సౌదీ ఎడారి నగరం నియోమ్ కోసం ‘భూమి ఇవ్వకపోతే చంపేయండి’ అని చెప్పారు

సౌదీ అరేబియాలో దిలైన్ అనేది నియోన్ ప్రాజెక్టు

ఫొటో సోర్స్, Shutterstock

ఫొటో క్యాప్షన్,
    • రచయిత, మెర్లిన్ థామస్, లారా ఎల్ గిబాలీ
    • హోదా, బీబీసీ వెరిఫై, బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్స్

సౌదీ అరేబియాలో నిర్మించాలనుకుంటున్న ఒక ఎడారి నగరానికి భూసేకరణ కోసం స్థానికులను ఖాళీ చేయించడానికి అవసరమైతే బల ప్రయోగం చేయడానికి అధికారులు అనుమతించారని మాజీ ఇంటెలిజెన్స్ అధికారి కల్నల్ రబీహ్ అలెనెజీ బీబీసీతో చెప్పారు.

డజన్ల కొద్దీ విదేశీ కంపెనీలు కలిసి సౌదీలో నియోమ్ నగరాన్ని నిర్మిస్తున్నాయి.

దీనికోసం గల్ఫ్‌లోని హువైతాట్ అనే తెగను ఖాళీ చేయాలంటూ ఆదేశించినట్లు కల్నల్ రబీహ్ అలెనెజీ తెలిపారు. వారుంటున్న గ్రామం నియోమ్ ఎకో-ప్రాజెక్ట్‌లో భాగమైన 'ది లైన్' మార్గంలో వస్తోంది.

తరలింపునకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు వారిలో ఒకరిని కాల్చి చంపారు.

దీనిపై స్పందించడానికి సౌదీ ప్రభుత్వం, నియోమ్ మేనేజ్‌మెంట్ నిరాకరించాయి.

సౌదీ నియోన్

అసలేంటీ ప్రాజెక్టు?

నియోమ్ అనేది సౌదీ అరేబియాలోని పర్యావరణ ప్రాంతం.

రూ. 41.75 లక్షల కోట్లు (500 బిలియన్ డాలర్స్)తో దీని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు.

ఈ ప్రాజెక్ట్ సౌదీ అరేబియా విజన్ 2030లో ఒక భాగం.

సౌదీ ఆర్థిక వ్యవస్థ చమురుపై ఆధారపడటం తగ్గించడం కోసం దీన్ని అభివృద్ధి చేస్తున్నారు.

ఇది 'కార్ ఫ్రీ సిటీ'గా చెబుతున్నారు. మొదట్లో ఈ 'ది లైన్' నగరాన్ని 170 కిలోమీటర్ల పొడవు, 200 మీటర్ల వెడల్పు (656 అడుగులు)తో నిర్మించాలనుకున్నారు.

2030 నాటికి అందులో కేవలం 2.4 కి.మీ మాత్రం పూర్తి చేయనున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి.

నియోమ్ అభివృద్ధిలో డజన్ల కొద్దీ ప్రపంచ కంపెనీలు పనిచేస్తున్నాయి. వీటిలో బ్రిటన్‌కు చెందిన చాలా కంపెనీలున్నాయి.

నియోమ్ నిర్మిస్తున్న ప్రాంతం సరైన 'బ్లాంక్ కాన్వాస్' అని సౌదీ అరేబియా లీడర్, క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అభివర్ణించారు.

ఈ ప్రాజెక్ట్ కోసం 6 వేల మందికి పైగా ప్రజలను వారి స్వస్థలాల నుంచి ఖాళీ చేయించాల్సి వచ్చిందని సౌదీ ప్రభుత్వం చెబుతోంది.

తరలించిన వ్యక్తుల సంఖ్య అంతకంటే చాలా ఎక్కువగా ఉంటుందని బ్రిటన్‌ చెందిన మానవ హక్కుల సంస్థ ఏఎల్‌క్యూఎస్టీ అంచనా వేసింది.

ఈ ప్రాజెక్ట్ కోసం ఖాళీ చేసిన మూడు గ్రామాలైన అల్ ఖురేబా, శర్మ, గయల్ ఉపగ్రహ చిత్రాలను బీబీసీ పరిశీలించింది.

ఈ గ్రామాల్లోని ఇళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులను తొలగించినట్లుగా మ్యాప్‌లో కనిపిస్తోంది.

సౌదీలో నియోన్
ఫొటో క్యాప్షన్, తరలింపును వ్యతిరేకించే ఎవరినైనా చంపేయాలని 2020 ఏప్రిల్‌లో జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉందని కల్నల్ అలెనేజీ అంటున్నారు.

వినకపోతే చంపేయాలంటూ ఉత్తర్వులు..

సౌదీ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి కల్నల్ అలెనేజీ, గతేడాది బ్రిటన్‌కు పారిపోయారు.

అల్ ఖురేబా గ్రామాన్ని ఖాళీ చేయించాలంటూ తనకు ఆదేశాలొచ్చాయని కల్నల్ తెలిపారు.

ఆ గ్రామం 'ది లైన్'కి దక్షిణంగా 4.5 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆయన బీబీసీతో చెప్పారు. ఈ గ్రామంలో ఎక్కువగా హువైతాట్ వంశానికి చెందినవారు నివసించేవారు.

ఈ తెగ సౌదీ అరేబియాలోని తబుక్ ప్రాంతంలో ఎన్నోతరాలుగా జీవనం సాగిస్తోంది.

హువైతాట్ తెగ సభ్యులలో చాలామంది తిరుగుబాటుదారులు ఉన్నారని, ఊరు ఖాళీ చేయడానికి నిరాకరించే ఎవరినైనా చంపేయాలని 2020 ఏప్రిల్‌లో జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉందని కల్నల్ అలెనేజీ చెప్పారు.

కానీ ఆరోగ్యం సరిగా లేదనే కారణంగా ఆ మిషన్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు కల్నల్ అలెనేజీ ఉన్నతాధికారులకు చెప్పారు. కల్నల్ ఆ పని చేయకున్నా, ఆదేశాలు మాత్రం అమలయ్యాయి.

వ్యతిరేకించినందుకు కాల్చేశారు..

అల్ ఖురేబా గ్రామానికి చెందిన అబ్దుల్ రహీమ్ అల్-హువైతీ, తన ఆస్తిని మూల్యంకనం చేయడానికి భూమి రిజిస్ట్రేషన్ కమిటీకి అనుమతి ఇవ్వలేదు.

మరుసటి రోజు సౌదీ అరేబియా భద్రతా దళాలు గ్రామాన్ని ఖాళీ చేస్తున్న సమయంలో అబ్దుల్ రహీమ్ అల్-హువైతీని కాల్చి చంపాయి.

ఇంతకుముందు, ప్రజలను వారి ఇళ్ల నుంచి బయటికి పంపుతున్న వీడియోలను అబ్దుల్ రహీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తరలింపు సమయంలో భద్రతా దళాలపై అబ్దుల్ రహీమ్ కాల్పులు జరిపారని, సైనికులు ప్రతీకారంగా ఆయనను కాల్చివేశారని సౌదీ స్టేట్ సెక్యూరిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే, అబ్దుల్ రహీమ్ నిరసన తెలిపినందుకే చంపేశారని మానవ హక్కుల సంస్థలు, ఐక్యరాజ్యసమితి వాదిస్తున్నాయి.

బలవంతంగా ఖాళీ చేయించడంపై కల్నల్ అలెనేజీ చేసిన వ్యాఖ్యలను బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది.

అయితే సౌదీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ పనితీరు గురించి తెలిసిన ఒక విశ్వసనీయ సమాచారం మాకు కల్నల్ వాంగ్మూలం గురించి తెలిపింది.

క్లియరెన్స్ ఆర్డర్ ఎలా కమ్యూనికేట్ అయిందనే విషయాన్ని వివరించింది. అలాంటి అసైన్‌మెంట్‌ పూర్తిచేయడానికి కల్నల్ స్థాయి సీనియారిటీ వ్యక్తులే ఉండేవారని తెలిపింది.

స్థానికుల తరలింపును వ్యతిరేకించిన కనీసం 47 మందిని నిర్బంధించారని ఐక్యరాజ్యసమితి, ఏఎల్‌క్యూఎస్టీ చెబుతోంది.

వీరిలో చాలామందిని తీవ్రవాద సంబంధిత ఆరోపణలపై విచారించారు. అందులో 40 మంది నిర్బంధంలో ఉన్నారు. వీరిలో ఐదుగురికి మరణశిక్ష పడే అవకాశం ఉందని ఏఎల్‌క్యూఎస్టీ తెలిపింది.

అబ్దుల్ రహీమ్ మరణానికి సోషల్ మీడియాలో సంతాపం తెలిపినందుకు చాలామందిని అరెస్టు చేసినట్లు ఆ సంస్థ తెలిపింది.

'ది లైన్ ప్రాజెక్ట్' కోసం నిర్వాసితులకు తగిన పరిహారం అందించామని సౌదీ అరేబియా అధికారులు చెబుతున్నారు.

నిర్వాసితులకు ఇచ్చిన పరిహారం, హామీ ఇచ్చిన మొత్తం కంటే చాలా తక్కువగా ఉందని ఏఎల్‌క్యూఎస్టీ అంటోంది.

"యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు నియోమ్ చాలా ప్రధానమైదని, వారు హువైతట్ తెగతో ఇంత క్రూరంగా ప్రవర్తించడానికి ఇదే కారణం" అని కల్నల్ అలెనేజీ అభిప్రాయపడ్డారు.

మెడలు తొక్కి పైకి రావాలా?

2020లో అమెరికా నుంచి నియోమ్ ప్రాజెక్టులో పని కోసం సౌదీ అరేబియాకు బయలుదేరడానికి కొద్ది వారాల ముందు అబ్దుల్ రహీమ్ మరణం గురించి విన్నట్లు బీబీసీతో ఆ కంపెనీ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆండీ విర్త్ తెలిపారు.

ఈ తరలింపుల ప్రచారాల గురించి తన కంపెనీ యజమానులను పదేపదే ప్రశ్నించినట్లు ఆయన చెప్పారు.

కానీ, కంపెనీ సీనియర్ అధికారులు చెప్పిన సమాధానాలతో సంతృప్తి చెందలేదని ఆయన తెలిపారు.

"ఈ అమాయక ప్రజలు భయంకరమైన దౌర్జన్యాలకు గురయ్యారని నేను గ్రహించాను. మీరు పైకి రావడానికి మరొకరి మెడను తొక్కకూడదు" అని ఆండీ విర్త్ అన్నారు.

ప్రాజెక్ట్‌లో చేరిన ఒక సంవత్సరంలోనే ఆండీ విర్త్ బయటికొచ్చారు. ఈ ప్రాజెక్ట్ అమలవుతున్న తీరుపై ఆయన కలత చెందారు.

బ్రిటీష్ ఉప్పు నీటి శుద్ధి సంస్థ అయిన సోలార్ వాటర్ పీఎల్సీ 2022లో 'ది లైన్'కి సంబంధించిన దాదాపు రూ. 834 కోట్ల ప్రాజెక్టు నుంచి వైదొలిగింది.

ఈ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాల్కం ఔ కూడా నియోమ్‌ను తీవ్రంగా విమర్శించారు.

"ఈ ప్రాంతంలో నివసిస్తున్న కొంతమంది హైటెక్ వ్యక్తులకు ఈ ప్రాజెక్ట్ మంచిది. కానీ, మిగిలిన వారి సంగతేంటి?" అని బీబీసీతో మాల్కం ఔ అన్నారు.

ఈ ప్రాంతంపై స్థానికులకు ఉన్న అవగాహనను బట్టి వారిని కూడా విలువైన వనరుగా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు.

"మీరు వారిని సంప్రదించి, నిర్మించాల్సింది. అవసరమైతే వారిని తరిమేయకుండా పునర్నిర్మించి ఉండాలి" అని మాల్కం అన్నారు.

'వాళ్లు యుద్ధం ప్రారంభించారు'

బహిష్కరణకు గురైన గ్రామస్తులు ఈ విషయంపై బయటికి చెప్పడానికి ఇష్టపడలేదు.

విదేశీ మీడియాతో మాట్లాడితే జైలులో ఉన్న తమ బంధువులకు మరింత నష్టం వాటిల్లుతుందని గ్రామస్తులు భయపడ్డారు.

సౌదీ విజన్ 2030కి సంబంధించిన మరొక ప్రాజెక్ట్ నిర్వాసితుల్లో కొంతమందితో బీబీసీ మాట్లాడింది.

సౌదీ అరేబియాలోని పశ్చిమ నగరమైన జెడ్డాలో సెంట్రల్ ప్రాజెక్ట్ కోసం పది లక్షలకుపైగా జనాలను ఇళ్ల నుంచి బయటికి పంపారు.

ఈ కొత్త నగరంలో ఒపెరా హౌస్, ప్రత్యేక క్రీడా ప్రాంతం, ఉన్నతస్థాయి దుకాణాలు, లగ్జరీ ఇళ్లు నిర్మిస్తున్నారు.

నాదిర్ హిజాజీ (అసలు పేరు కాదు) అజీజియాలో పెరిగారు. కొత్త ప్రాజెక్ట్ కోసం కూల్చివేసిన 63 పరిసరాల్లో అజీజియా ఒకటి.

నాదిర్ తండ్రి ఇల్లును 2021లో కూల్చివేశారు. బుల్‌డోజర్‌తో ఇంటిని కూల్చడానికి ముందు, ఇల్లు ఖాళీ చేయడానికి వారికి కేవలం ఒక నెల సమయం మాత్రమే ఇచ్చారు.

తన ఇంటి పరిసరాల చిత్రాలు దిగ్భ్రాంతికి గురిచేశాయని నాదిర్ చెప్పారు. ఆ ప్రాంతమంతా యుద్ధం జరిగినట్లు కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

"వాళ్లు ప్రజలపై యుద్ధం ప్రారంభించారు, అది మా గుర్తింపును చెరిపివేస్తోంది" అని నాదిర్ ఆరోపించారు.

నష్టపరిహారమూ లేదు..

జెడ్డాలో కూల్చివేత సమయంలో అరెస్టయిన ఇద్దరు వ్యక్తుల గురించి సౌదీ సామాజిక కార్యకర్తలు బీబీసీకి చెప్పారు.

వీరిలో ఒకరిని తన ఇంటి కూల్చివేతకు అడ్డుగా వచ్చినందుకు పోలీసులు అరెస్టు చేశారు. అదే సమయంలో సోషల్ మీడియాలో కూల్చివేత చిత్రాలను పోస్టు చేసినందుకు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.

మరో పదిహేను మందిని అదే విధంగా అరెస్టు చేసినట్లు విన్నానని జెడ్డాలోని దహబాన్ సెంట్రల్ జైలులో ఖైదు అయిన వ్యక్తి బంధువొకరు తెలిపారు.

కూల్చివేత సమయంలో వారంతా అక్కడే ఉండటంతో తీసుకెళ్లారు. కాగా, సౌదీ అరేబియాలో ఖైదు అయిన ఈ వ్యక్తులను సంప్రదించడం చాలా కష్టం.

మేం ఈ వాదనలను ధృవీకరించలేకపోయాం.

జెడ్డాలో ఇళ్లు కోల్పోయిన 35 మందితో ఏఎల్‌క్యూఎస్టీ మాట్లాడింది.

వీరిలో ఒక్కరు కూడా తమకు ప్రతిఫలంగా నష్టపరిహారం ఇచ్చారని, స్థానిక చట్టాల ప్రకారం తగిన హెచ్చరికలు చేశారని చెప్పలేదు.

అదే సమయంలో వీరిలో సగానికి పైగా ప్రజలు అరెస్టు బెదిరింపుతో తమ ఇళ్లను విడిచిపెట్టవలసి వచ్చిందని చెప్పారు.

ఇప్పటికీ ప్రమాదంలోనే ఉన్నా..

కల్నల్ అలెనేజీ బ్రిటన్‌లో నివసిస్తున్నా, ఇప్పటికీ ప్రమాదంలో ఉన్నట్లుగానే భావిస్తున్నారు.

లండన్‌లోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయంలో ఆ దేశ హోం మంత్రిని కలిస్తే 5 మిలియన్ డాలర్లు ఇస్తానని ఒక ఇంటెలిజెన్స్ అధికారి చెప్పారని కల్నల్ అలెనేజీ అన్నారు.

ఆ సమావేశానికి వెళ్లేందుకు కల్నల్ నిరాకరించారు. ఈ ఆరోపణలపై సౌదీ అరేబియా ప్రభుత్వ వైఖరిని తెలుసుకోవాలనుకున్నాం. కానీ వారు స్పందించలేదు.

విదేశాల్లో నివసిస్తున్న సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై గతంలో కూడా దాడులు జరిగాయి. వీటిలో అత్యంత ప్రసిద్ధ కేసు అమెరికన్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గిది.

2018లో తుర్కియేలో ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లో సౌదీ అరేబియా ఏజెంట్లు జమాల్ ఖషోగ్గిని హత్య చేశారు.

సౌదీ యువరాజు ముహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకే ఈ ఆపరేషన్‌ జరిగిందని అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్టులు తెలిపాయి.

ప్రిన్స్ సల్మాన్ ఈ ఆరోపణలను తిరస్కరించారు.

నియోమ్‌కు సంబంధించి సౌదీ అరేబియా అధికారుల ఆదేశాలను ధిక్కరించినందుకు కల్నల్ అలెనేజీ పశ్చాత్తాప పడటం లేదు.

"నియోమ్ నిర్మాణంలో ముహమ్మద్ బిన్ సల్మాన్ ఎలాంటి ఆటంకాలను సహించరు. నా సొంత వారిని హింసించమంటే నేనేం చెయ్యగలను?" అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)