వీర్యదానం: ఆమె ముగ్గురు నాన్నల కూతురు...థ్రిల్ల‌‌ర్‌ను తలపించే స్టోరీ

ఈవ్ విలీ

ఫొటో సోర్స్, EVE WILLEY

ఫొటో క్యాప్షన్, ఈవ్ విలీకి 16 ఏళ్లు ఉండగా ఆమె స్పెర్మ్ డొనేషన్ ద్వారా పుట్టారని తెలిసింది.
    • రచయిత, ఈవ్ విలే
    • హోదా, బీబీసీ న్యూస్

తాను స్పెర్మ్ డొనేషన్ ద్వారా పుట్టానని ఈవ్ విలీకి 16 సంవత్సరాల వయసులో తెలిసింది.

అమెరికాలోని టెక్సాస్‌లో నివసిస్తున్న ఈవ్‌కి ఇది ఆశ్చర్యం కలిగించింది. అయితే ఆ తర్వాత తన అసలు తండ్రి ఎవరనే ఉత్సుకతతో పాటు, ఆమె కొన్ని షాకింగ్ నిజాలను తెలుసుకోవాల్సి వచ్చింది.

వాస్తవానికి ఈవ్‌ను పెంచిన తండ్రి ఆమెకు 7 సంవత్సరాల వయస్సులో ఉండగా గుండె జబ్బుతో మరణించారు.

అనంతరం ఈవ్ తన స్పెర్మ్ డోనర్ బయోలాజికల్ తండ్రిని కలిశారు. ఆమె ఆ వ్యక్తిని నాన్న అని పిలవడం కూడా మొదలుపెట్టారు.

అంతేకాదు ఆమె తన వివాహంలో ఆయనకు తండ్రి గౌరవాన్ని కూడా ఇచ్చారు. కానీ ఈవ్ కొడుకు అనారోగ్యం పాలవడంతో కథ మరో మలుపు తిరిగింది. ఈవ్ తండ్రిగా మరో పేరు తెరమీదకి వచ్చింది.

ఈవ్ పుట్టినప్పుడు జరిగిన విచిత్రమైన డ్రామా అది. బీబీసీ అవుట్‌లుక్‌ ద్వారా తన కథను ఈవ్ విలే అందరితో పంచుకున్నారు.

ఈవ్ విలీ

ఫొటో సోర్స్, EVE WILLEY

అతిపెద్ద కుటుంబ రహస్యం నేనే

''ఆ సమయంలో నేను కాలేజీ విద్యార్థిని. ఒక రోజు నేను మా అమ్మ ఈమెయిల్‌ అకౌంట్‌ ఓపెన్ చేశాను. ప్రత్యేక కారణం ఏం లేదు, కానీ నేను మెయిల్‌ని తనిఖీ చేశాను.

నా తల్లికి కాలిఫోర్నియా క్రయోబ్యాంక్ అనే అకౌంట్ నుంచి నిరంతరం మెయిల్స్ వచ్చాయి.

ఒక మెయిల్‌లో నా పుట్టినరోజు గురించి కూడా ప్రస్తావించారు. ఆ మెయిల్ చూడగానే ఖచ్చితంగా ఏదో తప్పు జరిగిందని అర్థమైంది.

వెంటనే గూగుల్‌లో కాలిఫోర్నియా క్రయోబ్యాంక్ గురించి వెతికాను. అప్పుడు అది కృత్రిమ గర్భధారణ కేంద్రం అని తెలిసింది.

నేను ఇదే ఆసుపత్రి నుంచి మా అమ్మకు కృత్రిమ గర్భధారణ ద్వారా జన్మించానని తెలియడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. ఇది తెలుసుకున్న తర్వాత షాక్ అయ్యాను. అయోమయంలో పడ్డాను.

ప్రతి కుటుంబానికి కొన్ని రహస్యాలు ఉంటాయి. కానీ మా కుటుంబంలోని అతిపెద్ద రహస్యం నేనే అని తెలిసింది.

స్టీవ్‌తో ఈవ్

ఫొటో సోర్స్, EVE WILLEY

ఫొటో క్యాప్షన్, స్టీవ్‌తో ఈవ్

తండ్రి కోసం వెతుకులాటలో చిత్రవిచిత్రాలు

నన్ను పెంచిన తండ్రి పేరు డౌగ్. ఆయనే నా సొంత తండ్రి అనుకున్నా. నా చిన్నతనంలోనే డౌగ్ చనిపోయారు. కానీ, నేను తెలుసుకున్న ఈ కొత్త నిజం నాకు తండ్రి లేడనే విషయాన్ని మరచిపోయేలా చేసింది.

అందుకే నాన్న కోసం వెతకాలనుకున్నా. 18 ఏళ్ల వయస్సులో ఆయన కోసం వెతకడం ప్రారంభించా. నా తల్లి మెడికల్ పేపర్లను వెతికాను.

1980లలో నేను మా అమ్మ కడుపులో ఉన్నాను. అప్పట్లో ఆస్పత్రిలో స్థానిక దాతల ద్వారానే కృత్రిమ గర్భధారణ చేసేవారు. స్పెర్మ్ దాత గురించి వారికి ఎటువంటి సమాచారం ఇవ్వరు.

నిజానికి మా ఊరు చాలా చిన్నది. అయితే, ఆ రోజుల్లో వీర్యాన్ని దానం చేసిన వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయడమంటే గడ్డివాములో సూది వెతకడమే.

మా నాన్న ఎవరో కనుక్కోవడానికి మా ఊరు వెళ్లలేకపోయాం. అందుకే మేం ఆసుపత్రి వైపు నుంచి ప్రయత్నాలు చేశాం.

కాలిఫోర్నియా క్రయోబ్యాంక్‌లో స్పెర్మ్ డోనర్‌ను ఎంచుకునే స్వేచ్ఛ స్వీకర్తకు ఉంటుంది. సంబంధిత దాత పేరు చెప్పనప్పటికీ ఆ వ్యక్తి శారీరక స్థితి, అభిరుచులు, విద్య, బ్లడ్ గ్రూప్, ఇతర ముఖ్యమైన సమాచారం స్పెర్మ్ స్వీకర్తల ముందు ఉంచుతారు.

ఇది మనకు నచ్చిన ప్రొఫైల్‌ను ఎంచుకుని, కృత్రిమ గర్భధారణ పొందే వ్యవస్థ.

ఆ సమయంలో నా తల్లిదండ్రులు ప్రొఫైల్ నంబర్ 106ని ఎంచుకున్నారని నాకు సమాచారం వచ్చింది. మా అమ్మ ఆ రశీదును భద్రపరిచారు.

మొదట్లో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. కానీ తర్వాత ఆయన్ను తన నాన్నలాగా కలవాలని అనిపించింది.

నేను ప్రొఫైల్ నంబర్ 106 గురించి కాలిఫోర్నియా క్రయోబ్యాంక్‌‌లో ఎంక్వైరీ చేశాను. చివరగా ఒక సంవత్సరం ఫాలోఅప్ తర్వాత, నాకు ఆయన ఈ-మెయిల్ ఐడీ వచ్చింది.

మేం మొదట ఈ-మెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా మాట్లాడుకోవడం ప్రారంభించాం.

నా తండ్రి పేరు స్టీవ్ అని తెలిసింది. ఆయనది చాలా మంచి వ్యక్తిత్వం. ఇదంతా సరదాగా, మంచి కలలా అనిపించింది.

స్టీవ్‌, ఈవ్ ఫ్యామిలీ

ఫొటో సోర్స్, EVE WILLEY

చిన్నారి డీఎన్‌ఏ నుంచి మరో మలుపు

కొన్నేళ్ల తర్వాత నాకు పెళ్లయింది. ఆ పెళ్లికి నాన్న స్టీవ్‌ని కూడా ఆహ్వానించాను. నా తండ్రిగా ఆయన ఈ పెళ్లికి హాజరయ్యారు.

ఏడాది తర్వాత నాకు హట్టన్ అనే అబ్బాయి పుట్టాడు. అన్నీ సవ్యంగా సాగుతున్న రోజులవి. కానీ, హఠాత్తుగా హట్టన్‌కు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి.

బాబు నిత్యం అనారోగ్యం బారిన పడేవాడు. వైద్యులు కూడా అతని పరిస్థితిని స్పష్టంగా నిర్ధారించలేకపోయారు.

హట్టన్ 3 ఏళ్లు ఉన్నప్పుడు మేం అతనికి డీఎన్‌ఏ టెస్టు చేయించాం.

హట్టన్‌కు జన్యుపరమైన వ్యాధి ఉందని డాక్టర్ చెప్పారు. హట్టన్‌కు సెలియాక్ డిసీజ్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉంది.

ఈ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చిందని డాక్టర్ చెప్పారు. నా ద్వారా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని, కొన్ని కారణాల వల్ల అది నాకు రాలేదని డాక్టర్ వివరించారు.

అది విని నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నా కుటుంబం లేదా తండ్రి స్టీవ్ కుటుంబంలో ఎవరికీ అలాంటి లక్షణాలు లేవు. అంతేకాదు హట్టన్‌ డీఎన్‌ఏ స్టీవ్‌తో సరిపోలలేదు.

దీంతో పరీక్ష సమయంలో నేను హట్టన్ డీఎన్‌ఏతో సరిపోలిన కొంతమంది వ్యక్తుల పేర్లను తెలుసుకున్నా. ఆ వ్యక్తులను సంప్రదించడానికి ప్రయత్నించాను.

కొన్ని రోజుల తర్వాత నా ప్రయత్నం ఫలించింది. నేను జాబితాలో నంబర్ వన్ వ్యక్తిని కలిశాను. అతను నా కంటే పెద్దవాడు.

ఆ వ్యక్తి మాటల్లో ఆశ్చర్యం కనిపించలేదు. "అవును నేను మీ సోదరుడిని అవుతాను. మీ బయోలాజికల్ తండ్రి ఎవరో కూడా నాకు తెలుసు" అన్నారు.

ఆయన చెప్పిన పేరు వినగానే నా కాళ్ల కింద భూమి కదిలింది.

మనకి కిమ్ మెక్‌మోరిస్ అనే వ్యక్తి తండ్రి అని, ఆయన ఓ ఆసుపత్రిలో డాక్టర్ అని చెప్పాడు. మీ తల్లికి కూడా కిమ్ చికిత్స అందించారని తెలిపారు.

నేను నమ్మలేదు. అందుకే ఆ తర్వాత లిస్టులో ఉన్న మరో ఇద్దరు, ముగ్గురితో మాట్లాడాను.

వారితో మాట్లాడాక చర్చలన్నీ మలుపు తిరుగుతూ ఒక పేరు మీదే ఆగిపోయాయి. అదే కిమ్ మెక్‌మోరిస్.

ఈవ్ విలీ కుటుంబం

ఫొటో సోర్స్, స్టీవ్‌తో ఈవ్

చివరకు తెలిసిన నిజం

కిమ్ మెక్‌మోరిస్ నా తల్లికి చికిత్స చేసిన డాక్టర్. ఆయన గురించి చివరకు నిజం తెలిసింది.

ప్రొఫైల్ నంబర్ 106 స్పెర్మ్‌కు బదులుగా నా తల్లికి గర్భధారణ చేయడానికి కిమ్ తన సొంత స్పెర్మ్‌ను ఉపయోగించారు.

కిమ్ మెక్‌మోరిస్ చాలామంది వ్యక్తులకు కూడా అలాగే చేసి ఉండాలి.

ఇది నాకు నిజంగా షాకింగ్. చికాకు కలిగించింది. నాన్న కోసం వెతుకులాట ఈ వైద్యుడి దగ్గరికి చేరుకుంది.

నా అసలు నాన్నను కలవడానికి చాలా కాలం వేచి ఉన్నా. డా. కిమ్‌ని కలవాలి. కానీ ఆయన్ను నాన్నగా అంగీకరించడానికి సిద్ధంగా లేను. ఆయన అమ్మకు చేసిన ద్రోహం గుర్తు చేసుకుంటే నా గుండె రగిలిపోతోంది.

అలాగే, ఇప్పుడు నేను నా తండ్రిగా భావిస్తున్న స్టీవ్‌ను మిస్సవుతానేమోనని భయపడ్డాను. ఆఖరికి అమ్మ గుర్తుకువచ్చింది. ఇదంతా ఆమెకు తెలిస్తే ఎంత బాధ పడుతుందో ఊహించలేకపోయాను.

ఆమెకు చెప్పాలా వద్దా? అనే సందిగ్ధంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను.

నాకు తెలిసినవన్నీ తెలియనట్లు నటించాలని ఒకానొక సమయంలో అనుకున్నా. ఇలా చేయడం వల్ల అందరూ సంతోషంగా ఉంటారు.కానీ, పూర్తిగా ఆలోచించిన తర్వాత నేను వాటిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను.

నేను అమ్మను చూడటానికి వెళ్లాను.

"అమ్మా, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. స్టీవ్ నా తండ్రి కాదు. నా తండ్రి ఒక డాక్టర్. కిమ్ మెక్‌మోరిస్. నీకు గర్భధారణ చికిత్స అందించిన వ్యక్తి." అని అన్నాను.

అమ్మ ఆశ్చర్యపోయింది. నేను చెప్పింది వినగానే ఆమె చేతులు వణికాయి. ఒక్కసారిగా కళ్ల ముందు చీకట్లు కమ్ముకుంటుండగానే బస్సు ఎక్కారు.

నా భర్త కూడా పక్కనే ఉన్నాడు. అంబులెన్స్‌కి కాల్ చేయలా అని కూడా అడిగారు. అమ్మ ‘వద్దు’ అన్నారు.

‘అతను చాలా మంచి మనిషి. ఇలా ఎలా చేశాడు?" అని అన్నారు. మేం ప్రశాంతంగా ఆమెకు వివరించాం.

నేను అమ్మతో "అమ్మా, జరిగింది ఘోరం. కానీ నేను దీనివల్లే నీ జీవితంలోకి వచ్చాను. ఇప్పుడు నీ కూతురు నీతోనే ఉంటుంది. ఎప్పటికీ నీతోనే ఉంటుంది. దాని గురించి చెడుగా ఆలోచించవద్దు" అన్నాను.

అమ్మ షాక్‌ నుంచి బయటకు రాలేదు. డా. కిమ్ మా అనుమతి లేకుండా శాశ్వతంగా మా జీవితంలోకి ప్రవేశించారు.

డెలివరీ

ఫొటో సోర్స్, EVE WILLEY

మెక్‌మోరిస్‌ ఏమన్నారు?

డా. కిమ్ మెక్‌మోరిస్‌పై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి క్రిమినల్ లేదా సివిల్ చట్టం నాకు ఉపయోగపడలేదు. ఎందుకంటే అప్పట్లో ఈ అంశం చట్టం పరిధిలోకి రాలేదు.

కానీ, నేను డా. మెక్‌మోరిస్‌కు లేఖ రాశాను. జరిగిన సంఘటన గురించి సమాధానం చెప్పమని మర్యాదగా అడిగాను.

అతని సమాధానం ఏమిటంటే "అవును, నిజమే కావచ్చు. కానీ ఇప్పుడు దాని రికార్డులు మా దగ్గర లేవు. ఎందుకంటే మేం ఆ రికార్డులను ఏడేళ్లు మాత్రమే ఉంచాం. అప్పట్లో నేను నా స్పెర్మ్ శాంపిల్స్‌ను కూడా అక్కడే ఉంచాను. ఎందుకంటే కొంతమంది స్పెర్మ్ దాతల నమూనాలు క్రయోబ్యాంక్‌లో ఫలదీకరణం కోసం ఉపయోగపడలేదు. నేను కూడా స్పెర్మ్ దాతనే. కృత్రిమ గర్భధారణ కోసం నా శాంపిల్స్‌ను కూడా ఉపయోగిస్తున్నాను.

మీ అమ్మ ఎలా అయినా తల్లి కావాలని కోరుకుంది. ఆమె చాలా కాలంగా ప్రయత్నించింది. అందుకే ఆమె కోసం నా స్పెర్మ్ సీసాని శాంపిల్స్‌లో ఉంచాను" అని తెలిపారు.

తన స్పెర్మ్‌ని ఈ విధంగా ఉపయోగించడంలో తప్పేమీ లేకుంటే, అప్పట్లో డాక్టర్ కిమ్ ఈ విషయం నా తల్లికి ఎందుకు చెప్పలేదు.

"నా స్పెర్మ్‌ని ఉపయోగించడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ" అని ఆయన ఆ సమయంలో మా అమ్మతో చెప్పి ఉండాల్సింది.

అలా చేసి ఉంటే అమ్మకి కూడా దాని గురించి స్పష్టమైన ఆలోచన ఉండేది. అది ఆమెకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు.

మెక్‌మోరిస్‌ కారణంగా ఈ విధంగా మోసపోయిన 13 మందిని కలిశాను. అదృష్టవశాత్తూ నా తండ్రిగా భావించిన స్టీవ్ ఇవన్నీ అర్థం చేసుకున్నారు.

ఆయన నన్ను వదిలేయలేదు. మా సంబంధం మరింత సన్నిహితంగా మారింది.

ఈవ్ లీ పోరాటంతో చట్టంలో మార్పులు

ఈవ్ విలీ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఈ తరహా చర్యను నేరాల పరిధిలోకి తీసుకొచ్చారు.

అలాగే అనేక రాష్ట్రాల్లో ఇటువంటి నేరాలకు భారీ జరిమానాలు విధించారు. ఈవ్ తన కథను బీబీసీ ఔట్‌లుక్ కార్యక్రమంలో చెప్పిన తర్వాత, చాలా మంది వ్యక్తులు ఆమెను సంప్రదించారు. తమకు కూడా ఇలాగే జరిగిందన్నారు.

ఈవ్ న్యాయ పోరాటం టెక్సాస్‌లో ప్రారంభమైంది. అప్పటి నుంచి దాదాపు 11 ప్రావిన్సులు కృత్రిమ గర్భధారణపై చట్టాలను రూపొందించాయి. ఈవ్ తన కథనాన్ని బీబీసీతో పంచుకోవడం ద్వారా అందరిలో అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తున్నారు.

"నా బాధ నుంచి నేను ఇవన్నీ వచ్చాయి. కాబట్టి నా బాధను మరచిపోవాలంటే నేను ఇవన్నీ చేయాలి'' అని ఆమె అన్నారు.

దీనిపై స్పందన కోసం బీబీసీ డా. కిమ్‌ను సంప్రదించడానికి ప్రయత్నించింది. కానీ దీనిపై ఆయన స్పందించలేదు.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)