విశ్వంలో మరో సూర్యుడు ఉన్నాడా, ఉంటే ఏమయ్యాడు?

సౌర కుటుంబం

ఫొటో సోర్స్, Serenity Strull/ Getty Images

    • రచయిత, జొనాథన్ ఓ కల్లాఘన్
    • హోదా, జర్నలిస్ట్

గెలాక్సీలో చాలా నక్షత్రాలు జంటలుగా ఉన్నాయి. కానీ, మన సూర్యుడు మాత్రం అందుకు మినహాయింపు. ఎందుకంటే, సూర్యుడు ఒక్కడే. అయితే, ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన సంకేతాన్ని కనుగొన్నారు.

సూర్యుడికి తోడు ఉండి ఉండొచ్చనేందుకు ఆధారాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే..మరి ఈ కవల నక్షత్రం ఎక్కడికి వెళ్లింది?

అంతరిక్షంలో ఒంటరిగా ప్రయాణిస్తుండే నక్షత్రం సూర్యుడు. పాలపుంతలోని వర్తులాకారపు కక్ష్యలో ఒంటరిగా తిరుగుతూ 23 కోట్ల సంవత్సరాలకు ఒకసారి గెలాక్సీ చుట్టూ ప్రయాణం చేస్తుంటాడు.

సూర్యునికి అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారై. ఇది భూమికి 4.2 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇప్పటి వరకు నిర్మించిన వాటిలో అత్యంత వేగంగా ప్రయాణించే అంతరిక్ష నౌకలో ప్రయాణించినా ప్రాక్సిమా సెంటూరికి చేరుకోవడానికి 7వేల ఏళ్లకు పైగా పడుతుంది.

మన గెలాక్సీలో, సౌర కుటుంబం మధ్యలో ఒక నక్షత్రం చాలా అసాధారణంగా కనిపిస్తుంది. గెలాక్సీ చుట్టూ జంటలుగా పరిభ్రమించే బైనరీ నక్షత్రాలు మాత్రం సాధారణంగా కనిపిస్తుంటాయి.

అయితే, పాలపుంత మధ్యలో సూపర్ మాసివ్ బ్లాక్ హోల్‌కు సమీపంలో తిరుగుతున్న ఒక జంటను ఇటీవల ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ జంటను గుర్తించిన ప్రాంతంలో బ్లాక్ హోల్‌కు చెందిన తీవ్రమైన గురుత్వాకర్షణ వల్ల ఒకప్పుడు నక్షత్రాలు ఒకదానికొకటి విడిపోయి లేదా కలుసుకుని ఉండొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బైనరీ నక్షత్ర వ్యవస్థలో కొత్త విషయాలను కనుగొనడం సాధారణం. ఒకప్పుడు అన్ని నక్షత్రాలు బైనరీ రిలేషన్‌షిప్‌లో ఉండొచ్చని, అవన్నీ జంటలుగానే పుట్టి ఉండొచ్చని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అంటే ప్రతి నక్షత్రానికి మరో తోబుట్టువు ఉంటుంది. ఇదే ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నకు తెరతీసింది. ఒకప్పుడు బైనరీ నక్షత్రమైన సూర్యుడికి కూడా చాలా కాలం కిందట ఒక తోడు ఉందా? సూర్యుడు తన సహచరుడిని ఎప్పుడు కోల్పోయి ఉండొచ్చు అనే ప్రశ్నలు వస్తున్నాయి.

కచ్చితంగా అవకాశం ఉండొచ్చని అమెరికాలోని జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేసే ఖగోళ శాస్త్రవేత్త గాంగ్జీ లీ అన్నారు.

ఇది చాలా ఆసక్తికరమైన అంశమని చెప్పారు.

అయితే, అదృష్టత్తువశాత్తూ సూర్యుడికి తోడు లేకపోవడం మనకు నిజంగా మంచి విషయం. ఒకవేళ ఉండి ఉంటుంటే.. ఆ రెండో సూర్యుడి గురుత్వాకర్షణ వల్ల భూమితో పాటు ఇతర గ్రహాల కక్ష్యల్లో తరచు మార్పు వస్తూ ఉండేది. అంతే కాకుండా భూమి మీద ఉష్ణోగ్రతలతో పాటు చలి పెరగడం, పగటి కాలం ఎక్కువగా ఉండటం లాంటి అనేక సమస్యలు ఏర్పడేవి.

భూమికి సమీపంలో ఉన్న బైనరీ నక్షత్రాలు అల్ఫా సెంటూరి ఎ,బి. ఈ రెంటి మధ్య దూరం భూమిసూర్యుని మధ్య ఉన్న దూరంతో పోలిస్తే 24 రెట్లు ఎక్కువ. ఇవి అక్కడ తమ కక్ష్యలో పరిభ్రమిస్తున్నాయి.

ప్రస్తుతం సౌర వ్యవస్థలో సూర్యునికి కూడా ఒక సహచరుడు ఉండొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే, 1984లోనే నెమెసిస్ అనే ఒక ఊహాజనిత నక్షత్రం ఉండి ఉండొచ్చని తొలిసారి ప్రతిపాదన వచ్చింది. అయితే అనేక సర్వేలు, అధ్యయనాల తర్వాత అలాంటిదేమీ లేదని తేలింది.

అయితే ప్రస్తుతం మనం చూస్తున్న సూర్యుడు 460 కోట్ల ఏళ్ల కిందట ఏర్పడింది. కానీ అది వేరే విషయం.

సూర్యుడు

ఫొటో సోర్స్, NASA

కెనడాలోని క్వీన్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త సారా సదావోయ్ 2017లో యువ బైనరీ నక్షత్ర వ్యవస్థలతో కూడిన అద్భుతమైన నర్సరీగా పేరున్న పెర్సియస్ మాలిక్యులర్ క్లౌడ్‌‌కు చెందిన రేడియో సర్వేలోని డేటాను ఉపయోగించి, నక్షత్ర నిర్మాణ ప్రక్రియ జంటలుగా ప్రొటోస్టార్లను ఏర్పరుస్తుందని నిర్థరించారు.

అన్ని నక్షత్రాలు జంటలుగా లేదా బహుళ నక్షత్ర వ్యవస్థలలో ఏర్పడి ఉండొచ్చని ఆమె, ఆమె సహోద్యోగులు కనుగొన్నారు.

''పెర్సియస్ నక్షత్ర ధూళిలో నక్షత్రాల సంఖ్య కాస్త ఎక్కువగా ఉండవచ్చు. దీంతో వాటిలో కొన్ని రాలిపోయే అవకాశం ఉంది. దీన్నే మనం నక్షత్రాల విభజన ప్రక్రియ అంటాం. అవి బాగా దూరంగా ఉంటే ఒక దానికొకటి సమీపంగా వచ్చే అవకాశం ఉండదు. అలా కాకుండా బాగా దగ్గరగా ఉంటే గురుత్వాకర్షణ శక్తి వాటిని కలిపేస్తుంది" అని సదావోయ్ చెప్పారు.

నక్షత్రాలు ఒకప్పుడు జంటగా ఉండేవని కొన్ని శాశ్వతంగా కలిసి ఉంటున్నాయని, కొన్ని మాత్రం మిలియన్ సంవత్సరాల పరిణామ క్రమంలో విడిపోయాయని సదావోయ్ పరిశోధన వెల్లడించింది.

"నక్షత్రాలు సంవత్సరాల పాటు జీవిస్తాయి. విశ్వంలో ఇది క్షణకాలం పాటు మాత్రమే కావచ్చు. కానీ ఆ క్షణకాలంలోనే చాలా జరుగుతాయి" అని ఆమె చెప్పారు.

సూర్యుడి విషయంలోనూ ఇదే నిజమై ఉంటుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇలా జరగలేదని అనుకోవడానికి ఎలాంటి కారణం లేదని సదావోయ్ అన్నారు. ''ఒకవేళ సూర్యుడు జంటగా ఏర్పడి ఉంటే, మరో సూర్యుడిని మనం కోల్పోయాం'' అని ఆమె చెప్పారు.

బైనరీ నక్షత్ర వ్యవస్థలు

ఫొటో సోర్స్, Nasa/ JPL-Caltech/ University of Arizona

పాలపుంతలో రెండేసి నక్షత్రాలు తమ తమ కక్ష్యలో తిరిగే వ్యవస్థలో సూర్యుడు ఒకప్పుడు భాగమేననే కొన్ని ఆధారాలు ఉన్నాయి.

ప్లూటోకు చాలా దూరంలో మన సౌర వ్యవస్థలో ఘనీభవించిన తోకచుక్కల ప్రాంతం ఉందని అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఖగోళ శాస్త్రవేత్తగా పనిచేసిన అమిర్ సిరాజ్ 2020లో చెప్పారు. దీన్ని ఊర్ట్ క్లౌడ్‌గా పేర్కొన్నారు. ఇందులో సూర్యుడి కవల నక్షత్రానికి చెందిన ముద్రలు ఉండి ఉండవచ్చని సిరాజ్ చెప్పారు.

మంచు, రాళ్లతో ఉన్న ఈ ప్రాంతం భూమికి చాలా దూరంలో ఉంది. అంతరిక్షంలో సుదూర ప్రాంతాలకు చేరుకునేందుకు నాసా ప్రయోగించిన వాయేజర్ 1 లాంటి వ్యోమనౌకల్లో 300 సంవత్సరాలకు కూడా ఊర్ట్ క్లౌడ్‌కు చేరుకోలేము. బాహ్య సౌర వ్యవస్థ అధ్యయనం కోసం ఈ అంతరిక్ష నౌకను లాంచ్ చేశారు.

ఒకవేళ నిజంగానే సూర్యుడికి తోడు ఉండి ఉండుంటే, ప్లూటో వంటి ఎన్నో మరుగుజ్జు గ్రహాలు ఈ ప్రాంతంలో ఉండేవని సిరాజ్ అన్నారు. సూర్యుడి బాహ్య వలయంలో తొమ్మిదో గ్రహం నెఫ్ట్యూన్ పరిమాణంలో ఉన్న మరో పెద్ద గ్రహం ఒకటి ఇక్కడ అంతరించి ఉండిఉండవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

"ఊర్ట్‌ క్లౌడ్‌ లాంటి సుదూర ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే ఎన్నో పదార్ధాలను మనం చూడటం కష్టం. ఎందుకంటే అక్కడ లక్షల, కోట్ల పదార్దాలు తమ కక్ష్యలో తిరుగుతున్నాయి" అని సిరాజ్ అన్నారు.

‘‘ఒక వేళ తొమ్మిదవ గ్రహం లాంటి అదనపు గ్రహం ఉందని అనుకున్నా, సూర్యుడి నుంచి అంత దూరంలో ఉన్న ఆ గ్రహం ఎలా అంతరించిపోయిందో చెప్పడం చాలా కష్టం.’’ అని సిరాజ్ అన్నారు.

అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్లానెటరీ సైంటిస్ట్‌గా పనిచేసే కన్‌స్టాంటిన్ బెటిగిన్ , తొలిసారి 2016లో తొమ్మిదవ గ్రహం ఉనికి గురించి ప్రతిపాదించారు.

సుదూర వస్తువుల సమూహాన్ని ఆధారంగా చేసుకుని ఈ గ్రహం గురించి తెలియజేశారు. కానీ, తన ప్రతిపాదనకున్న కచ్చితత్వాన్ని వెల్లడించలేదు. ''ఊర్ట్‌ క్లౌడ్ గురించి వివరించేందుకు ఒకే రకమైన నక్షత్రాలు ఉండాల్సిన అవసరం లేదు'' అని బెటిగిన్ అన్నారు.

''నక్షత్రాల సమూహంలో సూర్యుడు ఏర్పడటం ద్వారా మీరు ఊర్ట్‌ క్లౌడ్ ఉనికి గురించి పూర్తిగా వివరించవచ్చు. బృహస్పతి, శని గ్రహాలు ప్రస్తుతమున్న ద్రవ్యరాశి స్థాయికి ఎదగడంతో, ఈ క్రమంలో పలు పదార్థాలను బయటికి నెట్టేశాయి. బర్త్ క్లస్టర్‌లో పాసింగ్ స్టార్ల ద్వారా కూడా తొమ్మిదవ గ్రహం గురించి వివరించవచ్చు'' అని బెటిగిన్ తెలిపారు.

అయితే, తాజాగా ప్రచురితమైపరిశోధనా పత్రంలో, సహచర నక్షత్రం ద్వారా ఊర్ట్‌క్లౌడ్ లోపలి అంచు ఏ విధంగా ఉందో వివరించవచ్చని బెటిగిన్ ప్రతిపాదించారు. ''కంప్యూటర్‌ సిమ్యులేషన్ల ద్వారా మేం కనుగొన్నది ఏంటంటే.. పదార్థాలు ఒకదానికొకటి విడిపోయి, తమ సహచర పదార్ధంతో కలిసిపోయాయి. అవి బృహస్పతి, శని కక్ష్యల నుంచి విడిపోయి, ఊర్ట్‌క్లౌడ్ లోపలి భాగంలో చిక్కుకుపోయి ఉండవచ్చు'' అని బెటిగిన్ తెలిపారు.

ఇది నిజమా కాదా అనేది చిలీలో వెరా రాబిన్ అబ్జర్వేటరీ అనే పిలిచే కొత్త టెలిస్కోప్ ద్వారా మాత్రమే ధ్రువీకరించడం సాధ్యమవుతుంది. దీని కోసం వచ్చే పదేళ్లలో రాత్రిపూట ఆకాశంలో మరింత సర్వే చేయనున్నారు.

''వెరా రాబిన్ ఆన్‌లైన్‌లోకి వచ్చిన తర్వాత, ఊర్ట్‌క్లౌడ్‌ నిర్మాణాన్ని మరింత వివరంగా మ్యాప్ చేయడం మొదలుపెడుతుంది. నక్షత్రాల సహచరుల గురించి స్పష్టమైన ఆనవాళ్లు ఉన్నాయో లేదో మనం చూడొచ్చు'' అని బెటిగిన్ తెలిపారు.

బైనరీ నక్షత్రాలు

ఫొటో సోర్స్, NASA

సూర్యుడికి తోడు ఉండచ్చని చెప్పడానికి మరో సంకేతం ఏంటంటే.. సౌర వ్యవస్థ సమతులానికి సూర్యుడు ఏడు డిగ్రీలు పక్కకు వంగి ఉంటాడు. మరో నక్షత్రపు గురుత్వాకర్షణ శక్తి వల్లే ఇదిలా జరిగి ఉండొచ్చని 'అవర్ సన్ ఆఫ్ బ్యాలెన్స్' అనే నివేదికలో వివరించారు.

''ప్రారంభంలో సహచర నక్షత్రపు ఉనికి దీనికి కారణమై ఉంటుందని నేను అనుకుంటున్నా. గెలాక్సీలో ఇతర బైనరీ నక్షత్రాల్లో మనం ఇలాంటి ప్రభావాన్ని చూడొచ్చు'' అని బెటిగిన్ చెప్పారు.

‘‘ఒకవేళ ఈ ఆధారాలు నిజమైతే, మన సూర్యుడు కోల్పోయిన జంట నక్షత్రాన్ని కనుగొనడం మరింత సవాలుతో కూడుకున్న విషయం. రాత్రి మనం ఆకాశంలో చూసే నక్షత్రాల సముద్రంలో ఏవైనా ప్రస్తుతం వాటి తోటి నక్షత్రాన్ని కోల్పోయి ఉండవచ్చు'' అని సదావోయ్ అన్నారు.

2018లో సూర్యుడి 'కవల' నక్షత్రాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అచ్చం సూర్యుడి పరిమాణంలో, రసాయన పదార్థాల కలయికతో ఉన్న ఈ నక్షత్రం భూమికి 200 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని చెప్పారు.

''అయితే, ఈ విషయంలో మనం ఉద్వేగానికి లోనయ్యే ముందు, సూర్యుడి పుట్టుక మాదిరి గ్యాస్, ధూళికలతోనే వందల లేదా వేలాది నక్షత్రాలు ఏర్పడ్డాయన్నది గుర్తుంచుకోవాలి'' అని సదావోయ్ అన్నారు.

వీటన్నింటికీ రసాయన పదార్థాల కలయిక ఒకేరకంగా ఉండొచ్చు. అంటే, సూర్యుడికి నిజంగా తోడు ఉందా అన్నది మనకు తెలియడం అసాధ్యమవ్వొచ్చు. ఒకవేళ సూర్యుడికి తోడు నక్షత్రం ఉన్నా, అది కూడా ఇదే పరిమాణంలో ఉండకపోవచ్చని సదావోయ్ అన్నారు. ''అది చిన్నగా, ఎర్రని మరుగుజ్జు నక్షత్రం కావొచ్చు, లేదా వేడిగా, నీలి రంగులో ఉండొచ్చు'' అని ఆమె చెప్పారు.

సూర్యుడి తోడును కనుగొనడం, గుర్తించడం చాలా కష్టమైనది. ఎక్స్‌ప్లానెట్స్‌గా పిలిచే ఇతర నక్షత్రాల చుట్టూ ఉన్న గ్రహాల ఆసక్తికరమైన ప్రభావాలను ఈ బైనరీ నక్షత్రం లేవనెత్తే అవకాశం ఉంది.

''వాస్తవానికి నక్షత్రాల సహచర నక్షత్రాల కక్ష్యల చుట్టూ తిరిగే ఎన్నో కనుగొనని ఎక్స్‌ప్లానెటరీ వ్యవస్థలు ఉన్నాయి'' అని గాంగ్జీ లీ అన్నారు.

వాటిల్లో కొన్ని, రెండు నక్షత్రాలలో ఒకటి పరిభ్రమిస్తూ ఉంటుంది. దాన్నే సర్కమ్‌స్టెలార్ సిస్టమ్స్ అన్నారు. మిగిలిన వాటిల్లో రెండు నక్షత్రాలు పరిభ్రమిస్తూ ఉంటాయి.

స్టార్ వార్స్‌లో ఫిక్షనల్ ప్లానెట్ టాటోయిన్ మాదిరి రెండు సూర్యుళ్లతో ఆకాశాలు ఉంటాయి. వీటిని సర్కమ్‌బైనరీ సిస్టమ్స్ అంటారు.

కొన్నిసార్లు ఇలాంటి వ్యవస్థలకు బైనరీ సహచరులు ఇబ్బందులు కలిగించడాన్ని మనం చూడొచ్చు. ''అయితే ఎంత దూరంలో నక్షత్రం ఉందనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది'' అని లీ గాంగ్జీ అన్నారు.

సూర్యుడికి చాలా కాల క్రితం తోడు నక్షత్రం ఉండటం మన గ్రహానికి ఎలాంటి హాని కలిగించి ఉండకపోవచ్చు. మన సౌర కుటుంబం గురించి శాస్త్రవేత్తలు మరింత వివరంగా అధ్యయనం చేయనున్నారు. ఈ అధ్యయనం ఒకప్పుడున్నన మరిన్ని ఖగోళపు అద్భుతాలను వెలుగులోకి తీసుకురావొచ్చు.

సూర్యుడికి ''ఒకవేళ తోడు ఉండి ఉంటే, అదెక్కడో, తన సొంత సౌర వ్యవస్థలో ఉండొచ్చు. అది చాలా వెనుకకు లేదా ముందుకు వెళ్లి ఉండకపోవచ్చు'' అని సదావోయ్ చెప్పారు.

‘‘గెలాక్సీలో మరోవైపు ఇది ఉండొచ్చు. మనకు తెలిసి ఉండకపోవచ్చు. అదెక్కడైనా ఉండి ఉండొచ్చు.’’ అని ఆమె చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)