జయలలిత బంగారు ఆభరణాలు: 27 కేజీల నగలు, వజ్రాలు ఎవరికి చెందాయంటే

జయలలిత ఆస్తులు

ఫొటో సోర్స్, Imran Qureshi

ఫొటో క్యాప్షన్, జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు, నగదు, ఆస్తుల పత్రాలు మూడు ట్రంకు పెట్టెల్లో తమిళనాడు ప్రభుత్వానికి చేరాయి.

శనివారం సాయంత్రం బెంగళూరులోని కోర్టు నుంచి ఈ ఆస్తులను ఏకే-47లతో వచ్చిన తమిళనాడు పోలీసు అధికారుల రక్షణలో చెన్నైకి తీసుకెళ్లారు.

జయలలితకు చెందిన ఈ ఆస్తులను 1996లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా 36వ అదనపు సివిల్ అండ్ సెషన్స్ జడ్జి హెచ్.ఎస్. మోహన్ ఆదేశాల మేరకు వాటిని తమిళనాడుకు పంపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జయలలిత, అన్నాడీఎంకే

ఫొటో సోర్స్, AP

ఫొటో క్యాప్షన్, జయలలిత 2016 డిసెంబర్ 6న మరణించారు (ఫైల్ ఫోటో )

అందులో ఏం ఉన్నాయి?

జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులలో 27 కిలోల బంగారు నగలు, వజ్రాలు, పచ్చలు, కెంపులు పొదిగిన నగలు, మూడు వెండి నాణేలు ఉన్నాయి.

రూ. 59, 870తో పాటు మరో రూ.1,60, 514 విలువగల గల పాత కరెన్సీ నోట్లు, 2023 నాటి విలువ ప్రకారం రూ.10.18 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్ ఫండ్‌ను కూడా తమిళనాడు పోలీసు బృందానికి అందజేశారు.

ఈ ఆస్తులను తమిళనాడు హోం వ్యవహారాల జాయింట్ సెక్రటరీ జె. ఆన్ మేరీ స్వర్ణ నేతృత్వంలోని తమిళనాడు అధికారులు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఎస్పీ విమలకు బెంగళూరు కోర్టు అందజేసింది.

చెన్నై, కాంచీపురం, తంజావూరు, తిరుప్పత్తూరు, తూత్తుకుడిలో ఉన్న 6 కంపెనీలకు చెందిన 1526 ఎకరాల భూమికి సంబంధించిన ఆస్తి పత్రాలు ఇందులో ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను దోషిగా తేల్చుతూ బెంగళూరు కోర్టు 2014 సెప్టెంబర్ 27న తీర్పునిచ్చింది.

జయలలిత ఆస్తులు

ఫొటో సోర్స్, Imran Qureshi

ఫొటో క్యాప్షన్, జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులలో 27 కిలోల బంగారు నగలు, వజ్రాలు, పచ్చలు ఉన్నాయి.

ఆస్తులను ఏం చేస్తారు?

జప్తు చేసిన ఆస్తులను ఏం చేయాలో నిర్ణయించాల్సిన బాధ్యత తమిళనాడు ప్రభుత్వానిదేనని కోర్టు పేర్కొంది. అంటే, ఆస్తులను విలువ కట్టి వేలంలో విక్రయించి సొమ్ము రాబట్టుకోవచ్చు లేదా ట్రెజరీకి పంపవచ్చని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిరణ్ ఎస్.జవళి విలేఖరులతో చెప్పారు.

ఈ కేసులో ప్రజల మనోభావాలు ఎక్కువగా ఉన్నందున, వీటిని అక్రమ ఆస్తులుగా ప్రకటించి, తదనుగుణంగా జప్తు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించినందున, సేకరించిన భూములను ఏం చేయాలో ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించడం సరైనదని బెంగళూరు కోర్టు అభిప్రాయపడింది.

"ఈ భూములను ప్రజాప్రయోజనాల కోసం డెవలప్‌మెంట్‌కు ఇవ్వవచ్చు, లేదా భూమిలేని వారికి పంచవచ్చు. లేదంటే, ఆ భూములను అమ్మి ప్రభుత్వ నిధులుగా మార్చవచ్చు" అని కోర్టు ఉత్తర్వులు సూచించాయి.

జయలలిత ఆస్తులు

ఫొటో సోర్స్, Imran Qureshi

"ఈ కేసును పరిగణనలోకి తీసుకుంటే, తమిళనాడు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు ప్రాథమిక విద్యకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం ఈ ఆస్తులను ఉపయోగిస్తుందని భావిస్తున్నాను" అని జస్టిస్ మోహన్ అన్నారు.

జయలలిత కేసును విచారణ జరిపి, సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ చేసినందుకు అయిన ఖర్చులకు కర్ణాటక ప్రభుత్వానికి, వీకే శశికళ, ఇళవరసి నుంచి వసూలు చేసిన రూ. 20 కోట్ల 20 వేల జరిమానాలో రూ. 13 కోట్లను చెల్లించాల్సిందిగా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

జయలలిత, తమిళనాడు

ఫొటో సోర్స్, Getty Images

ఏమిటీ కేసు?

జయలలిత ముఖ్యమంత్రిగా ఉండటంతో ఆమెపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేశారు. 18 ఏళ్ల పాటు వాదనలు సాగిన ఈ కేసులో జయలలితను దోషిగా తేలుస్తూ 2014 సెప్టెంబర్ 27న బెంగళూరు స్పెషల్ కోర్టు ఉత్తర్వులు వెల్లడించింది.

జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు, రూ. 100 కోట్ల జరిమానా సైతం విధించింది. దీంతో జయలలిత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ కేసుపై కర్ణాటక హైకోర్టులో ఆమె అప్పీల్ చేశారు.

జయలలిత

ఫొటో సోర్స్, Imran Qureshi

ఫొటో క్యాప్షన్, జయలలిత ఆస్తుల్లో ఒకటైన బంగారు ఖడ్గం

ఈ కేసులో జయలలితను నిర్దోషిగా ప్రకటిస్తూ కర్ణాటక హైకోర్టు 2015 మేలో తీర్పు ఇచ్చింది. దీంతో ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగా మళ్లీ బాధ్యతలు చేపట్టారు.

అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం అదే ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పీల్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునేలోపు జయలలిత (2016 డిసెంబర్ 6న) మరణించారు.

జయలలిత ఆస్తులను వేలం వేయడానికి లేదా విక్రయించడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించాలని కోరుతూ న్యాయవాది టి.నరసింహమూర్తి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 2024లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించగా శనివారం తుది ఉత్తర్వులు జారీ అయ్యాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)