు, ఆమె వద్ద ప్రస్తుతం మూడు వారాలకు సరిపడా యాంటీ రిట్రో వైరల్ డ్రగ్స్ మాత్రమే ఉన్నాయి. వ్యవస్థల వైఫల్యాన్ని కూడా ఆమె నిందిస్తున్నారు.

"ఇతరులు అందించే సాయం మీద మలావీ ప్రజలు ఎక్కువగా ఆధారపడుతున్నారు. కొన్ని సమయాలలో మనం సోమరితనంతో వ్యవహరిస్తున్నాం. ఎవరో ఇచ్చే సాయం మీద ఆధారపడతాం" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"దీన్నొక పాఠంగా తీసుకుని మనం స్వతంత్రంగా ఎదగడాన్ని అలవాటు చేసుకోవాలి" అని ఆమె చెప్పారు. అయితే ప్రపంచంలో విదేశీ సాయం మీద ఎక్కువగా ఆధారపడే పేద దేశంలో ఇది చాలా కష్టం

ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం మలావీలో ఇతర సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి. సుదీర్ఘ కాలం కరవు, తుపానులు, వరదలు లాంటి సమస్యలు ఈ దేశాన్ని కుంగ దీస్తున్నాయి.

ఆ దేశ ఆరోగ్య రంగంలో ఇలాంటి కుదుపు చాలా తీవ్రమైన సమస్య.

అమెరికా, యూఎస్ ఎయిడ్, యుగాండా, మలావి, కంపాలా

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, అమెరికా నిధుల సాయాన్ని ఆపేస్తే, రానున్న ఐదేళ్లలో 63 లక్షల మంది ఎయిడ్స్‌తో మరణిస్తారని హెడ్ ఆఫ్ యూఎన్ ఎయిడ్స్ విన్నీబయానిమా చెప్పారు.

కొన్ని దశాబ్ధాలుగా ఆఫ్రికా ప్రజారోగ్య వ్యవస్థలో అమెరికా కీలక భాగస్వామి.

హెచ్ఐవీ వ్యాప్తిని అరికట్టడానికి 2003లో యూఎస్ ప్రెసిడెంట్స్ ఎమర్జెన్సీ ప్లాన్ ఫర్ ఎయిడ్స్ రిలీఫ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా రెండున్నర కోట్ల మందిని రక్షించారు.

గత ఏడాది యూఎస్ ఎయిడ్ ద్వారా ఆమెరికా 8 బిలియన్ డాలర్ల సాయం అందించిందని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధిపతి చెప్పారు.

"అందులో 73 శాతం ఆరోగ్య రంగానికే కేటాయిస్తున్నాం" అని జీన్ కసేయా బీబీసీతో అన్నారు.

ఆగిపోయిన నిధుల్ని భర్తీ చేయడం చాలా కష్టమని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆఫ్రికన్ ప్రభుత్వాలు విదేశాలు ఇచ్చే సాయం మీద ఆధారపడటాన్ని తగ్గించు కోవడంలో కొంత పురోగతి సాధించాయి. కెన్యాలో హెచ్ఐవీ బాధితుల వైద్య సేవలకు అవసరమైన నిధుల్లో 60 శాతం ఆ దేశ ప్రభుత్వం అందిస్తోంది. సౌతాఫ్రికాలో స్థానిక ప్రభుత్వం 80 శాతం నిధులు అందిస్తోంది,

అయితే అనేక అల్పాదాయ దేశాల్లో పెరుగుతున్న అప్పులు, వాతావరణ మార్పుల వల్ల ఏర్పడుతున్న పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు వాటి స్వయంసంవృద్ధిని దాదాపు అసాధ్యంగా మారుస్తున్నాయి.

ఆఫ్రికాలో ప్రముఖ ఎన్జీవో అమ్రెఫ్ హెల్త్ ఆఫ్రికా, నిధుల విషయంలో సత్వర చర్యలు తీసుకోకుంటే ప్రపంచ ఆరోగ్య భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

"అమెరికా నిధులు నిలిపి వెయ్యడం వల్ల ఆఫ్రికన్ ప్రభుత్వాలు, ఆఫ్రికా సీడీసీ సొంత నిధుల కేటాయింపులను పెంచాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుత రుణగ్రస్త పరిస్థితుల్లో అది దాదాపు అసాధ్యం" అని అమ్రెఫ్ హెల్త్ ఆఫ్రికా సీఈఓ గితింజీ గితాహి బీబీసీతో చెప్పారు.

అమెరికా, యూఎస్ ఎయిడ్, యుగాండా, మలావి, కంపాలా
ఫొటో క్యాప్షన్, ఉత్తర మలావీలో హెచ్ఐవీ చికిత్సకు పెద్ద దిక్కుగా ఉన్న ఈ క్లినిక్ 18 రోజుల క్రితం మూతపడింది.

2023లో ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల 30వేల మంది ఎయిడ్స్‌తో చనిపోయారు. 15 లక్షల మందికి కొత్తగా హెచ్ఐవీ సోకింది.

హెచ్ఐవీ వ్యాప్తి రేటు బాగా ఉన్న దేశాల్లో అది తగ్గుతున్న సమయంలో, యూఎస్ ఎయిడ్‌నూ మూసి వేయడం వల్ల హెచ్ఐవీ కట్టడిలో ఇన్నాళ్లూ చేసిందంతా వృధాగా మారే అవకాశం ఉంది.

"అమెరికా అందిస్తున్న సాయం ఆపేస్తే, రానున్న ఐదేళ్లలో మరో 63 లక్షల ఎయిడ్స్ మరణాలు పెరిగే అవకాశం ఉందని మేము భావిస్తున్నాము" అని యూఎన్ ఎయిడ్స్ అధిపతి విన్నీ బయాన్‌ ఇమా బీబీసీ ఆఫ్రికాతో చెప్పారు.

"కొత్తగా 8.7 మిలియన్ల మందికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. 3.4 మిలియన్ల మంది అదనపు ఎయిడ్స్ బాధిత చిన్నారులు అనాథలుగా మిగులుతారు. నేను వినాశకర అంశాలను బోధించే ప్రవక్తలా మాట్లాడటం లేదు. వాస్తవాలను వెల్లడించాల్సిన బాధ్యత నాపై ఉంది" అని ఆమె చెప్పారు.

హెచ్ఐవీ చికిత్సలో అంతరాయం వల్ల ఏర్పడే ప్రమాదాల గురించి మెడికల్ చారిటీ సంస్థ మెడిసిన్స్ శానస్ ఫ్రాంటియర్స్ హెచ్చరించింది.

"హెచ్ఐవీ ఔషధాల్ని రోజూ తీసుకోవాలి లేకపోతే బాధితుల్లో వ్యాధి నిరోధకశక్తి తగ్గి తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు" అని మెడిసిన్స్ శాన్స్ ఫ్రాంటియర్స్ ఆఫ్రికా ప్రతినిధి టామ్ ఎల్లెన్ చెప్పారు.

తిరిగి యుగాండాకు వస్తే, భవిష్యత్‌ గురించి టుసుబిరా అయోమయంగా ఉన్నారు.

ఆయన వద్ద 30 రోజులకు సరిపడా యాంటీ రిట్రో వైరల్ మందులు మాత్రమే ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత కంపాలా వదిలి తన గ్రామానికి వెళ్లాలని ఆయన భావిస్తున్నారు.

"దీన్ని మరింత తేలిక చేయాలనుకుంటున్నాను. నేనక్కడ చనిపోతే వాళ్లు నాకు అంత్యక్రియలు చేస్తారు. కంపాలాలో నా వాళ్లను ఇబ్బంది పెట్టే బదులు ఊరికెళ్లడం మేలు. ఎందుకంటే యాంటీ రిట్రో వైరల్ మందులు లేకుండా నేను ఇక్కడ జీవించలేను" అని టుసుబిర అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)