కోనసీమ: ఆయిల్, గ్యాస్ తవ్వకాలు స్థానికులను ఎందుకు భయపెడుతున్నాయి?

కోనసీమ బ్లో అవుట్
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లోని కేజీ బేసిన్ పరిధిలో విస్తృతంగా చమురు, సహజ వాయువు తవ్వకాలు జరుగుతున్నాయి. 50 ఏళ్ల క్రితమే ఇవి మొదలయ్యాయి. ఆఫ్ షోర్, ఆన్ షోర్‌లో కూడా వివిధ ఆయిల్ కంపెనీల కార్యకలాపాలు సాగిస్తుంటాయి.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా ఈ నిక్షేపాలున్నాయి. కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలలో కూడా వాటిని కనుగొన్నారు.

కేంద్ర ప్రభుత్వ చమురు, సహజ వాయువు శాఖ అంచనా ప్రకారం దాదాపు 698 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వలు కేజీ బేసిన్‌లో ఉన్నాయి.

2023 ఫిబ్రవరి నాటికి సగటున రోజుకు 20వేల బ్యారెల్స్ ముడి చమురు తవ్వుతున్నారు. మరో 9.8 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు కూడా ఉత్పత్తి అవుతోంది. వాటిని విస్తృతం చేసేందుకు ఓఎన్జీసీ సహా వివిధ కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి.

సుదీర్ఘ కాలంగా ఆయిల్, గ్యాస్ తవ్వకాలు జరుగుతున్న కోనసీమ ప్రాంతంలో వాటి వల్ల అక్కడి ప్రజలకు ఎంతమేరకు మేలు జరుగుతోందనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

ఇప్పటికే కొన్నిచోట్ల బ్లో-అవుట్లు, పైప్ లైన్ల పేలుళ్లు చవిచూసిన ప్రజలకు ఆశించిన లబ్ధి జరగకపోగా నష్టం జరుగుతుందనే వాదన బలపడుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో అసలేం జరుగుతోందని బీబీసీ క్షేత్రస్థాయిలో పరిశీలించింది.

బ్లోఅవుట్ ప్రమాదంలో నియంత్రణ చర్యలు
ఫొటో క్యాప్షన్, బ్లోఅవుట్ ప్రమాదంలో నియంత్రణ చర్యలు

‘‘ఆపరేషన్ చేయకపోతే ప్రమాదమంటున్నారు..’’

బ్లో అవుట్‌తో ఆరోగ్య సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నారో నగరం గ్రామానికి చెందిన మోహనకృష్ణ బీబీసీతో మాట్లాడారు.

"2014 జూన్ 27న ఉదయాన్నే మేమంతా నిద్రపోతుంటే మా నాన్న వచ్చి లేపారు. కంగారుగా బయటకు వచ్చేసరికి అంతా మంటలు. దట్టమైన పొగలు కూడా కనిపించాయి. ఆ మంటల్లో నా ఒళ్లంతా కాలిపోయింది. కాకినాడ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేశారు. అప్పుడు నా వయసు ఏడేళ్లు. మొన్న పదో తరగతి పరీక్షలు రాశాను. ఇప్పటికే మూడుసార్లు ప్లాస్టిక్ సర్జరీలు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆపరేషన్ చేయించాల్సిందేనంటున్నారు. ఇప్పటికీ నాకు ఎండలోకి వెళితే శరీరం మండిపోతుంది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే నరాలకు ప్రమాదమని డాక్టర్లు అంటున్నారు" అని ఆయన చెప్పారు.

మోహన కృష్ణతో పాటుగా ఆయన కుటుంబంలో తల్లీ, అన్న కూడా మంటల్లో చిక్కుకుని స్వల్పంగా గాయపడ్డారు. ఆ గ్రామానికి చెందిన 22 మంది చనిపోయారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఇదంతా జరిగి 9 ఏళ్లు అవుతోంది. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన పైప్ లైన్ పేలిపోయి ఈ ప్రమాదం జరిగింది. నేటికీ ఆ ప్రమాద ఛాయలు నగరం వాసుల్లో కనిపిస్తున్నాయి.

మోహన్ కృష్ణ వైద్యానికి అప్పట్లో గెయిల్ సంస్థ ద్వారా ఆర్థిక సహాయం అందింది. ఇప్పుడు కూడా తన సర్జరీకి గెయిల్ సహాయం అందించాలని ఆయన కోరుతున్నారు.

ఆయననొక్కరే కాదు, నాటి గాయాలు పూర్తిగా మానకుండా, నిత్యం వేదనకు గురవుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.

మోహనకృష్ణ
ఫొటో క్యాప్షన్, మోహనకృష్ణ

పదుల గ్రామాల్లో ఇదే పరిస్థితి...

గెయిల్ పైప్ లైన్ ప్రమాదం తర్వాత కొంతకాలం విరామంతోనే కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. యథావిధిగా డ్రిల్లింగ్, తరలింపు జరుగుతోంది. కానీ నాటి కష్టాల నుంచి తాము పూర్తిగా గట్టెక్కలేదని బాధితులు అంటున్నారు.

ఒక్క నగరం వాసులే కాదు..ఆ జిల్లా పరిధిలో పదుల గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. చాలా రోజులు సాగిన పాశర్లపూడి బ్లో-అవుట్ నుంచి 2020 ఫిబ్రవరి నాటి ఉప్పూడి బ్లో అవుట్ వరకూ అనేక చోట్ల గ్యాస్ లీక్ కారణంగా ఏర్పడిన ప్రమాదాలు సృష్టించిన భయాలు వారిని వెంటాడుతున్నాయి. పలు చోట్ల పైప్ లైన్ లీకేజీల కారణంగా ప్రమాదాలకు గురైన వారు చాలాచోట్ల కనిపిస్తుంటారు.

కోనసీమ ప్రాంత ప్రజల్లో ఇప్పటికీ భయం తొలగిపోలేదని గ్రామ సర్పంచ్ జాలెం సుబ్బారావు బీబీసీతో అన్నారు.

"ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతాం. ఇప్పటికీ తగు జాగ్రత్తలు పాటిస్తున్నారా అంటే అనుమానమే. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోననే ఆందోళన వెంటాడుతూనే ఉంది. ఆనాటి ప్రమాదం గుర్తుకొస్తే కంటి మీద నిద్రకూడా పట్టదు. గెయిల్ యాజమాన్యం ఇచ్చిన హామీలు కూడా పూర్తిగా నెరవేర్చలేదు. నగరం ప్రమాదం తర్వాత స్థానికంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కడతామని, ఫైర్ ఇంజిన్లు అందుబాటులో ఉంచుతామని కూడా చెప్పారు. అవి నెరవేరలేదు. 11 హామీలు ఇచ్చి సగమే పూర్తి చేశారు" అని ఆయన వివరించారు.

నగరంలో గెయిల్, ఓన్జీసీ రిపైనరీలు జాతీయ రహదారికి చేరువలోనే పని చేస్తుంటాయి. వాటి నుంచి వెలువడే వాయువుల కారణంగా స్థానిక ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని సర్పంచ్ చెబుతున్నారు.

కోనసీమ బ్లో అవుట్

పైప్ లైన్ లీకులు తగ్గాయి...

నగరం ప్రమాదం దేశంలోనే చర్చనీయాంశమయ్యింది. ఆయిల్, గ్యాస్ తవ్వకాలు జరిపిన తర్వాత రిగ్గులు, పైప్ లైన్ల నిర్వహణ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో గెయిల్ సంస్థకు చెందిన పైప్ లైన్లు చాలా వరకూ ఆధునీకరించారు.

ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వంటి సంస్థలు కూడా రక్షణ చర్యలు ముమ్మరం చేశారు. కేజీ బేసిన్ పరిధిలో రిలయన్స్, కెయిర్న్స్ ఎనర్జీ, వేదాంత వంటి కంపెనీలు కూడా తవ్వకాలు జరుపుతున్నాయి.

ఓఎన్జీసీ ఆధ్వర్యంలో రోజుకు మరో 10వేల బ్యారెళ్ల చమురు తవ్వకాలకు రంగం సిద్ధమయ్యింది. గ్యాస్ కూడా రోజూ 2 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల చొప్పున వెలికితీస్తామని ఓఎన్జీసీ వెల్లడించింది. ఈ మే నెల నుంచి మొదలయ్యి క్రమంగా విస్తరిస్తామని ప్రకటించింది. అయితే ఇదంతా సముద్రగర్భంలో జరుగుతుంది.

అయినప్పటికీ ఆయిల్ అండ్ గ్యాస్ తరలింపు కోసం ఏర్పాటు చేసిన పైప్ లైన్ల కారణంగా తరచుగా ప్రమాదాలు వెలుగులోకి వస్తూ ఉండేవి. కానీ గడిచిన రెండు మూడేళ్లుగా తీసుకున్న జాగ్రత్తల వల్ల వాటిని నియంత్రించగలిగినట్టు ఆయిల్ సంస్థలు చెబుతున్నాయి.

"కోనసీమలో వారానికి ఒకటి రెండు చోట్ల గ్యాస్ లీక్, చమురు లీక్ అంటూ వార్తలు వచ్చేవి. చిన్న చిన్న ప్రమాదాలు కూడా తరచు జరిగేవి. కానీ పైప్ లైన్లను మార్చడం వల్ల చాలా వరకు ప్రమాదాలను నియంత్రించగలిగాం. ప్రస్తుతం రక్షణ చర్యలు కూడా ముమ్మరమయ్యాయి. ప్రజల్లో అపోహలు కూడా తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా సమస్యలుంటే సరిచేసే ప్రయత్నం జరుగుతుంది" అని ఇంజనీర్ రవి ప్రకాష్ అన్నారు.

కోనసీమ బ్లో అవుట్

కంపెనీలదే ప్రధాన బాధ్యత

ఆయిల్, గ్యాస్ తవ్వకాల కారణంగా కోనసీమలో కొబ్బరి, వరి పంటల దిగుబడుల మీద కూడా ప్రభావం పడుతుందనే వాదన ఉంది. కంపెనీలు మాత్రం దానిని తోసిపుచ్చుతున్నాయి. నేల గుల్లబారి సహజ స్వభావం కోల్పోతుందనే ఆందోళన గతంలో పలువురు పరిశోధకులు కూడా వ్యక్తం చేశారు. సముద్రం ఆటుపోట్లకు ముఖ్యంగా కొన్నిచోట్ల తీవ్రంగా కోతగురికావడం, మరికొన్ని చోట్ల సముద్రం వెనక్కి తరలిపోవడం వంటి పరిణామాలకు కూడా దారితీస్తుందనే ఓ అభిప్రాయం ఉంది. వాటిని శాస్త్రీయంగా నిర్ధరించలేమని భూగర్భ శాస్త్రవేత్తలు ప్రకటించారు.

ఆయిల్ కంపెనీలు తగిన జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యం కారణంగానే అనేక ప్రమాదాలు జరిగాయని పరిశోధకుడు ప్రొఫెసర్ కృష్ణప్రసాద్ అన్నారు.

“గ్యాస్ లేదా ఆయిల్ తవ్వకాల కోసం తవ్విన బావులను కొంత కాలం పాటు మూసివేసి, తిరిగి తవ్వకాలు ప్రారంభించినప్పుడు ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అంతేగాకుండా గ్యాస్ సరఫరాలో కూడా అజాగ్రత్తలు కనిపిస్తున్నాయి. గ్యాస్‌తో పాటుగా పైప్ లైన్‌లో మెర్‌కేప్టన్ కూడా కలిపి తరలించాలి. ఎక్కడయినా లీక్ అయితే తక్షణమే గ్యాస్ వాసన వస్తుంది. సామాన్యులు కూడా గుర్తించి, ప్రమాద నివారణకు ఆస్కారం ఉంటుంది. దీనిని గ్యాస్ కంపెనీల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా అందుకు చర్యలు తీసుకోవడం లేదు. వ్యాపార ప్రయోజనాలే తప్ప స్థానిక ప్రజల భద్రతకు ప్రాధాన్యతనివ్వడం లేదు” అని ఆయన బీబీసీతో అన్నారు.

కంపెనీల తప్పిదాల కారణంగానే బ్లో అవుట్లు, పైప్ లైన్ల పేలుడు సంభవించిన చరిత్ర ఉందని, దానిని సరిదిద్దేందుకు తగిన యంత్రాంగం అవసరమని కృష్ణ ప్రసాద్ అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, కాకినాడ: ప్రపంచ బియ్యం ఎగుమతుల హబ్‌గా మారుతోందా

సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి ..

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఆరు కంపెనీల కార్యకలాపాలు జరుగుతున్నాయి. అందులో ఆఫ్‌ షోర్, ఆన్ షోర్ కూడా కార్యకలాపాలు ఉన్నాయి. దాదాపుగా అన్ని మండలాల్లోనూ ఆయా కంపెనీలు డ్రిల్లింగ్ చేసి తవ్విన రిగ్గులు దర్శనమిస్తాయి. అయితే ఇటీవల తగినంత ఉత్పత్తి జరగని కారణంగతా పలు బావులు మూతవేస్తున్నారు.

వివిధ కంపెనీల టర్నోవర్‌పై 2 శాతం చొప్పున అందిస్తున్న సీఎస్ఆర్ నిధులతో జిల్లా అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతోందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధికారులు బీబీసీకి తెలిపారు.

"ఆరు కంపెనీలున్నాయి. ఏటా సీఎస్ఆర్ నిధులు జమచేస్తున్నారు. రోడ్లు, మంచినీటి కల్పన, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాము. వరదల నుంచి కోనసీమను కాపాడేందుకు అనుగుణంగా అనేక చర్యలు తీసుకున్నాం. జిల్లా అభివృద్ధికి ఆయా కంపెనీలు తోడ్పడుతున్నాయి" అని డీఆర్వో చిట్టిబాబు తెలిపారు.

"ప్రమాదాల ముప్పు ఉంది. అందుకు తగ్గట్టుగా అప్రమత్తమవుతున్నాం. ప్రజల్లో కూడా అవగాహన పెంచుతున్నాం. ఎన్టీఆర్ఎఫ్ బృందాలతో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాం. చిన్న ప్రమాదం తలెత్తగానే ప్రజలు ఏవిధంగా వ్యవహరించాలన్నది వివరిస్తున్నాం. తద్వారా నష్టనివారణకు అవకాశం ఉంటుంది. ఆయిల్ కంపెనీల విస్తరణలో పర్యావరణ నిబంధనలన్నీ పాటిస్తున్నాం" అని డీఆర్వో వివరించారు.

ఆయిల్, గ్యాస్ తవ్వకాల కోసం మరింత విస్తృతంగా వివిధ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్న దశలో, కోనసీమ వాసుల భయాందోళనలను గమనంలో ఉంచుకుని, తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.

వీడియో క్యాప్షన్, కోనసీమ రైల్వే లైన్ కార్యరూపం దాల్చడం లేదెందుకు

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)