కర్ణాటక సీఎం సిద్ధరామయ్య: ‘పశువుల కాపరి’ నుంచి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే వరకు.. ఒక సోషలిస్ట్ బీసీ నేత కథ
కర్ణాటక సస్పెన్స్ ఎట్టకేలకు వీడిపోయింది. సిద్ధరామయ్య మరోమారు ముఖ్యమంత్రి పదవిని చేపడతారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
మే 13న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. అయితే, ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై కొద్ది రోజులుగా సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది.
ఈ పదవికి ప్రధానంగా పోటీలో ఉన్న కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలలో ఎవరికి సీఎం పదవి ఇవ్వాలన్న అంశంపై కాంగ్రెస్ అధినాయకత్వం అనేక దఫాలుగా చర్చలు జరిపింది.
ఇరువురు నేతలతో పాటు, ఇంకా పోటీలో ఉన్న ఇతర నేతలతో కూడా చర్చలు జరిపిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం, చివరకు సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ప్రకటించింది. దీంతో ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అవుతున్నారు.
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డీకే శివకుమార్ ఉపముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయ యాత్రలో అనేక మలుపులు
సోషలిస్టుగా ప్రయాణం మొదలుపెట్టిన సిద్ధరామయ్య రాజకీయ జీవితంలో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి.
ఒకనాడు ఆయన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్నారు. కానీ, ఆ తరువాత అదే పార్టీలో చేరి ముఖ్యమంత్రి అయ్యారు.
75 ఏళ్ల సిద్ధరామయ్యకు రాజకీయాల్లో 45 ఏళ్ల అనుభవం ఉంది.
కర్ణాటకలో ముఖ్యమంత్రిగా అయిదేళ్ళ పూర్తికాలం పదవిలో ఉన్న రెండో వ్యక్తి కూడా ఆయనే. గతంలో దేవరాజ్ అర్స్ మాత్రమే అయిదేళ్ళు పూర్తి చేశారు.

వ్యవసాయ కుటుంబం
1948 ఆగస్టు 12న మైసూరు జిల్లాలోని సిద్ధరామనహుండిలో సిద్ధరామయ్య జన్మించారు. ఆయనది వ్యవసాయ కుటుంబం.
పదేళ్ల వయసు వచ్చే వరకు ఆయన బడికి పోలేదని, పొలం పనుల్లో సాయం చేస్తూ పశువులు కాసేవారని చెబుతారు. ఆ తరువాత ఆయన డిగ్రీ పూర్తి చేసి, మైసూర్ యూనివర్సిటీ నుంచి లా పట్టా తీసుకున్నారు.
సిద్ధరామయ్యది బీసీకి చెందిన కురబ కులం. కర్ణాటకలో కురబల జనాభా సుమారు 9 శాతం. బీసీల్లో మంచి పట్టున్న నేతగా సిద్ధరామయ్యను చూస్తారు.

ఫొటో సోర్స్, Facebook/Siddaramaiah
సోషలిస్టు భావజాలం
సిద్ధరామయ్య సోషలిస్టు భావజాలంతో పెరిగిన వ్యక్తి. రామ్ మనోహర్ లోహియా ప్రభావం ఆయన మీద ఉందని చెబుతారు. 1978లో మైసూరు జిల్లా కోర్టులో సిద్ధరామయ్యకు నంజుండస్వామి పరిచయమయ్యారు. ఆయనను రాజకీయాల్లోకి రావాల్సిందిగా నంజుండస్వామి కోరారు.
1983లో తొలిసారి చాముండేశ్వరీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఆ గెలుపుతో పాత మైసూరు ప్రాంతంలో సిద్ధరామయ్యకు ఒక్కసారిగా గుర్తింపు వచ్చింది.
ఆ తరువాత ఆయన జనతా పార్టీలో చేరారు. అధికార భాషగా కన్నడను ఉంచేందుకు ఏర్పాటు చేసిన కన్నడ కవలు సమితికి అధ్యక్షునిగా చేశారు.
1985 మధ్యంతర ఎన్నికల్లో జనతా పార్టీ 139 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. చాముండేశ్వరీ నియోజకవర్గం నుంచి మరొకసారి గెలిచిన సిద్ధరామయ్య, రామకృష్ణ హెగ్డే ప్రభుత్వంలో పశుసంవర్ధకశాఖ మంత్రిగా పదవి చేపట్టారు.
1994లో హెచ్‌డీ దేవెగౌడ నాయకత్వంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. నాడు సిద్ధరామయ్య ఆర్థికశాఖ మంత్రిగా పని చేశారు.
1996లో జయదేవప్ప హలప్ప పటేల్ ముఖ్యమంత్రి అయినప్పుడు సిద్ధరామయ్యను డిప్యూటీ ముఖ్యమంత్రిగా నియమించారు.

ఫొటో సోర్స్, DK Shivakumar/Facebook
నాడు దేవెగౌడతో విభేదాలు
దేవెగౌడ నాయకత్వంలోని ఒక వర్గం జనతా పార్టీ నుంచి విడిపోయి జనతా దళ్(సెక్యులర్) పేరుతో ఒక పార్టీని స్థాపించింది. నాడు సిద్ధరామయ్య కూడా దేవేగౌడ వర్గంతో వెళ్లిపోయారు.
2004లో కాంగ్రెస్, జేడీ(ఎస్) కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఉపముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టారు.
జేడీ(ఎస్) పార్టీలో దేవెగౌడ, సిద్ధరామయ్యల మధ్య విభేదాలు తలెత్తాయి. జేడీ(ఎస్)లో సిద్ధరామయ్య నంబర్ 2 నేతగా ఉండేవారు. కొడుకు కుమార స్వామి కోసం సిద్ధరామయ్యను దేవెగౌడ పక్కన పెట్టారనే విమర్శ ఉంది.
విభేదాల నేపథ్యంలో చివరకు జేడీ(ఎస్) నుంచి సిద్ధరామయ్యను 2005లో బహిష్కరించారు. దాంతో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2006 ఉపఎన్నికలో సిద్ధరామయ్య గెలిచారు.
2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు నడిపిన సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు.

ఫొటో సోర్స్, Siddaramaiah/Facebook
నాస్తికుడు అనే ముద్ర
చాలా కాలంగా సిద్ధరామయ్యకు నాస్తికుడు, దేవాలయాలకు వెళ్లడు అనే ముద్ర ఉండేది.
మతానికి ప్రతీకలుగా ఉండేవి ఏవీ ఆయన ఆహార్యంలో కనిపించవు. ఎప్పుడూ ఆయన తెల్లని లాల్చి, పంచె, కండువాతో కనిపిస్తారు.
అయితే తాను నాస్తికుణ్ణి కానని, తనకు దైవ చింతన ఉందని గతంలో ఒకసారి సిద్ధరామయ్య చెప్పారు.
‘‘అందరూ నన్ను నాస్తికుడు అనుకుంటున్నారు. అది నిజం కాదు. నాకు దైవ చింతన ఉంది. అయితే, నేను మూఢవిశ్వాసాలకు దూరంగా ఉంటాను. దేన్నయినా సైన్స్ కోణంలో ఆలోచిస్తాను’’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చూడండి:
- జిబో బార్బిక్యూ : తక్కువ ధరలో భోజనానికి పోటెత్తుతున్న జనం, రైళ్లకు టిక్కెట్లు కూడా దొరకడం లేదు
- ఏపీ, ఒడిశా సరిహద్దులో ఏనుగులు ఎందుకు చనిపోతున్నాయి, మనుషుల్ని ఎందుకు చంపుతున్నాయి?
- సీబీఐ కొత్త డైరెక్టర్గా నియమితులైన ప్రవీణ్ సూద్ ఎవరు... కర్ణాటక డీజీపీగా ఆయన ఏం చేశారు?
- కర్ణాటక: కాంగ్రెస్కు అపూర్వ విజయాన్ని అందించిన వ్యూహకర్తలు ఎవరు?
- ది కేరళ స్టోరీ: ఇది వాస్తవాల ఆధారంగా తీసిన సినిమానా, లేక ప్రచారాస్త్రమా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









