సూడాన్: 'గుర్రాలపై వచ్చే దెయ్యాల'ను ఎదుర్కోవడానికి ఏకే-47 పట్టుకున్న అకౌంటెంట్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జైనాబ్ మొహమ్మద్ సలీహ్, మెర్సీ జుమా
- హోదా, బీబీసీ ప్రతినిధులు
అకౌంటెంట్ మొహమ్మద్ ఉస్మాన్ తన జీవితంలో మొదటిసారిగా ఏకే 47 రైఫిల్ వాడవలసి వచ్చింది.
సూడాన్‌లో సంఘర్షణ పెరగడంతో దేశంలోని డార్ఫర్ ప్రాంతంలో అరబ్బులు, ఇతర సమూహాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
ఉస్మాన్ ఎల్ జెనీనాలో నివసిస్తున్నారు. చారిత్రకంగా ఆ ప్రాంతం నల్లజాతి ఆఫ్రికన్ శక్తికి సంకేతం. అయితే, దానిని పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్), అరబ్ మిలీషియామెన్ తగులబెట్టి, ధ్వంసం చేసి దోచుకున్నారు. అందుకే, వారిని జంజావీడ్ అంటే 'గుర్రాలపై వచ్చే దెయ్యాలు' అని పిలిచేవారు.
"డార్ఫర్‌లో 20 ఏళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఇంత దారుణాన్ని నేనెప్పుడూ చూడలేదు. ఇది దారుణం" అని 38 ఏళ్ల ఉస్మాన్ అన్నారు. భద్రత దృష్ట్యా మేం ఆయన పేరు మార్చాం.
"ఎల్ జెనీనాలో జంజావీడ్‌ల దాడి జరిగినప్పుడల్లా తోటి గిరిజనులు ఆయుధాలతో చాడ్ సరిహద్దు నుంచి మోటర్‌బైక్‌లు, గుర్రాలపై వచ్చి సాయం చేస్తారు" అని ఉత్తర అర్దమాటా పరిసర ప్రాంతంలోని తన ఇంటి నుంచి ఉస్మాన్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
'200 మీటర్లు కూడా నడవలేరు, చంపేస్తారు'
ఉస్మాన్ కార్యాలయం సిటీ సెంటర్‌లో కాలిపోయి, శిథిలావస్థలో ఉంది.
"నేను అక్కడికి వెళ్లలేను, ఒంటరిగా పని చేయనివ్వండి" అని ఆయన అంటున్నారు.
నగరాన్ని ఆర్‌ఎస్‌ఎఫ్, జంజావీడ్‌లు స్వాధీనం చేసుకున్నారని మరో నివాసి మహ్మద్ ఇబ్రహీం చెప్పారు. స్నైపర్‌లు భవనాలలో, గన్‌మెన్‌లను వీధుల్లో ఉంచారని తెలిపారు.
"వారు ప్రతి చోటా కాల్పులు జరుపుతున్నారు. మీరు బయటికి వెళితే చనిపోతారు.
మీరు 200 లేదా 300 మీటర్లు కూడా నడవలేరు" అని ఇబ్రహీం బీబీసీతో అన్నారు. ఆయన పేరు కూడా మార్చాం.
గత కొద్దిరోజుల్లోనే ఎల్ జెనీనాలో దాదాపు 280 మంది మరణించారని, 160 మంది వరకు గాయపడ్డారని వైద్య నిపుణులు తెలిపారు.
పౌరుల ఇబ్బందులు తగ్గించడానికి మే 11న సౌదీ మధ్యవర్తిత్వంలో ఆర్‌ఎస్‌ఎఫ్, సుడానీస్ సైన్యం మధ్య జరిగిన ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించారని తాజా హింసను చూసి విశ్లేషకులు భావిస్తున్నారు.
అదే సమయంలో జెడ్డాలో కాల్పుల విరమణకు సంబంధించిన చర్చలూ కొనసాగుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఊహించని పని చేస్తున్న ఉస్మాన్...
ఇటీవలి కాలంలో పోరాటం అర్దమాటాకు దగ్గరగా రావడంతో తాను, చుట్టుపక్కల పురుషులు ఏకే 47 రైఫిల్స్‌ను చేతపట్టారని ఉస్మాన్ తెలిపారు.
షిఫ్టులలో 24 గంటల పాటు గస్తీ చేయడం ప్రారంభించారు.
ఇది ఉస్మాన్‌కు ఊహించని పని. ఎందుకంటే, ఆయన జీవితం నిన్న మొన్నటి దాకా తన ఖాతాదారుల పద్దుల చుట్టూ మాత్రమే తిరిగేది.
"ఆయుధాలు ధరించడం. నగరాన్ని రక్షించుకోవడం తప్ప మాకు వేరే మార్గం లేదు" అని ఉస్మాన్ అంటున్నారు.
ఆయన తన కుటుంబాన్ని, తన తల్లి, సోదరీమణులు, మేనకోడళ్లు, మేనల్లుళ్లను పారామిలిటరీ, మిలిషియామెన్‌లకు చూపించే ఆస్కారం లేదని చెప్పారు. సోవియట్ తయారు చేసిన కలాష్నికోవ్ రైఫిల్‌ను ఎలా సంపాదించారని ఉస్మాన్‌ను బీబీసీ అడిగింది. దానికి ఆయన "మీరు ఇక్కడ కొనుగోలు చేయగల అత్యంత చౌక అయిన వస్తువు ఆయుధం" అని బదులిచ్చారు.
ఆర్‌ఎస్‌ఎఫ్, జంజావీడ్‌లు మార్కెట్‌లను దహనం చేయడంతో ఆహారం కొరత ఏర్పడింది. ధరలు ఆకాశాన్నంటాయి.
ఎల్ జెనీనాలోని ఒక ప్రభుత్వేతర సంస్థలో మాజీ కార్మికుడు ఇషాక్ హుస్సేన్.
ఆయన మాట్లాడుతూ "ఆకలితో చనిపోవాలని కోరుకున్నట్లు వారు మార్కెట్లలో నిల్వ చేసిన ఆహారం, పిండిని కూడా తగులబెట్టారు'' అని అన్నారు.
ఆర్‌ఎస్‌ఎఫ్ స్పందన కోసం బీబీసీ ప్రయత్నించగా సాధ్యం కాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
జంజావీడ్‌లు మసాలిత్‌ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు?
ఎల్ జెనీనాలో 2010 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 1,70,000 మంది ఉన్నారు. ఈ ఎల్ జెనీనా మసాలిత్ సంప్రదాయ రాజధాని. ఇది ఇపుడు జంజావీడ్‌కు లక్ష్యంగా మారింది.
డార్ఫూర్‌లో అరబ్-యేతర సమూహాల నిర్మూలనకు పాల్పడినట్లు వారు చాలా కాలంగా ఆరోపిస్తూ వస్తున్నారు.
"జంజావీడ్‌లు మసాలిత్‌తో ప్రారంభించి ఆఫ్రికన్ ప్రజలందరినీ చంపేస్తున్నారు" అని ఇబ్రహీం ఆరోపించారు.
2003లో డార్ఫూర్‌లో వివక్షత, అభివృద్ధి లేమి గురించి ఫిర్యాదు చేస్తూ అరబ్బుయేతరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టినప్పుడు మొదటిసారిగా వివాదం చెలరేగింది.
ప్రభుత్వం జంజావీడ్‌ను సమీకరించడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంది. తరువాత 80,000 నుంచి 1,00,000 మందితో బలమైన పారామిలిటరీ బలగాలుగా మార్చింది.
అది ఇప్పుడు సూడాన్ సైనిక పాలకుడు జనరల్ అబ్దెల్ ఫత్తా అల్-బుర్హాన్, సైన్యంపై తిరుగుబాటు చేసింది.
మరోవైపు ఆర్‌ఎస్‌ఎఫ్ ఏప్రిల్ 15న సూడాన్ రాజధాని ఖార్టూమ్‌పై దాడిని ప్రారంభించింది. నగరంపై నియంత్రణను తిరిగి పొందే ప్రయత్నంలో సైన్యం రోజువారీ వైమానిక దాడులు చేసింది.
కానీ, ఎల్ జెనీనాలో ఆర్‌ఎస్‌ఎఫ్, జంజావీడ్‌లకు వ్యతిరేకంగా సైన్యం పోరాడే ప్రయత్నం చేయలేదు.
"పౌరులను రక్షించడానికి సైన్యం లేదా మరేదైనా ప్రభుత్వ సంస్థ చర్యలు శూన్యం" అని అలీ ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
లక్ష మంది పారిపోయారు, ఇళ్లను బూడిద చేశారు.
నార్వే రెఫ్యూజీ కౌన్సిల్ (ఎన్ఆర్సీ) అంచనా ప్రకారం నగరంలో సుమారు లక్ష మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయారు.
"హింస కారణంగా ఇళ్లు మరోసారి బూడిదగా మారాయి. మేం ఇప్పటికీ అత్యవసర సాయాన్ని అందించలేకపోయాం" అని ఎన్ఆర్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
నీటి సరఫరా కూడా నిలిచిపోయిందని ఇబ్రహీం తెలిపారు. నీటి సమస్య చాలా ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.
గత 23 రోజులుగా నగరంపై దాడి జరుగుతోందని అంతర్జాతీయ సహాయం కోసం ఇబ్రహీం అలుపెరుగని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
"చాలా మంది గాయపడిన వ్యక్తులకు ఎటువంటి చికిత్స లేదు. వందలు, వందల కంటే ఎక్కువ" అని ఇబ్రహీం చెప్పారు.
ఇంట్లో ఒంటరిగా ఉన్నానని, తన కుటుంబాన్ని సురక్షితంగా పంపించివేసినట్లు ఆయన తెలిపారు.
"నాకు పిల్లలు ఉన్నారు. వారు ప్రతిరోజూ ఈ తుపాకీ శబ్దాలను వినడం కష్టం. అందుకే నేను వారిని బయటకు పంపాను ”అని ఇబ్రహీం చెప్పారు.
ఆర్‌ఎస్‌ఎఫ్, జంజావీడ్‌ల ప్రభావం తగ్గినపుడు సూర్యోదయానికి ముందు ఆయా కుటుంబాలు మార్గదర్శక గ్రూపులతో వెళ్లిపోవాలని ఆయన సూచించారు.
భద్రతా సంక్షోభం తీవ్రరూపం దాల్చినట్లయితే తను కూడా చాద్‌కు పారిపోయి మేక్-షిఫ్ట్ క్యాంపుల్లో ఉండేవాడినని ఉస్మాన్ అంటున్నారు.
''ఈ దాడులు తగ్గకపోతే ఇక్కడ చనిపోవడం కంటే, నా కుటుంబాన్ని తీసుకుని చాద్‌కు పరుగెత్తుతాను. అక్కడ బట్టలతో కట్టిన షెల్టర్లలో ఉంటాను'' అని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి
- హైపర్‌టెన్షన్ డే: అధిక రక్తపోటు ఎందుకు వస్తుంది, తగ్గాలంటే ఏం చేయాలి?
- హమీదా బానో: మగ కుస్తీ యోధులు కూడా ఓడించలేని పహిల్వాన్ ఈమె, చివరకు బూందీ అమ్ముకుంటూ ఎందుకు బతికారంటే....
- ఐపీఎల్‌కు ‘ఎంఎస్ ధోనీ ట్రోఫీ’ అని పేరు మార్చే సమయం వచ్చిందా?
- సిక్కిం రాజు కోటను 30 నిమిషాల్లో భారత సైన్యం ఎలా స్వాధీనం చేసుకుంది, విలీనంలో ఇందిరాగాంధీ పాత్ర ఏంటి?
- ఇంటి పెద్ద మరణిస్తే రూ.20 వేలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకం గురించి మీకు తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














