ఆంధ్రప్రదేశ్: మెట్రో రైలు ప్రాజెక్టు ఎక్కడ... ఎనిమిదేళ్ళ కింద ఏర్పాటైన ఆఫీసులో ఎవరైనా ఉన్నారా?

ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్
    • రచయిత, వడిశెట్టి శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ ఏర్పాటు కోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సి ఉంది. దానికి గానూ ఒక ఏడాది గడువు విధిస్తూ చట్టంలోని షెడ్యూల్ 13లో పేర్కొన్నారు.

ఒక ఏడాదిలో పూర్తి చేయాల్సిన మెట్రో రైల్ వ్యవహారం ఆ చట్టం చేసి పదేళ్లు పూర్తయినప్పటికీ కొలిక్కి రాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ పేరుతో 2015 నుంచి విజయవాడలో ఓ కార్యాలయం, కొందరు సిబ్బంది పనిచేస్తున్నారు.

రాష్ట్రంలో లేని, ఇప్పటి వరకూ స్పష్టత రాని ప్రాజెక్టు కోసం ఈ సిబ్బంది 8 ఏళ్లుగా ఏం చేస్తున్నారన్నది ఆసక్తికరం. ఇంతకాలంగా నిర్వహణ కోసం ప్రజాధనం వెచ్చిస్తున్నా ఫలితం ఏమిటన్నది ప్రశ్నార్థకం. అందుకే, ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పోరేషన్ కార్యాలయాన్ని బీబీసీ పరిశీలించింది. వారు సాధించిన ప్రగతి గురించి ఆరా తీసే ప్రయత్నం చేసింది.

మెట్రో రైల్ కార్పొరేషన్

ఖాళీగా కార్యాలయం

జూన్ 1, 2023 న నాడు ఉదయం 11గం.ల సమయంలో విజయవాడ లబ్బీపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫీసుకి వెళితే ఖాళీగా దర్శనమిచ్చింది. కార్యాలయంలో ఒక క్లర్క్, మరో అటెండర్, గుమస్తా మాత్రమే ఉన్నారు. కేవలం ఒకే ఒక్క కంప్యూటర్, కొద్దిపాటి ఫర్నీచర్ మాత్రమే ఉంది.

ఇతర సిబ్బంది, అధికారుల గురించి ఆరా తీసినప్పుడు వారంతా క్యాంపులో ఉన్నారని కార్యాలయంలో ఉన్న వారు చెప్పారు.

ఆంధ్ర్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఉన్న ఈ ఆఫీసులో మొత్తం 23 మంది సిబ్బంది ఉంటారని తెలిపారు. ఎక్కువగా ఫీల్డ్ లో ఉంటారని, ఆఫీసులో అందుబాటులో ఉండరని కూడా చెప్పారు.

ప్రస్తుతం ఈ కార్పోరేషన్ కి సీఎండీగా ఉన్న యూ జే ఎం రావుని ఫోన్ లో బీబీసీ సంప్రదించింది. ఆయన విశాఖలో ఉన్నట్టు తెలిపారు. అంతేగాకుండా, తనతో పాటుగా సిబ్బందిలో అత్యధికులు విశాఖలోని రీజనల్ కార్యాలయం నుంచి పనిచేస్తున్నట్టు తెలిపారు. విజయవాడ ఆఫీసులో కేవలం ముగ్గురిని ఉంచి మిగిలిన వారంతా విశాఖ డాబాగార్డెన్స్ లో ఉన్న రీజనల్ కార్యాలయం నుంచి పని చేస్తున్నట్టు చెప్పారు.

తీరా విజయవాడ ఆఫీసు మాత్రమే కాకుండా విశాఖ కార్యాలయం కూడా అదే సమయానికి ఖాళీగా కనిపించింది.

మెట్రో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హైదరాబాద్ మెట్రో

ఈ సంస్థ ఎందుకు?

రాష్ట్ర విభజన తర్వాత 2015 అక్టోబర్ 29న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థగా ఏపీ మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ ఏర్పాటైంది. విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో రైల్ అభివృద్ధి లక్ష్యం. ఆ తర్వాత విజయవాడ మెట్రోని అమరావతి వరకూ పొడిగించాలని ప్రతిపాదన సిద్ధం చేశారు.

తొలుత ఎండీగా ఉన్న ఎన్ పీ రామకృష్ణారెడ్డి సారథ్యంలో అమరావతి మెట్రో కోసమంటూ దిల్లీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అధికారి శ్రీధరన్ తో ఎంవోయూ కూడా కుదుర్చుకున్నారు. డీపీఆర్ కూడా సిద్ధం చేసి కేంద్రానికి ప్రతిపాదించారు. కానీ దానిని కేంద్రం తిరస్కరించింది. లైట్ మెట్రో ప్రాజెక్ట్ పేరుతో చేసిన ప్రయత్నం ముందుకు సాగలేదు. కొరియా, మలేసియా సంస్థల సహకారం తీసుకుని ముందుకు సాగుతామని ఏపీ ప్రభుత్వం చెప్పినప్పటికీ కేంద్రం నుంచి సహకారం లేకపోవడంతో అది ముందుకు సాగలేదు.

తదుపరి విశాఖ మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ(వీఎంఆర్డీయే) పరిధిలో మెట్రో ప్రాజెక్ట్ తో పాటుగా విజయవాడ నగరంలో మెట్రో ప్రాజెక్టు కోసం ఏపీ మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్(ఏపీఎంఆర్సీఎల్) పనిచేస్తుందని ప్రకటించారు.

మెట్రో

ఫొటో సోర్స్, Getty Images

8 ఏళ్లలో ఏం సాధించారు?

విజయవాడ, విశాఖ మెట్రోల కోసం ప్రయత్నాలు జరిగాయి. 2016 డిసెంబర్‌లో సుమారు 13.27 కిలోమీటర్ల పొడవున విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ కారిడార్ కోసం నిధులు కేటాయించారు. నిడమనూరు నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకూ ఉండే తొలిలైన్ లో భూ సేకరణ కోసం రూ. 100 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.

కానీ అది ముందుకు సాగలేదు. చివరకు ఇటీవల భూసేకరణ నోటిఫికేషన్ కూడా ఉపసంహరించుకుంటూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు విడుదల చేశారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ గడువు 2019లోనే ముగిసినందున, భవిష్యత్తులో అవసరమైతే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో ప్రస్తావించారు.

విజయవాడ రూరల్ మండలంలో ఉన్న ఎనికేపాడులోని వివిధ సర్వే నెంబర్లలో 3272.55 గజాల భూమిని సమీకరించేందుకు ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవడంతో ప్రస్తుతానికి విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ ప్రయత్నాలు మూలన పడినట్టేననే భావన కనిపిస్తోంది.

అదే సమయంలో విశాఖలో కూడా కొమ్మాది నుంచి స్టీల్ ప్లాంట్ వరకూ ఎన్ హెచ్-16 ఎంబడి 34.23 కిలోమీటర్ల పొడవు, గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్ వరకూ 5.26 కిలోమీటర్లు, తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకూ ఆర్కే బీచ్ మీదుగా 6.91 కిలోమీటర్లు, లా కాలేజ్ జంక్షన్ నుంచి మారికివలసకి 8.21 కిలోమీటర్లు, కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్ పోర్ట్ కి 25.3 కిలోమీటర్ల పొడవు ఉండేలా లైట్ మెట్రో రైల్ కారిడార్‌ను ప్రతిపాదించారు.

దాంతో పాటుగా అనకాపల్లి, పెందుర్తి, రుషికొండ బీచ్ ప్రాంతాలకు మెడర్న్ ట్రామ్ వే కూడా ప్రతిపాదనలో ఉంది.

కానీ ఇప్పటి వరకూ ఇవి పట్టాలెక్కలేదు. కనీసం తుది డీపీఆర్ రూపొందించి, దానికి కేంద్రం నుంచి ఆమోదం సంపాదించిన పరిస్థితి కూడా లేదు.

మెట్రో

ఫొటో సోర్స్, Getty Images

విశాఖ మీదనే కేంద్రీకరణ

మెట్రో ప్రాజెక్టుల కోసం నిధుల సమీకరణ, రవాణా ప్రణాళిక, డీపీఆర్ రూపొందించడం వంటివి రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. దానికి తగ్గట్టుగా ఏపీఎంఆర్సీఎల్ ఆ బాధ్యత నెరవేర్చుతుందని ఏపీ ప్రభుత్వం తొలుత ఆశించింది. కానీ ఇప్పటి వరకూ మెట్రో రైల్ కార్పొరేషన్ ఆ దిశగా విజయవంతం అయినట్టు కనిపించడం లేదు

"ప్రస్తుతం విశాఖ మీద కేంద్రీకరించాం. ఏపీలోనే పెద్ద నగరం. అన్ని రకాలుగా అవసరం ఉంది. మెట్రో అందుబాటులోకి వస్తే ఆదాయానికి కూడా ఢోకా లేదు. అందుకే అన్నింటినీ పరిశీలించి విశాఖలో మెట్రో ఏర్పాటు కోసం కసరత్తులు చేస్తున్నాం. ఇక్కడే దృష్టి కేంద్రీకరించడం కోసం సిబ్బందిని మళ్లించాం. కేంద్రం కూడా సహకరిస్తుందని ఆశిస్తున్నాం. ఎప్పటికి నిర్మాణం ప్రారంభమవుతుందన్నది ఇప్పుడే చెప్పలేం గానీ మెట్రో సాధన మీద ఆశావహంతో ఉన్నామని" ఏపీ మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ సీఎండీ యూజేఎం రావు బీబీసీకి తెలిపారు.

8 ఏళ్లుగా కార్పోరేషన్ వల్ల ప్రయోజనం లేదనే వాదన వాస్తవం కాదని, తమ ప్రయత్నాలు చేస్తున్నామని, అవి పూర్తిగా ఫలించడానికి కొంత సమయం పడుతుందని అన్నారు.

వీడియో క్యాప్షన్, కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రూట్ : ఈ రైలు ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణిస్తుంది?

ఖర్చు తప్ప లాభం లేదు...

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న సమయంలో మెట్రో ప్రాజెక్టు వంటివి కేంద్రం తోడ్పాటు లేకుండా సాధ్యం కాదని రిటైర్డ్ రైల్వే మేనేజర్ ఆర్ సునందరావు అభిప్రాయపడ్డారు. మెట్రో రైలు వ్యవహారం త్వరగా కొలిక్కి వచ్చే అంశం కాదని, ఇప్పటి వరకూ సిబ్బందికి జీతాలు, ఇతర ఖర్చులు భరిస్తూ ఇంతకాలం పాటు ఆ కార్పొరేషన్ కొనసాగించిన తీరు ఆశ్చర్యంగా ఉందన్నారాయన.

"దేశవ్యాప్తంగా మెట్రో రైళ్ల విషయంలో అనేక అనుభవాలున్నాయి. ఏపీ ప్రభుత్వం ఆడంబరాలకు పోకుండా వాటిని గమనంలో తీసుకోవాలి. హైదరాబాద్ వంటి మహానగరాల్లోనే మెట్రో పరిస్థితి ఆశాజనకంగా లేదనే వాదన ఉంది. అలాంటిది విజయవాడ, విశాఖ నగరాలకు మెట్రో అంటే కేంద్రం అంగీకరిస్తుందా? తొలుత విశాఖని కాదని అమరావతికి మెట్రో పేరుతో చేసిన డీపీఆర్ ని కేంద్రం తిరస్కరించింది. ఇప్పటికైనా విశాఖ విషయంలో సమగ్ర పరిశీలన అవసరం. దానికోసమంటూ పదుల సంఖ్యలో సిబ్బందిని కార్పోరేషన్ కి కేటాయించడం ఖర్చు తప్ప ప్రయోజనం ఉండదని" అభిప్రాయపడ్డారాయన.

2017 మెట్రో రైల్ పాలసీ ప్రకారం కేంద్రం ఇప్పటికే మళ్లీ ప్రతిపాదనలు పంపించాలని రాష్ట్రాలకు చెప్పిందని అలాంటప్పుడు విజయవాడలో లేని మెట్రో ప్రాజెక్ట్ కోసం ఆఫీసు నిర్వహణ ఎందుకని సునందరావు ప్రశ్నించారు. ప్రజాధనం వినియోగం విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన కోరారు.

వీడియో క్యాప్షన్, ఒడిశా ప్రమాదం: ఏ రైలుకు, ఏ నిమిషానికి, ఏం జరిగింది?

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)