బిడ్డను కనేందుకు ఒంటెపై ప్రయాణం.. ఏడు గంటల పాటు యువతి నరకయాతన

బాని సాద్ ఆస్పత్రికి ఒంటెపై వెళ్తోన్న గర్భిణీ

ఫొటో సోర్స్, SADAM ALOLOFY/UNFPA

ఫొటో క్యాప్షన్, బాని సాద్ ఆస్పత్రికి ఒంటెపై వెళ్తున్న గర్భిణి
    • రచయిత, చార్లీన్ అన్నే రోడ్రిగ్యూస్
    • హోదా, బీబీసీ న్యూస్

మోనా 19 ఏళ్ల యువతి. ఆమెకు, తన బిడ్డకు ఒంటెనే ప్రాణాధారంగా నిలిచింది.

రాకీ పర్వతాల పైనున్న తన ఇంటి నుంచి ఆస్పత్రికి చేరుకోవాలంటే నాలుగు గంటల సమయం పడుతుంది. 40 కి.మీ వరకు మోనా ప్రయాణించాల్సి ఉంటుంది.

కానీ, సరైన రోడ్లు లేకపోవడం, ప్రతికూల వాతావరణం, పురిటి నొప్పులతో మోనా ఆస్పత్రికి చేరుకోవడానికి ఏడు గంటలు పట్టింది.

‘‘ఒక్కొక్క అడుగు ఒంటె ముందుకు వేస్తుంటే, నేను తీవ్ర ప్రసవ వేదనను అనుభవించాను, నలిగిపోయాను,’’ అని మోనా తెలిపారు.

చివరి క్షణాల్లో ఒంటె మరింత ముందుకు నడవకపోవడంతో, మోనా ఒంటెను దిగి తన భర్తతో కలిసి కాలినడకనే ఆస్పత్రికి చేరుకున్నారు.

వాయువ్య యెమెన్‌లో మహవీత్ ప్రావిన్స్‌లో వేల మంది మహిళలకు ఆరోగ్య సదుపాయాలు అందిస్తున్న ఏకైక ఆస్పత్రి బాని సాద్ హాస్పిటల్.

అల్-మాఖారా గ్రామంలోని మోనా ఇంటి నుంచి ఈ ఆస్పత్రికి చేరుకోవడానికి ఒంటెలపై లేదా కాలినడకన ప్రమాదకరమైన ఎన్నో పర్వతాలను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది.

మోనా ఒంటెపై ఆస్పత్రికి చేరుకోవాలనుకున్నప్పుడు, ఆమె భద్రత గురించి, కడుపులో ఉన్న తన బిడ్డ గురించి చాలా భయపడ్డారు.

‘‘ఇక్కడ రహదారి అంతా రాళ్లు, రప్పలతో ఉంటుంది’’ అని మోనా తెలిపారు.

ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు మానసికంగా, శారీరకంగా తాను పడిన వేదనను మోనా గుర్తుకు చేసుకున్నారు.

‘‘నన్ను తీసుకెళ్లిపోయి, నా బిడ్డను కాపాడు అని ఎన్నిసార్లు దేవుడిని ప్రార్థించానో. దీని వల్ల నేను ఈ బాధ నుంచి విముక్తి పొందొచ్చని అనుకున్నాను’’ అని తెలిపారు.

ఆస్పత్రిలో వైద్యులు, నర్సుల చేతిలో ఉన్న తన బిడ్డ ఏడుపును విన్న తర్వాత ఆమెలో మళ్లీ జీవితంపై ఆశ చిగురించింది.

తన భర్తతో కలిసి మోనా తమ మగబిడ్డకు జర్రాహ్ అనే పేరు పెట్టారు.

సమీపంలోని గ్రామాల నుంచి ఆస్పత్రికి చేరుకోవాలంటే రహదారులు చాలా చిన్నగా ఉంటాయి.

సౌదీ కూటమి మద్దతు ఇస్తున్న ప్రభుత్వ అనుకూల దళాలకు, ఇరాన్ అండ ఉన్న హౌతీ తిరుగుబాటుదారులకు మధ్య ఎనిమిదేళ్లుగా సాగుతున్న అంతర్యుద్ధానికి చాలా రహదారులు బ్లాక్ అయ్యాయి. కొన్ని పాడైపోయాయి.

గర్భిణులను ఈ ఎత్తైన పర్వతాల గుండా ఆస్పత్రికి తరలించేందుకు వారి ఇంట్లోని మహిళలు, కుటుంబ సభ్యులు, భర్తలు సాయపడుతూ ఉంటారు.

బిడ్డతో మోనా

ఫొటో సోర్స్, SADAM ALOLOFY/UNFPA

ఫొటో క్యాప్షన్, బిడ్డతో మోనా

త్వరలోనే తల్లి కాబోతున్న 33 ఏళ్ల సల్మా అబ్దు తాను చూసిన ఒక సంఘటనను గుర్తుకు చేసుకున్నారు.

రాత్రి వేళ ఎత్తైన పర్వతాల గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఒక గర్భిణి మధ్యలోనే ప్రాణాలు విడిచినట్లు సల్మా అబ్దు చెప్పారు.

మహిళలపై, పిల్లలపై కాస్త దయ చూపించండని ప్రజల్ని సల్మా కోరుకున్నారు.

‘‘మాకు రహదారులు, ఆస్పత్రులు, ఫార్మసీలు కావాలి. మేం ఈ లోయలో చిక్కుకుపోయాం. అదృష్టవంతులు మాత్రమే సురక్షితంగా పిల్లలకు జన్మనిస్తారు. ఇతరులు మరణిస్తారు. ఆస్పత్రికి వెళ్లే మార్గంలో ఎన్నో ఇబ్బందులను మేం ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని సల్మా తెలిపారు.

కొన్ని కుటుంబాలకు మాత్రమే ఆస్పత్రి బిల్లులను చెల్లించే స్తోమత ఉంటుంది. కొందరికి ఆ బిల్లులు చెల్లించే శక్తి ఉండదు.

యెమెన్‌లోని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి(యూఎన్‌ఎఫ్‌పీఏ)కి చెందిన హిచామ్ నహ్రో నివేదించిన వివరాల ప్రకారం, యెమెన్‌లో పిల్లలను కనే సమయంలో ప్రతి రెండు గంటలకు ఒక మహిళ చనిపోతున్నట్లు తెలిసింది.

యెమెన్‌లోని మారుమూల ప్రాంతాల్లోని మహిళలు క్రమం తప్పకుండా చెకప్‌లు చేయించుకోరని, తీవ్ర రక్తస్రావం అవ్వడం ప్రారంభమైనప్పుడు లేదా పురిటి నొప్పులు బాగా వస్తేనే డాక్టర్ల సాయం కోరుతుంటారని నహ్రో చెప్పారు.

సగం కంటే తక్కువ జననాలు మాత్రమే డాక్టర్ల పర్యవేక్షణలో జరుగుతుంటాయి. కేవలం మూడింట ఒకవంతు మాత్రమే ప్రసవాలు ఆస్పత్రిలో అవుతున్నాయని యూఎన్‌ఎఫ్‌పీఏ తెలిపింది.

యెమెన్ జనాభాలో పావు వంతు మంది సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి గంటకు పైగా దూరంలో నివసిస్తున్నారు.

ఈ అంతర్యుద్ధానికి ముందు కూడా యెమెన్ ఆరోగ్య సదుపాయాలు ఇలానే ఉండేవి. ప్రజలు వైద్య సౌకర్యాలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది.

అంతర్యుద్ధం తర్వాత యెమెన్‌లో ఆస్పత్రికి వెళ్లే రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ఆస్పత్రికి చేరుకోవడం అసాధ్యమైన పనే.

ఆస్పత్రుల్లో కూడా నిపుణులైన వైద్యులు, ఉద్యోగులు లేరు. పరికరాలు, ఔషధాలు కూడా సరిగా అందుబాటులో ఉండటం లేదు.

రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై పెట్టుబడులు నిలిచిపోయాయి.

ఈ ఆస్పత్రుల్లో ఐదుగురిలో కేవలం ఒక్కరికి మాత్రమే అవసరమైన మాతృ సంబంధిత సౌకర్యాలను, పిల్లల ఆరోగ్య సేవలను అందిస్తున్నారని యూఎన్‌ఎఫ్‌పీఏ తెలిపింది.

బాని సాద్ ఆస్పత్రి వంటి ఆరోగ్య కేంద్రాలకు నిలిచిపోయిన అంతర్జాతీయ నిధులు

ఫొటో సోర్స్, SADAM ALOLOFY/UNFPA

ఫొటో క్యాప్షన్, బాని సాద్ ఆస్పత్రి వంటి ఆరోగ్య కేంద్రాలకు నిలిచిపోయిన అంతర్జాతీయ నిధులు

‘అవే నా చివరి క్షణాలు అనుకున్నా’

యెమెన్‌లో గర్భిణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు మోనా కథ ఒక ఉదాహరణ. మోనా ఎదుర్కొన్న పరిస్థితులను ఇక్కడ చాలా మంది మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 80 శాతం జనాభా సాయంపై ఆధారపడింది.

హైలాహ్ అనే మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆమె భర్త సౌదీ అరేబియాలో పనిచేసుకుంటూ డబ్బులు పొదుపు చేసుకుంటూ బైకు కొన్నారు.

ఉమ్మ నీరు పోవడం ప్రారంభమైన తర్వాత, తన మరిది ఆమెను బైకు ఎక్కించి, వెనకాల కట్టారు. అలా ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా, పురిటి నొప్పులకు తట్టుకోలేక, సరైన రోడ్లు లేకపోవడంతో ఆమె మధ్యలోనే కింద పడిపోయారు.

ధమార్‌లోని హడకా ఆరోగ్య కేంద్రానికి వారు చేరుకొన్న వెంటనే హైలాహ్‌ను డాక్టర్లు సర్జన్ వార్డుకు తరలించారు.

‘‘అవే నా చివరి క్షణాలు’’ అని 30 ఏళ్ల హైలాహ్ చెప్పారు. తాను, తన బిడ్డ బతికేందుకు ఎలాంటి మార్గమూ లేదనిపించిందని తెలిపారు.

ఇంట్లోనే బిడ్డను కనాలనుకోవడం సరైనది కాదని గర్భం దాల్చిన ప్రారంభంలోనే హైలెహ్‌ను డాక్టర్లు హెచ్చరించారు. ఎందుకంటే తీవ్ర రక్తస్రావం, ఇతర ప్రెగ్నెన్సీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

హైలాహ్‌ను, ఆమె బిడ్డను 11వ అంతస్తులో ఆపరేషన్ చేసి రక్షించినట్లు ఈ ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్ చెప్పారు.

హైలాహ్ తనకు పుట్టిన పాపకు అమల్ అని పేరు పెట్టుకున్నారు. అరబిక్‌లో దీని అర్థం ‘‘ఆశ’’.

"ఈ అంతర్యుద్ధం వల్ల నేను, నా పాప ప్రాణాలు కోల్పోతామనుకున్నాం. కానీ, నా కూతురు నాకు ఆశను కలిగించింది’’ అని ఆమె తెలిపారు.

అంతర్జాతీయంగా నిధులు రావడం ఆగిపోవడంతో, బాని సాద్ హాస్పిటల్ వంటి ఆరోగ్య కేంద్రాలకు ఆర్థిక సాయం అందడం లేదు. కాబోయే తల్లులు, బిడ్డల గురించి ఈ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)