ఈ బాలీవుడ్ నటిని డ్రగ్స్ స్మగ్లర్‌గా సినీ ఫక్కీలో ఇరికించారు

క్రిసాన్ పెరీరా

ఫొటో సోర్స్, CHRISANN PEREIRA

ఫొటో క్యాప్షన్, క్రిసాన్ పెరీరా
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ న్యూస్

క్రిసాన్ పెరీరా ఒక వర్థమాన నటి. ఆమెకు గత నెలలో ఎదురైన అనుభవాలు ఒక బాలీవుడ్ థ్రిల్లర్ సినిమాకు తీసిపోవు.

సడక్-2, బాట్లా హౌజ్ వంటి బాలీవుడ్ సినిమాల్లో చిన్న పాత్రలు పోషించిన 27 ఏళ్ల క్రిసాన్ పెరీరా.. ఎన్నో ఆశలతో ఏప్రిల్ 1న ముంబయి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌(యూఏఈ)కి వెళ్లారు.

వెబ్ సిరీస్‌లో ఆడిషన్ కోసం క్రిసాన్‌ను యూఏఈకి పిలిచారని బీబీసీతో ఆమె సోదరుడు కెవిన్ చెప్పారు.

షార్జా పర్యటన ఆమెకు, ఆమె కుటుంబానికి పీడకలగా మారింది. షార్జాలో క్రిసాన్‌ను అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లారు. ఆమెతో తీసుకెళ్లిన ఒక మెమెంటోలో డ్రగ్స్ ఉన్నట్లు తేలడంతో క్రిసాన్‌ను అరెస్ట్ చేశారు.

మూడు వారాల తర్వాత క్రిసాన్ జైలు నుంచి విడుదలయ్యారు.

ముంబయి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారిపై క్రిసాన్‌ను డ్రగ్స్ కేసులో ఇరికించారనే అభియోగాలు మోపారు.

భారత్‌కు రావడానికి పాస్‌పోర్ట్ కోసం క్రిసాన్ వేచి చూస్తున్నారని కెవిన్ తెలిపారు.

క్రిసాన్ కేసును దర్యాప్తు చేసిన బృందంలో భాగమైన ముంబయి క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన ఒక పోలీసు అధికారి దీని గురించి బీబీసీతో మాట్లాడారు.

డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా అనుమానిస్తున్న మూడో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించినట్లు ఆయన చెప్పారు.

పగ తీర్చుకోవడానికేనా?

‘‘పగ తీర్చుకోవడం కోసమే ఇలా చేశారు. ఇందులో ప్రధాన నిందితుడు, బేకరీ యజమాని ఆంథోని పాల్. తన స్నేహితుడు, బ్యాంకర్ అయిన దామోదర్ బోభాటే సహాయంతో పాల్ తన కుట్రను అమలు చేశారు. దామోదర్‌ను రవి జైన్, ప్రసాద్ రావు అనే పేర్లతో కూడా పిలుస్తారు’’ అని ఆయన వెల్లడించారు.

గతంలో కూడా నిందితులు ఇద్దరూ మరో నలుగురిని ఇలాగే డ్రగ్స్ కేసులో ఇరికించినట్లు తమ దర్యాప్తులో తెలిసిందని, ఆ నలుగురిలో ఒకరైన క్లేటన్ రోడ్రిగ్స్ ఇప్పటికీ షార్జాలోని జైలులోనే ఉన్నారని పోలీసు అధికారి చెప్పారు.

తమ మీద వచ్చిన ఆరోపణలపై జైలులో ఉన్న ఆంథోని పాల్, దామోదర్ బాభోటే స్పందించలేదు.

అయితే పాల్‌పై వచ్చిన ఆరోపణలను ఆయన తరఫు లాయర్ అజయ్ దూబే ఖండించారు. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమైనవని, దుర్మార్గమైనవి అన్నారు.

తన క్లయింట్‌ను దామోదర్ బొభాటే మోసం చేశారని, మెమెంటోతో పాల్‌కు ఎలాంటి సంబంధం లేదని అజయ్ దూబే చెప్పారు.

దామోదర్ బొభాటే భార్య సోనాల్ బీబీసీతో మాట్లాడుతూ, ‘‘నా భర్తను పాల్ ఈ కేసులో ఇరికించాడు’’ అన్నారు.

నమ్మశక్యం కాని ట్విస్టులు

క్రిసాన్ పెరీరాను ఎలా డ్రగ్స్ స్మగ్లర్‌గా చిత్రీకరించారో పూర్తి కథను బీబీసీకి కెవిన్ వివరించారు. అందులో నమ్మశక్యం కాని ట్విస్టులు, మలుపులు ఉన్నాయి.

‘‘మార్చి 23వ తేదీన మా అమ్మ ప్రేమీలా పెరీరాకు ఒక వ్యక్తి మెసేజ్ చేశాడు. ఒక ఈవెంట్‌లో అతను మా అమ్మను కలిసినట్లు మెసేజ్‌లో రాశాడు. తానొక వెబ్‌సిరీస్‌కు నగదు సహాయం చేస్తున్నానని, ఆ వెబ్ సిరీస్‌లో క్రిసాన్‌ నటించాలంటూ కోరుతూ మెసేజ్ చేశాడు.

క్రిసాన్ ఆయన్ను కలిసినప్పుడు, ఆడిషన్ కోసం దుబాయ్‌కు వెళ్లాలని చెప్పాడు. కానీ, ఆమెకు షార్జా టికెట్ పంపించాడు’’ అని కెవిన్ చెప్పారు.

ఈ రోజుల్లో ఎన్నో స్కామ్‌లు జరుగుతున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తన సోదరికి చెప్పినట్లు కెవిన్ తెలిపారు. కానీ, ఆమె మనసులో ఎలాంటి అనుమానం రాలేదని అన్నారు.

‘‘ఆడిషన్ కోసం ఆమె సన్నద్ధం అయ్యారు. వెబ్‌ సిరీస్ అవకాశం రావడం పట్ల ఎంతో సంతోషించారు’’ అని కెవిన్ చెప్పారు.

ప్రయాణానికి కొన్ని గంటల ముందు అదే వ్యక్తి నుంచి క్రిసాన్‌కు ఫోన్ వచ్చిందని, ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే దారిలో తనను కలవాలని ఆ వ్యక్తి క్రిసాన్‌ను కోరినట్లు కెవిన్ తెలిపారు.

షార్జాలో తన మిత్రుడికి ఇవ్వాలంటూ ఒక మెమెంటోను అతను క్రిసాన్‌కు ఇచ్చినట్లు కెవిన్ వెల్లడించారు.

‘‘అర్ధరాత్రి దాటాక 1:17 గంటలకు ఆమె షార్జాలో దిగింది. రాత్రి 2 గంటల సమయంలో మా నాన్నకు ఫోన్ చేసి తాను మోసపోయినట్లు చెప్పింది. ఎయిర్‌పోర్ట్‌లో తనను పికప్ చేసుకోవడానికి ఎవరూ రాలేదని, తన పేరు మీద హోటల్ కూడా బుక్ చేయలేదని చెప్పింది. తర్వాత మెమెంటో గురించి కూడా మాకు చెప్పింది’’ అని కెవిన్ తెలిపారు.

సోదరితో కెవిన్

ఫొటో సోర్స్, KEVIN PEREIRA

ఫొటో క్యాప్షన్, సోదరి క్రిసాన్‌తో కెవిన్

మరణ శిక్ష కూడ పడొచ్చన్నారు: సోదరుడు కెవిన్

గతంలో ఒక విమానయాన సంస్థలో పనిచేసిన కెవిన్‌, తన సోదరి పెద్ద సమస్యలో ఉన్నట్లు తాను గుర్తించినట్లు చెప్పారు.

‘‘వెంటనే ఎయిర్‌పోర్ట్ పోలీసుల దగ్గరకు వెళ్లి ఉన్నదున్నట్లుగా అంతా చెప్పమని నేను క్రిసాన్‌తో అన్నాను. ఆ తర్వాత 17 రోజుల వరకు మేం క్రిసాన్‌ను చేరుకోలేకపోయాం’’ అని కెవిన్ వెల్లడించారు.

క్రిసాన్ కుటుంబం తమ కూతురి సమస్యను పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఫిర్యాదు నమోదు చేసింది. తర్వాత సహాయం కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ సహా భారత విదేశీ వ్యవహారాలశాఖ, షార్జాలోని భారత రాయబార కార్యాలయానికి 15 ఈమెయిళ్లు చేసింది.

‘‘చివరకు మాకు షార్జాలోని భారత రాయబార కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. డ్రగ్స్ కలిగి ఉన్నందుకు షార్జాలోని సెంట్రల్ జైలులో క్రిసాన్‌ను ఉంచినట్లు మాకు తెలిసింది. ఈ నేరానికి 25 ఏళ్ల జైలు శిక్ష లేదా మరణ శిక్ష కూడా విధించవచ్చని గూగుల్‌లో వెతికితే మాకు తెలిసింది. మా కుటుంబం అంతా భయాందోళనకు గురైంది’’ అని కెవిన్ చెప్పారు.

క్రిసాన్ అరెస్ట్ అయిన వారం తర్వాత వారి కుటుంబం మరింత నిరాశలో మునిగింది. దీంతో సహాయం కోరుతూ ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో కెవిన్ పోస్టులు చేశారు. చివరకు ఆయనకు ఒక క్లూ దొరికింది.

తాము కూడా ఇలాంటి కష్టాన్నే ఎదుర్కొన్నామంటూ కెవిన్ పెట్టిన పోస్టుకు నలుగురు వ్యక్తులు స్పందించారు.

క్రిసాన్‌కు మెమెంటో ఇచ్చిన అదే పేరుతో ఉన్న వ్యక్తి, తమకు కూడా మధ్యప్రాచ్యం(మిడిల్ ఈస్ట్)‌కు తీసుకెళ్లాలంటూ అనుమానాస్పద వస్తువులు ఇచ్చారని ఆ నలుగురు చెప్పారు.

దీంతో కెవిన్‌తోపాటు ఇతర బాధిత కుటుంబాలు కూడా పోలీసులను ఆశ్రయించాయి.

ఈ కేసు దర్యాప్తును ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేపట్టారు.

క్రిసాన్

ఫొటో సోర్స్, KEVIN PEREIRA

క్రిసాన్‌ను ఎందుకు ఇరికించారు?

ఈ అయిదు కేసుల్లోనూ వ్యక్తిగత కోణం ఉందని, అయిదుగురు బాధితులు కూడా పాల్‌కు తెలిసినవారేనని పోలీసులు చెప్పారు.

వారిపై పగ తీర్చుకోవడం కోసమే పాల్ ఇలా చేసినట్లు తెలిపారు.

వీధి కుక్కల విషయంలో క్రిసాన్ తల్లితో పాల్‌కు వాగ్వాదం జరిగింది.

ఈ విషయంలో ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఏడాది క్రితమే ప్రణాళిక రచించడం మొదలుపెట్టానని దర్యాప్తులో పాల్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

ఈ వాగ్వాదం గురించి తమ కుటుంబం మరిచిపోయిందని, అంతా సవ్యంగా సాగుతున్న వేళ క్రిసాన్ అరెస్ట్ కావడం, దీని వెనుక ఉద్దేశాన్ని ఏప్రిల్ 24న పోలీసులు వెల్లడించేంత వరకు తమకు ఈ విషయం మీద అవగాహనే లేదని పెరీరా కుటుంబం చెబుతోంది.

పెరీరా కుటుంబానికి ఈ పీడకల ఇంకా ముగియలేదు.

‘‘నా సోదరి ఏ తప్పూ చేయలేదని నాకు తెలుసు. ఎప్పటికైనా నిజం బయటకు వస్తుందని మాకు తెలుసు. కానీ, ఈ సమయంలో మేం అనుభవించిన మానసిక హింసను ఎవరూ ఊహించలేరు. నా సోదరి జైలు నుంచి బయటపడింది. ఆమె సురక్షితంగా ఉంది. కానీ, ఈ కేసు ఎప్పుడు ముగుస్తుందో మాకు తెలియదు’’ అని కెవిన్ చెప్పారు.

ఈ ఘటన క్రిసాన్‌ను బాగా కుంగదీసిందని ఆయన తెలిపారు.

‘‘ఆమె షాక్‌లో ఉన్నారు. ఒక వ్యక్తి తన పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించగలరనే విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమెలో ధైర్యం నింపేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. కానీ, ఆమె ఇంటికి వచ్చేవరకు మేం ఊపిరి తీసుకోలేం’’ అని కెవిన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)