అచ్యుతాపురం గ్యాస్ లీక్: దుస్తుల పరిశ్రమలో విష వాయువులు ఎలా విడుదలయ్యాయి? దీని వెనుక ఏముంది

బ్రాండిక్స్ కంపెనీ
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ‘బ్రాండిక్స్‌ అప్పారెల్ సిటీ’లోని ‘బ్రాండిక్స్ సీడ్స్’ దుస్తుల కంపెనీలో వరుసగా గ్యాస్ లీక్ ప్రమాదాలు జరుగుతున్నాయి.

సరిగ్గా రెండు నెలల కిందట(జూన్ 3న) ఇదే ‘బ్రాండిక్స్ సీడ్స్‌ కంపెనీ’లో గ్యాస్‌ లీకై 400 మందికి పైగా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.

తాజాగా ఆగస్ట్ 2న జరిగిన గ్యాస్ లీక్ ఘటనలో 121 మంది అస్వస్థత పాలయ్యారు. అందులో 9 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

మొదటి ప్రమాదం జరిగిన మూడు రోజులకి అంటే జూన్ 5న కూడా స్వల్పంగా గ్యాస్ లీకై కొంతమంది అసుపత్రిలో చేరారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదాల్లో ఉద్యోగుల ప్రాణాలకు ఎలాంటి హాని కలుగలేదు.

కానీ, ప్రమాద సమయంలోని దృశ్యాలు మాత్రం తీవ్రమైన ఆందోళన కలిగించాయి. ఏ వాయువు పీల్చడం వల్ల కార్మికులు అనారోగ్యానికి గురయ్యారో వైద్యులు, అధికారులు స్పష్టంగా వెల్లడించలేదు.

అచ్యుతా పురం గ్యాస్ లీకేజీ

జూన్ 3న ఏం జరిగిందో, ఆగస్టు 2న కూడా అదే జరిగింది

గ్యాస్ లీకైన అరగంట తర్వాత అందులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడటం మొదలైంది.

వెంటనే వారిని సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులతో పాటు అనకాపల్లి జిల్లాలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ సమయంలో ఉద్యోగులు అందరూ వాంతులు, తల తిరగడం, చర్మంపై దురదలు వంటి సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

వీరందరినీ ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు, ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీక్ సంఘటనని గుర్తుకు తెచ్చాయి.

జూన్ 3న జరిగినట్లుగానే ఆగస్టు 2న కూడా బ్రాండిక్స్ సీడ్స్ కంపెనీలో ప్రమాదం జరిగింది.

మూసేయమన్న కంపెనీలో ప్రమాదం ఎలా జరిగింది?

జూన్ 3న సీడ్స్‌ కంపెనీలో గ్యాస్ లీక్ వల్ల 200 మందికిపైగా మహిళా ఉద్యోగులు అస్వస్థత పాలయ్యారు. కొందరు ఆ రోజే ప్రాథమిక చికిత్స తర్వాత డిశ్చార్జ్ కాగా, మరికొందరు రెండు రోజులపాటు చికిత్స పొందారు. ఎవరికీ ప్రాణహాని కలుగలేదు.

సమీపంలో ఉన్న పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ నుంచి అమ్మోనియా వాయువు విడుదల కావడం వల్లే సీడ్స్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు.

ఈ రెండు కంపెనీల నుంచి నమూనాలు సేకరించి పరీక్షకు పంపించారు. విచారణ పూర్తయ్యేవరకు సీడ్స్, పోరస్ కంపెనీలు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు.

అలా మూసివేయమని ఆదేశాలు ఇచ్చిన సీడ్స్ కంపెనీలోనే ఆగస్టులో మళ్లీ ప్రమాదం జరిగింది.

బ్రాండిక్స్ కంపెనీ

నోటీస్ ఇచ్చినా మూసేయలేదా?

బ్రాండిక్స్ సీడ్స్ కంపెనీ నుంచి సేకరించిన గ్యాస్‌ నమూనాలను ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ)కి పంపించారు.

ఆ నివేదికలు వచ్చినా ప్రభుత్వం బయట పెట్టలేదు. ఇంతటి ప్రమాదానికి దారి తీసిన వాయువు ఏమిటో కూడా నిర్ధరించలేదు. ఇప్పుడు కంపెనీలో మళ్లీ విష వాయువుల లీకేజ్ కలకలం సృష్టించింది.

కంపెనీని మూసేయాలని నోటీసులిచ్చిన విషయాన్ని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వద్ద బీబీసీ ప్రస్తావించగా.. నోటీసులిచ్చిన తరువాత రెండు నెలల సమయం ఉంటుందని, ఈలోగానే మళ్లీ ప్రమాదం జరగడంతో ఇప్పుడు తక్షణం మూసివేయాలని ఆదేశాలిచ్చామని చెప్పారు.

''మొదటి ప్రమాదం, ఏసీ డెక్‌లలో క్రిమిసంహారక మందులు కలవడం వల్ల జరిగినట్లు తేలింది. ఆ ప్రమాదంలో క్లోరోఫైరిఫాస్ (Chlorpyrifos) అనే రసాయనం వెలువడినట్టు తెలిసింది.

ఈసారి ప్రమాదం ఎలా జరిగిందో ఇంకా నిర్ధరించాల్సి ఉంది. పరిశ్రమలకు సేఫ్టీ ఆడిట్ ముఖ్యం. లేనిపక్షంలో ఆయా కంపెనీలపై చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు (ఆగస్ట్ 2) జరిగిన గ్యాస్ లీక్ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ చేస్తాం.

గ్యాస్ లీకైన ప్రదేశంలోని నమూనాలు ల్యాబ్‌కు పంపుతున్నాం" అని పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ తెలిపారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 1
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 1

విషవాయువులే బ్రాండిక్స్ ప్రమాదానికి కారణమా?

దుస్తులు కుట్టే పరిశ్రమలో విష వాయువులు ఉంటాయా? అసలు ఇక్కడ ప్రమాదకరమైన రసాయనాలతో పని ఉంటుందా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

‘బ్రాండిక్స్ అప్పారల్ సిటీ’లో అన్నీ దుస్తుల తయారీ పరిశ్రమలే ఉన్నాయి. ఈ ప్రాంగణంలో 21వేల మంది కార్మికులు, ఉద్యోగులు పని చేస్తుంటారు.

"అప్పారల్ సిటీని ఆనుకునే ఫార్మా కంపెనీ ఉండటంతో సమస్య మూలం అక్కడే ఉందని కాలుష్యం నియంత్రణ మండలి ప్రాథమికంగా అంచనా వేసింది. కానీ, పొరుగు కంపెనీ నుంచి వెలువడిన విషవాయువుల ప్రభావం విండ్ డైరెక్షన్ ప్రకారం చూసుకుంటే అందరి మీదా కనిపించాలి. కానీ, సీడ్స్ కంపెనీలో ఉన్న కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ప్రభావితం అయ్యారు. ఈ ఘటనపై అనేక కోణాల్లో పరిశీలన తర్వాత ఏసీల ద్వారానే విషవాయువులు వెలువడేందుకు ఆస్కారం ఉందని తేలింది'' అని పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ తెలిపారు.

రెండోసారి ప్రమాదం జరగడంతో వెంటనే ఫ్యాక్టరీని మూసివేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

అచ్యుతా పురం గ్యాస్ లీకేజీ

'ఎ' షిఫ్ట్ సేఫ్, బి-షిఫ్ట్ లో ప్రమాదం

'ఎ' షిఫ్ట్ విధులకు వెళ్లిన మహిళా ఉద్యోగులు బ్రాండిక్స్ పార్కులో మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా విధులు నిర్వహించారు. బి-షిఫ్ట్ లో సాయంత్రం 7 గంటల సమయంలో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోలేని పరిస్థితులు ఏర్పడటంతో భయంతో పరుగులు తీశారు.

ఈ సమయంలో సీడ్స్ కంపెనీలో 2,100 మంది పనిచేస్తున్నారు. విషవాయువుల తీవ్రత పెరగడంతో కంపెనీ లోపల ఉంటే చనిపోతామనే భయంతో పరుగులు తీశారు.

"ఏం జరిగిందో తెలియదు. ఒక్కసారిగా వికారంగా అనిపించిది. వాంతులు, తల తిరగడం మొదలైంది. నా కళ్ల ముందే కొందరు పడిపోయారు. కాసేపటికి నేను కూడా పడిపోయాను. ఇప్పుడు నేను ఆసుపత్రిలో ఉన్నాను. గతంలో కూడా ఇలాగే జరిగింది. ఇకపై ప్రమాదాలు జరగవని అన్ని రకాల ఏర్పాట్లు చేశామని యాజమాన్యం మాతో చెప్పింది. కానీ, మళ్లీ ప్రమాదం జరిగింది. మాకు చాలా భయమేస్తుంది" అని గ్యాస్ లీకేజ్ బాధితురాలు కనకదుర్గ బీబీసీతో చెప్పారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 2
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 2

పాలిమర్స్ ఘటన తర్వాత కూడా ప్రభుత్వం కళ్లు తెరవలేదు

విశాఖపట్నంలో రెండేళ్ల కిందట ఎల్జీ పాలీమర్స్‌లో స్టైరిన్‌ విషవాయువు లీకై 12 మంది మరణించారు. 1000మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు.

"ఇప్పుడు సరిగ్గా అటువంటి ఘటనే బ్రాండిక్స్ అప్పారల్ సిటీలోనూ జరిగింది. బ్రాండిక్స్‌లో ప్రమాదానికి కారణమైన వాయువులు ఏసీల నుంచి వచ్చాయని మంత్రి చెబుతున్నారు. ఏసీల్లో ఉపయోగించే గ్యాస్ వల్లే ఈ ఘటన జరిగిందా? ఏసీల్లో ఫ్రియోన్ అనే గ్యాస్ వాడతారు. ఇది పర్యావరణ హితమైనదని అంటారు. ఏసీలోని గ్యాస్ వల్ల ఈ స్థాయి ప్రమాదాలు జరిగే అవకాశాలు స్వల్పమని రసాయన శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఏదైనా రసాయనిక చర్య జరిగిందా? జరిగితే ఏ కెమికల్స్ వాడారు? ఎటువంటి జాగ్రత్తలు పాటించారు? నిపుణుల కమిటీతో వీటిపై విచారణ జరిపించి వాస్తవాలు బయటపెట్టాలి" అని అనకాపల్లి జిల్లా సీఐటీయూ కార్యదర్శి శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.

బ్రాండిక్స్ కంపెనీ

బ్రాండిక్స్‌పై కేసు నమోదు

అచ్యుతాపురం పోలీస్ స్టేషన్‌లో దుప్పుటూరు రెవెన్యూ అధికారులు, బ్రాండిక్స్ గ్యాస్ లీక్ ఘటనపై ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుతో పోలీసులు బ్రాండిక్స్‌పై కేసు నమోదు చేశారు.

ఐపీసీ 336, 337 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ ఎస్కే గఫూర్ తెలిపారు.

ప్రస్తుతం బ్రాండిక్స్ కంపెనీలో ఎలాంటి పనులు జరగడం లేదని, అక్కడ పోలీసుల పహారా ఉందని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)