సితవే: మియన్మార్‌కు చెందిన ఈ పట్టణం కోసం భారత్, చైనా, బంగ్లాదేశ్‌లు ఎందుకు పోటీ పడుతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
వాయువ్య మియన్మార్‌లో సితవే ఒక పట్టణం. ఇది రఖాయిన్ ప్రావిన్స్‌కు రాజధాని. బర్మీ భాషలో సితవేకు ‘‘యుద్ధ భూమి’’అనే అర్థముంది.
1784లో బర్మా రాజు బోదవ్‌పాయా ఈ ప్రావిన్స్‌పై దండెత్తారు. కలాదాన్ నదీ తీరంలో ఆయన సేనలతో రఖాయిన్ ఫైటర్లు వీరోచితంగా పోరాడారు.
ఆ తర్వాత 1825లో ఆంగ్లో-బర్మా యుద్ధ సమయంలో బ్రిటిష్ సేనలు సితవే లోని నదీ పరివాహక ప్రాంతంలో మోహరించాయి. పట్టణంలోని ప్రాచీన అఖయాయెబ్-డా పగోడా పరిసరాల్లో వారు శిబిరాలు ఏర్పాటుచేశారు.
సుభాష్ చంద్రబోస్ ఏర్పాటుచేసిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’, జపాన్ సేనలతో కలిసి సితవే లో బ్రిటిషర్లపై పోరాడిందని, కోహిమాతోపాటు అరాకాన్ (నేటి రఖాయిన్) కూడా వీరి ఆధినంలోకి వచ్చిందని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు.
2014లో మియన్మార్ ప్రభుత్వం చేపట్టిన జనాభా లెక్కల ప్రకారం, రఖాయిన్ జనాభా 21 లక్షలు. వీరిలో బౌద్ధుల సంఖ్య 20 లక్షల వరకూ ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్, చైనా, బంగ్లాదేశ్‌ల మధ్య పోటీ..
అయితే, రఖాయిన్‌లోని దాదాపు పది లక్షల మందిని జనాభా లెక్కల సమయంలో పరిగణలోకి తీసుకోలేదని, వీరిలో ఎక్కువ మంది రోహింజ్యా ముస్లింలే ఉంటారని కొన్ని వార్తా సంస్థలు వెల్లడించాయి. రోహింజ్యాలు ఎక్కువగా రాజధాని సితవే వెలుపలి ప్రాంతాల్లో జీవిస్తుంటారు.
నేడు మళ్లీ ఇదే రఖాయిన్ ప్రావిన్స్ వార్తల్లో నిలిస్తోంది. ఇక్కడ భారత్, చైనా, బంగ్లాదేశ్‌ల మధ్య గట్టిపోటీ కనిపిస్తోంది.
తాజాగా కలాదాన్ ప్రాజెక్టులో భాగంగా కొత్త సితవే పోర్టును మియన్మార్ డిప్యూటీ ప్రధాని అడ్మిరల్ టిన్ ఆంగ, భారత జల వనరులు, నౌకాయాన శాఖల మంత్రి సర్బానంద్ సోనోవాల్ కలిసి మంగళవారం ప్రారంభించారు.
కోల్‌కతాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్టు నుంచి ఇక్కడకు వచ్చిన భారత తొలి రవాణా నౌకకు కూడా సర్బానంద్ సోనోవాల్ స్వాగతం పలికారు.
ఈ కొత్త ప్రాజెక్టులో భారత్‌లోని ఈశాన్య ప్రాంతాలు, మియన్మార్ మధ్య వాణిజ్యం, రవాణా, వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయని యాంగోన్‌లోని మియన్మార్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్ సాన్ విన్ చెప్పారు. దీంతో ఉత్తర, మధ్య మియన్మార్ ప్రాంతాలకూ మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, NEIL THOMAS/BBC
కలాదాన్ ప్రాజెక్టుతో భారత్‌కు దక్కే ప్రయోజనాలేమిటి?
కలాదాన్ మల్టీమోడల్ ప్రాజెక్టు భారత్‌లోని కోల్‌కత్తా పోర్టును మియన్మార్‌లోని సితవే పోర్టుతో అనుసంధిస్తుంది. అక్కడి నుంచి పాలెతవా నది పాలెతవా పట్టణానికి తీసుకెళ్తుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా మిజోరామ్‌లోని లాంగ్తలాయీకి చేరుకోవచ్చు.
2008లో ఈ ప్రాజెక్టు బడ్జెట్ రూ.500 కోట్లుగా అంచనా వేశారు. అయితే, భూసేకరణలో ఆలస్యం వల్ల ప్రాజెక్టు ఆలస్యమైంది. ఇప్పుడు దీని బడ్జెట్ రూ.2,000 కోట్లకుపైనే పెరిగింది.
‘‘లుక్ ఈస్ట్’’ పాలసీలో భాగంగా 1991లో ఈ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చారు. అయితే, ‘‘యాక్ట్ ఈస్ట్’’ పాలసీలో భాగంగా ఈ ప్రాజెక్టుకు భారత్‌లోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్త మెరుగులు దిద్దింది.
కలాదాన్ ప్రాజెక్టు ఒక మల్టీమోడల్ ప్రాజెక్టు. దీనిలో భాగంగా రోడ్డు మార్గాలు, వంతెనలు, ఫ్లోటింగ్ బ్యారేజ్‌లను నిర్మించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలను ఇతర ప్రాంతాలను అనుసంధానించే ఏకైక మార్గం ‘‘సిలిగుడీ కారిడార్’’. పశ్చిమ బెంగాల్‌లోని ఈ సన్నని మార్గాన్నే ‘‘చికెన్ నెక్’’అని కూడా పిలుస్తారు.
తాజా ప్రాజెక్టుతో ఆహార ధాన్యాలు, ఇతర వస్తువులను ఈశాన్య రాష్ట్రాలకు మియన్మార్ మీదుగా తరలించడానికి మార్గం సుగమం అవుతుంది. దీంతో రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది.
ప్రస్తుతం మియన్మార్‌లో భారత్ ప్రాబల్యం కూడా పెరుగుతోందని అస్సాంలోని సిల్‌చర్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జయశ్రీ రౌత్ అన్నారు.
‘‘కొన్ని దశాబ్దాలుగా మియన్మార్‌లో రాజకీయ వాతావరణం చాలా ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. సమీప భవిష్యత్‌లో ఇది మెరుగుపడుతుందని కూడా చెప్పలేం’’ అని ఆమె వివరించారు.
‘‘అయితే, ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తమ వ్యూహాత్మక-ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించుకోవడం కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే మియన్మార్ అటు చైనా, ఇటు బంగ్లాదేశ్‌లకు కూడా పొరుగు దేశం’’ అని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
రఖయీన్‌లో పోటీ
మియన్మార్‌లో 2021లో సైన్యం తిరుగుబాటు చేసింది. ఆ తర్వాత ఏర్పాటైన సైనిక ప్రభుత్వం, కొన్ని రెబల్ గ్రూపుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.
ఈ ఘర్షణల్లో అత్యంత సున్నితమైన ప్రాంతంగా రఖాయిన్ మారింది. ఇక్కడ తమ ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు చైనా క్రియాశీలంగా పనిచేస్తోంది. బంగ్లాదేశ్ కూడా ఇక్కడ పావులు కదుపుతోంది.
‘‘రఖాయిన్‌లోని ఇప్పటికే పది లక్షల మంది రోహిజ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కు చేరుకున్నారు. వీరు కాక్స్‌బజార్ శిబిరాల్లో జీవిస్తున్నారు. అయితే, రోహింజ్యాలను మళ్లీ మియన్మార్‌కు తిప్పి పంపేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది’’ అని వాషింగ్టన్‌కు చెందిన థింక్ ట్యాంక్ విల్టన్ సెంటర్ డైరెక్టర్ మైఖేల్ కుజెల్‌మన్ అన్నారు.
రఖాయిన్‌లో హింసను అడ్డుకునేందుకు బంగ్లాదేశ్ ప్రయత్నిస్తోంది. ఎందుకంటే అక్కడి హింసతో రోహింజ్యాల వలసలు పెరుగుతాయి. ఫలితంగా సరిహద్దుల్లో మరింత ఎక్కువ మంది బలగాలను మోహరించాల్సి ఉంటుంది. దీంతో బంగ్లాదేశ్‌కు మరింత వ్యయం పెరుగుతోంది.
అయితే, రోహింజ్యాలను వెనక్కి పంపే దిశగా బంగ్లాదేశ్ చేస్తున్న ప్రయత్నాలేమీ ఫలించడం లేదు.
ఇక చైనా గురించి చెప్పుకోవాలంటే, దక్షిణ చైనా సముద్రం, బంగాళాఖాతం మధ్య ఎకనామిక్ కారిడార్‌లో రఖాయిన్ ప్రధాన పాత్ర పోషించగలదు.
ఇటీవల పూర్తయిన క్యాఖ్‌పియూ పోర్టు, ఈ పోర్టును అనుసంధానించే రైల్వే లైను, గ్యాస్ పైప్‌లైన్‌లు చైనాకు చాలా ముఖ్యమైనవి.
రఖాయిన్ ద్వారా తొలిసారి బంగాళా ఖాతంలో చైనా పట్టుపెరిగింది. దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కోల్పోవాలని చైనా భావించడం లేదు.
కలాదాన్ ప్రాజెక్టు పూర్తయితే ఈశాన్య ప్రాంతాలకు కీలకమైన సరఫరాలకు బంగ్లాదేశ్‌పై ఆధారపడాల్సిన అవసరంలేదని భారత్ భావిస్తోంది. మరోవైపు మియన్మార్‌తోనూ నేరుగా వాణిజ్యం కొనసాగించొచ్చు.
‘‘నేడు భారత్, బంగ్లాదేశ్, చైనాలకు రఖాయిన్ ఒక మిఠాయి లాంటిది. మియన్మార్‌లో వేగంగా మారుతున్న పరిణామాల నడుమ తమ ప్రయోజనాలను పరిక్షించుకునేందుకు మూడు పొరుగు దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి’’ అని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని దక్షిణాసియా వ్యవహారాల నిపుణుడు, ప్రొఫెసర్ సుధీంద్ర కుమార్ అన్నారు.
ఇవి కూాడా చదవండి:
- చార్ధామ్: ఎత్తైన ప్రాంతాలలో ఊపిరి ఆడనప్పుడు ఏం చేయాలి?
- ది కేరళ స్టోరీ: ఇది వాస్తవాల ఆధారంగా తీసిన సినిమానా, లేక ప్రచారాస్త్రమా?
- పోఖ్రాన్ II: అమెరికా కళ్లుగప్పి వాజ్‌పేయి అణు పరీక్షలు ఎలా నిర్వహించారు?
- మైసూర్ శాండల్ సబ్బు చరిత్ర ఏంటి? దాని పుట్టుకకు మొదటి ప్రపంచయుద్ధం ఎలా కారణమైంది?
- ‘కస్టడీ’ రివ్యూ: నాగచైతన్య సినిమా ఎలా ఉందంటే..
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















