ఏపీ, ఒడిశా సరిహద్దులో ఏనుగులు ఎందుకు చనిపోతున్నాయి, మనుషుల్ని ఎందుకు చంపుతున్నాయి?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం..
పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం కాట్రగడ గ్రామంలోని పొలాల్లో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. ఈ మండలం ఇంతకుముందు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉండేది.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో 2006 నుంచి ఇప్పటి వరకు మొత్తం 8 ఏనుగులు చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
అలాగే ఏనుగులు దాడిలో రైతులు, అటవీ సిబ్బంది మరణించిన సందర్భాలూ ఉన్నాయి.
ఏపీ, ఒడిశా సరిహద్దులో ఏనుగులు ఎందుకు చనిపోతున్నాయి? అలాగే మనుషులను ఏనుగులు ఎందుకు చంపుతున్నాయి?

నాలుగు ఏనుగులు ఏలా చనిపోయాయి?
పొలాల్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లను రాత్రి సమయంలో ఏనుగులు తాకడంతో చనిపోయినట్లు పార్వతీపురం మన్యం జిల్లా అటవీశాఖాధికారి ప్రసూన బీబీసీతో చెప్పారు.
ఈ ప్రమాదానికి సంబంధించి డీఎఫ్‌ఓ ప్రసూన అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
"మొత్తం ఆరు ఏనుగులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. చనిపోయిన నాలుగు ఏనుగులు కాకుండా, మరో రెండు ఏనుగులు సమీపంలో ఉన్న తివ్వకొండ పైకి వెళ్లిపోయి ఉంటాయని భావిస్తున్నాం. నిన్న అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది.
సాధారణంగా ఏనుగులు తొండంతో ఎదురుగా ఉన్న వస్తువులను తాకుతాయి. అలాగే ఒక ఏనుగు ఈ ట్రాన్స్‌ఫార్మర్లను తాకడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ఇక్కడ పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. అంతే కాకుండా ఏనుగులు గుంపుగా, ఒకదాని పక్కన మరొకటి వెళ్తూంటాయి. అందుకే ఒక ఏనుగుకి విద్యుత్ షాక్ తగలగానే, మిగతా ఏనుగులు కూడా ఈ ప్రమాదానికి గురై ఉంటాయి. చనిపోయిన వాటిలో ఒక మగ, మూడు ఆడ ఏనుగులు ఉన్నాయి.
ఏనుగుల మృతిపై భామిని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ‘‘ప్రస్తుతం చనిపోయిన ఏనుగులకు ఇక్కడే పోస్ట్ మార్టం నిర్వహించి, పాతిపెడుతున్నాం. గత 15 ఏళ్లకు పైగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగులను తిరిగి అరణ్యంలోకి పంపించేందుకు అనేక ప్రయత్నాలు అటవీశాఖ చేస్తోంది. కాకపోతే విజయం సాధించలేకపోతున్నాం." అని ప్రసూన తెలిపారు.

లకేరి అటవీ ప్రాంతం నుంచి వచ్చాయి
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆరుగురు ఏనుగులు ఒడిశాలోని లకేరి అటవీప్రాంతం నుంచి ఏపీలోకి ప్రవేశించాయని అటవీశాఖాధికారులు చెప్పారు. వాటిలో ప్రస్తుతం నాలుగు విద్యుత్ షాక్ తగిలి మరణించాయి.
ఏనుగులు గ్రామల్లోకి వచ్చేసేటప్పుడు వాటిని దారి మళ్లించి అటవీప్రాంతంలోకి పంపించేందుకు ట్రాకర్లు పని చేస్తుంటారు. అయితే వీరు కూడా ఏనుగుల దాడిలో మరణించిన సంఘటనలు నమోదయ్యాయి.
నిరుడు నవంబర్ 12న జిల్లాలోని కల్లికోట గ్రామంలో గోవింద్, ఈ ఏడాది ఫిబ్రవరిలో పసుకుడి గ్రామంలో ట్రాకర్ లక్ష్మీనారాయణ, పల్లింపేటకు చెందిన ఒక రైతు ఏనుగుల దాడికి బలయ్యారు.
ఏనుగులు సీతానగరం, బలిజిపేట, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం తదితర ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నాయి.
సాధారణంగా ఏనుగులు రోజుకు 40 నుంచి 50 కిలో మీటర్లు వరకు ప్రయాణం చేస్తుంటాయని, అలా అవి మైదాన ప్రాంతాల్లోకి, వ్యవసాయ భూముల్లోకి వస్తుంటాయని ప్రసూన చెప్పారు.
ఆ సమయంలో ఏనుగులను చూసి భయపడటం, కొందరైతే దగ్గర నుంచి చూడాలని అనుకోవడం, వాటిని ఆటపట్టించడం చేస్తుంటారని దాంతో చాలా సార్లు ఏనుగులకు చిరాకు కలిగి దాడి చేస్తాయని ఆమె చెప్పారు.

'ఇది పిల్ల ఏనుగు పనే'
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు మరణించిన విషయంపై విశాఖ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ శ్రీకంఠనాధ రెడ్డితో బీబీసీ మాట్లాడింది.
ఆయన సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత బీబీసీకి వివరాలు తెలిపారు.
“ఫిబ్రవరిలో ఒడిశా లకేరి అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఆరు ఏనుగులు తరుచూ మైదాన ప్రాంతాల్లోకి రావడం చూస్తున్నాం. అలాగే నిన్న రాత్రి కూడా ఆరు నాలుగు ఏనుగులు కాట్రగడ గ్రామంలోకి వచ్చాయి. అందులో ఒక పిల్ల ఏనుగు కూడా ఉంది.
ఏనుగులు చాలా తెలివైన జంతువులు. అయితే, పిల్ల ఏనుగుకు పరిసరాలపై అవగాహన లేకపోవడంతో 11 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ముట్టుకుంది. దాంతోనే ఈ ప్రమాదం జరిగింది. అదే పెద్ద ఏనుగైతే అలా చేయదు.
2006 నుంచి చూసుకుంటే ఈ సంఘటనతో కలిపి మొత్తం 8 ఏనుగులు మరణించాయి. వాటిలో ఇచ్చాపురం వద్ద రెండు ఏనుగులను దాడి చేస్తాయోమోననే భయంతో గిరిజనులు చంపేశారు. విశాఖ జూకు తరలిస్తుండగా మరొకటి, విద్యుత్ షాక్ తగిలి ఇంకొకటి మరణించాయి. ఇప్పుడు నాలుగు మరణించాయి” అని ఆయన బీబీసీతో చెప్పారు.

‘ఇక్కడ ఏనుగులు లేవు’
ఒడిశా లకేరీ అటవీ ప్రాంతంలో విస్తారంగా అడవులు ఉండేవి. కానీ, అవి క్రమంగా తగ్గిపోయాయి. లకేరీ అటవీ ప్రాంతం ఏనుగులకు ఆవాసం.
ఇక్కడ రోడ్డు, నిర్మాణాలు, కొండపోడు వ్యవసాయం కారణంగా, అటవీ విస్తీర్ణం తగ్గడంతో క్రమంగా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని అటవీ ప్రాంతంవైపు ఏనుగులు వచ్చాయి.
"ఇది 2006, 2007 మధ్యలో మొదలైంది. దీనికి ముందు ఉత్తరాంధ్ర అటవీ ప్రాంతలో ఏనుగులే లేవు. ఇప్పుడు ఇక్కడ కూడా అటవీ విస్తీర్ణం తగ్గుతుండటంతో మైదాన ప్రాంతాల వైపు ఏనుగులు వస్తున్నాయి" అని విశాఖ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్‌గా పని చేసి పదవి విరమణ పొందిన పి. రామ్మెహన్ బీబీసీకి చెప్పారు.
అటవీ ప్రాంతంలో వెదురు, వెలగ, చింత వంటివి పండ్లు, దట్టమైన పచ్చిక బయళ్లు ఏనుగులకు ఆహారం. కానీ, అడవుల్లో ఈ జాతుల మొక్కలు దాదాపుగా అంతరించిపోయి ఆహారం కరువైంది.
దీంతో, అడవిలో గిరిజనులు, మైదానంలో రైతులు పండించే పంటలపై పడి నాశనం చేస్తున్నాయి.
విజయనగరం, శ్రీకాకుళం సరిహద్దు ప్రాంతంలో నీటి వనరులు కూడా అందుబాటులో ఉండటంతో ఏనుగులు ఇటువైపుకు వలసలు వస్తున్నాయి.
“అడవిలో ఉండే ఏ జంతువైనా వాటికి కావలసిన కనీస అవసరాలు ఎక్కడ ఉండే అవకాశం ఉందో, వాటి బట్టే అవి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తాయి” అని రామ్మెహన్ వివరించారు.

‘భయంతోనే మనిషి, ఏనుగు దాడులు’
"అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండే మైదాన ప్రాంతంలోని గ్రామాలకు సాధారణంగా జంతువులు వస్తుంటాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అయితే పులి, ఏనుగు, ఎలుగుబంట్లు గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తాయి. జంతువులు తమని చంపేస్తాయని మనిషి.. ఆ మనిషి నుంచి తనకి ఆపద వస్తుందని జంతువు ఒకరిని ఒకరు చంపుకునే ప్రయత్నం చేస్తుంటాయి" అని రామ్మోహన్ చెప్పారు.
“ఏ జంతువుకైనా శబ్ధం, నిప్పు అంటే భయం ఉంటుంది. అందుకే అటవీ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించే వారు గుంపులుగా ఉంటూ, శబ్ధాలు చేస్తూ, కాగడాలు వంటివి సిద్ధంగా ఉంచుకోవాలి. ఏదైనా జంతువు వస్తే వాటికి నిప్పు చూపించడం ద్వారా అవి దూరంగా వెళ్లిపోతాయి. అలాగే వాటిని చూసిన వెంటనే అంతా కలిసి వాటిపై దాడి చేయాలనుకోవడం కూడా ప్రమాదకరమే. జంతువులు సాధారణంగా మనిషిపై దాడికి ప్రయత్నించవు. కేవలం వాటిని ఆందోళనకు, కంగారుకు గురి చేసినప్పుడే అవి దాడి చేసే అవకాశం ఉంది” అని ఆయన వివరించారు.

అసలు సమస్య ఎక్కడ?
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగులు సంచారం ఎక్కువ ఉండే చోట్ల వాటి నీటి అవసరాల కోసం కొన్ని నీటి కుంటలు నిర్మించారు.
అయితే, వీటిని సరిగా నిర్వహించలేకపోవడంతో నీటి కోసం ఏనుగులు మైదాన ప్రాంతంలోని వ్యవసాయ భూముల వైపు వస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు.
ఆహారం కూడా ఇక్కడ ఎక్కువగా దొరుతుండటంతో ఒడిశా నుంచి ఏనుగులు ఇక్కడికి వస్తున్నాయి. అందుకే వాటిని ఒడిశా పంపించే ప్రయత్నం చేయాలని, ఏనుగుల కోసం పని చేసే గ్రీన్ మెర్సీ స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులు అన్నారు.
ఏనుగులను ఇక్కడ నుంచి లకేరి అటవీ ప్రాంతాలకు తరలించాలనే డిమాండ్ సీతంపేట ఐటీడీఏ గిరిజన గ్రామాలతో పాటు మైదాన ప్రాంతాల రైతుల నుంచి కూడా చాలా కాలంగా ఉంది.
దానిపై ఒడిశా అటవీశాఖ, ఏపీ అటవీశాఖాధికారులు ఒకరితో ఒకరు చర్చించుకుంటున్నామని, వారి నుంచి సహాకారం అందుతుందని సీసీఎఫ్ శ్రీకంఠనాధ రెడ్డి అన్నారు.
సాధారణంగా జంతువులు ఎవరో పంపిస్తే ఒక చోటు నుంచి ఒక చోటుకు వలస వెళ్లవని, వాటి అవసరాలకు అనుగుణంగానే వాటి ప్రయాణం ఉంటుందని చెప్పారు.
“వాటిని వెనక్కి తరలించలేకపోతే.. ఎక్కడైతే ఏనుగులు సంచారం జరుగుతుందో అక్కడ నుంచి గ్రామాలను ఖాళీ చేయించి ఏనుగుల కోసం రిజర్వ్ ఫారెస్ట్ తరహాలో ఏదైనా ఏర్పాటు చేయాలి. వాటికి పునరావాసం కల్పించాలి. లేదంటే మనిషికి, ఏనుగులకి మధ్య ఒక యుద్ధంలాంటిది జరుగుతూనే ఉంటుంది. ఏనుగులు పంటలను నాశనం చేసేటప్పుడు ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం కొరవడి, బాధితులకు పంట నష్టం అందడం లేదు. దాంతో కోపంతో ఏనుగులను చంపేస్తున్నారు. ఏనుగుల కదలికలను గమనించే ట్రాకర్లతో పాటు ఏనుగులకు జియో ట్యాగింగ్ చేసి, వాటి ప్రయాణ గమనాన్ని ట్రాక్ చేయాలి” అని గ్రీన్ మెర్సీ ఎన్జీవో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రమణమూర్తి బీబీసీతో అన్నారు.

‘చట్టాలను పాటించాలి’
ఏనుగులనే కాదు పులి, ఎలుగుబంటి వంటి జంతులకు హాని కలిగించడం వంటివి వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972 కింద నేరం.
జనావాసాల్లో జంతువులు కనిపించగానే అంతా కలిసి చంపడం, లేదా గాయపరచడం వంటివి ఈ చట్ట ప్రకారం నేరం.
‘‘ఏ జంతువైనా దానికి అనుకూలంగా ఉండే పరిస్థితులున్న ప్రాంతాలకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. పొరపాటున వచ్చినా, తిరిగి తాను ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడికే వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుంది. అలాంటి సమయాల్లో వాటిని చూసి భయపడిపోయి, గందరగోళానికి గురై, హడావిడి చేస్తే ప్రాణాలకు నష్టం వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి’’ అని రిటైర్డ్ సీసీఎఫ్ రామ్మోహన్ రావు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- చార్ధామ్: ఎత్తైన ప్రాంతాలలో ఊపిరి ఆడనప్పుడు ఏం చేయాలి?
- ది కేరళ స్టోరీ: ఇది వాస్తవాల ఆధారంగా తీసిన సినిమానా, లేక ప్రచారాస్త్రమా?
- పోఖ్రాన్ II: అమెరికా కళ్లుగప్పి వాజ్పేయి అణు పరీక్షలు ఎలా నిర్వహించారు?
- మైసూర్ శాండల్ సబ్బు చరిత్ర ఏంటి? దాని పుట్టుకకు మొదటి ప్రపంచయుద్ధం ఎలా కారణమైంది?
- ‘కస్టడీ’ రివ్యూ: నాగచైతన్య సినిమా ఎలా ఉందంటే..
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















