హైదరాబాద్: కలెక్షన్లు తక్కువ తెచ్చారని ఫ్లెక్సీలతో కండక్టర్ల పరువు తీసిన ఆర్టీసీ

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మేడ్చల్ ఆర్టీసీ డిపోలో పెట్టిన ఓ ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది. రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సిబ్బందితో పాటూ, సోషల్ మీడియాలోనూ చర్చకు కారణం అయింది.
మే నెలలో తక్కువ టికెట్లు అమ్మిన బస్ కండక్టర్ల ఫోటోలను ఫ్లెక్సీపై ముద్రించి ప్రదర్శించడమే ఈ వివాదానికి కారణం. ఈ ఘటనపై కార్మికులతో పాటూ, ఇతర వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో ఆ ఫ్లెక్సీ తొలగించారు.
సాధారణంగా ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీల్లో ఏవరైనా డ్రైవర్ అత్యధిక మైలేజ్ సాధించినా లేదా కండక్టర్లు మంచి బిజినెస్ సాధించినా వారి పేరు, ఫోటో ముద్రించిన ఫ్లెక్సీని బస్ డిపోలో, బస్టాండ్‌లలో పెట్టే పద్ధతి ఉంది.
ఉమ్మడి ఏపీ ఆర్టీసీలో ఈ విధానం ప్రారంభం అయింది. బాగా పని చేసిన కండక్టర్, డ్రైవర్‌లను ఈ విధంగా ప్రోత్సహించి మరింత లాభాలు తెచ్చుకోవాలనేది ఆర్టీసీ యాజమాన్యం ఉద్దేశం.

ఫొటో సోర్స్, UGC
అయితే ఈ విషయంలో తెలంగాణలోని మేడ్చల్ డిపో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అత్యల్పంగా టికెట్లు అమ్మిన కండక్టర్లు అంటూ కొందరు కండక్టర్ల ఫోటోలతో డిపోలో ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు.
కండక్టర్ల ఫోటోల కింద వారి పేరు, ఉద్యోగి ఐడీ నంబర్, మే నెలలో వారు అమ్మిన టీఏవైఎల్ టికెట్ల సంఖ్య ఆ ఫ్లెక్సీలో ప్రదర్శించారు. మొత్తం 15 మంది కండక్టర్ల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అభినందిస్తూ ఫ్లెక్సీలు కట్టడం తప్ప, అవమానిస్తూ ఫ్లెక్సీలు పెట్టడం ఇప్పటివరకూ జరగలేదని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఈ ఫ్లెక్సీల చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అధికారులపై విమర్శలు రావడంతో బుధవారం సాయంత్రం దాన్ని తొలగించారు.

‘డిపో మేనేజర్ల ఫొటోలు పెట్టరేం?’
కార్మిక సంఘాలు ప్లెక్సీ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
‘‘ఆదాయానికి కండక్టర్ బాధ్యత చాలా తక్కువ. అనేక అంశాలు అందులో ఉంటాయి. ఆర్టీసీలో 70 వరకూ డిపోలు నష్టాల్లో ఉన్నాయి. మరి ఆ డిపో మేనేజర్ల ఫోటోలు కూడా ఇలానే పెడతారా? ప్రతినెలా ఎందరో కండక్టర్లు టార్గెట్ కంటే ఎక్కువ తెస్తున్నారు. మరి వాళ్ల ఫోటోలు పెడుతున్నారా?’’ అని ప్రశ్నించారు టీఎంయూ నాయకులు అశ్వత్థామ రెడ్డి.
‘‘తెలంగాణలో ఆర్టీసీ సిబ్బంది ఆత్మగౌరవం కోల్పోయి పనిచేయాల్సి వస్తోంది. ఒక్కొక్కరూ 12 గంటల పైన కష్టపడుతున్నారు. ఉన్నతాధికారులు వేధిస్తున్నారు. ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా చేస్తున్నారు. సంస్థ పరువూ తీస్తున్నారు.’’ అని ఆరోపించారు అశ్వత్థామ రెడ్డి.
ఆర్టీసీలో కీలకమైన రూట్ మ్యాప్ సిద్ధం చేసేది అధికారులే తప్ప కార్మికులు కాదని గుర్తు చేస్తున్నారు కార్మిక నాయకులు. ఆదాయం రాకపోవడానికి లక్షల జీతం తీసుకునే ఉన్నతాధికారులను బాధ్యులను చేయాలనేది వారి డిమాండ్.
‘‘ఒకప్పుడు రూట్ మ్యాప్ సిద్ధం చేసేటప్పుడు డిపో మేనేజర్లు సైతం సీనియర్ కండక్టర్ల దగ్గరకు వచ్చి వాళ్ల అభిప్రాయం తీసుకునేవారు. ఫలానా రూట్లో మైలేజీ రాకపోయినా, ఆక్యుపెన్సీ లేకపోయినా, ఆదాయం లేకపోయినా కండక్టర్, డ్రైవర్ల అభిప్రాయం తెలుసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.’’ అన్నారు అశ్వత్థామ రెడ్డి.

ఫొటో సోర్స్, TSRTCHQ/FACEBOOK
ఫ్లెక్సీ ఏర్పాటుపై అధికారులు ఏమంటున్నారు?
అయితే దీనిపై తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులు బీబీసీతో మాట్లాడారు. ఆర్టీసీ యాజమాన్యం అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని వారు తెలిపారు. స్థానిక డిపో అధికారులు అత్యుత్సాహంతో ఈ పని చేశారని వెల్లడించారు.
‘‘కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఎవరూ ఇలా చేయాలని చెప్పలేదు. స్థానికంగా జరిగింది. దానిపై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుతం దానిపై విచారణ జరుగుతోంది.’’ అని బీబీసీతో టీఎస్ఆర్టీసీ అధికారి ఒకరు చెప్పారు.
‘‘సాధారణంగా సిబ్బంది పనితీరుని ప్రోత్సహించడం, కోసం ఎక్కువ మైలేజీ సాధించిన వారు, ఎక్కువ ఆదాయం తెచ్చిన వారి ఫోటోలు ఫ్లెక్సీల్లో పెట్టి అభినందించి ప్రోత్సహిస్తుంటాం. కానీ ఇలా తక్కువ తెచ్చిన వారి ఫోటోలు పెట్టే సంస్కృతి ఆర్టీసీలో లేదు.’’ అని సదరు అధికారి బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి
- 'సహజీవనం చేస్తున్న మహిళ మృతదేహాన్ని ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడికించాడు'
- స్వర్గానికి వెళ్లడానికి ఆకలితో చావాలని చెబితే దాదాపు 100 మంది ప్రాణాలు తీసుకున్నారు... ఆ అడవిలోని రహస్య ప్రదేశంలో ఏం జరుగుతోంది?
- నరేంద్ర మోదీ- సత్యపాల్ మలిక్: రిలయన్స్ కాంట్రాక్ట్‌ను ఈ మాజీ గవర్నర్ అప్పట్లో ఎందుకు రద్దు చేశారు?
- మూల కణాల మార్పిడి: క్యాన్సర్‌తోపాటు హెచ్ఐవీ నుంచి కోలుకున్న అమెరికన్ కథ
- 'చివరి లాటరీ టికెట్'తో రెండున్నర కోట్లు గెలుచుకున్న 89 ఏళ్ల రిక్షావాలా
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














