విశాఖ ఏజెన్సీ - రంగు రాళ్లు: ఐశ్వర్యా రాయ్ ఉంగరం పేరుతో ఇక్కడ రూ.కోట్ల వ్యాపారం ఎలా జరుగుతుందంటే....

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం...
క్యాట్స్ ఐ, ఎలెక్స్, అలగ్జాండ్రైట్.. ఇవన్నీ అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో దొరికే విలువైన రంగురాళ్ల పేర్లు.
ఈ రంగురాళ్లకు కొందరు ప్రముఖులకు లింక్ పెట్టి.. వారు ధరించేవి ఇవేనంటూ మార్కెట్ చేస్తారు.
అందుకే తూర్పు కనుమల్లో దొరికే రంగురాళ్లకు దశాబ్దాలుగా డిమాండ్ ఉంది. ఇలాంటి రాళ్లు దొరుకుతాయనే ఆశతో కొద్దిపాటి వర్షాలు పడినప్పుడు గిరిజనులు బృందాలుగా వెళ్లి కొండ ప్రాంతాలలో తవ్వకాలు జరుపుతుంటారు.
‘‘రంగురాళ్లు ఉన్న మట్టిని సంచుల్లో నింపి అదే ప్రాంతంలో ఉండే దళారికి అప్పగిస్తారు. ఆ మట్టిలో కనిపించిన రాళ్ల ఆధారంగా దళారులు గిరిజనులకు డబ్బు ఇస్తారు. సాధారణంగా రూ. వెయ్యి ఇస్తారు. ఒకవేళ అందులో విలువైన రాళ్లేవీ లేవనుకుంటే సబ్బులు, ఫేస్ క్రీంలు, టార్చ్ లైట్లు వంటి చిన్నచిన్న వస్తువులు బహుమతులుగా ఇస్తారు" అని ఈ ఏడాది మే మొదటి వారంలో చింతపల్లి మండటం సిగనాపల్లి కొండపై రంగురాళ్ల తవ్వకాల పనికి వెళ్లిన ఓ గిరిజనుడు బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, koti
రంగురాళ్లు ఎలా ఏర్పడతాయి?
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సిగనాపల్లి, గుర్రాలగొందితో పాటు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్‌లోని ఆరిలోవ, సారికమల్లవరం ప్రాంతాల్లో రంగురాళ్ల తవ్వకాలు జరుగుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అయితే గతంతో పోల్చితే ఈ తవ్వకాలు బాగా తగ్గాయని తెలిపారు.
ఈ ప్రాంతాల్లో రంగురాళ్లు ఎలా ఏర్పడతాయో తెలుసుకునేందుకు ఆంధ్ర యూనివర్సిటీ జియాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైరైన కృష్ణారావుతో బీబీసీ మాట్లాడింది.
‘‘భౌగోళికంగా కొన్ని ప్రాంతాలలో ఉండే ఉష్ణోగ్రతల వలన అక్కడ సహజంగా ఉండే రాళ్లు గ్రహించే కాంతిని బట్టి వాటికి ప్రత్యేక లక్షణాలు ఏర్పడి అవి రూపాంతరం చెందుతాయి. ఈ ప్రక్రియ వందల ఏళ్లు జరుగుతుంది. దాంతో ఆ రాళ్ల ఉపరితల రంగు, అంతర్గత లక్షణాల్లో మార్పులు ఏర్పడతాయి. ఈ తరహా రాళ్లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. వాటినే మనం విలువైన రాళ్లు, రంగురాళ్లు అంటాం. తూర్పు కనుమల్లో ఈ తరహా రంగురాళ్లు దొరుకుతాయి’’ అన్నారు ప్రొఫెసర్ కృష్ణారావు.

ఎవరు తవ్వుతున్నారు? ఎలా తవ్వుతున్నారు?
చింతపల్లి అటవీ ప్రాంతంలోని కొండలపై రంగురాళ్ల తవ్వకాలు జరుగుతున్నాయని తెలిసి విశాఖ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ శ్రీకంఠనాధ్ రెడ్డి ఆ ప్రాంతాలను సందర్శించారు. అక్కడ రంగురాళ్ల తవ్వకాలు జరిగిన ఆనవాళ్లను గుర్తించారు.
“రంగురాళ్ల తవ్వకాలకు పెద్ద పెద్ద యంత్రాల అవసరం ఉండదు. కేవలం పార, గునపాలతో తవ్వుతారు. రంగు రాళ్లు ఉండొచ్చని భావించే ప్రాంతాలలో ఈ తవ్వకాలు జరుపుతారు. ఎలుక కన్నాలు పెట్టినట్లు కొండ ప్రాంతంలో నిలువుగా, భూ ఉపరితలంపై కన్నాలు చేసుకుంటూ వెళ్తుంటారు. అక్కడ దొరికే మట్టిని సంచుల్లో వేసుకుని తీసుకుని వస్తారు.” అని శ్రీకంఠనాథ్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
ఆ మట్టిని దళారులు కొంటారు. రంగు రాళ్లు ఎన్ని ఉండొచ్చు? ఎలాంటి విలువైనవి ఉండొచ్చనే అంచనా ప్రకారం ధర నిర్ణయిస్తారు. ‘అలెగ్జాండరైట్’ అనే రాయి రాత్రి సమయంలో ఒక రంగులో.. ఉదయం మరో రంగులో ఉంటుందని.. అలెగ్జాండర్ ఈ తరహా రాయినే వాడేవాడని, అదే అతడి విజయాలకు కారణమని, అతని పేరు మీద ఈ రాయికి అలెగ్జాండరేట్ అనే పేరు వచ్చిందని చెప్తూ దళారులు వాటిని మైదాన ప్రాంతంలో ఉండే వ్యాపారులకు విక్రయిస్తారని శ్రీకంఠనాధ్ రెడ్డి తెలిపారు.
రంగురాళ్ల తవ్వకాలు ఏడాది పొడవునా జరగవని, చిన్నపాటి వర్షాలు పడినప్పుడు మాత్రమే గిరిజనులు ఈ తవ్వకాలు చేస్తారని చెప్పారు.

ఏజెన్సీలో దొరికే ఏ రాళ్లు విలువైనవి
రంగు రాళ్లు అన్ని విలువైనవే అనుకుంటారు, కానీ ఏదైనా రంగురాయికి ధర అనేది అది లభించిన ప్రాంతంతో పాటు దాని ఆకృతి, రంగు, పారదర్శకతపై ఆధారపడి ఉంటుందని విశాఖకు చెందిన సర్టిఫైడ్ జెమాలజిస్ట్ మనోజ్ బీబీసీతోచెప్పారు.
మార్కెట్ లో విలువ ఉన్న రాళ్లు వాటికున్న ప్రాధాన్యం రీత్యా అమ్ముడవుతుంటాయి. ‘అల్లూరి’ జిల్లాలో దొరికే రంగురాళ్లలో నాలుగు రకాలైన రాళ్లకు ఎక్కువ విలువ ఉంటుంది.
1. సిల్లిమనైట్ క్యాట్స్ ఐ: ఇది మధ్యరకం విలువైన రాయి. సహజసిద్ధమైన రంగురాయిగా దీనికి పేరు. దీనిని ధరించడం స్టేటస్ సింబల్‌గా భావిస్తారు.
2. క్రిసోబెరిల్ క్యాట్స్ ఐ: దీనిని వైఢూర్యం అని అంటారు. దీనిని జాతకపరంగా వాడతారు. అందుకే దీనికి డిమాండ్.
3. ఎలెక్స్: ఇది విదేశాల్లో బంగారు నగల అభరణాల తయారీలో ఎక్కువగా వాడతారు. కాంతి పడినప్పుడు రంగు మారడం దీని ప్రత్యేకత.
4. స్పినెల్: ఇది కూడా మధ్యరకం విలువైన రాయి. ఇది నీలం రంగులో ఉండటంతో జాతకాల కోసం వాడే మయూర నీలం అని చెప్పి అమ్ముతుంటారు. కానీ ఇది అది కాదు.
‘‘మరో విలువైన రాయి టర్కోయిస్. దీనినే ఫిరోజా అని అంటారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ బ్రేస్‌లెట్‌లో ఈ రాయే ఉంటుందంటూ చాలామంది ఈ రాయి కావాలని అడుగుతుంటారు. కానీ, ఇది తూర్పు కనుమలలో దొరకదు. ఇక్కడ దొరక్కపోయినా ఈ రాయి కోసం స్థానికంగా అడుగుతుంటారు.
అలాగే అంబర్.. ఇది చెట్ల జిగురు శిలాజంగా మారి రాయిలా గట్టిపడిన రూపం. అందుకే ఇందులో ఒక్కోసారి కీటకాలు చిక్కుకుని కనిపిస్తుంటాయి.
ఈ రాయిలోపల కీటకాలు ఉన్నట్లు బయటకు స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఈ ప్రత్యేకత వల్ల వీటికి డిమాండ్ ఎక్కువ’’ అని మనోజ్ తెలిపారు.
కొన్నిసార్లు సాధారణ రంగు రాళ్లను విలువైన రంగురాళ్లుగా చెప్పి విక్రయిస్తుంటారు. అలాంటి రాళ్లు క్రమంగా రంగు కోల్పోవడం, పగిలిపోవడం లాంటివి జరుగుతుంటాయి.

‘నమ్మకాలే అమ్మకాలకు ఆధారం’
అరుదుగా దొరికే వాటికి ఎప్పుడూ ఎక్కువ విలువ ఉంటుంది. ఈ రంగురాళ్లు కూడా అలాంటివే. అంతేకానీ వీటికి ఎలాంటి ప్రత్యేకతమైన శక్తులు ఉండవని 1990లలో రంగురాళ్ల వ్యాపారం చేసి నష్టపోయిన నర్సీపట్నానికి చెందిన ఒక రంగు రాళ్ల వ్యాపారి చెప్పారు.
‘‘ఐశ్వర్యరాయ్ చేతి ఉంగరంలో కనిపించే రంగురాయి నర్సీపట్నం ప్రాంతంలో దొరికిందేనంటూ ఇక్కడ ఇప్పటికీ ప్రచారం జరగుతుంది. ఆమె విజయాలను చూసి మిగతా అనేక మంది సినీ తారలు, రాజకీయ నాయకులు కూడా ఇక్కడి రంగురాళ్ల కోసం వారి మనుషులను పంపించేవారు. దాంతో ఈ రాళ్లకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. జైపూర్ నుంచి అనేక మంది వర్తకులు వచ్చి నెలల తరబడి ఇక్కడే బస చేసి కూలీలతో తవ్వకాలు జరిపించేవారు. అలా లక్షలు సంపాదించినవారు ఉన్నారు, పొగొట్టుకున్నవారు ఉన్నారు. ఇక్కడ జరిగే వ్యాపారమంతా జనం, దళారులు, వ్యాపారులు చెప్పే కథలపైనే ఆధారపడి ఉంటుంది’ అని ఆ వ్యాపారి అన్నారు.
నర్సీపట్నం ప్రాంతంలో చాలా మందికి ఇది సీజనల్ బిజినెస్, రంగురాళ్ల వ్యాపారం చేయడమంటే అదృష్టాన్ని పరీక్షించుకోవడమేనని చెప్పారు.

ఫొటో సోర్స్, koti
‘కోట్ల రూపాయల వ్యాపారం అబద్ధం’
ఈ ఏడాది మే మొదటివారంలో చింతపల్లి మండలం సిగనాపల్లిలో మూడు రోజుల తవ్వకాలు జరిగినట్లు అధికారులకు సమాచారం అందింది. ఆ మూడురోజుల్లోనే రూ. 2 కోట్ల విలువైన రంగురాళ్లు దొరకాయంటూ వార్తలు వచ్చాయి. దీంతో అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ పరిస్థితిని అంచనా వేశారు.
“సిగనాపల్లిలో తవ్వకాలు జరిగిన ప్రాంతానికి వెళ్లాం. కొందరు చిన్నచిన్న పనిముట్లతో తవ్వకాలు చేసినట్లు అక్కడ ఆధారాలు కనిపించాయి. అయితే కోట్ల రూపాయల రంగురాళ్లు దొరికాయనే మాటలు అవాస్తవం.” అని సీసీఎఫ్ శ్రీకంఠనాధ్ రెడ్డి అన్నారు.
దళారులు ఎక్కడో ఉంటూ గిరిజనులను ఈ పనులకు వాడుకుంటున్నారు. ఆ అడవుల్లో గిరిజనులు ఏ పనికి వెళ్తున్నారో చెప్పడం కష్టం. మూడు గంటల పాటు కాలినడకన కొండపైకి ఎక్కి అక్కడ తవ్వకాలు చేస్తుంటారు. వారి వద్దకు చేరుకోవడమే చాలా కష్టమవుతుంది. రంగురాళ్ల కోసం పెట్టిన రంధ్రాలతో కొండ మట్టి జారిపోయే ప్రమాదం ఉంది. అది తవ్వకాలు జరిపే గిరిజనుల ప్రాణాలకు ప్రమాదం. ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేసి రంగురాళ్ల తవ్వకాలు జరగకుండా చూస్తామని ఆయన తెలిపారు.
రంగురాళ్ల తవ్వకాల్లో ఇప్పటీ వరకు ముగ్గురు చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.

ఫొటో సోర్స్, koti
‘రంగురాళ్ల పేరుతో గిరిజనుల ప్రాణాలతో చెలగాటం’
రంగురాళ్ల తవ్వకాల కోసం దళారులు గిరిజనుల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారని గిరిజన సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నలుగురైదుగురు రోజంతా తవ్వితే ఏదైనా రాయి దొరికితే వెయ్యో, రెండు వేలో చేతిలో పెడతారని.. లేదంటే టీ డబ్బులు ఇచ్చి పంపించేస్తారని గిరిజన సంఘం నాయకులు కృష్ణ అన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
గిరిజనులకు రంగురాళ్ల తవ్వకాలు వెళ్లవద్దని అవగాహన కల్పిస్తూ...గిరిజన గ్రామాల్లో అటవీ శాఖ సిబ్బంది తిరుగుతుందని సీసీఎఫ్ శ్రీకంఠనాథ్ రెడ్డి చెప్పారు. అక్రమ తవ్వకాల్లో ఏ నష్టం జరిగినా అది దళారులు, వ్యాపారులకు కాదనే విషయం వారికి అర్థమయ్యేలా చెప్తున్నామని, అలాగే వారు జీవన భృతి కోసం ప్రభుత్వ పథకాలను వాడుకోవాలి కానీ, ఇలా అక్రమంగా రంగురాళ్ల తవ్వకాలు వంటి పనులు చేయకూడదని వారికి తెలియజేస్తున్నామని శ్రీకంఠనాధ్ రెడ్డి చెప్పారు.
‘రంగురాళ్ల రాజకీయం’
రంగురాళ్ల తవ్వకాలు రాజకీయంగా కూడా ఎప్పుడూ వివాదాస్పద అంశమే. దశాబ్దాలుగా అధికార, ప్రతిపక్ష స్థానాలలో ఏ పార్టీలున్నా రంగురాళ్ల తవ్వకాల విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. రాజకీయ ఆరోపణలకు రంగురాళ్ల తవ్వకాలు ఎప్పుడు ఒక అస్త్రంగా ఉపయోగపడుతుంటాయి. ప్రస్తుతం కూడా అదే జరుగుతోంది.
సాలిక మర్లవరం రిజర్వ్ ఫారెస్ట్ వద్ద రంగురాళ్ల కోసం అక్రమంగా మట్టిని తరలించుకుపోతున్నారంటూ మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఈ మట్టి విలువ రూ. 15 కోట్లు ఉంటుందని, ఈ తవ్వకాలు వెనుక అటవీశాఖ సిబ్బంది, పోలీసులు ప్రమేయం ఉందని.. ఇదంతా నడిపిస్తున్నది నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ అంటూ అయ్యన్నపాత్రుడు వీడియో ఒకటి విడుదల చేశారు.
ఈ ఘటనలో ఎవరెవరికి సంబంధం ఉందో అందరిపైనా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
“రంగురాళ్ల తవ్వకాలతో తాను ఒక్క రూపాయి అయినా సంపాదించినట్టు నిరూపిస్తే తక్షణమే రాజకీయాల నుంచి తప్పుకుంటా. అయ్యన్నపాత్రుడు మా ప్రభుత్వంపై కక్షతోనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రంగురాళ్ల తవ్వకాలలో కోట్లు సంపాదించారు.” అని ఎమ్మెల్యే గణేష్ ప్రత్యారోపణలు చేశారు.
ఇవి కూడా చదవండి:
- రూ. 2,000 నోట్ల వాడకాన్ని ఆపేసిన ఆర్బీఐ.. మీ దగ్గర ఉన్న నోట్లను ఎలా మార్చుకోవాలి?
- నాసిక్: త్రయంబకేశ్వర ఆలయంలో ముస్లింలు ధూపం సమర్పించారా... వైరల్ వీడియోలో ఏముంది, అసలేం జరిగింది?
- జనసేన: పార్టీలకు ఎన్నికల గుర్తులను ఈసీ ఎలా కేటాయిస్తుంది?
- కరీంనగర్ - ఆశ: ఒకప్పుడు భిక్షాటనతో బతికిన హిజ్రా.. ఇప్పుడు ఫొటోగ్రాఫర్ ఎలా అయ్యారు?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














