అర్ధశతాబ్దం తర్వాత చంద్రుడిపై కాలుమోపేదెవరు, అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
1969లో బజ్ ఆల్డ్రిన్, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌లను అపోలో 11 చంద్రుడిపైకి తీసుకెళ్లింది. ఆ తర్వాత 1972 వరకూ నిర్వహించిన అపోలో మిషన్లలో భాగంగా మరో పది మంది అమెరికన్లు చంద్రుడిపైకి వెళ్లగలిగారు. ఆ తర్వాత వ్యోమగాములతో కూడిన మూన్ మిషన్‌లను అమెరికా నిలిపివేసింది.
అర్ధశతాబ్దం విరామం తర్వాత, ఇప్పుడు మళ్లీ చంద్రుడిపైకి వెళ్లడంపై ఆసక్తి పెరుగుతోంది.
శ్వేతజాతీయుడు కాని ఒక వ్యక్తి, ఒక మహిళతో సహా వ్యోమగాములను మళ్లీ చంద్రుడిపైకి పంపేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది. భారత్, చైనా కూడా చంద్రుడిపైకి కొత్త మిషన్లను పంపే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇప్పుడెందుకీ ప్రయత్నాలు? 1960ల నాటి అంతరిక్ష పరిశోధనలకు, ఇప్పటికీ తేడా ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ రాజకీయాలు
1961లో అప్పటి యూఎస్ఎస్ఆర్ యూరి గగారిన్‌ను భూ కక్ష్యలోకి పంపిన మిషన్‌కు ప్రతిస్పందనగా అమెరికా మానవ సహిత మిషన్‌ను నిర్వహించింది.
చంద్రుడిపై దిగడమనేది అంతరిక్ష పరిశోధనలో భారీ విజయం. అలాగే, ప్రపంచాన్ని అబ్బురపరిచిన ఒక చారిత్రాత్మక విషయం కూడా.
''భూమిపై నుంచి చంద్రుడిపైకి మనుషులను తీసుకెళ్తాం అని చెప్పడం కంటే, ఏం చేయగలమో మరింత స్పష్టంగా చెప్పడం చాలా కష్టం'' అని 'ది మూన్, ఏ హిస్టరీ ఆఫ్ ది ఫ్యూచర్' రచయిత, ది ఎకనమిస్ట్ వార్తాపత్రిక సీనియర్ ఎడిటర్ ఆలివర్ మోర్టాన్ చెప్పారు.
చంద్రుడిపై ఈసారి కాలుమోపేదెవరనేది ప్రపంచ రాజకీయాలతో పాటు అక్కడి వనరులను ఉపయోగించుకోవాలన్న వారి కోరికపై ఆధారపడి ఉంటుంది. అనేక దేశాలు, ప్రైవేటు కంపెనీలు కూడా ఆ ప్రయత్నాల్లో ఉన్నాయి. అందుకు ఎవరి ఎజెండా వారిది.
ఇప్పటికే రష్యా, చైనా, భారత్, జపాన్, యూరోపియన్ యూనియన్లు చంద్రుడి ఉపరితలంపై మానవ రహిత ప్రోబ్స్ లేదా రోవర్లను విజయవంతంగా సాఫ్ట్-ల్యాండింగ్ చేశాయి, కానీ మనిషిని పంపలేదు.
ఇప్పుడు అమెరికా, చైనాల మధ్య పోటీ ఉంది.
''ప్రపంచ రాజకీయాలే అందుకు కారణం. ఇతర భాగస్వాములతో కలిసి మిషన్‌లు(ప్రయోగాలు) నిర్వహించేందుకు అమెరికా, చైనా సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఆ రెండు దేశాలూ మానవ సహిత మిషన్‌లు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. అంతర్జాతీయ భాగస్వాములతో ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. ఐదు నుంచి పదేళ్లలో చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి'' అని ఆర్స్ టెక్నికా సంస్థ సీనియర్ స్పేస్ ఎడిటర్ ఎరిక్ బర్జర్ చెప్పారు. స్పేస్, టెక్నాలజీ విషయాలతో పాటు రాజకీయ, సామాజిక అంశాలను ఆర్స్ టెక్నికా రిపోర్ట్ చేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
వనరులు
చంద్రుడిపైకి పంపిన మొదటి మిషన్ లక్ష్యం చంద్రుడిపై పరిశోధన కాదు, కేవలం దానిని చేరుకోవడం మాత్రమే.
కానీ ఇప్పుడు, కేవలం చంద్రుడిపైకి వెళ్లడం మాత్రమే కాదు.. చంద్రుడిపై ఆవాసానికి, అక్కడి వనరులను సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేయడం ఎలా అనేదే ప్రధాన ప్రశ్న.
''మనుషులు భూమి మీద పుట్టిన జీవులు. కొందరు ఏం చేయాలనుకుంటున్నారంటే, అంగారకుడిపై కాలనీల ఏర్పాటు, చంద్రుడిపై కాలనీలు, అంతరిక్షంలో కృత్రిమ కాలనీలను సృష్టించాలనుకుంటున్నారు. నేను ఇక్కడ సైన్స్ ఫిక్షన్ గురించి మాట్లాడుతున్నా.'' అని యూకేలోని నార్తంబ్రియా విశ్వవిద్యాలయంలో స్పేస్ లా అండ్ పాలసీ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ న్యూమన్ చెప్పారు.
మానవజాతి అంతరించిపోయే పరిస్థితి వచ్చినా తట్టుకుని బతికేందుకు భూమిపై కాకుండా ఇతర గ్రహాలపై ఆవాసాలు ఉండాలనేది అలాంటి వారి ఆశయమని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తాత్కాలిక వేదిక
చంద్రుడిపైకి వెళ్లాలనే అమెరికా ప్రస్తుత మిషన్ కేవలం చంద్రుడికే పరిమితం కాదు, అంతరిక్ష పరిశోధనలో మరింత ముందుకు వెళ్లాలన్నదే దాని ఉద్దేశం.
''చంద్రుడిపైకి వెళ్లి, తిరిగి భూమి మీదకు రావడం కాదు. అక్కడ ఒక స్థావరం ఏర్పాటు చేయగలగాలి. తద్వారా చంద్రుడిపై నుంచి అంగారకుడిని చేరుకోవడానికి దానిని తాత్కాలిక వేదికగా భావించవచ్చు'' అని అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి చెందిన థండర్‌బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ నమ్రతా గోస్వామి చెప్పారు.
చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండడం వల్ల, భూమి నుంచి ప్రయోగించే కంటే తక్కువ ఇంధనంతో చంద్రుడిపై నుంచి రాకెట్‌ను ప్రయోగించడం సాధ్యమవుతుంది. అందుకే చంద్రుడిని వ్యూహాత్మక వేదికగా భావిస్తున్నారని ఆమె చెప్పారు.
చంద్రుడిపై కొన్ని ప్రాంతాలపై దాదాపుగా నిరంతరం సూర్యరశ్మి ఉంటుంది. అందువల్ల సౌర విద్యుత్‌ని ఉత్పత్తి చేసే అవకాశం కూడా ఉంది. లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈవో - భూమికి దగ్గరగా ఉండే కక్ష్య)లోని భారీ ఉపగ్రహాల ద్వారా ఆ సౌర విద్యుత్‌ను మైక్రోవేవ్‌ల రూపంలో భూమికి పంపించే ఆలోచన కూడా ఉంది.
భూ ఉపరితలం నుంచి 1200 మైళ్లలోపు (2000 కిలోమీటర్లు) ఆవరించి ఉన్న భూ కక్ష్యను 'లో ఎర్త్ ఆర్బిట్'గా వ్యవహరిస్తారని నాసా తెలిపింది.
చంద్రుడిపై భారత్ చేసిన ప్రయోగాలు, చంద్రుడి దక్షిణ ధృవం వద్ద సల్ఫర్, అల్యూమినియం వంటి ఇతర ఖనిజాల ఉనికిని గుర్తించాయి. ఇప్పుడు మానవ మనుగడకు అవసరమైన కీలక విషయాన్ని కనుగొనడంపై దృష్టి కేంద్రీకృతమైంది.
''అందులో మంచు (వాటర్ ఐస్) చాలా కీలకం. మానవ ఆవాసం ఏర్పాటు చేయాలనుకుంటే అది తప్పనిసరి. ఎందుకంటే, మంచు ఆక్సిజన్‌గా మారుతుంది'' అని గోస్వామి వివరించారు.
మొదటగా చంద్రుడిపై కాలుమోపిన విజయానందం తర్వాత, 1960ల చివర్లో నక్షత్రాలపైకి వెళ్లడం గురించి కూడా చర్చ జరిగింది. కానీ, ఇప్పటి వరకూ అది జరగలేదు.
''లో ఎర్త్ ఆర్బిట్‌కి సమీపంలో, గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండడం వల్లే జాబిల్లి మానవులకు గమ్యస్థానంగా మారింది. అలాగే, అక్కడికి చేరుకోవడం కూడా సులభం. ఇది చాలా దగ్గరగా ఉంటుంది. చంద్రుడిని చేరుకోవడానికి మూడురోజులు పడుతుంది. అక్కడి నుంచి అంగారకుడిపైకి మనుషులను పంపేందుకు ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుంది. అందుకే అది మరో మైలురాయి'' అని బర్జర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కాబట్టి, చంద్రుడిపైకి వెళ్లడమనేది అంతరిక్ష ప్రయోగాల్లో ముఖ్యమైన సాంకేతిక అడ్డంకులను అధిగమించడమే.
ముందుగా, వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి, రేడియేషన్‌కి గురవకుండా సురక్షితంగా ఉంచేందుకు శక్తివంతమైన రాకెట్ అవసరం.
ఆ తర్వాత చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్(ఎలాంటి ఇబ్బంది లేకుండా దిగడం) చేయడం మరో సవాల్. అలాగే, వ్యోమగాములు అక్కడి నుంచి తిరిగి రాగలగాలి. అక్కడ ఏదైనా సాంకేతికక సమస్య తలెత్తితే, వారికి బయటి నుంచి సహకారం అందే పరిస్ధితి కానీ, లేదా మిషన్‌ను నిలిపివేసే అవకాశం కానీ ఉండదు.
వ్యోమగాముల అంతరిక్ష నౌక చంద్రుడి నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించేప్పుడు సెకనుకు కొన్ని కిలోమీటర్ల వేగంతో వస్తుంది.
ఎందుకంటే, చంద్రుడి నుంచి తిరిగి వచ్చేప్పుడు నిర్దేశించిన వేగం, లో ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశించిన తర్వాత పెరుగుతుందని బర్జర్ వివరించారు.
అయితే, వివిధ దేశాలు చంద్రుడిపై అడుగుపెట్టిన తర్వాత, అక్కడి వనరులు ఏమవుతాయన్నదే కీలక ప్రశ్న.
1967 నాటి ఔటర్ స్పేస్ ఒప్పందం ప్రకారం, అంతరిక్షంలో ఏ దేశమూ సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోలేవు, అయితే వాస్తవాలు అందుకు భిన్నంగా ఉండవచ్చు.
''చంద్రుడిపై కాలుమోపగలిగిన, అక్కడి వనరులను వెలికితేసే సామర్థ్యం ఉన్న దేశాలు మాత్రమే ఆ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే, ఇప్పటికి చంద్రుడిపై ఉన్న వనరులను ఎలా పంచుకోవాలనే చట్టాలు కూడా లేవు'' అని గోస్వామి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతరిక్షంలో కొత్త రేసు
2030 దశకంలో చంద్రుడిపై శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేయాలని చైనా యోచిస్తోంది. అందుకోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తూ వస్తోంది. 2028 నాటికి అంతరిక్ష కేంద్రం ఏర్పాటులో కీలక ఘట్టాన్ని ఆవిష్కరించగలదని అమెరికా అంచనా వేసింది. కానీ ఆ కార్యక్రమం ఇంకా వెనకంజలో ఉంది.
బిలియనీర్ ఎలన్ మస్క్, ఆయనకు చెందిన అంతరిక్ష పరిశోధన కంపెనీ స్పేస్ ఎక్స్ సామర్థ్యంపైనే అమెరికా విజయం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
వచ్చే ఏడాది తొలి మానవ సహిత అంతరిక్ష నౌకలను పంపేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. 2035 నాటికి చంద్రుడిపై అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి, 2040 నాటికి వ్యోమగామిని పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది.
''చైనీస్ అంతరిక్ష ప్రయోగాల్లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యం. శాశ్వత స్థావర నిర్మాణమే లక్ష్యంగా 21వ శతాబ్దంలో చంద్రుడిపై అడుగుపెట్టగల మొదటి దేశం చైనా అని నేను బలంగా విశ్వసిస్తున్నా'' అని గోస్వామి చెప్పారు.
(ఈ కథనం బీబీసీ వరల్డ్ సర్వీస్ రేగియో ప్రోగ్రాం, ది ఎంక్వైరీ ఆధారంగా రూపొందింది.)
ఇవి కూడా చదవండి:
- విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులు గంగవరం పోర్టు కార్మికులను చేతులెత్తి వేడుకొంటున్నారు ఎందుకు?
- కోవిడ్ సమయంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎకనమిక్ టాస్క్‌ఫోర్స్ ఏం పని చేసింది?
- మాల్దీవులు: ‘ఇండియా అవుట్’ అన్న ఆ ప్రభుత్వమే భారత్‌కు విదేశాంగ మంత్రిని ఎందుకు పంపింది, తెర వెనక ఏం జరుగుతోంది?
- ఐకే గుజ్రాల్: ‘నాతో మాట్లాడాలనుకుంటే మర్యాదగా మాట్లాడు’ అని సంజయ్ గాంధీతో ఎందుకు అన్నారు?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














