అమ్మాయిల పీరియడ్స్ గురించి అబ్బాయిలూ తెలుసుకోవాలి, ఎందుకంటే...

పీరియడ్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నసీరుద్దీన్
    • హోదా, బీబీసీ కోసం

‘‘ఒక బాలికకు తొలిసారిగా రుతుస్రావం (పీరియడ్స్) మొదలైంది. ఆమె వయస్సు 12 ఏళ్లు. దుస్తులకు రక్తపు మరకలు అంటుకున్నాయి. వాటిని ఆమె సోదరుడు చూశాడు.

తన 12 ఏళ్ల చెల్లికి రుతుస్రావం అవుతుందని ఆయన అనుకోలేదు.

రక్తపు మరకలను లైంగిక సంబంధమని భావించి ఆమెను చంపేశాడు’’ ఇదంతా మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లో జరిగినట్లు తాజాగా వార్తలు వచ్చాయి.

అమ్మాయిలు, మహిళలపై హింసకు అనేక కారణాలు ఉంటాయి.

బాలికను చంపిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో రుతుస్రావం గురించి అవగాహనలేమిపై చర్చ జరుగుతోంది.

ఈ కాలంలో మగపిల్లలకు రుతుక్రమం గురించి తెలియకపోవడం ఆశ్చర్యకరమే. కానీ, పురుషులకు కూడా రుతుక్రమం గురించి తెలియదన్నది వాస్తవం.

వివాహితులైన కొందరు పురుషులు కూడా స్త్రీల శరీరం నుంచి లైంగిక చర్య తర్వాత మాత్రమే రక్తం వస్తుందనే భావనలో ఉంటారు.

రుతుక్రమం గురించి తెలియనప్పుడు, దాని ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యల గురించి కూడా వారికి తెలిసే అవకాశం లేదు.

పీరియడ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

రుతుస్రావం వ్యాధి కాదు

రుతుస్రావం అనేది సహజమైన జీవ ప్రక్రియ అని అబ్బాయిలకు, పురుషులకు తెలుసా?

మహిళల్లో ఇది సాధారణ జీవ ప్రక్రియ. రుతుస్రావం ఒక వ్యాధి కాదు. మహిళలకు నెలకు ఒకసారి పీరియడ్స్ వస్తాయి. మహిళల్లో రుతుక్రమం సగటున 28 రోజులుగా ఉంటుంది.

21వ రోజు నుంచి 35 రోజుల మధ్యలో మహిళలకు ఎప్పుడైనా పీరియడ్స్ రావొచ్చు.

రుతుస్రావం సమయంలో గర్భాశయం లోపలి నుంచి రక్తం బయటకు వస్తుంది.

రుతుక్రమం మొదలవ్వడం అంటే స్త్రీ శరీరం గర్భం దాల్చే ప్రక్రియకు అనువుగా మారుతున్నట్లు అర్థం.

మహిళల శరీరంలో వచ్చే హర్మోన్ల మార్పులను కూడా ఇది సూచిస్తుంది.

పీరియడ్స్

ఫొటో సోర్స్, Getty Images

అనేక రకాల అపోహలు

రుతుక్రమంపై మన సమాజంలో అనేక అపోహలు ఉన్నాయి. మహిళల జీవితాలను ప్రమాదంలో పడేసే అనేక ఆచారాలు కూడా ఇందులో ఉన్నాయి.

అనేక మతాల్లో, సమాజాల్లో రుతుస్రావం సమయంలో స్త్రీని అపవిత్రంగా పరిగణిస్తారు.

పీరియడ్స్ వచ్చిన స్త్రీలు పూజలు, ప్రార్థనలకు దూరంగా ఉండాలి. రంజాన్ మాసంలో ఉపవాసం కూడా మానుకోవాలి.

ఈ సమయంలో చాలా చోట్ల మహిళలను ఒంటరిగా ఉంచే ఆచారం కూడా ఉంది.

పీరియడ్స్

ఫొటో సోర్స్, Getty Images

పీరియడ్స్ అంటే కేవలం'ప్యాడ్స్' గురించి మాట్లాడటం కాదు.

మహిళల జీవితంలో రుతుక్రమం చాలా ముఖ్యమైనది. ఇది మహిళలకు సంబంధించిన ఒక రహస్య వ్యవహారంగా మాత్రమే మగపిల్లలకు, పురుషులకు తెలుస్తుంది.

అయితే, పీరియడ్స్ గురించి టీవీల్లో ప్రచారం, చర్చల వల్ల అందరిలో దీనిపై కాస్త అవగాహన పెరిగింది.

కానీ, ఈ అవగాహన శానిటరీ ప్యాడ్‌ల వరకే పరిమితమైంది.

మహిళలకు రుతుస్రావం ఉంటుంది. ఈ సమయంలో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్యాడ్లు వాడాలి అనే వరకే ఈ అవగాహన పరిమితమైంది.

కానీ, ఇది ఆడపిల్లల పునరుత్పత్తి వ్యవస్థ, లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన విషయం. సంవత్సరాల తరబడి ప్రతీ నెలా అది వారి జీవితంలో భాగం అవుతుంది.

పీరియడ్స్

ఫొటో సోర్స్, Getty Images

రుతుక్రమం గురించి అబ్బాయిలు, పురుషులకు ఎందుకు తెలియాలి?

బయాలజీ పుస్తకాల్లో రుతుక్రమం గురించి ఉంటుంది. అయితే చాలా స్కూళ్లలో దీని గురించి సరిగ్గా బోధించకపోవడంతో పాటు విద్యార్థులు కూడా సరిగా చదవడం లేదు.

ఉపాధ్యాయులు ఈ అంశాన్ని సరిగ్గా బోధించినా లేదా విద్యార్థులు సరిగ్గా చదివితే, స్త్రీ జీవితంలోని ఈ ముఖ్యమైన చక్రం గురించి వారికి కచ్చితంగా తెలుస్తుంది.

అమ్మాయిల జీవితంలో ప్రతీ నెలలో ఆరు నుంచి ఏడు రోజులు ఎలా ఉంటాయో అబ్బాయిలకు, పురుషులకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోవాలి.

ఇది తెలియకుండా మన సోదరి లేదా స్నేహితురాలి స్వభావాన్ని, మానసిక స్థితిని అర్థం చేసుకోలేం.

రుతుస్రావ సమయంలో మహిళల శరీరంలో ఒక అంతర్గత ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియ వారిని అపవిత్రంగా మార్చదు. వారిపట్ల స్పృహ లేకుండా వ్యవహరించకూడదు.

పీరియడ్స్

ఫొటో సోర్స్, Getty Images

అనేక మార్పులు

రుతుస్రావం మొదలవడానికి ముందు అమ్మాయిలు, మహిళల శరీరాల్లో చాలా మార్పులు వస్తాయి.

వీటిని పీఎంఎస్ లేదా ప్రి మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. వీటివల్ల మానసిక స్థితితో పాటు శారీరకంగా కూడా మార్పులు వస్తాయి.

ఈ మార్పులు 200 రకాలుగా ఉంటాయని వైద్య శాస్త్రం చెబుతోంది. మూడ్ స్వింగ్స్ ఉంటాయి. చిరాకుతోపాటు నొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది.

చిన్న విషయానికే ఏడుస్తుంటారు. ఒత్తిడి, ఆందోళనతో పాటు నిద్ర లేమి, తలనొప్పి, అలసటగా ఉంటుంది.

పీరియడ్స్

ఫొటో సోర్స్, Getty Images

తెలుసుకొని మసులుకోవాలి

ఈ లక్షణాలన్నీ ప్రతి అమ్మాయి లేదా మహిళలో ఉండాల్సిన అవసరం లేదు.

అందుకే మన ఇంట్లోని ఆడపిల్లలు లేదా మహిళల గురించి మగపిల్లలు, పురుషులు తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

ఇది తెలుసుకొని ఉండటం వల్ల ఇంట్లోని మహిళల ప్రవర్తన, మానసిక స్థితిని అంచనా వేయవచ్చు.

ప్రతీనెలా ఈ దశలో మన తల్లి, సోదరి, కూతురు, స్నేహితురాలు, భాగస్వామికి ఎలా సహాయపడాలో నిర్ణయించుకోవాలి.

మగపిల్లలు, పురుషులు ఏం చేయాలి?

ఇంట్లోని స్త్రీలను గమనించడం మంచిది. వారితో సున్నితంగా వ్యవహరించాలి. పీరియడ్స్ సమయంలో వారికి సహాయపడాలి.

బహుశా పురుషులు, అబ్బాయిల కోసం ప్రకృతి ఈ పని నిర్దేశించి ఉంటుంది. ఇది రహస్యం కాదు, అపవిత్రమైనది కాదు. భయపడాల్సిన పనిడా లేదు. ఇది వ్యాధి కూడా కాదు.

రుతుస్రావ సమయంలో మహిళలు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తే, వారికి విశ్రాంతిని ఇవ్వండి.

ఇంట్లో ఒక మూలకు వారిని పరిమితం చేయకుండా, వారి స్థానంలో వారు విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించండి. వారి ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇదంతా చేయడానికి అబ్బాయిలు, పురుషులు ఇంటి పనులను కూడా చేయాల్సి ఉంటుంది.

రుతుస్రావం అంటే కేవలం పరిశుభ్రత లేదా ప్యాడ్ల సమస్య మాత్రమే కాదని గుర్తుంచుకోవాలి. దానికంటే పెద్దది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)