‘రామరాజ్యం' కోసం అంటూ చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్‌పై దాడి చేసింది ఎవరు?

ఫొటో సోర్స్, Rangarajan chilkur twitter/rangareddy.telangana.gov.in
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''నాలాంటి బలహీనుడు నీకు దొరికాడు. నన్ను కస్టడీలోకి తీసుకోండి అన్నావు. నా వల్ల కావడం లేదు'' అంటూ నేలమీద కూర్చుని చేతులెత్తి ప్రాథేయపూర్వకంగా నమస్కారం చేస్తున్నారు చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్.
''నేను చెప్పేది విను. చెప్పింది వినడం నేర్చుకో. ఉగాది వరకు సమయం ఇస్తున్నాను. రామరాజ్యం కోసం పనిచేయ్. లేదంటే నేను రానక్కర్లేదు. ఎవరు రావాలో వారు వస్తారు. ఏం చేయాలో చేస్తారు'' అంటూ నల్లబట్టలు వేసుకుని నామాలు పెట్టుకుని, గట్టిగా అరుస్తూ రంగరాజన్ ఎదురుగా పైన కూర్చుని,హెచ్చరిస్తున్న ఓ వ్యక్తి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అందులో చిలుకూరు పూజారి రంగరాజన్‌ను తీవ్రంగా హెచ్చరిస్తూ, ఆయన్ను బెదిరిస్తూ మాట్లాడిన దృశ్యాలున్నాయి.
హైదరాబాద్ శివార్లలోని చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు, దేవాలయ పరిరక్షణ ఉద్యమ నిర్వాహకుల్లో ఒకరైన సి.రంగరాజన్‌పై రాఘవ రెడ్డి అనే వ్యక్తి ఆధ్వర్యంలో 'రామరాజ్యం' అనే సంస్థ ప్రతినిధులు దాడి చేశారు.
ఈ వీడియోలు ఆ దాడికి సంబంధించినవే.
స్వయంగా దాడి చేసిన వారే వాటిని తీసి, వెబ్ సైట్లో పెట్టి, మళ్లీ డిలీట్ చేశారు.


ఫొటో సోర్స్, UGC
ఏం జరిగింది?
కొవ్వూరి వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తి, ఆయన అనుచరులు పూజారి రంగరాజన్ నివాసంలోకి వెళ్లి ఆయనతో వాదనకు దిగారు. తాము ఏర్పాటు చేయబోయే రామరాజ్యంతో కలసి రావాలని కోరారు.
ఈ క్రమంలో ఆయనపై భౌతిక దాడి చేసినట్టు రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ మీడియా ప్రకటనలో చెప్పారు. దానిపై రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇప్పటి వరకూ రాఘవ రెడ్డి సహా మొత్తం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిలుకూరు అర్చకులు, టెంపుల్స్ ప్రొటెక్షన్ మూవ్‌మెంట్ కన్వీనర్, రంగరాజన్ తండ్రి సౌందర రాజన్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలోని అంశాలు ఇలా ఉన్నాయి.
''చాలా బాధతో ఈ ప్రకటన ఇస్తున్నాను. కొందరు వ్యక్తులు తమను తాము ఇక్ష్వాక వంశస్తులుగా చెప్పుకుంటూ, రామరాజ్యం ఏర్పాటు చేస్తామంటూ ప్రైవేటు సైన్యాలను తయారు చేసుకున్నారు. వారి అజెండాను అంగీకరించకపోతే ఈ ప్రైవేటు సైన్యాలతో శిక్షిస్తారు. వారు ప్రతిపాదించిన రాజ్యాంగపరమైన రామరాజ్యం అనేదాన్ని నా కుమారుడు అంగీకరించలేదు. వారితో కలవడానికి తిరస్కరించాడు. దీంతో నా కుమారుడు, చిలుకూరు బాలాజీ అర్చకుడు అయిన రంగరాజన్‌ను కొట్టారు. పిడిగుద్దులు కురిపించారు.ఇదంతా ఫిబ్రవరి 7 శుక్రవారం నాడు మా ఇంట్లోనే జరిగింది. దీనిపై మా అబ్బాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి కారకులను, దాని వెనుక ఉన్న వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని కోరుతున్నాను. శ్రీ చిలుకూరు బాలాజీ దయతో నా కుమారుడు భద్రంగా ఉన్నాడు, దేవుని సేవ కొనసాగిస్తాడు'' అంటూ ఈ ప్రకటన సాగింది.
ఘటన జరిగిన రెండు రోజుల తరువాత ఈ ప్రకటన ఇచ్చారు సౌందర రాజన్.

ఫొటో సోర్స్, Rama Rajyam
ఆ వీడియోలో ఏముందంటే..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నదాని ప్రకారం రంగరాజన్‌ను దాదాపు పదిమంది నల్లబట్టలు వేసుకున్నవారు చుట్టు ముట్టారు. నల్లచొక్కాలను ఇన్ షర్ట్ చేసుకుని, కాషాయ కండువాలు కప్పుకుని ఉన్నారు. వారంతా పూజారి రంగరాజన్‌ను బెదిరిస్తూ మాట్లాడారు. ఆయన ప్రాథేయపూర్వకంగా మాట్లాడినా వారి ఆగ్రహం పెరిగింది తప్ప చల్లారలేదు. పది మంది ఒకేసారి ఆయనతో అరుస్తూ మాట్లాడారు.
''మీరు చెప్పేది వినడానికి రాలేదు. మేం చెప్పేది మీరు వినాలి. ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశీకులదా కాదా, అడిగింది చెప్పు? ఆ ఇక్ష్వాకులు ఏ గోత్రంలో ఉన్నారో తెలుసా నీకు? నువ్వు జడ్జీలను పదవుల నుంచి తప్పించగలవా? నీకేమీ తెలియదు. పండితుల వేషం వేసుకున్నావు. స్వరం తెలియదు. లయ తెలియదు. క్షాత్రం కలిగిన వారు ఎందరు ఉన్నారో తెలియదు'' అంటూ కొన్ని భగవద్గీత శ్లోకాలు చదివారు.
''భగవద్గీత ప్రకారం రామరాజ్యం ఏర్పాటు చేశాం. నువ్వు కోర్టులో పిటిషన్లు వేసి వారిని భిక్షం అడుగుతున్నావా? మేం ధర్మం కోసం ప్రాణం ఇవ్వడానికి వచ్చాం. మా ఇక్ష్వాకు సంప్రదాయం ప్రకారం నీకు ఉగాది వరకు అవకాశం ఇస్తున్నాను. నువ్వు రామరాజ్యం కోసం పనిచేయ్. లేదంటే మేం రాం. వచ్చేవారు మీ పనిచేసుకుపోతారు'' అంటూ హెచ్చరించారు.
పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న రంగరాజన్‌ను బలవంతంగా నేలపై కూర్చోబెట్టారు రాఘవరెడ్డి. న్యాయ వ్యవస్థపై కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు రాఘవ రెడ్డి.
''నా వల్ల కావడం లేదు.. నేను మీ పరీక్షలో ఫెయిల్ అయ్యాను. నేను భగవంతుని సేవ చేస్తాను. నేను రాజ్యాంగం ప్రకారం నడచుకుంటాను. నాలాంటి బలహీనుడు నీకు దొరికాడు. నన్ను కస్టడీలోకి తీసుకోమన్నావు. నేను సుప్రీం కోర్టులో కేసు నడపుతున్నాను'' అంటూ వివరించే ప్రయత్నం చేశారు రంగరాజన్.
రంగరాజన్ శబరిమల అయ్యప్ప దేవాలయం గురించి సుప్రీం కోర్టులో సుదీర్ఘ కాలంగా కేసు నడుపుతున్నారు. ఆ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారాయన.

ఫొటో సోర్స్, Rama Rajyam
ఎవరీ వీర రాఘవ రెడ్డి? ఏమిటీ రామరాజ్యం?
కొవ్వూరి వీర రాఘవ రెడ్డి తెలుగునాట హిందుత్వవాదులకు బాగా పరిచితమైన పేరే.
స్ట్రింగ్ వంటి హిందుత్వ జాతీయవాద సోషల్ మీడియా పేజీల్లో ఆయన వీడియోలు కూడా వచ్చేవి.
ముఖ్యంగా గోత్రం – ప్రవర అనే అంశాలు కేంద్రంగా తమది రాముని వంశం అయిన ఇక్ష్వాకు వంశం అని రాఘవ రెడ్డి చెప్పుకునేవారు. కలియుగంలో తానే స్వయంగా రామరాజ్యం స్థాపిస్తున్నట్టు ప్రకటించి ఒక యూట్యూబ్ చానల్, ఒక వెబ్ సైట్ మొదలుపెట్టారు.
ఆ రామరాజ్యానికి ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పాలకులు, ప్రత్యేక సైన్యం ఉంటాయని ప్రకటించారు. అందుకోసం మనుషులు కావాలని ప్రకటనలు ఇచ్చి, జీతభత్యాలు ప్రకటించారు. కొందరిని చేర్చుకున్నారు కూడా. అంతేకాదు, తన ప్రధాన అనుచరులను ఫలానా జిల్లా రామరాజ్యం పాలకులు అంటూ ప్రకటించారు కూడా.
''దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ నిర్వీర్యమైంది. నిర్వీర్యం అయిన వ్యవస్థను గాడిన పెట్టడానికి 43 సీఆర్పీసీ అధికరణం 361 (రాజ ప్రముఖ), కృష్ణ గీత అ 4 - 7, 8 శ్లోకాలు మరియు అ 18 - 17, 43 శ్లోకాల ప్రకారం రామరాజ్యం ఏర్పాటు చేసి ధర్మ స్థాపన చెయ్యడమే అన్ని సమస్యలకు పరిష్కారం'' అని ప్రకటించుకున్నారు.

ఫొటో సోర్స్, Rama Rajyam
భారత రాజ్యాంగం, భారతదేశ చట్టాల్లో హైకోర్టు, సుప్రీం కోర్టు జడ్జీలకు ఉన్న రక్షణల గురించిన సెక్షన్లు, ప్రభుత్వ సిబ్బంది విధుల నిర్వహణకు సంబంధించిన సెక్షన్లను కంఠత పట్టి తరచూ వాటి గురించి మాట్లాడుతూ, వీడియోలు చేస్తారు.
అలాగే మనుషుల గోత్రాలు, వాటిపేర్లు వాటి గురించి కూడా విపరీతంగా వీడియోలు చేస్తారు. హిందూ మతంలో నాలుగు వర్ణాల వ్యవస్థ తప్ప కుల వ్యవస్థ లేదని వాదించేవారు.
తాజాగా తన రామరాజ్యానికి మద్దతు ఇవ్వాలంటూ ఇలా బెదిరింపులకు దిగారు. ఈయన సొంత ఊరు ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి ప్రాంతం.
దాడి విషయం బయటకు వచ్చినప్పటి నుంచి రంగరాజన్‌కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.
చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా రంగరాజన్ ఇంటికి వెళ్లి పరామర్శించి, మద్దతు తెలిపారు. ఏ సమస్యైనా తమకు తెలియజేయాలని, తాము అండగా ఉంటామని రంగరాజన్‌తో అన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ దాడిని ఖండించి, రంగరాజన్‌కు మద్దతు తెలిపారు.
''ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. వీర రాఘవ రెడ్డి సహా మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నాం'' అని బీబీసీతో చెప్పారు పోలీసు అధికారులు.
‘ఇది మతోన్మాద విపరిణామం’
''మతం అనేది ఉన్మాదినికి దారి తీస్తే, మతం పేరుతో ఉన్మాదం అనేది వస్తే అది తన పర బేధాన్ని చూడదు. అసంఖ్యాకంగా హిందూ మతాన్ని అనుసరించేవారు, అభిమానించే వారు ఉన్న ఈ దేశంలో ఇలాంటి దౌర్జన్యపూరిత తీవ్రవాదాన్ని తీసుకు రావడం అనేది మొత్తం సమాజానికి చేటు చేస్తుంది. రంగరాజన్ లాంటి సాత్వికుడిగా పేరున్న అర్చకులపై కూడా అంతటి తీవ్రమైన దౌర్జన్యానికి దారి తీసింది. ఇటువంటి సామాజికమైన తీవ్ర ధోరణులను అందరూ ఖండించాలి. మతోన్మాదం ఎటువంటి విపరిణామాలకు దారి తీస్తుందో అర్థం చేసుకోవాలి'' అని బీబీసీతో అన్నారు సీనియర్ పాత్రికేయులు కె శ్రీనివాస్.
‘నిజమైన హిందువులు చేసే పని కాదు ఇది’
''చిలుకూరు ఆలయ పూజారిపై దాడి హేయమైనది. కాషాయం కట్టుకున్నా రామరాజ్యం అని పేరు పెట్టుకున్నా వారు మాత్రం హిందువులు కాదు. అవి నిజమైన హిందువు చేసే పనులు కావు. నాథూరాం గాడ్సేకి వీళ్లకీ తేడా లేదు. గాంధీతో రాజకీయ సైద్ధాంతికంగా విభేదించినా, దాని అర్థం ఆయన్న చంపమని కాదు. అందుకే వారికీ వీరికీ తేడా లేదు అని నా అభిప్రాయం. సోషల్ మీడియాలో సెన్సేషనలిజం, ఫెనాటిక్ కంటెంట్ వెర్రితలలు వేస్తోంది. అది ఇటువంటి ఘటనలకు దారి తీస్తోంది. దాన్ని ప్రభుత్వాలు అరికట్టాలి'' అని బీబీసీతో అన్నారు సీనియర్ పాత్రికేయులు రాక సుధాకర్.
రామరాజ్యం రాఘవ రెడ్డి సంఘ్ పరివార్ వ్యక్తి అని సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై కూడా సుధాకర్ స్పందించారు. ''ఆ ఆరోపణలు చేసేవారి సాక్ష్యాలు చూపించాలి. లేదా పరువునష్టం దావాలకు సిద్ధపడాలి. అలా అనడం తేలిక. ఆయన ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్ యూనిఫాం వేసుకున్నాడా? వారి సమావేశాలకు వెళ్లినట్టు ఆధారాలు ఉన్నాయా? ఏ ఆధారంతో చెప్తారు ఈ మాట? విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్.. అందరూ రంగరాజన్‌కే మద్దతుగా నిలిచారు. వారంతా రామరాజ్యం చర్యను ఖండించారు. రామరాజ్యం వారు ఎంత బాధ్యతారాహిత్యంతో ఉన్నారో, రామరాజ్యానికీ సంఘ్‌కీ ముడిపెట్టే వారు కూడా అంతే బాధ్యతా రాహిత్యంతో ఉన్నట్టు. అసలు సంఘ్ పరివార్ అనే మాటేలేదు. దాన్ని వామపక్ష వాదులు సృష్టించారు'' అని బీబీసీతో అన్నారు సుధాకర్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














