విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులు గంగవరం పోర్టు కార్మికులను చేతులెత్తి వేడుకొంటున్నారు ఎందుకు?

ఫొటో సోర్స్, Lakkojusrinivas
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
గంగవరం పోర్టులో జీతాలు పెంపు, వైద్య సదుపాయం వంటివి కోరుతూ నిర్వాసిత కార్మికులు చేపట్టిన సమ్మెతో విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడే పరిస్థితి ఏర్పడిందిందని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
దాదాపుగా నెల రోజుల నుంచి గంగవరం పోర్టు కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో సమ్మె విరమించాలంటూ పోర్టు కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
గతేడాది జూలైలో జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సుమారు 500 మంది గంగవరం పోర్టు కార్మికులు ఆందోళన చేశారు. అప్పుడు పోర్టుతో పాటు జిల్లా కలెక్టర్ హామి ఇవ్వడంతో సమ్మె విరమించారు. ఆ హామీ నెరవేర్చకపోవడంతో కార్మికులు మరోసారి సమ్మెకు దిగి పోర్టు లోపలే కుటుంబాలతో ఉండిపోయారు.
పోర్టు రెండు గేట్లకు తాళలు వేసి.. బయటి వారిని లోపలకు రానివ్వకుండా, వీరు బయటకు రాకుండా పోర్టు కార్యాకలాపాలను స్తంభింపజేశారు. దీంతో ఈ సమ్మె ప్రభావం స్టీల్ ప్లాంట్‌పై పడింది.
గంగవరం పోర్టులో చేస్తున్న సమ్మెతో స్టీల్ ప్లాంట్‌కు వచ్చిన సమస్య ఏంటి? పోర్టు లోపలే కార్మికులు ఉండిపోతే గంగవరం పోర్టు యాజమాన్యం ఏం చేస్తోంది? సమ్మెపై స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఏమంటున్నారు? సమ్మె కార్మికులు కోరుతున్న పరిష్కారం ఏంటి? సమ్మెతో స్టీల్ ప్లాంట్ మూతపడే ప్రమాదం ఉందా?

ఫొటో సోర్స్, Lakkojusrinivas
గంగవరం పోర్టుకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పాదయాత్ర..
ఏప్రిల్ 12వ తేదీ నుంచి స్టీల్ ప్లాంట్‌కు వెళ్లాల్సిన బొగ్గు నిల్వలు గంగవరం పోర్టులోనే ఉండిపోయాయి. దీంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి దాదాపు 1,000 మంది ప్లాంట్ ఉద్యోగులు గంగవరం పోర్టుకు ర్యాలీగా వచ్చారు. అక్కడ సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చించారు. అదానీ గంగవరం పోర్ట్ లిమిటెడ్‌లో నిల్వ ఉన్న బొగ్గును వెంటనే విడుదల చేయాలని కోరారు.
"స్లీట్ ప్లాంట్‌లో బొగ్గు నిల్వలు లేవు. ప్లాంట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. స్టీల్ ప్లాంట్ కోసం ఆస్ట్రేలియా నుంచి వచ్చిన కోకింగ్ కోల్‌ను గంగవరం పోర్టు నుంచి ప్లాంట్‌కు పంపాలని చేతులెత్తి మొక్కుతున్నాం" అని సమ్మె చేస్తున్న కార్మికులతో స్టీల్ ప్లాంట్ మానవ వనరుల విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ జి. గాంధీ అన్నారు.
“స్టీల్ ప్లాంట్ కోసం గంగవరం పోర్టు నుంచి బొగ్గును రవాణా చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. పోర్టు ఆ ఆదేశాలను తక్షణం అమలు చేయాలని కోరుతున్నాం” అని విశాఖ జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జునకు విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ లేఖ రాశారు.
పోర్టు నుంచి ప్లాంట్‌కు బొగ్గు రవాణా చేసేందుకు అవసరమైన పోలీసు భద్రత కల్పించాలని ఆ లేఖలో కోరారు.
అయితే, హైకోర్టు ఆదేశాల మేరకు గంగవరం నిర్వాసిత కార్మికులతో తాము జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయని గంగవరం పోర్టు యాజమన్యం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది.
‘‘డిమాండ్లు ఒక్కొక్కటి నెరవేస్తున్నా కార్మికులు మళ్లీ ఆందోళన చేస్తూ పోర్టు కార్యకలాపాలని అడ్డుకుంటున్నారు’’ అని ఆ ప్రకటనలో యాజమాన్య వెల్లడించింది. మొత్తానికి కార్మికులతో జరిగిన చర్చలు సఫలం కాలేదని తెలిపింది.

ఫొటో సోర్స్, Lakkojusrinivas
స్టీల్ ప్లాంట్‌కు కోకింగ్ కోల్ సరఫరా ఆగిపోతే ఏమవుతుంది?
స్టీల్ తయారీలో కోకింగ్ కోల్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది ముడి ఇనుములోని మలినాలను తగ్గించి నాణ్యమైన ఇనుమును ఇచ్చేందకు ఉపయోగపడుతుంది. కోకింగ్ కోల్ అంటే ముడి బొగ్గు.
‘’స్టీల్ తయారీలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతి నెలా 3 లక్షల టన్నుల కోకింగ్ కోల్ కొనుగోలు చేస్తుంది. దీనిని రష్యా, ఆస్ట్రేలియా, అమెరికాల నుంచి ఆర్డర్ చేస్తారు. 40 రోజులకు డెలివరీ అవుతుంది. నిజానికి స్టీల్ ప్లాంట్‌లో 40 రోజులకు సరిపడా కోకింగ్ కోల్ మెటీరియల్ నిల్వ ఉండాలి. కానీ ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితి కారణంగా అధిక నిల్వలు ఉండటం లేదు, ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాల్సి వస్తోంది. వర్కింగ్ క్యాపిటల్, కేంద్రం సహకారం లేకపోవటంతో పాటు ఇప్పుడు గంగవరం పోర్టు కార్మికుల సమ్మెతో పోర్టుకు వచ్చిన కోకింగ్ కోల్ అక్కడే ఉండిపోవడంతో స్టీల్ ప్లాంట్‌లో నిల్వలు లేవు” అని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నాయకుడు, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు నీరుకొండ రామచంద్రరావు బీబీసీతో చెప్పారు.
“కోకింగ్ కోల్ లేకపోతే కోక్ ఓవెన్ బ్యాటరీలు షట్ డౌన్ అయిపోతాయి. కోక్ ఓవెన్‌కు బ్యాటరీలే చాలా ముఖ్యం. ఓవెన్ రన్ అయితేనే దానిలో ఐరన్ ఓర్ కలిపి స్టీల్ తయారు చేయగలం. ఈ ప్రాసెస్ కోసం ప్లాంట్‌లో ఐదు కోక్ ఓవెన్ బ్యాటరీలు ఉన్నాయి. ఈ ఐదు బ్యాటరీలు ఏర్పాటు చేయాలంటే రూ. 10 వేల కోట్ల ఖర్చుతో పాటు ఐదేళ్ల సమయం పడుతుంది. కోక్ ఓవెన్ బ్యాటరీలు పని చేయడం లేదంటే స్టీల్ ప్లాంట్ మూత పడినట్లే లెక్క. ప్రస్తుతానికి సెయిల్ కంపెనీ వారు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కోకింగ్ కోల్ ఇస్తున్నారు. గంగవరం పోర్టులో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం విదేశాల నుంచి వచ్చిన దాదాపు 2 లక్షల టన్నుల కోకింగ్ కోల్ ఉంది. కానీ పోర్టు కార్మికుల సమ్మె కారణంగా ఆ సరుకు అక్కడి నుంచి రవాణా కావడం లేదు” అని రామచంద్రరావు చెప్పారు.

ఫొటో సోర్స్, Lakkojusrinivas
‘‘విశాఖ స్టీలు ప్రైవేటీకరణ కోసం’’
‘గంగవరం పోర్టు అదానీ పోర్ట్స్ నిర్వహణలో ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ఇందులో భాగంగా అదానీ గ్రూపు ద్వారా స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన కోకింగ్ కోల్‌ను నిలిపి వేసి.. దానికి కార్మికుల సమ్మెను బూచిగా చూపిస్తున్నారు’’ అని నీరుకొండ రామచంద్రరావు అన్నారు.
గతంలో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీలు ప్లాంటులోని తమ వాటాను అమ్మివేస్తున్నట్లు ప్రకటించింది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఆర్‌ఐఎన్‌లో 100శాతం వాటాను విక్రయించనున్నట్లు 2021 జనవరి 27న తెలిపింది. అయితే విశాఖపట్నం స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ ప్రతిపాదనకు నిరసనగా నాడు వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ప్రదర్శనలు చేపట్టాయి. ప్రైవేటీకరణ మీద కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని దగ్గుబాటి పురందేశ్వరి వంటి ఆంధ్రా బీజేపీ నాయకులు నాడు తెలిపారు.
ఆ తరువాత అదే ఏడాది మార్చి 8న పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ చేపడుతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు.

ఫొటో సోర్స్, CMRamesh
ప్రైవేటీకరణను కేంద్రం నిలిపివేసింది : బీజేపీ నేత సీఎం రమేశ్
గంగవరం పోర్టులో కార్మికుల సమ్మెతో స్టీల్ ప్లాంట్‌కు బొగ్గు రవాణా నిలిచిపోవడంపై బీజేపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మేల్యే విష్ణుకుమార్ రాజు బీబీసీతో మాట్లాడారు.
“బీజేపీ ప్రభుత్వానికి అదానీ గంగవరం పోర్టుకు ఏం సంబంధం లేదు. అది ప్రైవేటు పోర్టు. దాని వ్యవహారాల్లో మా పార్టీకి ఏం సంబంధం ఉంటుంది?” అని విష్ణుకుమార్ రాజు అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని అనకాపల్లి లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఏప్రిల్ 24న అన్నారు.
‘‘స్టీల్ ప్లాంటును మరింత బలోపేతం చేసే మార్గాలను వెతుకుతాం. ప్రైవేటీకరణను నిలిపివేయాలన్నది ఒక పార్టీ నిర్ణయం కాదు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం’’ అని ఆయన వార్తా సంస్థ ఏఎన్ఐతో చెప్పారు.

ఫొటో సోర్స్, Lakkojusrinivas
యాజమాన్యం స్పందించాలి: కార్మికులు
గతంలో హామీ ఇచ్చినట్లు కనీస వేతనంగా రూ.36 వేలు చెల్లించాలని, ఏటా మూల వేతనంపై 20 శాతం ఇంక్రిమెంట్, క్యాంటీన్‌లో సబ్సిడీతో ఇతర అలవెన్సులు కల్పించాలని కార్మికులు ఆందోళన చేస్తున్నారు.
గత నెల రోజులుగా దాదాపు 300 మంది కార్మికులు గంగవరం పోర్టు రెండు గేట్లకు తాళాలు వేసి కుటుంబాలతో సహా లోపలే ఉంటున్నారు. వారికి అవసరమైన వస్తువులు, ఆహారాన్ని బయట ఉన్న కార్మికులు అందిస్తున్నారు.
“మా సమస్యలు పరిష్కరించాలని 8 నెలల క్రితం ఆందోళనకు దిగాం. అప్పుడు పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్, జిల్లా కలెక్టర్ మల్లికార్జున సమక్షంలో యాజమాన్యం, కార్మికుల మధ్య చర్చలు జరిగాయి. అప్పుడు మా డిమాండ్లను యాజమాన్యం అంగీకరించింది. కానీ ఇంతవరకూ వాటిని నెరవేర్చలేదు. అందుకే మళ్లీ మేం సమ్మె బాట పట్టాం. ఈసారి మా సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన చేస్తూనే ఉంటాం. ఈసారి ఎవరి మాట నమ్మం.” అని గంగవరం పోర్టు నిర్మాసిత కార్మికుడు నొల్లి తాతారావు బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Lakkojusrinivas
పోర్టు మా ఆధీనంలోనే ఉంది: కార్మికులు
అదానీ గంగవరం పోర్టు ప్రైవేట్ లిమిటెడ్‌లో గంగవరం, దిబ్బపాలెంలకు చెందిన మత్స్యకారులు 595 మంది ఉన్నారు. వీరిలో నిర్వాసితులు దాదాపు 400 మంది ఉంటారు. వీరంతా సెక్యూరిటీ, క్లీనింగ్, లోడింగ్, అన్ లోడింగ్ వంటి నాన్ స్కిల్డ్ విభాగాల్లో పని చేస్తున్నారు.
ఇక్కడ 14 ఏళ్లగా పని చేస్తున్న వీరికి అందుతున్న జీతం నెలకు రూ. 9 వేల నుంచి రూ. 18 వేల వరకు ఉంది. అందులోనూ వీరందరికి జాయినింగ్ నుంచి ఇప్పటి వరకు బేసిక్ పే రూ. 3,700 గానే ఉంది. వీరి పే స్లిప్పులను బీబీసీ పరిశీలించింది.
“కార్మికులమంతా ఒక తాటిపైకి వచ్చి గేట్లకు తాళాలు వేసి పోర్టుని మా ఆధీనంలోకి తీసుకున్నాం. ఇతరుల గురించి ఆలోచిస్తే మా సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి? మేం కూడా ఇతర ఉద్యోగుల లాంటి వారిమే. స్టీల్ ప్లాంట్ దృష్టిలో పెట్టుకుని మా సమస్యల పరిష్కారానికి కలెక్టర్ లేదా లేబర్ కమిషనర్‌తో అగ్రిమెంట్ రాసిస్తే సమ్మె విరమిస్తాం. లేదంటే లేదు” అని గంగవరం పోర్టులో పని చేస్తున్న అమ్మోరు అన్నారు.
‘‘ఏళ్ల తరబడి ఒకే బేసిక్ పే ఉండటం, కార్మిక చట్టాల ప్రకారం నేరం. ప్రభుత్వ, కాంట్రాక్ట్, ప్రైవేట్ ఉద్యోగాల్లో జీతభత్యాలు వేర్వురుగా ఉన్నప్పటికీ పెరుగుదల లేకుండా అతి తక్కువ జీతాలు ఉండటం అన్యాయమ’’ని న్యాయవాది వెన్నెల ఈశ్వరరావు అన్నారు.
“షాప్స్ అండ్ ఎస్టాబిష్ మెంట్ యాక్ట్ ప్రకారం వారిని రిక్రూట్ మెంట్ చేసుకుంటే కార్మికులను టెర్మినేట్ చేయవచ్చు. ఎందుకంటే ఇవి శాశ్వత ఉద్యోగాల కింద పరిగణించరు. అందుకే వీళ్లని తొలగించే అధికారం, జీతాలు తక్కువగా ఇచ్చే అవకాశం పోర్టు యాజమాన్యానికి ఉంటుంది.” అని ఈశ్వరరావు తెలిపారు.

ఫొటో సోర్స్, Lakkojusrinivas
గంగవరం పోర్టు, అదానీ పోర్టుగా ఎలా మారింది?.
2009లో గంగవరం పోర్టు ప్రైవేటు లిమిటెడ్ (జీపీఎల్) పేరుతో డీవీఎస్ రాజు, ఆయన కుటుంబానికి 89.6 శాతం వాటా, ప్రభుత్వానికి 10.4 శాతం వాటాతో కార్యకలాపాలు ప్రారంభమైయ్యాయి.
ఈ పోర్టు కారణంగా భూములను కోల్పోయిన మత్స్యకారులకు దశల వారీగా నిర్వాసితుల కోటాలో ఉద్యోగాలు కల్పించారు. ఆ తర్వాత ఈ పోర్టులో వాటాలను అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. అనంతరం ఏపీ ప్రభుత్వం తనకున్న10.4 శాతం వాటాలను కూడా అమ్మేయంతో ప్రస్తుతం ఈ పోర్ట్ అదానీ గంగవరం పోర్టు ప్రైవేట్ (AGPL) పేరుతో నడుస్తోంది.
“మా భూములు తీసుకున్నది గంగవరం పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, అదే పేరుతో అప్పుడు అగ్రిమెట్లు జరిగాయి. మాకు ఉద్యోగాలు మాత్రం గంగవరం పోర్టు సర్వీస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ పేరుతో ఇచ్చారు. ఇదొక ఏజెన్సీ మాదిరి పని చేస్తుంది. ఇందులో ఉన్న మాకు ఎటువంటి కార్మిక హక్కులు, చట్టాలు వర్తించకుండా చేస్తున్నారు. అందుకే మమ్మల్ని అదానీ పోర్ట్స్ కార్మికులుగా గుర్తించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం” అని కార్మికుడు నొల్లి తాతారావు అన్నారు.
“గతంలో, ఇప్పుడు తమకు షాప్స్ అండ్ ఎస్టాబిష్ మెంట్ యాక్ట్ ప్రకారం జీతాలు ఇస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. పోర్టు కాబట్టి ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం జీతాలు ఇవ్వాలని కార్మికులు అడుగుతున్నారు. అదానీ పోర్టు యాజమాన్యం షాప్స్ అండ్ ఎస్టాబిష్ మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్లకి ఉద్యోగాలు ఇస్తే...జీతాలు తక్కువగానే ఉంటాయి. అయితే ఇక్కడ కీలకాంశం కార్మికులను పోర్టులో ఏ పద్దతిలో రిక్రూట్ చేసుకున్నారో చూడాలి. అప్పుడే కార్మికులు ఏ వేతనాలకు అర్హులో తేలుతుంది. ఈ విషయంలో పోర్టు వాళ్లని మేం సమాచారం అడిగాం. అందిస్తామని చెప్పారు.” అని విశాఖ డిప్యూటీ లేబర్ కమిషనర్ సునీత బీబీసీతో చెప్పారు.
గంగవరం పోర్టు యాజమాన్యం ఏమంటోంది?
కార్మికుల సమస్యలు, డిమాండ్లపై కార్మికులు, ప్రభుత్వ అధికారులు, అదానీ గంగవరం పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు.
ఈ సమావేశాల అనంతరం గంగవరం పోర్ట్ సర్వీసెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆ సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న జీజె రావు 09.05.2024న కార్మికులతో మాట్లాడారు.
హైకోర్టు ఆదేశాల మేరకు గంగవరం నిర్వాసిత కార్మికులతో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయని గంగవరం పోర్టు యాజమన్యం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో పేర్కొంది.
కార్మికులతో జరిపిన చర్చల్లో అదానీ పోర్టు అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ డైరెక్టరుగా వ్యవహరిస్తున్న జీజే రావు పాల్గొన్నారు.
స్టీల్ ప్లాంట్ కు కోకింగ్ కోల్ పంపించాలంటే ముందు తమ డిమాండ్లను పరిష్కరించాలని పట్టుబట్టినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. గతేడాది ఆందోళనలు చేసినప్పుడు అదానీ గంగవరం పోర్టు వారి సమస్యలను పరిష్కరించేందుకు ఒప్పందంపై సంతకం చేసిందని అందులో తెలిపారు.
ఒక్కొక్కటి నెరవేస్తున్నా కార్మికులు మళ్లీ ఆందోళన చేస్తున్నారని,, పోర్టు కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని యాజమాన్యం విడుదల చేసిన ప్రకటనలో ఉంది. దీంతో నిర్వాసిత కార్మికులతో జరిగిన చర్చలు సఫలం కాలేదని తెలిపింది.
అయితే, యాజమాన్యం తమ సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీలు ఇవ్వడం లేదని నిర్వాసిత కార్మికులు చెప్తున్నారు.
ఈ నెల 9వ తేదీన గంగవరం పోర్టు వద్దకు బీబీసీ బృందం వెళ్లినప్పుడు పోర్టు కార్మికులు చేస్తున్న సమ్మె, స్టీల్ ప్లాంట్‌కు బొగ్గు రవాణా అంశాలపై అక్కడి అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. కానీ, వారు అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత ఆ సంస్థ పీఆర్వో సునీల్ కుమార్‌ను సంప్రదించింది. ఆయన 24 గంటల తర్వాత బీబీసీకి ఈ కింది విధంగా చెప్పారు.
‘‘ప్రస్తుతం కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. పోర్టులో ఎటువంటి కార్యకలాపాలు జరగడం లేదు. పోర్టు అధికారులకు, నిర్వాసిత కార్మికులకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. మరోసారి చర్చించేందుకు పోర్టు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నిర్వాసిత కార్మికులతో చర్చల్లోని ప్రతిష్టంభన ఎందుకు ఏర్పడింది? దీనిని నివారించేందుకు బొగ్గు రవాణా విషయంలో స్టీల్ ప్లాంట్ అధికారులు, గంగవరం పోర్టు అధికారుల మధ్య ఏదైనా సమావేశం జరిగిందా లేదా? అనే విషయాలను పోర్టు ఉన్నతాధికారి అయిన జీజే రావుతో మాట్లాడిన తర్వాత సమాచారం చెప్పగలను’’ అని అదానీ గంగవరం పోర్టు పీఆర్వో సునీల్ కుమార్ బీబీసీతో చెప్పారు.
ఈ అంశంపై మళ్లీ గంగవరం పోర్టు పీఆర్వో సునీల్ కుమార్‌ను బీబీసీ 11.05.24 తేదీన రెండుసార్లు సంప్రదించింది. పోర్టు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చానని.. వారి నుంచి ఎటువంటి సమాచారం రాలేదని, మరో సారి ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- సౌదీ ఎడారి నగరం నియోమ్ కోసం ‘భూమి ఇవ్వకపోతే చంపేయండి’ అని చెప్పారు
- మాల్దీవులు: ‘ఇండియా అవుట్’ అన్న ఆ ప్రభుత్వమే భారత్‌కు విదేశాంగ మంత్రిని ఎందుకు పంపింది, తెర వెనక ఏం జరుగుతోంది?
- పెనైల్ క్యాన్సర్: పురుషాంగం తొలగించడానికి కారణమవుతున్న ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది?
- World Asthma Day: ఆస్తమా ఎందుకు వస్తుంది? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ‘మా నాన్న సీఎం’
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














