సౌదీతో చైనా ఒప్పందాలు చేసుకుంటే భారత్ ఎందుకు టెన్షన్ పడుతోంది?

సౌదీ అరేబియా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అభినవ్ గోయల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సౌదీ అరేబియా, చైనా దేశాల మధ్య సంబంధాలకు ప్రధాన ఆధారం చమురు.

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి చేసే దేశం సౌదీ అరేబియా కాగా, అత్యధికంగా ఇంధనాన్ని వినియోగించే దేశం చైనా.

ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మారుతున్నాయి.

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో శనివారం-ఆదివారం జరిగిన 10వ అరబ్-చైనా వ్యాపార సదస్సులో ఇరు దేశాలు తమ సంబంధాలకు కొత్త రూపును ఇచ్చేందుకు ప్రయత్నించాయి.

ఈ సదస్సులో రెండు దేశాల మధ్య రూ. 82,252 కోట్ల (10 బిలియన్ డాలర్లు) విలువైన ఒప్పందాలు కుదిరాయి.

గత వారమే భారత ప్రధాని నరేంద్ర మోదీ, సౌదీ అరేబియా ప్రధాని మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు.

ఇరాన్, సౌదీ అరేబియా మధ్య దౌత్య సంబంధాలను చైనా పునరుద్ధరించిన తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన మొదటి సంభాషణ ఇది.

ప్రధాని మోదీ, సౌదీ యువరాజు మధ్య చర్చలు జరిగిన తర్వాతే చైనాతో సౌదీ అరేబియా ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు చేసుకుంది.

దీనికంటే ముందు శ్రీనగర్‌లో జరిగిన జీ-20 సమావేశానికి సౌదీ అరేబియా తన ప్రతినిధిని పంపలేదు. జీ-20 సమావేశాన్ని శ్రీనగర్‌లో నిర్వహించడంపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత చైనా, సౌదీ అరేబియా, తుర్కియే, ఈజిప్ట్‌ దేశాలు తమ ప్రతినిధులను జీ-20 సమావేశానికి పంపలేదు.

ఈ సంవత్సరం జీ-20కి భారతదేశం అధ్యక్షత వహిస్తోంది. నవంబర్‌లో దిల్లీ వేదికగా జీ-20 శిఖరాగ్ర సమావేశం జరుగనుంది.

జిన్‌పింగ్‌తో సౌదీ యువరాజు

ఫొటో సోర్స్, Getty Images

అరబ్-చైనా సమావేశం సందర్భంగా, ఈ ఇరు దేశాల సంబంధాలపై పాశ్చాత్య దేశాలు చేస్తున్న విమర్శల గురించి సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి, ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్‌ను ప్రశ్నించగా, వాటిని ఆయన ఖండించారు.

"నేను వాటిని పట్టించుకోను. ఎందుకంటే ఒక వ్యాపారిగా మీరు మెరుగైన అవకాశం ఉన్న చోటుకే వెళతారు’’ అని ఆయన బదులిచ్చారు.

రెండింటిలో ఏదైనా ఒకదాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి మన ముందు ఎప్పుడూ ఉండకూడదని చెప్పారు.

దీని అర్థం ఏంటంటే, సౌదీ అరేబియాకు చైనా లేదా పశ్చిమ దేశాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడూ తలెత్తకూడదనే ఉద్దేశంతో ఆయన అలా వ్యాఖ్యానించారు.

కొన్ని రోజుల క్రితమే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, సౌదీ అరేబియాను సందర్శించారు. రియాద్‌లో ఇప్పుడు చైనా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తల బృందం ఉంది. సౌదీ అరేబియా మారుతున్న ప్రాధాన్యాల గురించి ఈ పరిణామాలు చాలా చెబుతాయి.

అయితే, ఇక్కడొక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది. ఒకవేళ సౌదీ అరేబియాకు చైనా చాలా సన్నిహితంగా మారితే, దాన్ని భారత్ ఎలా చూస్తుంది? ఇదే ఇక్కడ పుట్టుకొస్తున్న ప్రశ్న.

ఎందుకంటే, చైనాను భారత్ భద్రతా ముప్పుగా చూస్తుంది.

మధ్యప్రాచ్యంలో చైనా పురోగతి సాధిస్తున్న తీరుతో పోలిస్తే, ఈ విషయంలో భారత్ ఎక్కడ నిలిచింది? భారత్ ఎలా సన్నద్ధం అవుతోంది? అది దేశాన్ని ఎలా ప్రభావితం చేయనుంది?

సౌదీ అరేబియా

ఫొటో సోర్స్, Getty Images

సౌదీ-చైనా మధ్య బలమైన సంబంధాలు

మిడిల్ ఈస్ట్‌లోని రెండు ప్రత్యర్థి దేశాలైన ఇరాన్, సౌదీ అరేబియా ఇటీవల పరస్పరం స్నేహహస్తం చాచినప్పుడు ప్రపంచం అంతటా చైనా గురించి చర్చ మొదలైంది.

ఏడేళ్ల తర్వాత ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించడంలో చైనా కీలక పాత్ర పోషించింది. చైనా అత్యున్నత దౌత్యవేత్త వాంగ్ యీ ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించారు.

2016లో సౌదీ అరేబియాలో షియా మతగురువును ఉరితీసిన తర్వాత, తెహ్రాన్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలోకి ఇరాన్ నిరసనకారులు చొచ్చుకెళ్లారు. ఈ ఘటన తర్వాత ఇరాన్‌తో సౌదీ అరేబియా తన సంబంధాలను తెంచుకుంది.

దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలోని వెస్ట్ ఏషియన్ స్టడీస్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సుజాత ఐశ్వర్య మాట్లాడుతూ, చైనా ఇలా చేయడం వారి ముందుచూపును తెలియజేస్తోందన్నారు.

"సౌదీ అరేబియా, ఇరాన్‌ దేశాల మధ్య మాటలు ఉన్నాయి. కానీ, వాటి మధ్య ఒక గోడ ఉండేది. దాన్ని చైనా తొలగించింది’’ అని ఆమె చెప్పారు.

దీని తరువాత, 2022 డిసెంబర్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, సౌదీ అరేబియాలో పర్యటించారు. చైనా-సౌదీ దేశాల మధ్య చమురు లావాదేవీలు చైనా కరెన్సీ యువాన్‌లో జరగాలని ఆ సమయంలో జిన్‌పింగ్ డిమాండ్ చేశారు.

ప్రపంచంలో చమురు ఎగుమతి, దిగుమతులు ఎక్కువగా డాలర్లలో జరుగుతాయి. ఆయన చేసిన డిమాండ్ ఎలాంటిదంటే, నేరుగా డాలర్ బలంపై ప్రభావం చూపేది.

సౌదీ అరేబియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్

చైనా వైపు సౌదీ ఎందుకు మొగ్గుతోంది?

సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చమురు ఆధారిత తమ ఆర్థిక వ్యవస్థను మరింత విస్తరించేందుకు సౌదీ ప్రయత్నాలు చేస్తోంది.

సుజాత ఐశ్వర్య మాట్లాడుతూ, “సౌదీ చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ రాబోయే కాలంలో క్రమక్రమంగా బలహీనపడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ సన్నాహాలు జరుగుతున్నాయి. గత కొన్నేళ్లలో సౌదీ అరేబియా పెట్రో కెమికల్ రంగాన్ని చాలా ప్రోత్సహించింది. ఈ రంగం కూడా చమురు, గ్యాస్‌పై ఆధారపడుతుంది’’ అని చెప్పారు.

అరబ్-చైనా వ్యాపార సదస్సులో కుదిరిన కొత్త ఒప్పందాలను సౌదీ అరేబియా విదేశాంగ విధానంలో పెద్ద మార్పుగా అభిప్రాయపడ్డారు విదేశీ వ్యవహారాల నిపుణుడు కమర్ అఘా.

ఇప్పుడు సౌదీ అరేబియా బహుళ ధ్రువ ప్రపంచం వైపు వెళుతోందని ఆయన అన్నారు.

“చైనాతో పాటు రష్యాతో కూడా సౌదీ స్నేహం చేస్తోంది. భారత్‌తో కూడా వాళ్లకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, వారి విదేశాంగ విధానంలో జపాన్, దక్షిణ కొరియాలకు కూడా స్థానం ఉంది. తమ సంబంధాలను వారు ఒక దేశానికి పరిమితం చేయడం లేదు.

యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ కొత్త పాలసీని తెచ్చారు. ఇందులో కొత్త నగరాలను నిర్మించడం, విదేశీ పెట్టుబడులను తీసుకురావడం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వారికి చైనా ఒక ముఖ్యమైన దేశంగా కనిపిస్తోంది" కమర్ వివరించారు.

జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

గల్ఫ్ దేశాల్లో భయం

20 ఏళ్ల క్రితం ఇరాక్‌పై అమెరికా దండెత్తినప్పుడు, పశ్చిమాసియాలో ఇరాక్ ప్రధాన శక్తిగా ఉంది. కానీ, గడిచిన కొన్నేళ్లలో అమెరికా ఆధిపత్యం చెలాయించే స్థితిలో చాలా మార్పు వచ్చింది. అమెరికాను చైనా వెనక్కి నెట్టేస్తోంది.

యుక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత పశ్చిమాసియా దేశాలను ఒక కొత్త భయం వెంటాడుతోంది. ఈ భయానికి కేంద్ర బిందువు కూడా పశ్చిమ దేశాలే.

కమర్ ఆగా దీని గురించి మాట్లాడుతూ, ‘‘రష్యాపై అమెరికా ఏ రకంగా ఆంక్షలు విధించిందంటే, పశ్చిమ దేశాల్లో రష్యాకు చెందిన కోట్ల డాలర్ల పెట్టుబడి ప్రాజెక్టులు సీజ్ అయ్యాయి. దీంతో పశ్చిమాసియా దేశాల్లో భయం పెరిగింది. పాశ్చాత్య దేశాల్లో తమ డబ్బుకు భద్రత లేదని పశ్చిమాసియా దేశాలు భావిస్తున్నాయి. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ వంటి దేశాలకు బదులుగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాయి’’ అని అన్నారు.

అమెరికా సహా పాశ్చాత్య దేశాలు యుక్రెయిన్‌కు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ, రష్యాపై ఆంక్షలు విధించాయి. ఇలా యుద్ధంలో రష్యాను బలహీనపరిచేందుకు ప్రయత్నించాయి.

"పాశ్చాత్య దేశాలు ఆంక్షలను ఆయుధాలుగా ఉపయోగించుకుంటాయి. అందుకే పశ్చిమాసియా దేశాలు వాటిని చూసి భయపడుతున్నాయి" అని సుజాత ఐశ్వర్య అన్నారు.

మోదీ, జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

చైనా శిబిరంలోకి సౌదీ వెళ్తుందా?

విదేశీ వ్యవహారాల నిపుణుడు కమర్ ఆగా మాట్లాడుతూ, “చైనా శిబిరంలో సౌదీ అరేబియా చేరుతుందనుకోవడం పూర్తిగా తప్పు. అరబ్ దేశాల్లో చైనాకు మద్దతు లేదు. ఇప్పుడు కుదిరిన ఒప్పందం ఏంటంటే, రెండు దేశాల ప్రభుత్వాల మధ్య కుదిరిన సంబంధం మాత్రమే. చైనాలోని షిన్‌జియాంగ్‌లో ముస్లిం ప్రజలకు జరుగుతున్నదానితో అరబ్ దేశాల ప్రజలు చైనాను ఇష్టపడరు’’ అని ఆయన వివరించారు.

“భారత్, అరబ్ దేశాల సంబంధాలు నాగరికతల సంబంధాలు. ఇవి ముగుస్తాయని నేను ఎప్పటికీ అనుకోను. కరోనా మహమ్మారికి ముందు, గల్ఫ్ ప్రాంతంలో సుమారు 75 లక్షల మంది పనిచేశారు. సౌదీ అరేబియాలోనే దాదాపు 25 లక్షల మంది భారతీయులు ఉంటారు. అక్కడి జనాభా పరంగా చూస్తే దీన్ని భారీ సంఖ్యగా చెప్పొచ్చు’’ అని ఆయన అన్నారు.

సౌదీ అరేబియా

ఫొటో సోర్స్, BANDAR ALGALOUD/SAUDI ROYAL COURT/REUTERS

భారత్ ఆందోళన పెరుగుతుందా?

ఓవైపు డోక్లామ్ నుంచి గల్వాన్ వరకు భారత్-చైనా సరిహద్దుల్లో కొంతకాలంగా ఉద్రిక్తత పెరుగుతుండగా, మరోవైపు భారత్‌కు మిత్ర పక్షాలైన గల్ఫ్ దేశాలతో చైనా సంబంధాలను పటిష్టం చేసుకుంటోంది.

సుజాత ఐశ్వర్య మాట్లాడుతూ, ''భారత్ తమను తాము గ్రేట్ పవర్ అని చెప్పుకుంటున్నప్పటికీ, మనం ఏమీ చేయలేకపోతున్నాం. చైనా మన సంప్రదాయ భాగస్వామ్య (ట్రెడిషనల్ పార్ట్‌నర్) దేశాల్లో బిలియన్ డాలర్ల కొద్ది పెట్టుబడులు పెడుతోంది. ఇలా చేయడం ద్వారా భారతదేశ ప్రభావాన్ని తగ్గించాలని చూస్తోంది. ఎందుకంటే పెట్టుబడి పెరిగే చోట స్నేహం కూడా పెరుగుతుంది’’ అని అన్నారు.

చైనా తరహాలో గల్ఫ్ దేశాలతో భారత్ ఎందుకు పెద్ద పెద్ద ఒప్పందాలు చేసుకోలేక పోతుందనే ప్రశ్నకు సుజాత బదులిచ్చారు.

‘‘భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అన్ని ఆంక్షలను ఎదుర్కొన్న తర్వాత కూడా ఇరాన్ మనకంటే మెరుగైన స్థితిలో ఉంది. చైనా ఆర్థిక వ్యవస్థ సుమారు 17 ట్రిలియన్ డాలర్లు. భారత ఆర్థిక వ్యవస్థ సుమారు 3 ట్రిలియన్ డాలర్ల దగ్గర ఉంది. చైనా దగ్గర డబ్బు, నైపుణ్యం ఉన్నాయి. వాటిని ఉపయోగిస్తూ చైనా ముందుకు దూసుకెళ్తోంది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)