చైనా మిలటరీపై జోక్ వేసినందుకు 17 కోట్ల జరిమానా

చైనా మిలటరీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫ్యాన్ వాంగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మిలటరీపై జోక్ చేసినందుకు చైనాలోని ఒక ప్రముఖ కామెడీ గ్రూప్‌పై అధికారులు దాదాపు 17 కోట్ల రూపాయల జరిమానా విధించారు.

కుక్కల ప్రవర్తనను సైన్యంతో చమత్కారంగా పోల్చడంతో అధికారుల ఆగ్రహానికి గురయ్యారు.

షాంఘై జియావోగువో కల్చర్ మీడియా సంస్థ, ఆ సంస్థకు చెందిన కమెడియన్ లీ హవోషి "చైనా సైన్యాన్ని అవమానపరిచారు" అని అధికారులు అన్నారు.

కాగా, కంపెనీ పెనాల్టీ కట్టడానికి అంగీకరించింది. ఘటనకు కారణమైన లీతో ఒప్పందాన్ని ఆ కంపెనీ రద్దు చేసుకుంది.

శనివారం బీజింగ్‌లో స్టాండప్ కామెడీ షోలో లీ తాను దత్తత తీసుకున్న రెండు కుక్కలు ఉడుతను వెంబడించిన కథను గుర్తు చేశారు. ఆ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు.

హౌస్ అనే పేరుతో షోలు నిర్వహించే లీ, "ఇతర కుక్కల్ని చూస్తే అవి ఆరాధించదగినవిగా మీకు కనిపించవచ్చు. కానీ, ఈ రెండు కుక్కలు మాత్రం నాకు, 'పోరాడు.. గెలుపు కోసం పోరాడు. అదే నీ తత్వంగా మారాలి' అనే మాటల్ని గుర్తు చేస్తాయి" అని చెప్పారు.

అయితే ఈ పంచ్‌లైన్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 2013లో తన సైన్యానికి ఇచ్చిన నినాదాలలో ఒకటి.

సోషల్ మీడియా

ఫొటో సోర్స్, Getty Images

అధికారుల దృష్టికి ఎలా వెళ్లింది?

చైనా సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ వీబోలో ఆడియో రూపంలో ఉన్న ఈ జోక్‌కు చాలామంది నవ్వుతూ ప్రతిస్పందించారు.

అయితే, నెటిజన్లలో ఒకరు దీని గురించి ఫిర్యాదు చేయడంతో విషయం సీరియస్ అయింది. నెటిజన్ల నుంచి లీ వ్యాఖ్యలకు స్పందన తగ్గింది.

లీ పోస్టును చూసిన అనంతరం మంగళవారం విచారణ ప్రారంభించినట్లు బీజింగ్ అధికారులు తెలిపారు.

అక్రమ ఆదాయంగా భావిస్తూ అధికారులు కంపెనీకి చెందిన రూ.1.55 కోట్లను జప్తు చేశారని, మరో రూ.15.7 కోట్ల జరిమానా సైతం విధించినట్లు జిన్హువా వార్తాసంస్థ తెలిపింది.

చైనా రాజధానిలో షాంఘై జియోగువో కంపెనీ కార్యకలాపాలు కూడా నిరవధికంగా నిలిపివేశారు.

"పీఎల్‌ఎ [పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ]ను అవమానించడానికి ఏ కంపెనీ లేదా వ్యక్తి చైనా రాజధానిని వేదికగా ఉపయోగించడాన్ని మేం ఎప్పటికీ అనుమతించబోం" అని చైనా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, టూరిజం బ్యూరో బీజింగ్ విభాగం తెలిపింది.

కొందరు జాతీయవాదులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని స్టేట్ మీడియా కూడా ప్రచారం చేయడంతో లీ ఆడియో వైరల్‌గా మారింది.

అయితే మరికొందరు మాత్రం ఘటనపై అతిగా స్పందించారని అభిప్రాయపడ్డారు.

'నేను సిగ్గుపడుతున్నాను, క్షమించండి'

"నాకు దేశభక్తి ఉంది. ఇతరులు మన దేశాన్ని కించపరచడం నిజంగా ఇష్టం లేదు. కానీ ప్రతి పదం సున్నితంగా ఉండే ఈ వాతావరణం నాకు నిజంగా ఇష్టం లేదు" అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

లీకి వీబోలో దాదాపు 1,36,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఘటనకు చింతిస్తూ ఆయన వారికి క్షమాపణలు చెప్పారు.

"నేను చాలా సిగ్గుపడుతున్నాను. విచారిస్తున్నాను. నేను బాధ్యత తీసుకుంటాను, అన్ని కార్యకలాపాలు ఆపివేస్తాను. లోతుగా ఆలోచించి, మళ్లీ నేర్చుకుంటాను" అని తెలిపారు లీ.

అనంతరం లీ వీబో ఖాతా సస్పెండ్ అయింది.

సోషల్ మీడియాలో అధికారులను టార్గెట్ చేసే చైనీస్ హాస్య నటులకు ఈ ఘటన ఒక హెచ్చరికను పంపినట్లయింది.

2020 చివరలో స్టాండ్-అప్ మహిళా కమెడియన్ యాంగ్ లీ పురుషులపై జోకులు వేయడంతో "సెక్సిజం", "పురుష ద్వేషం" వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు.

పురుషుల హక్కులను పరిరక్షిస్తున్నట్లు పేర్కొంటున్న ఒక సమూహం యాంగ్ లీ ప్రవర్తనను చైనా మీడియా రెగ్యులేటర్‌కు నివేదించాలంటూ నెటిజన్లను కూడా కోరింది.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)