పోఖ్రాన్ II: అమెరికా కళ్లుగప్పి వాజ్‌పేయి అణు పరీక్షలు ఎలా నిర్వహించారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన రోజుల వ్యవధిలోనే కొత్త ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయిని మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు కలిశారు.
''మెటీరియల్ సిద్ధంగా ఉంది. మీరు ముందుకెళ్లొచ్చు'' అని పీవీ చెప్పారు.
పార్లమెంట్‌లో విశ్వాస పరీక్ష నెగ్గిన పదిహేను రోజుల్లోనే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ రాజగోపాల చిదంబరంలను వాజ్‌పేయి పిలిపించారు. అణు పరీక్షకు సిద్ధం కావాలని ఆదేశించారు.
అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు దక్షిణ అమెరికా దేశాల్లో పర్యటించాల్సి ఉంది. కొద్ది రోజులు ఆ పర్యటనను వాయిదా వేసుకోవాలని సమాచారం అందించారు.
అలాగే, ఏప్రిల్ 27న డాక్టర్ చిదంబరం కూతురి వివాహం కూడా జరగాల్సి ఉంది. చిదంబరం లేకపోవడం వల్ల ఆ వివాహం కూడా కొద్ది రోజులు వాయిదా పడింది. ఈ పరిణామాలు ఏదో భారీ పరిణామం జరగబోతోందన్న సంకేతాలిచ్చాయి.
1998 మే 11వ తేదీ బుద్ధ పూర్ణిమ రోజు అణు పరీక్ష జరపాలని డాక్టర్ అబ్దుల్ కలాం సూచించారు.

ఫొటో సోర్స్, HARPER AND COLLINS
శాస్త్రవేత్తలకు ఆర్మీ యూనిఫాం
పోఖ్రాన్ II అణు పరీక్షలు నిర్వహించాలని భారత్ నిర్ణయం తీసుకున్నట్టు 1998 ఏప్రిల్ 20న బాబా అటామిక్ రీసర్చ్ సెంటర్(బార్క్)లోని కీలక శాస్త్రవేత్తలకు సమాచారం అందింది. ఆ తర్వాత వారు చిన్న చిన్న గ్రూపులుగా పోఖ్రాన్‌కు బయల్దేరారు.
ఒక సదస్సుకు హాజరయ్యేందుకు దిల్లీ వెళ్తున్నామని, 20 రోజుల వరకూ ఫోన్‌కు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని వారు వాళ్ల భార్యలకు చెప్పారు.
ఆ మిషన్‌ను సీక్రెట్‌గా ఉంచేందుకు శాస్త్రవేత్తలు మారుపేర్లతో ప్రయాణాలు చేశారు. పోఖ్రాన్‌కు నేరుగా వెళ్లకుండా వేర్వేరు ప్రదేశాల మీదుగా అక్కడికి చేరుకున్నారు. బార్క్, డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)కి చెందిన 100 మంది శాస్త్రవేత్తలు అక్కడ కలుసుకున్నారు.
పోఖ్రాన్‌కు వచ్చిన శాస్త్రవేత్తలు ధరించేందుకు ఆర్మీ దుస్తులు అందజేశారు. చెక్కలతో నిర్మించిన చిన్న చిన్న గదులను వారికి కేటాయించారు. అందులో సింగిల్ బెడ్ మాత్రమే ఉంది.
బిగుతుగా ఉండే ఆర్మీ దుస్తులు ధరించేందుకు శాస్త్రవేత్తలు ఇబ్బంది పడ్డారు.

ఫొటో సోర్స్, HARPERCOLLINS
కోడ్ నేమ్ 'క్యాంటీన్ స్టోర్స్'
అణు బాంబులకు 'క్యాంటీన్ స్టోర్స్' అనే కోడ్‌నేమ్ ఇచ్చారు. బాంబు పేలుళ్లకు అనుమతులు వచ్చినా, ముంబయిలో భూమిలోపల వాల్ట్‌లో దాచిన బాంబులను పోఖ్రాన్‌కు తరలించడం పెద్ద సమస్యగా మారింది.
ఈ వాల్ట్‌లను 1980లలో నిర్మించారు. ఏడాదికి ఒక్కసారి విశ్వకర్మ పూజ రోజున మాత్రమే వాటిని తెరిచేవారు.
ఆ రోజు శాస్త్రవేత్తలు, అక్కడ పనిచేసే సిబ్బంది పూజలు నిర్వహించేవారు. బార్క్‌ను సందర్శించేందుకు ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆ వాల్ట్‌లను చూపించేవారు.
ఒకసారి ఆర్మీ చీఫ్ జనరల్ సుందర్‌జీ వచ్చినప్పుడు వాల్ట్‌ను చూపించారు. బంతి రూపంలో తయారు చేసిన ఆరు ప్లూటోనియం బాంబులను ఆయన గమనించారు. అవి సాధారణ టెన్నిస్ బాల్ కంటే కొంచెం పెద్దగా ఉన్నాయి.
ఆ బంతుల బరువు మూడు నుంచి ఎనిమిది కేజీల లోపే ఉంది. వాటన్నింటినీ ఒక బ్లాక్ బాక్స్‌లో పెట్టి ఉంచారు. ఆ బ్లాక్ బాక్స్ యాపిల్ పండ్లు పెట్టే అట్టపెట్టెలా ఉంది. పోఖ్రాన్‌కు తరలించేటప్పుడు పేలుడు పదార్థాలకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా ప్యాకింగ్ చేశారు.
సొంత భద్రతా సిబ్బందికి ఈ విషయాలు చెప్పకుండా ఈ షెల్స్‌ను అక్కడి నుంచి తరలించడం బార్క్ శాస్త్రవేత్తలకు పెద్ద తలనొప్పిగా మారింది.
దక్షిణాదిలో ఏర్పాటు చేసిన మరో అణు స్థావరానికి కొన్ని ప్రత్యేక పరికరాలను తరలిస్తున్నట్లు భద్రతా సిబ్బందికి చెప్పారు. వాటిని తరలించేందుకు రాత్రిపూట ప్రత్యేక ద్వారం నుంచి కాన్వాయ్ వస్తుందన్నారు.

ఫొటో సోర్స్, HARPER COLLINS
నాలుగు ట్రక్కుల్లో ఎయిర్‌పోర్టుకు చేరిన బాల్స్
అర్ధరాత్రి అయినప్పటికీ ముంబయిలో హడావిడి కనిపించింది. ట్రాఫిక్ జామ్ కాకుండా, ఎవరికీ ఎలాంటి సందేహాలు రాకుండా ఉండేందుకు తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్య ఈ ట్రక్కులు బయలుదేరాలని నిర్ణయించారు.
''మే 1వ తేదీ ఉదయం నాలుగు ట్రక్కులు నిశ్శబ్దంగా బార్క్ ప్లాంట్‌కు చేరుకున్నాయి. ఒక్కో ట్రక్కులో ఐదుగురు సాయుధ జవాన్లు ఉన్నారు'' అని తన పుస్తకం 'వెపన్స్ ఆఫ్ పీస్: ది సీక్రెట్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ క్వెస్ట్ టు బీ ఏ న్యూక్లియర్ పవర్'లో సీనియర్ జర్నలిస్ట్ రాజ్ చెంగప్ప రాశారు.
''ఆ ట్రక్కులపై బాంబులు వేసినా తట్టుకునేలా రక్షణ కవచాలు ఏర్పాటు చేసి ఉన్నాయి. ఇతర పరికరాలతో పాటు రెండు నల్ల బాక్సులను ట్రక్కుల్లోకి ఎక్కించారు. చరిత్ర మొదలవబోతోంది అని డీఆర్‌డీవో సీనియర్ సభ్యుడు ఉమంగ్ కపూర్ అన్నారు'' అని చెంగప్ప తెలిపారు.
ఆ తర్వాత నాలుగు ట్రక్కులు వేగంగా ముంబయి విమానాశ్రయం వైపు వెళ్లిపోయాయి. అక్కడి నుంచి విమానాశ్రయానికి 30 నిమిషాలే పడుతుంది.
అప్పటికే ఎయిర్‌పోర్ట్ నుంచి అన్ని క్లియరెన్సులు వచ్చేశాయి. ట్రక్కులు నేరుగా రన్‌వే వద్దకు వెళ్లిపోయాయి. వాటిని తరలించేందుకు అక్కడ ఏఎన్ 32 ఎయిర్‌క్రాఫ్ట్ సిద్ధంగా ఉంది.
నలుగురు భద్రతా సిబ్బంది మాత్రమే విమానంలోకి ఎక్కారు. అది చూస్తే ఆర్మీ సాధారణ కార్యక్రమంలో భాగంగానే అనిపిస్తుంది.
ముంబయి నగరాన్ని నిమిషాల్లో నాశనం చేయగలిగిన బాంబులు ఆ విమానంలో ఉన్నాయని ఎవరికీ తెలియదు. తెల్లవారుజామున ఏఎన్ 32 ఎయిర్‌క్రాఫ్ట్ ముంబయి ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయింది. రెండు గంటల తర్వాత జైసల్మేర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. అక్కడ అప్పటికే కాన్వాయ్ సిద్ధంగా ఉంది.
కాన్వాయ్‌లోని ట్రక్కుల్లో ఆయుధాలతో భద్రతా సిబ్బంది కూర్చుని ఉన్నారు. ట్రక్కుల్లోంచి దిగే సమయంలో వారి ఆయుధాలను టవళ్లతో దాచేశారు. ఆ వెంటనే జైసల్మేర్ ఎయిర్‌పోర్ట్ నుంచి ట్రక్కులు పోఖ్రాన్‌కు బయలుదేరాయి.
''పోఖ్రాన్‌కు చేరిన తర్వాత ఈ ట్రక్కులు నేరుగా బాంబులు అమర్చిన 'ప్రేయర్ హాల్'కు చేరుకున్నాయి.
ప్లూటోనియం బాల్స్ అక్కడికి చేరుకునేసరికి అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ రాజగోపాల చిదంబరం అక్కడికి వచ్చారు. చాలా సేపు వేచిచూడడంతో ఆయన అసహనంగా ఉన్నారు.
''1971లో ఉన్న పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు తేడాను ఆయన గుర్తుచేసుకున్నారు. అప్పట్లో అణు పరికరాన్ని ఆయనతో పాటు పోఖ్రాన్‌కు తీసుకురావాల్సి వచ్చింది.'' అని రాజ్ చెంగప్ప రాశారు.

ఫొటో సోర్స్, HAR
తేలు, బుల్డోజర్
అణు పరీక్షకు కొద్దిరోజుల ముందు బార్క్ డైరెక్టర్ అనిల్ కకోద్కర్ తండ్రి చనిపోయారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్లిన కకోద్కర్ రెండు రోజుల్లోనే పోఖ్రాన్ తిరిగొచ్చేశారు.
పేలుడు జరిపేందుకు కుంభకర్ణ షాఫ్ట్‌ను సిద్ధం చేస్తుండగా, ఓ సైనికుడి చేతిపై తేలు కుట్టింది. కానీ, ఆ సైనికుడు కనీసం శబ్దం బయటకు రానీయలేదు. ఎలాంటి వైద్య సాయం కూడా తీసుకోకుండానే తన పనిని కొనసాగించారు. ఆ సైనికుడి చేతిపై వాపు రావడంతో, చుట్టుపక్కల ఉన్నవారు గుర్తించి ఆయన్ను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు.
తాజ్ మహల్ షాఫ్ట్ వద్ద ఇసుకను తోడుతున్న బుల్డోజర్ ప్రమాదవశాత్తూ ఒక పెద్ద బండరాయికి తగిలింది. అది ఆ షాఫ్ట్ లోపల పడి ఉంటే అక్కడ అమర్చిన వైర్లు పాడైపోవడం ఖాయం.
అంతలో ఓ యువకుడు డైవ్ చేసి ఆ రాయి షాఫ్ట్‌లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. మరో నలుగురు జవాన్లు తమ ప్రాణాలకు తెగించి ఆ రాయిని ఆపేందుకు ప్రయత్నించారు.
అణుపరీక్షకు కొద్దిరోజుల ముందు, షాఫ్ట్‌ను పుల్లీ సిస్టంతో కిందకు దించుతుండగా కరెంటు పోయింది. దీంతో వారంతా షాఫ్ట్ లోపలే చిక్కుకుపోయారు. మళ్లీ కరెంటు రావడానికి గంటల కొద్దీ సమయం పట్టడంతో వాళ్లలో వాళ్లు జోకులు వేసుకుంటూ కాలక్షేపం చేశారు.
పదేపదే కరెంటు పోతుండడం పనులకు ఆటంకం కలిగించింది. ఒకవేళ విద్యుత్ సరఫరా ఉన్నా చాలా హెచ్చుతగ్గులు ఉండడంతో ఎప్పుడు పరికరాలు కాలిపోతాయో తెలియని పరిస్థితి.
చివరికి, పనులు జరుగుతున్న ప్రాంతానికి జనరేటర్‌ను తరలించాలని నిర్ణయించుకున్నారు. దానికి ఫామ్ హౌస్ అనే కోడ్ నేమ్ కూడా పెట్టారు.

ఫొటో సోర్స్, HARPERCOLLINS
భారీ వర్షం, పిడుగుల ముప్పు
పోఖ్రాన్ వాతావరణ పరిస్థితులు కూడా శాస్త్రవేత్తలకు కొత్త సమస్యలు సృష్టించాయి. ఒక రోజు అక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అణు పరికరాన్ని అనుసంధానం చేస్తున్న ప్రేయర్ హాల్ నుంచి శాస్త్రవేత్తలు తమకు కేటాయించిన గదులకు వచ్చిన కొద్దిసేపటికే భారీ వర్షం పడింది.
ఒకవేళ ప్రేయర్ హాల్‌పై పిడుగు పడితే అక్కడి పరికరాలు పాడవడమే కాకుండా, అవి పేలిపోయే ప్రమాదం కూడా ఉందని శాస్త్రవేత్త ఎస్‌కే సిక్కా, ఆయన బృంద సభ్యులు ఆందోళన చెందారు. అంత భారీ తుపాను వచ్చింది. ఏమీ కనిపించనంత పెద్ద వర్షం కురిసింది.
అగ్నిప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రేయర్ హాల్‌లో ఏసీలను అనుమతించలేదు. ఇబ్బందికర పరిస్థితుల్లోనే శాస్త్రవేత్తలు పనిచేయాల్సి వచ్చింది. అక్కడ వేడి కారణంగా శాస్త్రవేత్తలు చెమటతో తడిసిముద్దయ్యేవారు.
సహాయ సిబ్బందిని కావాలనే తక్కువగా తీసుకురావడంతో, సీనియర్ శాస్త్రవేత్త సిక్కా కూడా వైర్లు, స్క్రూలు బిగించేవారు.

ఫొటో సోర్స్, RUPA
అనిల్ కకోద్కర్‌ను గుర్తుపట్టారు
అణు పరీక్షలకు అక్కడ ప్రయత్నాలు జరుగుతుండగా, అక్కడికి సమీపంలో ఒక ప్రైవేట్ కంపెనీ చమురు కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు శాస్త్రవేత్తలకు తెలిసింది. తవ్వకాలు జరిపేందుకు వాళ్లు ఏ టెక్నాలజీ వాడుతున్నారో తెలుసుకోవాలని అనిల్ కకోద్కర్ అనుకున్నారు.
''మేమంతా ఆర్మీ యూనిఫాంలో అక్కడికి చేరుకున్నాం. మా టీమ్ సభ్యుడు విలాస్ కులకర్ణి అక్కడ పనిచేస్తున్న ఒక వ్యక్తిని పక్కకు తీసుకెళ్లి మాట్లాడే ప్రయత్నం చేశారు. అతను నా వైపు చూపిస్తూ ఆయన కకోద్కర్ సార్ కదా, మీరెవరు అని అడిగారు.
ఆయన కకోద్కర్ కాదని వివరించేందుకు కులకర్ణి ప్రయత్నించారు. అయితే తాను డోంబివిలి వాడినని, కకోద్కర్‌ని చాలాసార్లు చూశానని అతను చెప్పారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవడమే మేలు అనుకున్నాం'' అని తన పుస్తకం ఫైర్ అండ్ ఫ్యూరీలో అనిల్ కకోద్కర్ రాశారు.
మరోవైపు దిల్లీలోని తన నివాసానికి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హాను వాజ్‌పేయి హఠాత్తుగా పిలిపించారు.
''వాజ్‌పేయి ఆఫీస్‌లో నన్ను కలవలేదు. ఆయన బెడ్‌రూంకి తీసుకెళ్లారు. ఆయన ఏదో ముఖ్యమైన విషయం చెప్పబోతున్నారని నాకు అర్థమైంది. నేను కూర్చున్న వెంటనే అణు పరీక్ష సన్నాహాల గురించి చెప్పారు'' అని ఆటోబయోగ్రఫీ 'రెలెంట్‌లెస్'లో యశ్వంత్ సిన్హా రాశారు.
''ఈ అణుపరీక్షల వల్ల ప్రపంచ శక్తులు ఇండియాపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించే అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి మనం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అందుకే మిమ్నల్ని ముందుగానే హెచ్చరిస్తున్నా. అలా ఏదైనా జరిగితే, అన్నింటికీ సిద్ధంగా ఉండాలని చెప్పారు'' అని యశ్వంత్ సిన్హా గుర్తుచేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా ఉపగ్రహాలకు దొరక్కుండా..
ఉపగ్రహాలకు దొరక్కుండా ఉండేందుకు శాస్త్రవేత్తల బృందం రాత్రివేళల్లో మాత్రమే పనిచేసేది. ఆ రాత్రులు వారికి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.
''ఒకరోజు రాత్రి శాస్త్రవేత్త కౌశిక్ ఉపగ్రహం కదలికలను గమనించారు. మూడు గంటల్లో నాలుగు ఉపగ్రహాల కదలికలను ఆయన గుర్తించారు. మనం ఏదో చేస్తున్నామని తెలిసిపోయింది. లేకుంటే ఒక్క రాత్రిలో ఇన్ని ఉపగ్రహాలు రావడమేంటి? మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. మేం ఎలాంటి రిస్క్ తీసుకోలేం'' అని శర్మ చెప్పారని రాజ్ చెంగప్ప రాశారు.
అణుపరీక్షలు నిర్వహించాలని 1995లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నిర్ణయించుకున్నప్పుడు, అక్కడ కొత్తగా ప్రసరిస్తున్న వెలుగుల కారణంగా భారత్ ఉద్దేశాలను అమెరికా ఉపగ్రహాలు పసిగట్టాయి.
అప్పట్లో షాఫ్ట్‌ను కనిపించకుండా చేసేందుకు భారీ మొత్తంలో ఇసుకతో కప్పేయడాన్ని కూడా అమెరికా ఉపగ్రహాలు గుర్తించాయి. ఇంకా భారీ సంఖ్యలో వాహనాల రాకపోకలు కూడా కనిపించడంతో అమెరికా అప్రమత్తమైంది.
1998లో కూడా అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) పోఖ్రాన్‌పై ఉపగ్రహాలను మోహరించింది. అయితే అణు పరీక్షకు కొద్దిరోజుల ముందే అది జరిగింది. వాటిలో ఒక్క ఉపగ్రహం మాత్రమే పోఖ్రాన్‌ను పర్యవేక్షించేది. అది కూడా ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్య పోఖ్రాన్ మీదుగా వెళ్లేది.
అణుపరీక్ష జరగడానికి సరిగ్గా ఒక్క రోజు ముందే ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించే బాధ్యతను సీఐఏ ఒక అనలిస్టుకు అప్పగించింది. ఆయన మరుసటి రోజు తన అధికారులకు చూపించేందుకు పోఖ్రాన్‌లో తీసిన కొన్ని చిత్రాలను ఎంపిక చేసుకున్నారు. అయితే, అప్పటికే భారత్ చాలా అడుగులు వేసేసింది.

ఫొటో సోర్స్, HARPER COLLINS
మధ్యాహ్నం 3.45 గంటలకు విస్ఫోటనం
అణు పరీక్ష జరిగిన మే 11న, ప్రధాని నివాసంలో ఉన్న బ్రజేష్ మిశ్రాకు అబ్దుల్ కలాం ఫోన్ చేశారు. గాలి వేగం తగ్గుతోందని, మరో గంటలో పరీక్ష నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు.
అప్పటికే పోఖ్రాన్‌లోని కంట్రోల్ రూంలో శాస్త్రవేత్తలు ప్లాస్టిక్ కుర్చీలు వేసుకుని కూర్చుని సిద్ధంగా ఉన్నారు. వాతావరణం అనుకూలంగా ఉందనే సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.
దిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో బ్రజేశ్ మిశ్రా చాలా ఆందోళనగా కనిపించారు.
వాజ్‌పేయి సెక్రటరీ శక్తి సిన్హా కొన్ని ముఖ్యమైన ఫైళ్లు వాజ్‌పేయి వద్దకు తీసుకొచ్చారు. ఆ రోజే శక్తి సిన్హా పుట్టిన రోజు కూడా. శుభాకాంక్షలు చెప్పేందుకు ఫోన్ కాల్స్ వస్తున్నా ఆయన వాటికి సమాధానం ఇవ్వడం లేదు.
ఇంతలో పోఖ్రాన్‌లో అంతా అనువుగా ఉందని వాతావరణ శాఖ నుంచి రిపోర్ట్ వచ్చింది. సరిగ్గా 3 గంటల 45 నిమిషాలకు మానిటర్‌లో రెడ్ లైట్ వెలిగింది. ఆ తర్వాత సెకండ్లలోనే మూడు మానిటర్లలోనూ లైట్లు వెలుగులు చిమ్మాయి.
పేలుడు ధాటికి షాఫ్ట్‌లోని కెమెరాలు ధ్వంసమవడంతో అక్కడి చిత్రాలు కనిపించడం ఆగిపోయింది. భూమి లోపల ఉష్ణోగ్రత మిలియన్ల డిగ్రీల సెంటిగ్రేడ్‌కు చేరుకుంది.
తాజ్ మహల్ షాష్ట్‌లో పేలుడు ధాటికి హాకీ మైదానమంత పరిమాణంలో ఇసుక పైకి లేచింది. ఆ సమయంలో హెలికాప్టర్ ద్వారా పేలుళ్లను పరిశీలించిన డీఆర్‌డీవో సభ్యుడు ఉమంగ్ కపూర్ భారీ స్థాయిలో దుమ్ము పైకి లేవడాన్ని గుర్తించారు.

ఫొటో సోర్స్, HARPER COLLINS
'భారత్ మాతా కీ జై' నినాదాలు
తమ కాళ్ల కింద భూమి కంపించిపోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఆ ప్రకంపనలు వ్యాపించాయి. ఎడారిలో ఎగసిపడుతున్న ఇసుకను తమ కళ్లారా చూసేందుకు శాస్త్రవేత్తలు బంకర్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
వందల మంది జవాన్లు దూరం నుంచి ఆ దృశ్యాలను వీక్షించారు. భారత్ మాతాకీ జై అనే నినాదాలు మిన్నంటాయి.
''ఆ దృశ్యం చూసి నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి'' అని శాస్త్రవేత కె.సంతానం బీబీసీతో చెప్పారు.
కలాంతో చిదంబరం కరచాలనం చేస్తూ, '' 24 ఏళ్ల తర్వాత కూడా దీన్ని మళ్లీ చేయగలం అని నీకు చెప్పాను'' అన్నారు.
''ప్రపంచంలోని అణ్వాయుధ దేశాల ఆధిపత్యాన్ని అంతం చేశాం. ఇప్పుడు వంద కోట్ల జనాభా ఉన్న మన దేశానికి ఏం చేయాలో ఎవరూ చెప్పలేరు. ఏం చేయాలో ఇప్పుడు మనమే నిర్ణయిస్తాం'' అని కలాం అన్నారు.
అటు ప్రధాని నివాసంలో ఫోన్ పక్కనే కూర్చున్న బ్రజేశ్ మిశ్రా, ఫోన్ రింగ్ అయిన వెంటనే ఎత్తారు.
కలాం గద్గద స్వరాన్ని ఆయన విన్నారు. ''సర్, మనం సాధించాం" అనగానే, "గాడ్ బ్లెస్ యూ" అని మిశ్రా గట్టిగా అరిచారు.
''ఆ క్షణాలను వర్ణించడం సాధ్యం కాదు. చాల సంతోషం, సంతృప్తి కలిగాయి'' అని ఆ తర్వాత వాజ్‌పేయి చెప్పారు.
''క్యాబినెట్‌లోని నలుగురు మంత్రులు లాల్ కృష్ణ అడ్వాణీ , జార్జ్ ఫెర్నాండెజ్, యశ్వంత్ సిన్హా, జస్వంత్ సింగ్ ప్రధాని నివాసంలోని డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చుని ఉన్నారు. వాజ్‌పేయి సోఫాలో కూర్చుని ఆలోచనలో మునిగిపోయారు. ఎవరూ ఎవరితో ఏమీ మాట్లాడలేదు'' అని తన పుస్తకం 'వాజ్‌పేయి: ది ఇయర్స్ దట్ చేంజ్డ్ ఇండియా'లో శక్తి సిన్హా రాశారు.
''వారి ముఖాల్లో సంతోషం స్పష్టంగా కనిపించింది. కానీ, ఎవరూ సంతోషంగా కేరింతలు కొట్టలేదు. ఒకరినొకరు ఆలింగనం చేసుకోలేదు. ఎవరి వీపూ తట్టలేదు. కానీ, అక్కడున్న వారందరి కళ్లలో నీళ్లు కనిపించాయి.''
''చాలా సేపటి తర్వాత వాజ్‌పేయి ముఖంలో నవ్వు కనిపించింది. టెన్షన్‌లో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయన పెద్దగా నవ్వారు.'' అని సిన్హా రాశారు.

ఫొటో సోర్స్, HARPER COLLINS
రెండు రోజుల తర్వాత మరో రెండు విస్ఫోటాలు
వాజ్‌పేయి ఇంటి నుంచి బయటికి వచ్చేప్పటికే ప్రధాన మీడియా ప్రతినిధులు అక్కడికి వచ్చేశారు.
ప్రధాని వేదికపైకి వెళ్లడానికి కొన్ని క్షణాల ముందు ప్రమోద్ మహాజన్ భారత త్రివర్ణ పతాకాన్ని వేదికపై ఏర్పాటు చేశారు.
అప్పటికే జస్వంత్ సింగ్ మీడియాకు ఏం చెప్పాలో నోట్ సిద్ధం చేశారు. కానీ, చివరి క్షణంలో వాజ్‌పేయి అందులో మార్పులు చేశారు.
అందులోని మొదటి వాక్యం ఏంటంటే, '' ఐ హ్యావ్ ఏ బ్రీఫ్ ఎనౌన్స్‌మెంట్ (నేను ఒక చిన్న ప్రకటన చేయాలనుకుంటున్నా.)'' అని ఉంది. అందులో బ్రీఫ్ అనే పదాన్ని వాజ్‌పేయి కొట్టేసి ప్రకటన చేశారు.
''ఈ రోజు 3 గంటల 45 నిమిషాలకు భారత్ మూడు అణుపరీక్షలను నిర్వహించింది. పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినందుకు శాస్త్రవేత్తలను, ఇంజనీర్లను అభినందిస్తున్నాను'' అని ఆయన చెప్పారు.
రెండు రోజుల తర్వాత పోఖ్రాన్ మరోసారి దద్దరిల్లింది. ఇండియా మరో రెండు అణుపరీక్షలు నిర్వహించింది.
ఒక రోజు తర్వాత, ''ఇండియా ఇప్పుడు అణ్వాయుధ దేశం'' అని వాజ్‌పేయి ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్లో ‘డర్టీ హ్యారీ’ ఎవరు, ఇమ్రాన్ ఖాన్ పదే పదే ఆ పేరెందుకు చెబుతున్నారు?
- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహిస్తారు? కచ్చితత్వం ఎంత?
- మహిళా రెజ్లర్లు: ప్రభుత్వ అధికారాన్ని, రాజకీయ పలుకుబడిని సవాల్ చేస్తున్న ఈ నిరసన ఏం చెబుతోంది?
- డోనల్డ్ ట్రంప్: అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ బరిలోకి దిగాలనే ఆయన ఆశలకు లైంగిక వేధింపుల కేసు తీర్పు గండి కొడుతుందా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














