చైనా ఆయుధ సంపత్తికి దీటుగా భారత నౌకాదళం ఎలా సిద్ధమవుతోంది?

ఇండియన్ నేవీ

ఫొటో సోర్స్, PRO DEFENCE MUMBAI/TWITTER

    • రచయిత, బీబీసీ మానిటరింగ్
    • హోదా, విశ్లేషణ

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా జోక్యాన్ని ఎదుర్కోవడానికి భారత సైన్యం, ముఖ్యంగా నౌకాదళం సిద్ధమవుతోందని, అందుకు తగ్గ సామార్థ్యాన్ని పెంచుకుంటోందని దేశీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

గత మూడేళ్లుగా చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినా పరిష్కారం లభించలేదు.

చైనాను ఎదుర్కోవడానికి ఆసియాలోని ఇతర దేశాలతో సైనిక సహకారం పెంచుకుంటోంది భారత్. అలాగే, నౌకాదళంలో కొత్త జలాంతర్గాములను చేర్చడం, సైనిక పరికరాల ఆధునీకరణ వంటి విషయాలపై దృష్టి సారిస్తోంది.

నౌకాదళం చేపడుతున్న చర్యలేంటి?

నౌకాదళం

ఫొటో సోర్స్, ANI

హిందూ మహాసముద్రంలో చైనా జోక్యం పెరుగుతున్న నేపథ్యంలో, భారతదేశం సముద్ర సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి సారిస్తోంది. ఆగ్నేయాసియా దేశాలతో సహకారాన్ని పెంచుకోవడం దగ్గర నుంచి జలాంతర్గాములను తయారుచేసుకోవడం వరకు పలు చర్యలు చేపడుతోంది.

2023 ప్రారంభం నుంచి భారతదేశం 17 జలాంతర్గాములను మోహరించింది. కానీ, చైనా వద్ద దీని కంటే మూడు రెట్లు ఎక్కువ జలాంతర్గాములు ఉన్నాయి.

2020 నాటికి చైనా వద్ద 66 జలాంతర్గాములు ఉన్నాయని, వీటిలో డీజిల్‌తో నడిచేవి, అణుశక్తితో నడిచేవి, బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు కూడా ఉన్నాయని అమెరికాకు చెందిన ఒక థింక్ ట్యాంక్ అంచనా వేసింది.

భారత నౌకాదళం, ఫ్రెంచ్ నేవల్ గ్రూప్‌తో కలిసి స్థానికంగా ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (ఏఐపీ) సాంకేతికతతో కూడిన మూడు డీజిల్‌ జలాంతర్గాములను తయారు చేయబోతోందని హిందుస్థాన్ టైమ్స్ ఒక కథనంలో తెలిపింది.

ముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ వీటిని నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సంస్థ ఫ్రెంచ్ స్కార్పియన్ క్లాస్ సబ్‌మెరైన్ తరహాలో ఆరు కల్వరి క్లాస్ సబ్‌మెరైన్‌లను నిర్మించింది. ఈ సిరీస్‌లో ఆరవ జలాంతర్గామి ఐఎన్ఎస్ వగీర్ (ఎస్26) 2024లో సముద్రంలోకి దిగే అవకాశం ఉంది.

భారత నౌకాదళం

ఫొటో సోర్స్, ANI

"ఈ జలాంతర్గామి యాంటీ సర్ఫేస్ వార్‌ఫేర్, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్, ఇంటెలిజెన్స్ సేకరణ, మందుపాతరలు పెట్టడం, నిఘా మొదలైన అనేక మిషన్‌లను నిర్వహించగలదు" అని అధికారులు చెప్పినట్టు ఇండియా టుడే పత్రిక వెల్లడించింది.

"2025 నాటికి చైనా నౌకాదళంలో మరో 400 నౌకలు, 2030 నాటికి 440 నౌకలు చేరుతాయని అంచనా... భారత్‌లో, 30 ఏళ్ల జలాంతర్గామి నిర్మాణ ప్రణాళిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే నౌకాదళం కనీసం మరో 24 జలాంతర్గాములను నిర్మించాల్సి ఉంటుంది" అని అదే కథనంలో రాశారు.

సముద్రంలోనే కాక, ఆకాశంలో కూడా భారత్ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. నిఘా కోసం డ్రోన్ల సంఖ్యను పెంచాలన్న యోచనలో ఉంది.

ఇండియా టుడేలోని మరొక నివేదిక ప్రకారం, భారత నౌకాదళం అండమాన్, నికోబార్ దీవుల చుట్టూ ఉన్న ప్రాంతాలను పర్యవేక్షించడానికి 2023 ఏప్రిల్‌లో ఎంక్యూ-9 డ్రోన్‌ను లీజుకు తీసుకుంది. ఈ ప్రాంతాలు బంగాళాఖాతంలోని మియన్మార్‌లో కోకో దీవులకు సమీపంలో ఉన్నాయి. ఇక్కడ చైనా తన సైనిక స్థావరాన్ని విస్తరించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు నివేదికలు వచ్చాయి.

2022 డిసెంబర్‌లో వచ్చిన ఒక మీడియా రిపోర్ట్ ప్రకారం, సైన్యంలోని మూడు విభాగాల కోసం అమెరికా నుంచి ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌లను కొనుగోలు చేయాలని భారతదేశం యోచిస్తోంది.

భారత సైన్యం అమెరికా నుంచి MQ-9 రీపర్ డ్రోన్‌ను కొనుగోలు చేయనుంది.

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, భారత సైన్యం అమెరికా నుంచి MQ-9 రీపర్ డ్రోన్‌ను కొనుగోలు చేయనుంది.

భారత నౌకాదళం ఇతర ప్రణాళికలు

చైనా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను రూపొందించడం నుంచి సైనిక పరికరాల కొనుగోలు వరకు భారత్ అనేక చర్యలను చేపడుతోంది. ఇటీవల నౌకాదళ సామార్థ్యాలను మెరుగుపరచుకునే వేగం పెంచింది.

ఈ ఏడాది మార్చిలో కొత్త హెలికాప్టర్లు, క్షిపణి వ్యవస్థలు, తుపాకుల కొనుగోలు ప్రతిపాదనను భారత ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకాల వ్యయం రూ.70,500 కోట్లు. వీటిలో భారత నౌకాదళం డిమాండ్ చేసినవి 80 శాతం ఉన్నాయి.

బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణులు, యుటిలిటీ హెలికాప్టర్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టం కూడా కావాలని నౌకాదళం కోరింది.

బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను రష్యాకు చెందిన ఎన్‌పీఓ మషినోస్ట్రోయెనియా, భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వీటిని ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేసేందుకు భారత్ 375 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,086 కోట్లు) ఒప్పందం కుదుర్చుకుంది.

ఉమ్మడి డ్రిల్స్

ఫొటో సోర్స్, ANI

ఇటీవల జరిపిన ఉమ్మడి డ్రిల్స్ ఎందుకు కీలకం?

దక్షిణ చైనా సముద్రంలో చైనా కదలికలపై భారతదేశం ఆందోళన చెందుతోందని, చైనా నౌకాదళం ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించకుండా ఆపాలని పట్టుదలగా ఉన్నట్టు 2023 ఏప్రిల్‌లో హిందూస్థాన్ టైమ్స్‌లో ఒక కథనం వెలువడింది.

బహుశా అందుకే ఫిలిప్పీన్స్, మలేషియా, వియత్నాం వంటి తూర్పు ఆసియా దేశాలతో భారత్ సైనిక సహకారాన్ని పెంచుకుంటోంది. ఈ దేశాలకు దక్షిణ చైనా సముద్రంలో చైనాతో సరిహద్దు వివాదాలు ఉన్నాయి.

మే 8న భారత నౌకాదళం 'ఆసియాన్-ఇండియా మారిటైం ఎక్సర్‌సైజ్' (ఏఐఎంఈ-23)ను ముగించింది. ఆసియా దేశాలు దక్షిణ చైనా సముద్రంలో తొలిసారి సంయుక్తంగా నిర్వహించిన యుద్ధ విన్యాసాలివి. వీటిని సింగపూర్‌లోని చాంగి నేవల్ బేస్‌లో ప్రారంభించారు.

ఈ సైనిక విన్యాసాలు జరిపిన ప్రాంతానికి సమీపంలో చైనా నౌకలు కనిపించాయని భారత మీడియాలో రిపోర్టులు వచ్చాయి.

మరొక ఊహించని పరిణామం ఏమిటంటే, ఫిబ్రవరిలో భారత నౌకాదళ జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధుకేసరిని ఆగ్నేయాసియాలోని అతిపెద్ద దేశమైన ఇండోనేషియాలో నిలిపారు. భారత యుద్ధ నౌక ఇండోనేషియాకు వెళ్లడం అదే తొలిసారి.

కిందటి ఏడాది, బంగాళాఖాతంలో భారత్, జపాన్‌లు ఉమ్మడిగా డ్రిల్స్ నిర్వహించాయి. వాటిని 'జేఐఎంఈఎక్స్ 22' అని పిలుస్తారు. ఈ రెండు దేశాల మధ్య ఇలాంటి విన్యాసాలు 2012లోనే ప్రారంభమయినప్పటికీ, ఈసారి మీడియా వీటిని ఎక్కువ హైలైట్ చేసింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావం పెరుగుతున్న కారణంగా తాజా డ్రిల్స్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.

ఇదే కాకుండా, 2023 ప్రారంభంలో భారత్, జపాన్ సంయుక్తంగా వైమానిక విన్యాసాలు 'వీర్ గార్డియన్'ను పూర్తిచేశాయి. ఈ రెండు దేశాలు ఆకాశంలో డ్రిల్స్ నిర్వహించడం ఇదే తొలిసారి.

ఇది చైనాకు సందేశం పంపించే ప్రయత్నమని హాంగ్‌కాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వ్యాఖ్యానించింది.

భారత్, చైనా

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుతం భారత్, చైనా మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి?

భారత, చైనాల మధ్య సంబంధాలు "అసాధారణంగా" ఉన్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవల పేర్కొన్నారు. తూర్పు లద్దాఖ్‌లో ఇరు దేశాల సైన్యాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగడమే ఇందుకు కారణమని అన్నారు.

కాగా, చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ మాత్రం భారత్-చైనా సరిహద్దులో పరిస్థితి 'స్థిరంగా' ఉందని అన్నారు.

మే 4, 5 తేదీల్లో గోవాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా, సరిహద్దు వివాదంపై ఇరుదేశాల మధ్య చర్చలు కూడా జరిగాయి.

ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, భారత్, చైనాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన ఇంకా పరిష్కారం కాలేదు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)