వానపాముల్లా కనిపించే పాలికేట్ల స్మగ్లింగ్‌తో పులికాట్ సరస్సులో ఏం జరుగుతోంది?

- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ చూడటానికి వానపాముల్లా కనిపించే పాలీకేట్ (Polycheate) అనే జీవుల అక్రమ రవాణా పులికాట్ నుంచి జోరుగా సాగుతోంది.
దీని వల్ల పులికాట్ సరస్సు దెబ్బతినడంతోపాటు, చేపలు తగ్గి మత్స్యకారులకు ఉపాధి పోవడం, వలస పక్షుల రాక తగ్గడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి.


ఈ చిన్న జీవులను ఎందుకు స్మగ్లింగ్ చేస్తున్నారు?
వానపాముల్లా కనిపించే పాలికేట్ పురుగులు లేదా బ్రిజిల్ పురుగులు పులికాట్ సరస్సులో చాలా ఎక్కువగా ఉంటాయి. వానపాముకు కాళ్లుండవు. వీటికి చూడటానికి కాళ్లుంటాయి.
''బ్రాకిష్ వాటర్‌లో పెరిగే చేపలు, రొయ్యలు, పీతలు వంటి వాటికి ఈ పురుగులు ప్రధాన ఆహార వనరు. ఆక్వాటిక్ ఎకో సిస్టంలోని ఆహార గొలుసులో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి'' అని మెరైన్ బయాలజిస్ట్ డా. టీడీ బాబు బీబీసీతో చెప్పారు .
పాలికేట్ పురుగులను వానపాములనుకుని చాలామంది గందరగోళపడతారు. చూడటానికి ఈ పాలికేట్లు కూడా వానపాముల్లానే ఉంటాయి. కానీ వానపాములు భూమిలో ఉంటాయి. పాలికేట్లు నీటి జీవులు. వీటికి జెర్రి తరహాలో కాళ్లు ఉంటాయి. సూళ్లూరుపేట స్థానికులు వానపాములను పిలిచినట్టే వీటిని కూడా ఎర్రలు అని పిలవడం వల్ల గందరగోళం పెరిగి, పత్రికలు కూడా వీటిని వానపాములనే రాస్తున్నాయి.
పులికాట్‌లో రొయ్యలు, చేపలు వీటిని తిని ఎదుగుతాయి. ఆ చేపలను మత్స్యకారులు పట్టుకుంటారు. కానీ ఇప్పుడు కోస్తా ఆంధ్రలోని రొయ్యల హేచరీల కన్ను ఈ పురుగుల మీద పడింది. అంతే పులికాట్‌ను గుల్ల చేసేలా పెద్ద ఎత్తున అక్రమ మార్గాల్లో వీటిని సేకరించి స్మగ్లింగ్ చేస్తున్నారు. కొందరు ఇదే పనిగా కూలీలను పెట్టి, ఈ పురుగులను సేకరించి, రహస్యంగా ఎగుమతి చేసి, హేచరీలకు అమ్ముతున్నారు.

ఈ పురుగులను పులికాట్ సరస్సు నుంచి వెలికి తీసే కూలీలకు రోజుకు సుమారు వెయ్యి రూపాయల వరకూ ఇస్తారు. కొందరు సేకరించిన జీవులను బట్టి కేజీల ప్రకారం కూడా ఇచ్చేవారు. అయితే స్మగ్లర్లు వాటిని ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు స్థానిక పాత్రికేయులు కొందరు బీబీసీతో చెప్పారు.
ఆంధ్రలో రొయ్యల చెరువులు ఎక్కువగా ఉంటాయి. వాటికి కోట్లలో రొయ్య పిల్లలు కావాలి. సముద్రాల నుంచి తల్లి రొయ్యను సేకరించి, అవి పిల్లల్ని పెట్టే విధంగా చూసి, ఆ రొయ్య పిల్లలను హేచరీల వారు ఆక్వా రైతులకు అమ్ముతారు.
అయితే ఆ తల్లి రొయ్య బాగా ఎదగడానికి, తొందరగా పిల్లలు పెట్టడానికి మంచి మేత కావాలి.
''ఆ తల్లి రొయ్య తొందరగా ఎదగడం కోసం మంచి పోషకాలున్న ఆహారం ఇవ్వాలి కాబట్టి ఈ జీవులను అక్రమంగా, రహస్యంగా సేకరించి వాటిని మేతగా వేస్తున్నారు. ఈ పాలికేట్లలో పాలీ అన్‌శాచ్యురేటెడ్ ఫాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో తల్లిరొయ్యలు తొందరగా ఎదగడానికి, ఎక్కువసార్లు పిల్లల్ని పెట్టడానికి ఇవి ఉపయోగపడతాయి. వాస్తవానికి వీటిని విదేశాల నుంచి కూడా కొందరు దిగుమతి చేసుకుంటారు. అయితే ఫ్రోజెన్ పాలీకేట్లు దిగుమతి చేసుకోవడం కన్నా ఇక్కడ పులికాట్ సరస్సు నుంచి సేకరించడం చవక కావడంతో హేచరీలు ఈ పనిచేస్తున్నాయి'' అని బీబీసీతో చెప్పారు డా. టీడీ బాబు.

పర్యావరణంపై ప్రభావం
నేషనల్ బయోడైవర్సిటీ చట్టం 2002 ప్రకారం పాలికేట్ల సేకరణ నేరం. అంతేకాదు, వీటిని నిరంతరం ఏరేయడం ద్వారా చేపలు, రొయ్యల సంఖ్య కూడా తగ్గి, పరోక్షంగా మత్స్యకారులను కూడా దెబ్బతీస్తుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
''ఇలా వీటిని సేకరిస్తూ పోతే ఈ పులికాట్ ఎకో సిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది. ఇక్కడుండే నీటి జీవులకు ఇక ఆహారం మిగలదు. వాటిని సేకరించే క్రమంలో సరస్సు అడుగు భాగాన్ని కలబెట్టేస్తున్నారు. ఆ ప్రాంతాన్ని బెంతిక్ జోన్ అంటారు. దాన్ని ధ్వంసం చేస్తున్నారు. అనేక చిన్న జీవులను చంపుతూ, వాటి ఆవాసాలను ధ్వంసం చేస్తున్నారు'' అని బాబు చెప్పారు.
''ఈ జీవుల వేట ఆపాలి. లేకపోతే ప్రకృతికి నష్టం. వలస పక్షులు రావడం ఆగిపోతుంది. సరస్సు దెబ్బతింటుంది. మత్స్యకారులకు కూడా ఉపాధి ఉండదు'' అని తడ ప్రాంతానికి చెందిన ఉస్మాన్ బాషా అనే ప్రకృతి ప్రేమికుడు బీబీసీతో చెప్పారు.

లెక్కకు తేలని అక్రమ రవాణా
మరికొందరు మాజీ వ్యాపారుల మాట భిన్నంగా ఉంది. గతంలో కంటే ఈ ఎగుమతులు కాస్త తగ్గాయని వారు అంటున్నారు.
''చెన్నై నుంచి కూడా ఈ తరహా జీవుల దిగుమతి పెరిగింది. అలాగే, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వారు, హేచరీల్లోనే సొంతంగా వీటిని పెంచుకునే వారు పెరిగారు'' అని సూళ్లూరుపేటకు చెందిన ఒక వ్యాపారి బీబీసీతో చెప్పారు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆయన గతంలో ఈ పాలీకేట్ల అక్రమ ఎగుమతుల్లో భాగస్వామి.
''గతంలో కన్నా ఇప్పుడు కాస్త తగ్గింది అని మాత్రం చెప్పగలను. ఇప్పటికీ నెలకు కొన్ని లక్షల రూపాయల విలువైన అక్రమ రవాణా జరుగుతోంది. అయితే క్రమంగా హేచరీలు సొంతంగా పెంచుకోవడం వల్ల ఇక్కడ డిమాండ్ కాస్త తగ్గింది'' అని ఆయన అన్నారు.
ఈ అక్రమ రవాణా దాదాపు దశాబ్ద కాలానికి పైగా జరుగుతోంది. ఎంత మొత్తంలో ఈ దందా జరుగుతోంది, ఎంత మొత్తంలో ఎగుమతి అవుతున్నాయి అనేదానికి ఎక్కడా స్పష్టమైన లెక్కలు లేవు. స్మగ్లర్లను అధికారులు పట్టుకున్నప్పుడు మాత్రమే ఆ కొద్ది వివరాలు బయట పడుతున్నాయి.
గతంలో ఒకసారి అటవీ శాఖ 60 కేజీల పాలికేట్లను ఒకేసారి పట్టుకుంది. సాధారణంగా మొత్తం ఒకరే తీసుకువెళ్లరు కాబట్టి కేజీ నుంచి 10 కేజీల వరకూ రకరకాల మోతాదుల్లో పాలికేట్లను పట్టుకున్నారు. దాన్ని బట్టి రవాణా పరిమాణాన్ని ఒక అంచనా మాత్రం వేయవచ్చు. అయితే ఈ అక్రమ రవాణా పూర్తి పరిమాణాన్ని బీబీసీ స్వతంత్రంగా నిర్ధరించలేదు.

చేపల వేటకు వెళ్లినట్టుగా...
స్మగ్లర్లు, వారి ఏజెంట్లు పులికాట్ పరిసర గ్రామాల్లోని మత్స్యకారులు, కూలీలతో ఒప్పందం చేసుకుంటున్నారు. వేనాడు, ఇరకం దీవులు సహా తడ, సూళ్లూరుపేట, అరంబాక్కం (తమిళనాడు) ప్రాంతాల్లోని వారు ఈ పనుల్లో దిగుతున్నారు. వారంతా చేపలవేటకు వెళ్లినట్టుగా పడవలో వెళ్లి, సరస్సు మధ్యలో పడవ ఒకచోట ఆపి, నీటిలో దిగి ఈ పురుగులను సేకరిస్తారు. చూసేవారికి వారు చేపలవేటకు వెళ్తున్నట్టే కనిపిస్తుంది.
అలా సేకరించిన వాటిని బతికి ఉండగానే కొన్ని నీళ్లు నింపిన ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేస్తారు. తరువాత వాటిని థర్మాకోల్ బాక్సులు లేదా ఇతర ప్లాస్టిక్ కంటైనర్లలో పెట్టి, ట్రావెల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు వంటి వాటిలో రవాణా చేస్తున్నారు. కొందరు కుండల్లో కూడా పంపుతారు. లైవ్ కాకుండా ప్యాక్ చేసి పంపేవారు కూడా ఉంటారు.
''కొందరు హేచరీల వారు ఈ పాలీకేట్లను తమ హేచరీల్లోనే పెంచుకుంటున్నారు. ప్రభుత్వాలు ఈ తరహా విధానాలను ప్రోత్సహించవచ్చు. దానివల్ల సరస్సుల నుంచి సేకరించడాన్ని ఆపవచ్చు.'' అని మెరైన్ బయాలజిస్ట్ డా. బాబు చెప్పారు.
''ఈ సమస్యలన్నీ వద్దనుకుని హేచరీల వారు కొందరు తమ ప్రాంగణంలోనే వీటిని కల్చర్ చేస్తున్నారు. వానపాములను ఎలా పెంచుతారో, అలా వీటి కోసం బాగా చిన్న చెరువుల్లాంటివి నిర్మించి పెంచుతున్నారు'' అని ఒక రొయ్య పిల్లల హేచరీలో పనిచేసే టెక్నీషియన్ ఒకరు బీబీసీతో చెప్పారు.

అటవీ శాఖ సిబ్బంది ఈ అక్రమ రవాణాపై అప్పుడప్పుడు దాడులు చేసి కొందరిని పట్టుకుంటారు. కానీ అలాంటి సంఘటనలు చాలా తక్కువగా జరిగాయి. దీనిపై బీబీసీ సూళ్లూరుపేట అటవీ శాఖ వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులను సంప్రదించింది.
''పాలికేట్ల అక్రమ రవాణా జరుగుతున్నట్టు మాకు సమాచారం ఉంది. దాన్ని అరికట్టడానికి అనేక చర్యలు తీసుకున్నాం. ముఖ్యంగా మత్స్యకారుల సహకారంతో ఈ పని ఆపే ప్రయత్నం చేస్తున్నాం. మాకు సిబ్బంది తక్కువ కాబట్టి, పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నాం.
నాలుగు సంవత్సరాలలో మొత్తం 29 కేసులు నమోదుచేశాం. అయితే గతం కేంటే ఇప్పుడు ఈ అక్రమ రవాణా బాగా తగ్గింది. దానికి రెండు కారణాలు... ఒకటి హేచరీల వారు సొంతంగా పాలికేట్లను పెంచుకోవడం, మరొకటి నెదర్లాండ్స్ నుంచి చట్టపరంగా వాటిని దిగుమతి చేసుకోవడం. అయినప్పటికీ గట్టి నిఘా పెట్టి అక్రమ రవాణా చేసే వారిని పట్టుకుంటున్నాం'' అని బీబీసీతో చెప్పారు అటవీ శాఖ పులికాట్ రేంజ్ అధికారి నరసింహా రావు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














