మధ్యప్రదేశ్: ఆ పాఠశాలలో మతమార్పిళ్లకు పాల్పడుతున్నారా? హిందూ బాలికలు హిజాబ్ ధరిస్తున్నారా?

- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
మధ్యప్రదేశ్‌లోని దామోహ్ పట్టణంలో ఉన్న 'గంగా జమున హైయర్ సెకండరీ స్కూల్'లో "మత మార్పిడి" జరిగిందన్న ఆరోపణలపై పోలీసులు పాఠశాల నిర్వాహకులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఈ స్కూలు నుంచి సుమారు 1,200 మంది విద్యార్థులను ఇతర పాఠశాలలకు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
స్కూలు యాజమాన్యంపై ఆరోపణలు వచ్చిన తరువాత 295 (ఏ), 506 (బీ), 'జువైనల్ జస్టిస్ యాక్ట్' సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మీడియకు తెలిపారు.
"పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాస్తవాలు తెలిసేకొద్దీ మరిన్ని సెక్షన్లను జోడించవచ్చు" అని ఆయన అన్నారు.
గంగా జమున హైయర్ సెకండరీ స్కూల్ గుర్తింపును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.
"జిల్లా స్థాయిలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశాం. ఇందులో డిప్యూటీ కలెక్టర్ ఆర్‌ఎల్ బాగ్రీ, మహిళా సెల్ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ భావన దాంగీ కూడా సభ్యులుగా ఉంటారు" అని దామోహ్ జిల్లా మేజిస్ట్రేట్, కలెక్టర్ మయాంక్ అగర్వాల్ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అసలేం జరిగింది?
మధ్యప్రదేశ్‌లో 10వ తరగతి బోర్డు పరీక్ష ఫలితాలను ప్రకటించిన తరువాత, గంగా జమున హైయర్ సెకండరీ స్కూల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఫొటోలతో ఒక పోస్టర్ పెట్టారు.
పాఠశాలలో 98.5 శాతం మంది విద్యార్థులు బోర్డు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని ఆ పోస్టర్‌లో ఉంది.
అందులో కొందరు హిందూ బాలికలు హిజాబ్ ధరించి ఉన్నట్టు కనిపిస్తోంది. ఇది వివాదానికి దారితీసింది. వాళ్ల పేర్లు హిందూ పేర్లు. కానీ, ముఖం మాత్రం కనిపించేలా హిజాబ్ వేసుకున్నారు.
పాఠశాల యాజమాన్యం బలవంతపు మతమార్పిళ్లకు పూనుకుంటోందని అనేక సంస్థలు ఆరోపించాయి.
స్కూల్లో విద్యార్థులకు 'కలిమాలు' కూడా నేర్పుతున్నారని, హిందూ బాలికలను హిజాబ్ ధరించాలని బలవంతపెడుతున్నారని స్థానిక బీజేపీ నాయకులు ఆరోపించారు.
ఈ వివాదం ముదరడంతో, దీనిపై ఒక నివేదిక సమర్పించాలని జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
"పాఠశాల ముసుగులో లవ్ జిహాద్, జిహాదీ సామ్రాజ్యాన్ని నెలకొల్పాలని ప్రయత్నిస్తున్న వారిపై మతమార్పిడి చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలి. వారి ఆస్తులపై విచారణ జరిపించాలి" అని బీజేపీ మధ్యప్రదేశ్ అధ్యక్షుడు వీడీ శర్మ కోరారు.
ఈ వివాదంపై మే 30న దామోహ్ కలెక్టర్ మయాంక్ అగర్వాల్ ఒక ట్వీట్ చేశారు.
"గంగా జమున స్కూల్ పోస్టర్‌కు సంబంధించి కొందరు వ్యక్తులు చేస్తున్న ప్రచారంపై స్టేషన్ ఇన్‌ఛార్జ్ కొత్వాలి, జిల్లా విద్యా శాఖ అధికారి కలిసి దర్యాప్తు జరిపిన తరువాత, అది తప్పని తేలింది. తరువాత ఒక తహసీల్దార్ నేతృత్వంలో దర్యాప్తు కమిటీని కూడా నియమించాం. కమిటీ నివేదిక సమర్పించింది" అని కలెక్టర్ తెలిపారు.
జిల్లా విద్యా శాఖ అధికారిపై ఇంకు చల్లిన బీజేపీ నేతలు
జిల్లా స్థాయి కమిటీ నివేదిక సమర్పించిన తరువాత దామోహ్ జిల్లా విద్యా శాఖ అధికారి ఎస్‌కే మిశ్రాపై పలువురు మండిపడ్డారు.
జూన్ 6న ఆయన తన కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా, కొందరు బీజేపీ కార్యకర్తలు ఆయనపై ఇంకు చల్లారు.
దీనిపై "ముగ్గురు నేతలకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని, ఇలాంటి చర్యలను బీజేపీ సమర్థించదని" దామోహ్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రీతమ్ సింగ్ లోధి విలేఖరులతో చెప్పారు.
ఈ ఘటనకు సంబంధించి, దామోహ్ బీజేపీ ఉపాధ్యక్షుడు అమిత్ బజాజ్, మరో ఇద్దరు కార్యకర్తలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

జిల్లా యంత్రాంగం నివేదికపై మంత్రి ఆగ్రహం
దామోహ్ జిల్లా యంత్రాంగం ఇచ్చిన నివేదికపై రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ "స్కూల్ యాజమాన్యానికి క్లీన్ చిట్" ఇచ్చే బదులు, పాఠశాలపై వచ్చిన ఆరోపణలపై సక్రమంగా, క్షుణ్ణంగా విచారణ చేసి ఉండాల్సిందని మంత్రి అన్నారు.
"జిలా విద్యా శాఖ అధికారి (డీఈవో) తప్పుడు సమాచారం ఇచ్చారు. ఆయన స్కూలుకు క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ, దర్యాప్తులో చాలా విషయాలు బయటపడ్డాయి. ఇందులో డీఈవో నిర్లక్ష్యమే కనిపిస్తోంది. అందుకే ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించి, ఆయనపై విచారణకు ఆదేశిస్తున్నాం. సమస్య స్కూలులో జరుగుతున్న విషయాలే కాదు, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం కూడా. కలెక్టర్ పాఠశాలకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చారు. ఇందులో ఆయన పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి" అని పర్మార్ భోపాల్‌లో విలేఖరులతో అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ముఖ్యమంత్రి కఠిన వైఖరి
ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు ఇచ్చామని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీస్ శాఖ డైరెక్టర్ జనరల్‌తో ముఖ్యమంత్రి మాట్లాడారు.
సీఎం విలేఖరులతో మాట్లాడుతూ, "రాష్ట్రంలో కొన్నిచోట్ల మతమార్పిళ్లు జరుగుతున్నాయి. వాటిని సఫలీకృతం కానివ్వం. విద్యా సంస్థల్లో దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చాం. పాఠశాలల్లో తప్పుడు మార్గంలో విద్యాబోధన జరుగుతున్నట్లయితే, మేం వెంటనే చెక్ చేస్తాం. దామోహ్ ఘటనపై నివేదిక అందాల్సి ఉంది. ఇది పెద్ద విషయం. ఇద్దరు బాలికలు వాంగ్మూలం ఇచ్చారు. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాం. కఠిన చర్యలు తీసుకుంటాం" అన్నారు.
స్కూల్ యాజమాన్యం ఏం చెబుతోంది?
2010 నుంచి మహ్మద్ ఇద్రీస్ అధ్యక్షతన ప్రభుత్వేతర సంస్థ 'గంగా జమున వెల్ఫేర్ సొసైటీ' ఈ పాఠశాలను నడుపుతోంది.
పాఠశాలపై వివాదం ముసురుకోవడంతో యాజమాన్యం వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.
విద్యార్థులపై బలవంతపు నిబంధనలు విధించలేదని నిర్వాహకులు చెప్పారు.
విద్యార్థినులు యూనిఫాంలో భాగంగా స్వచ్ఛందంగా ‘స్కార్ఫ్’ లేదా దుపట్టా ధరించవచ్చనే నిబంధన పెట్టామని, ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు రాతపూర్వకంగా సమాచారం ఇచ్చామని తెలిపారు.
బాలికలే కాకుండా, బాలురు చేతులకు దారాలు, తాళ్లు (మతపరమైనవి) కట్టుకుని స్కూలుకు వెళితే, టీచర్లు వాటిని తెంపేస్తారని బీజేపీ స్థానిక నేత అమిత్ బజాజ్ ఆరోపించారు.
పాఠశాలలో పనిచేస్తున్న ముగ్గురు మహిళా ఉపాధ్యాయులు మొదట హిందువులుగా ఉండి, ఆ తరువాత ఇస్లాంలోకి మారారని బజాజ్ చెబుతున్నారు.
అయితే, "తాము స్వచ్ఛందంగా మతం మారినట్లు, అది కూడా ఈ స్కూల్లో చేరడానికి చాలా ఏళ్ల ముందే మారినట్లు" జిల్లా కలెక్టర్‌కు వారు లిఖితపూర్వకంగా తెలియజేశారు.
ప్రస్తుతం కేసు దర్యాప్తు వివిధ స్థాయుల్లో కొనసాగుతోంది.
గంగా జమున వెల్ఫేర్ ట్రస్ట్‌కు ఈ పాఠశాలతో పాటు పెట్రోల్ పంపులు, పారిశ్రామిక ఉత్పత్తులకు సంబంధించిన గోదాములు, పప్పు దినుసుల మిల్లులు, బట్టల షోరూమ్‌లు మొదలైనవి ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు వీటన్నిటిపైనా విచారణ జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) తెస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన వైఎస్ జగన్... ఇప్పుడు జీపీఎస్ అంటున్నారేంటి?
- బిర్సా ముండా: ఈ ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడి స్వగ్రామం ఎలా ఉంది, ఆయన వారసులు ఏం చేస్తున్నారు?
- హైదరాబాద్: కలెక్షన్లు తక్కువ తెచ్చారని ఫ్లెక్సీలతో కండక్టర్ల పరువు తీసిన ఆర్టీసీ
- ఫస్ట్ డే-ఫస్ట్ షో, ఏపీ ఫైబర్‌నెట్: కొత్త సినిమాలను నేరుగా ఇంట్లోనే రిలీజ్ రోజే చూసే సదుపాయం
- 'సహజీవనం చేస్తున్న మహిళ మృతదేహాన్ని ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడికించాడు'
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















