ఇంటి పెద్ద మరణిస్తే రూ.20 వేలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకం గురించి మీకు తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎ.కిశోర్‌బాబు
- హోదా, బీబీసీ కోసం
కుటుంబ బాధ్యతలు చూసుకునే ఇంటిపెద్ద అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఒక్కసారిగా అగమ్యగోచరంగా మారుతుంది. అలాంటి పరిస్థితులో ఆ కుటుంబానికి ఆసరాగా ఉండటం కోసం రూ.20వేలు ఆర్థిక సాయం ఇచ్చే ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.
ఆ పథకం పేరే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (NFBS).
ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే ఉండాల్సిన అర్హతలు, దరఖాస్తు చేసుకునే విధానం ఏమిటి, డబ్బులు ఏవిధంగా చెల్లిస్తారు తదితర వివరాలు తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ పథకం?
కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి అనుకోకుండా మరణించినప్పుడు, సామాజిక బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం రూ.20,000 ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన పథకమే ఇది.
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
సహజ మరణం పొందినా సాయం అందిస్తారా?
అందిస్తారు. కుటుంబాన్ని పోషిస్తున్న పెద్ద (బ్రెడ్-విన్నర్) అది ఆడవారైనా, మగవారైనా, వారికి మరణం ఎలా సంభవించినా సరే దానితో నిమిత్తం లేకుండా ఆ కుటుంబానికి ఈ ఆర్థిక సాయం చేస్తారు
గృహిణి మరణిస్తే?
ఇంట్లో గృహిణిగా ఉన్న మహిళ మరణించినా సరే ఆమెను కూడా బ్రెడ్ విన్నర్ (కుటుంబ పోషకురాలిగా) కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. ఆ కుటుంబం కూడా ఆ సాయం పొందడానికి అర్హమైనదే.
అన్ని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందా?
కాదు, పేద కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు, నిరుపేద కుటుంబాల వారికి మాత్రమే ఈ సాయం అందుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
మరణించిన వారికి వయసు ఎంతుండాలి?
18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు లోపు వయసున్న వారు మరణిస్తే వారి కుటుంబాలకు ఈ పథకం ద్వారా డబ్బు చెల్లిస్తారు.
ఎవరిని కుటుంబంగా పరిగణిస్తారు?
భర్త లేదా భార్య, మైనర్ పిల్లలు, అవివాహిత కుమార్తెలు, తమపైన ఆధారపడిన తల్లిదండ్రులను కుటుంబంగా పరిగణిస్తారు.
పథకం కోసం ఎలాంటి పత్రాలు సమర్పించాలి?
- గుర్తింపు కార్డు ఏదైనా
- నివాస ధ్రువీకరణ పత్రం
- ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతా వివరాలు
- దరఖాస్తు దారుడి మొబైల్ నంబరు
- ఆధార్ కార్డు
- కుటుంబ పెద్ద వయసు ధ్రువీకరణ పత్రం
- దరఖాస్తుదారుడి పాస్‌పోర్టు సైజు ఫోటో
మరణించిన వ్యక్తికి సంబంధించి ఏమేమి పత్రాలు సమర్పించాలి?
- మరణ ధ్రువీకరణ పత్రం
- గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డు
- వ్యక్తి నివాస ధ్రువీకరణ పత్రం
- తెల్ల రేషన్ కార్డు
డబ్బులు ఎలా ఇస్తారు?
కుటుంబ పెద్ద మరణించినప్పుడు తదుపరి కుటుంబ బాధ్యతలు చూసే వారికి ఈ డబ్బులు ఇస్తారు. ఇది వారి బ్యాంకు ఖాతాకు నేరుగా జమ చేస్తారు.
కోఆపరేటివ్ బ్యాంకు ఖాతా ఉంటే డబ్బు జమ చేస్తారా?
చేయరు. దరఖాస్తుదారుడికి తప్పనిసరిగా ఏదైనా జాతీయ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉండాలి.
కుటుంబ పెద్ద మరణించినప్పుడు ముందుగా ఎవరికి సమాచారం అందించాలి?
ఈ పథకం పొందాలనుకునే వారు కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆ విషయాన్ని దరఖాస్తుదారుడికి ఖాతా ఉన్న బ్యాంకు బ్రాంచి మేనేజరు దృష్టికి తీసుకెళ్లాలి.
పథకం పొందడానికి ఎవరు అర్హులు?
- దరఖాస్తుదారుడు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి.
- కుటుంబం దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నదై ఉండాలి.
- మరణించిన వ్యక్తి వయసు 18 నుండీ 60 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి.
- పథకం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి మరణించిన కుటుంబ పెద్ద స్థానంలో బాధ్యతలు చూసేవారై ఉండాలి.
అమ్మా, నాన్న ఇద్దరూ కుటుంబ పోషకులే. అమ్మకు నాన్న కంటే ఆదాయం ఎక్కువ. ఆమె ఇటీవల మరణించారు. ఇప్పుడు ఆ కుటుంబం ఈ పథకం పొందడానికి అర్హత ఉందా?
ఉంది. తల్లిని కుటుంబ పెద్దగా గుర్తించి సాయం అందిస్తారు.
పథకానికి లబ్ధిదారుడ్ని ఎంపిక ఎలా చేస్తారు?
జిల్లా కలెక్టర్, మండల స్థాయిలో ఎంపిక కమిటీలను ఏర్పాటు చేస్తారు. మీ దరఖాస్తును క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరిపించి, అర్హులని భావిస్తే మీ దరఖాస్తును పథకానికి ఎంపిక చేస్తారు.
గ్రామ సభ నిర్వహించి కూడా ఈ పథకం లబ్ధి దారులను ఎంపిక చేస్తారు
దరఖాస్తులను ఎక్కడ సమర్పించాలి?
ఈ పథకం కోసం దరఖాస్తులను మీ సేవా కేంద్రాల్లో లేదా ఆన్‌లైన్ ద్వారా కూడా పంపవచ్చు
దరఖాస్తును డౌన్లోడు చేసుకుని వాటిని పూరించి మీ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లేదా మండల రెవెన్యూ అధికారికి కూడా సమర్పించవచ్చు.
ఆన్‌లైన్లో దరఖాస్తు పొందడమెలా?
ఈ కింది వెబ్ లింక్‌లో దరఖాస్తు పొందవచ్చు.
వివరాలకు ఎవర్ని సంప్రదించాలి?
వివరాలకు మీకు దగ్గర్లోని సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని సంప్రదించవచ్చు.
ఇవి కూాడా చదవండి:
- చార్ధామ్: ఎత్తైన ప్రాంతాలలో ఊపిరి ఆడనప్పుడు ఏం చేయాలి?
- ది కేరళ స్టోరీ: ఇది వాస్తవాల ఆధారంగా తీసిన సినిమానా, లేక ప్రచారాస్త్రమా?
- పోఖ్రాన్ II: అమెరికా కళ్లుగప్పి వాజ్‌పేయి అణు పరీక్షలు ఎలా నిర్వహించారు?
- మైసూర్ శాండల్ సబ్బు చరిత్ర ఏంటి? దాని పుట్టుకకు మొదటి ప్రపంచయుద్ధం ఎలా కారణమైంది?
- ‘కస్టడీ’ రివ్యూ: నాగచైతన్య సినిమా ఎలా ఉందంటే..
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















