వలస పక్షుల గురించి 13 ఆసక్తికర అంశాలు

ఫొటో సోర్స్, Getty Images
శీతాకాలంలో పక్షులన్నీ ఎక్కడికి పోతున్నాయనే ప్రశ్న శతాబ్దాలపాటు ప్రపంచంలోని చాలా ప్రాంతాల ప్రజలను వెంటాడింది. మునుపటితో పోలిస్తే, నేడు ఈ వలసల గురించి మనకు కాస్త ఎక్కువే తెలుసు.
చిన్నచిన్న పక్షులు కూడా ఏటా వెచ్చని వాతావరణం కోసం వేల కి.మీ. ఎలా ప్రయాణిస్తాయో బీబీసీ రేడియో కార్యక్రమం ‘‘ఇన్ అవర్ టైమ్’’లో చర్చించారు. దీనిలోని కొన్ని ఆసక్తికర అంశాలు మీ కోసం..
1. శీతాకాలంలో పక్షులు చేపలుగా మారిపోతాయని..
కాలం మారుతున్నప్పుడు ఒక్కసారిగా పక్షులు మాయం కావడంపై ప్రపంచవ్యాప్తంగా చాలా కథలు ప్రచారంలో ఉండేవి.
కొంత మంది ఈ పక్షులు శీతాకాలంలో సముద్రంలో కనిపించే ఆల్చిప్పల తరహాలో మారిపోతాయని, మరికొందరు అయితే, ఇవి కొండల్లో సుప్తావస్థలోకి వెళ్లిపోతాయని భావించేవారు.
19వ శతాబ్దం ముందు వరకు శీతాకాలంలో ఈ పక్షులన్నీ చెరువుల్లో బురదలోకి వెళ్లిపోతాయని కథలుగా చెప్పుకునేవారు.

ఫొటో సోర్స్, Getty Images
2. ఆఫ్రికా ఈటె గుచ్చుకున్న కొంగ జర్మనీలో కనిపించింది
1822లో ఆఫ్రికా ఈటె శరీరంలో గుచ్చుకున్న ఓ కొంగ జర్మనీలో కనిపించింది.
శీతాకాలంలో పక్షులు ప్రపంచంలోని వేరే ప్రాంతాలకు వెళ్తున్నట్లు చెప్పడానికి ఇది ప్రధాన సంకేతంగా భావించారు. ఆ తర్వాత ఇలాంటి 25 ఆధారాలు కూడా పక్షుల నిపుణులకు కనిపించాయి.
3. బంధించిన పక్షుల్లో వింత ప్రవర్తన
1700ల మొదట్లో శీతాకాలం వలసల సమయంలో పంజరంలో బంధించిన పక్షుల్లో వింత ప్రవర్తనను శాస్త్రవేత్తలు గమనించారు. బరువు పెరగడం, విశ్రాంతి లేకుండా కనిపించడం, రాత్రిపూట చురుగ్గా ఉండటం, బోనుకు పదేపదే గోర్లతో గీకడం.. లాంటి సంకేతాలు పక్షుల్లో కనిపించేవి.
4. తొలి వలస ప్రమాదకరం.. కానీ, దీర్ఝాయువు వస్తుంది
ఎక్కువ దూరం వలస వెళ్లడం చాలా ప్రమాదకరం. కొత్త వాతావరణానికి అలవాటు పడటం, వ్యాధుల ముప్పు, తమను వేటాడే పక్షులు, జంతువులు.. ఇలా చాలా ముప్పులు వాటిని వెంటాడుతుంటాయి. అయితే, చిన్న వయసులో ఉండే పక్షులకు వలస మరింత ప్రమాదకరం. మొత్తంగా సాంగ్‌బర్డ్ వలస మరణాల్లో 80 శాతం చిన్న పక్షులే ఉంటాయని తేలింది. అసలు వలస వెళ్లని పక్షులతో పోల్చినప్పుడు, చిన్న వయసులోనే వలస వెళ్లిన పక్షులు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు కూడా పరిశోధనల్లో రుజువైంది.

ఫొటో సోర్స్, Getty Images
5. పక్షుల్లో జీవ గడియారం
అథ్లెట్ల తరహాలోనే వలసలకు ముందుగా పక్షులు శారీరకంగా సిద్ధం అవుతాయి. ప్రయాణానికి ముందుగా ఇవి ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటాయి. కాలేయం, ఇతర ప్రత్యుత్పత్తి అవయవాల పరిమాణం కూడా తగ్గుతుంది. ఆక్సిజన్, కొవ్వులను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేలా శరీరంలో మార్పులు జరుగుతాయి. కొన్ని పక్షుల్లో వలసలకు ముందుగా కొత్త ఈకలు కూడా వస్తుంటాయి. దీనికి దాదాపు నెల రోజుల వరకూ సమయం పట్టొచ్చు.
6. వలస పక్షుల్లో రెండు రకాలు
క్యాలెండర్ పక్షులు, వెదర్ బర్డ్స్ అని రెండు రకాలుగా వీటిని విభజించొచ్చు. పక్షులు ఎప్పుడు వలస మొదలుపెడతాయో కచ్చితంగా చెప్పలేం.
కొన్ని పక్షులు ఏటా ఒకే సమయంలో వలసకు వెళ్తాయి. మరికొన్ని వాతావరణంపై ఆధారపడతాయి.
ఆసియాలోని బోర్నియోలో బ్రౌన్ ష్రైక్ పక్షుల రాక సమయం చాలా కచ్చితంగా ఉంటుంది. వీటి ఆధారంగానే పంట ఎప్పుడు వేయాలో స్థానిక రైతులు ఒక అంచనాకు వస్తుంటారు.
7. వలస మార్గం ఎలా?
హంసలు, బాతులు లాంటి పెద్ద పక్షులు సాధారణంగా తమ బృందంలోని పెద్ద పక్షులను అనుసరిస్తుంటాయి. కానీ, కొన్ని చిన్న పక్షులు ఎలాంటి మార్గనిర్దేశంచేసే పెద్ద పక్షులు లేకుండానే వలస మొదలుపెడతాయి. బహుశా వీటికి శరీరమే దిక్సూచీలా పనిచేయొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
రెండు భిన్న మార్గాల్లో వెళ్లే పక్షులకు పుట్టే సంతానం ఆ రెండు పక్షుల మార్గాలనూ కొంత వరకు అనుసరిస్తున్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనలో రుజువైంది.

ఫొటో సోర్స్, Getty Images
8. అదే ప్రాంతానికి వెళ్తాయా?
ఉష్ణోగ్రత, కాంతి, ఆహారం లాంటివాటి ఆధారంగా తొలిసారి వెళ్లే పక్షులు తమ గమ్యాలను ఎంచుకుంటాయి. అయితే, తరువాత వలసల్లో ఇవి మళ్లీ అదే ప్రాంతానికి తిరిగి వెళ్తాయి. కచ్చితంగా అదే ప్రాంతానికి పక్షులు ఎలా వెళ్లగలుగుతున్నాయో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పూర్తిస్థాయిలో అర్థంకావడం లేదు.
9. కొన్ని పక్షులు వలస వెళ్లినంత మాత్రాన, అన్నీ వెళ్తాయని అనుకోకూడదు
ఉదాహరణకు బ్లాక్ బ్యాకెడ్ గల్స్‌ను తీసుకోండి. వీటిలో చిన్న పక్షులతో పోల్చినప్పుడు పెద్ద పక్షులు వలస వెళ్లేందుకు ఇష్టపడవని అధ్యయనంలో రుజువైంది. బహుశా ఆహారం కోసం పోటీపడాల్సి వచ్చినప్పుడు, ఆ ప్రాంతంపై ఆధిపత్యం చూపే పక్షులు అక్కడే ఉండొచ్చు. లేదా పెద్ద పక్షులు శీతాకాలంలో ఆహారం తినకపోయినా మనుగడ సాగించొచ్చు.
10. చిన్న పక్షులు కూడా 15 వేల కి.మీ. వెళ్లగలవు
చాలా చిన్నగా కనిపించే సాంగ్‌బర్డ్.. అలస్కా నుంచి సబ్-సహారన్ ఆఫ్రికా వరకు వలస వెళ్లగలవు. మళ్లీ ఇవి అదే ఏడాదిలోనే తమ స్వస్థలానికి తిరిగిరాగలవు.
11. ఒక జాతి పక్షులు భిన్న మార్గాల్లో
కొన్నిసార్లు ఒకేజాతి పక్షులు భిన్నమైన మార్గాల్లో ప్రయాణిస్తుంటాయి. కెనడాలోని నార్తెర్న్ వీటర్స్.. అలస్కాలోని ఇదే జాతి పక్షులతో పోల్చినప్పుడు భిన్నమైన మార్గంలో వెళ్తాయి. కెనడా పక్షులు సబ్-సహరన్ ఆఫ్రికాకు చేరుకునేందుకు ఎక్కువగా సముద్రంపై నుంచే ప్రయాణిస్తుంటాయి.
12. వాసన చూసే శక్తి కోల్పోతే మార్గం కనిపెట్టడం కష్టం
హోమింగ్ పీజియన్స్‌పై చేపట్టిన పరిశోధనలో ఈ పక్షులు వాసన సామర్థ్యాన్ని కోల్పోతే తమ మార్గాన్ని కనిపెట్టడం కష్టం అవుతుందని తేలింది. మిగతా వలస పక్షుల విషయంలోనూ ఇలానే జరుగుతోందని కొన్ని అధ్యయనాల్లో రుజువైంది.
13. భూమి అయస్కాంత క్షేత్రం సాయంతో...
పక్షులు తమ మార్గాన్ని కనిపెట్టేందుకు భూమి అయస్కాంత క్షేత్రం సాయం కూడా తీసుకుంటాయి. అయితే, ఉత్తరం వైపు వెళ్తున్నాయో దక్షిణంవైపు వెళ్తున్నాయో ఇవి కనిపెట్టలేకపోవచ్చు. కానీ, ధ్రువాల వైపు వెళ్తున్నాయో లేదా భూమధ్య రేఖ వైపు వెళ్తున్నాయో ఇవి కనిపెట్టగలవు.
ఇవి కూడా చదవండి:
- జనగణమన: జాతీయగీతానికి మదనపల్లెకూ సంబంధం ఏమిటి?
- ఐశ్వర్య తాటికొండ: టెక్సస్ కాల్పుల్లో చనిపోయిన హైదరాబాదీ, ఆమె ఫ్రెండ్‌కూ బుల్లెట్ గాయాలు
- పాకిస్తాన్: ఉచిత ఆహారం కోసం క్యూ కడుతున్న ప్రజలు... రాజకీయ కలహాలే ఆ దేశాన్ని చిందరవందర చేస్తున్నాయా?
- కర్ణాటక ఎన్నికలు: బీజేపీ మళ్లీ వస్తుందా, కాంగ్రెస్ జెండా ఎగరేస్తుందా? గ్రాఫిక్స్‌లో రాజకీయ ముఖచిత్రం
- తెలంగాణ: రబీ సాగును ముందుకు జరపాలని కేసీఆర్ ఎందుకు అంటున్నారు? ఇది రైతులకు ప్రయోజనకరమేనా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















