కేరళ బోటు ప్రమాదం: 'మా కుటుంబంలో 11 మంది చనిపోయారు.. వాళ్లంతా చివరి క్షణంలో పడవ ఎక్కారు'

సాయితలవి

ఫొటో సోర్స్, NEBULA MP/BBC

    • రచయిత, సంతోష్ క్రిస్టీ
    • హోదా, బీబీసీ కోసం

మే 7 ఆదివారం సాయంత్రం అంబులెన్సులు తమ ఊరిలోని ఏరు వైపు వెళుతుండడం చూసి కంగారుపడ్డారు కున్నుమ్మల్ సాయితలవి.

కేరళకు చెందిన 48 ఏళ్ల సాయితలవి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తూనే ఉన్నారు కానీ, స్పందన లేదు.

"మూడు నంబర్లకు ఫోన్ చేశాను. ఎవరూ ఎత్తలేదు" అని చెప్పారాయన.

ఆ రాత్రి సాయితలవికి కాళరాత్రిగా మిగిలింది.

ఆయన కుటుంబంలో పలువురు సభ్యులు తూవల్ తీరం అనే ప్రాంతానికి విహారానికి వెళ్లారు. ఇది మళప్పురం జిల్లాలోని తానూర్ తీరంలో ఉన్న ప్రముఖ పర్యటక కేంద్రం.

అదే రోజు టూరిస్ట్ బోటు తిరగబడి 22 మంది చనిపోయారు. వారిలో సాయితలవి భార్య, నలుగురు పిల్లలు సహా 11 మంది కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

సాయితలవి, ఆయన తమ్ముడు కున్నుమ్మల్ సిరాజ్ కుటుంబాలు పుత్తన్‌కడప్పురంలోని సొంతింట్లో కలిసి ఉంటున్నాయి. సాయితలవి తల్లి కూడా వాళ్లతోనే ఉంటున్నారు. ఆ ఊరికి తూవల్ తీరం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది.

సాయితలవి, సిరాజ్‌ల తోబుట్టువు నుస్రత్ వాళ్ల ఇంటికి వచ్చారు. అందరూ కలిసి తూవల్ తీరానికి పిక్నిక్‌కు వెళ్లారు.

వాళ్ల దత్త తమ్ముడు కున్నుమ్మల్ జబీర్ కుటుంబం, పొరుగున ఉండే ఆషిఫా, ఆమె పిల్లలిద్దరూ కూడా వీళ్లతో పాటు పిక్నిక్‌కు వెళ్లారు.

మొత్తం 19 మంది మే 7 సాయంత్రం ఈ విహారయాత్రకు వెళ్లారు.

సాయితలవి కూడా ఆ ప్రదేశానికి వెళ్లి, కుటుంబంతో కొంతసేపు గడిపాక, మరొక స్నేహితుడిని కలవడానికి వెళ్లిపోయారు.

"బోట్ రైడ్‌కు వెళ్లొద్దని వాళ్లకు చెప్పాను. ఆ సమయంలో పడవలో షికారు సురక్షితం కాదని హెచ్చరించాను" అన్నారు సాయితలవి.

కేరళ

ఫొటో సోర్స్, NEBULA MP/BBC

'ఇంటికి వచ్చేద్దామనుకుంటూ ఉండగా.. '

ఆ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేద్దామనుకుంటుండగా, బోటు నిర్వాహకులు టికెట్లపై భారీ డిస్కౌంట్ ఇచ్చారని, పిల్లలకు ఫ్రీ టికెట్లు ఇచ్చారని ఆషిఫా చెప్పారు.

"వాళ్లిచ్చిన ఆఫర్ చూసి ఆశపడ్డాం. కానీ, అది అంత సురక్షితం కాదనిపించి నేను మనసు మార్చుకున్నాను. బోటు ఎక్కలేదు" అని ఆమె చెప్పారు.

సాయితలవి కుటుంబం ఒక డబుల్ డెకర్ బోటు ఎక్కారు.

ఆషిఫా, ఆమె ఇద్దరు పిల్లలు ఒడ్డునే ఉండిపోయారు. బోటులో షికారుకు వెళ్లిన వారి రాక కోసం ఎదురుచూస్తున్న ఆమెకు బోటు తిరగబడిన వార్త తెలిసింది.

"ఆ వార్త విని నాకు కాళ్లూ చేతులూ ఆడలేదు" అన్నారామె.

బోటు సామర్థ్యానికి రెట్టింపుగా 50 మందిని ఎక్కించుకున్నట్టు సమాచారం.

సాయంత్రం చీకటి పడ్డాక, బోటును నీళ్లలోకి తీసుకెళ్లడానికి నిర్వాహకులకు అనుమతి లేదని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రిక ఒక కథనంలో తెలిపింది.

సామార్థ్యానికి మించి జనాన్ని ఎక్కించుకోవడ వల్లే బోటు తిరగబడిందని అధికారులు చెబుతున్నారు.

స్నేహితుడి ఇంట్లో ఉన్న సాయితలవి ఎన్ని ఫోన్లు చేస్తున్నా ఎవరూ ఎత్తకపోవడంతో సందేహం వచ్చి ఏరు దగ్గరకు పరిగెత్తారు.

"నా కుటుంబానికి కీడు జరిగిందని శంకించాను" అన్నారు సాయితలవి.

బోటు ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

మేనకోడలి మృతదేహం చేతికి చిక్కింది

తీరానికి చేరుకుని, అక్కడి నుంచి ఒక చిన్న బోటు తీసుకుని ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లారు.

"మేం అక్కడికి చేరుకునేటప్పటికే చాలామంది సహాయక చర్యలు అందిస్తున్నారు. సాయితలవి చాలా భయపడ్డారు" అని ఆయన స్నేహితుడు ఎన్‌పీ కోయా చెప్పారు.

తన కుటుంబం బోటు కింద చిక్కుకుపోయిందని సాయితలవికి గట్టిగా అనిపించింది. వెంటనే నీళ్లలోకి దూకారు. ఒక మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. అది తన మేనకోడలిది.

"మేనకోడలి మృతదేహాన్ని చూడగానే సాయితలవికి పూర్తిగా నమ్మకం పోయింది" అని కోయా చెప్పారు.

షాక్‌లో ఉన్న ఆయన్ను ఎలాగో ఒడ్డుకు తీసుకొచ్చారు.

సాయితలవికి నలుగురు కూతుళ్లు, ఆయన తమ్ముడు సిరాజ్‌‌కు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వాళ్లల్లో ఎనిమిది నెలల పసిపాప కూడా ఉంది.

అన్నదమ్ములిద్దరి భార్యలూ, పిల్లలందరూ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మరో తమ్ముడు జబీర్ భార్య, కొడుకు కూడా మరణించారు.

బోటు ప్రమాదం

ఫొటో సోర్స్, NEBULA MP/BBC

నలుగురే బతికారు

మొత్తం కుటుంబంలో కేవలం నలుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. సాయితలవి చెల్లి నుస్రత్, ఏడాదిన్నర వయసున్న వాళ్ల పాప ఆయిషా, ఇద్దరు జబీర్ పిల్లలు జర్షా, జన్నా. వీళ్లు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సాయితలవికి తన కూతుళ్లంటే ప్రాణమని, వాళ్లే తన బలమని ఆయన మేనకోడలు ఉమ్ము హబీబా కేపీ చెప్పారు.

"బాగా చదువుకుని, మంచి ఉద్యోగాలు తెచ్చుకుని నాన్నకు తోడుగా ఉంటామని వాళ్లు చెబుతుండేవారు" అన్నారామె.

ఆయన పెద్ద కూతురు హసన్ డాక్టర్ కావాలని కలలు కనేవారు. స్కూల్ ఫైనల్ పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఈ ప్రమాదం జరిగింది.

మూడేళ్లుగా కొత్త ఇల్లు కట్టుకుందామని వాళ్ల కుటుంబం ప్రయత్నిస్తోంది. ఇంట్లో సభ్యులు ఎక్కువ కావడంతో ఇల్లు చాలట్లేదని, పిల్లలు వంటింట్లో పడుకుంటున్నారని హబీబా చెప్పారు.

"ఆ పిల్లలు అన్ని ఆశలు, కలలు వదిలి వెళ్లిపోయారు" అన్నారామె.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)