అమెజాన్ అడవుల్లో కూలిన విమానంలోని నలుగురు పిల్లలు 40 రోజుల తర్వాత ప్రాణాలతో దొరికారు

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, అయోఫ్ వాల్ష్
- హోదా, బీబీసీ న్యూస్
కొలంబియా అమెజాన్ అడవుల్లో విమానం కూలిపోయిన తర్వాత 40 రోజులకు అందులోని నలుగురు పిల్లలు ప్రాణాలతో దొరికారని ఆ దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో చెప్పారు.
ఈ పిల్లల వయసు పదమూడేళ్లు, తొమ్మిదేళ్లు, నాలుగేళ్లు, ఏడాదని తెలిపారు.
మే 1న ప్రమాదానికి గురైన విమానంలో తమ తల్లి, పైలట్, కో-పైలట్‌తో పాటు ఈ పిల్లలు కూడా ఎక్కారని చెప్పారు.
ఈ విమాన ప్రమాదంలో వారి తల్లితో పాటు, ఇతరులు కూడా మరణించారు.
వారాల తరబడి విస్తృత స్థాయిలో జరిపిన గాలింపు చర్యల ఫలితంగా ఈ పిల్లల్ని అమెజాన్ అడవుల్లో గుర్తించినట్లు ప్రెసిడెంట్ చెప్పారు.
ఈ పిల్లలు ప్రాణాలతో బయటపడటంతో ఆ దేశ ప్రజలంతా ఆనందంలో మునిగిపోయారు.
ఇదొక అద్భుతమైన రోజని ఆ దేశ అధ్యక్షుడు అభివర్ణించారు.
‘‘వారు క్షేమంగా ఉన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు’’ అని అన్నారు.
ఆ నలుగురు తోబుట్టువులను 40 రోజులుగా వెతుకుంటూ వెళ్లిన సైన్యం, స్థానిక కమ్యూనిటీకి చెందిన సభ్యుల ఫోటోను పెట్రో షేర్ చేశారు.
ఈ పిల్లలకి ప్రస్తుతం వైద్య సేవలు అందిస్తున్నట్లు పెట్రో చెప్పారు. వారి తాతతో మాట్లాడామని, అడవి తల్లి తమ బిడ్డల్ని కాపాడిందని ఆయన అన్నారని తెలిపారు.
అమెజోనాస్ ప్రావిన్స్‌లోని అరరాకురా నుంచి శాన్ జోస్ డెల్ గువావియారేకు ప్రయాణిస్తోన్న సెస్నా 206 విమానంలో ఈ పిల్లలు, వారి తల్లి ఎక్కారు.
విమానంలో ఇంజిన్ సమస్య తలెత్తడంతో, అలర్ట్ జారీ చేశారు. ఆ తర్వాత విమానం కూలిపోయింది.

ఫొటో సోర్స్, Reuters
విమాన ప్రమాద స్థలంలో ముగ్గురు పెద్దవాళ్ళ మృతదేహాలను గుర్తించారు.
ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న పిల్లలు, సాయం కోసం అడవి అంతా తిరిగారని సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది.
విమాన ప్రమాదం తర్వాత ఈ పిల్లల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు మొదలు పెట్టారు. పిల్లల మంచినీళ్ల బాటిల్, కత్తెర, హెయిర్ టై వంటి వస్తువులను సహాయక సిబ్బంది గుర్తించారు.
పిల్లల పాద ముద్రలను కూడా కనుగొన్నారు. దీంతో ఈ పిల్లలు బతికే ఉంటారని సహాయక సిబ్బంది భావించారు.
ఈ పిల్లలు హయిటోటో స్థానిక గ్రూప్‌కు చెందిన వారు. పిల్లలకు పండ్లపై ఉండే అవగాహన, అటవీ ప్రాంతంలో మనుగడ సాధించే నైపుణ్యాలు వీరిని బతికించేందుకు సహకరించాయని ఈ కమ్యూనిటీకి చెందిన సభ్యులు భావించారు.
స్థానిక ప్రజలు కూడా ఈ పిల్లల్ని వెతికేందుకు సహకరించారు. హుయిటోటో భాషలో రికార్డు చేసిన పిల్లల అమ్మమ్మ మెసేజ్‌ను హెలికాప్టర్ల ద్వారా బ్రాడ్‌కాస్ట్ చేశారు. ఎక్కడున్న వారు అక్కడే ఉండాలని, అప్పుడే తాము తేలికగా కనుగొనగలమని చెప్పారు.
పిల్లల్ని కనుగొన్నట్లు తన అకౌంట్‌పై ట్వీట్ పబ్లిష్ కావడంతో గత నెలలో కొలంబియా అధ్యక్షుడు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు.
ఆ తర్వాత రోజే అధ్యక్షుడు ఆ ట్వీట్‌ను తొలగించారు. కొలంబియా పిల్లల సంక్షేమ ఏజెన్సీ ఇచ్చిన సమాచారాన్ని తమ ఆఫీసు ఈ ట్వీట్ చేసిందని, తాము దాన్ని ధ్రువీకరించలేదని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వర్జిన్ బర్త్: మగ మొసలితో కలవకుండానే సొంతంగా గర్భం దాల్చిన ఆడ మొసలి
- మధ్యప్రదేశ్: ఆ పాఠశాలలో మతమార్పిళ్లకు పాల్పడుతున్నారా? హిందూ బాలికలు హిజాబ్ ధరిస్తున్నారా?
- లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్...ఈ పదాల మధ్య తేడా ఏంటి?
- వీర్యదానం: ఆమె ముగ్గురు నాన్నల కూతురు...థ్రిల్లర్‌ను తలపించే స్టోరీ
- ఆడవాళ్ల మెదడు ఎలా పనిచేస్తుంది? 'బికినీ మెడిసిన్' వల్ల స్త్రీలు నష్టపోతున్నారా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














