సీబీఐ కొత్త డైరెక్టర్‌‌గా నియమితులైన ప్రవీణ్ సూద్ ఎవరు... కర్ణాటక డీజీపీగా ఆయన ఏం చేశారు?

ప్రవీణ్ సూద్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రవీణ్ సూద్
    • రచయిత, దీపక్ మండల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ప్రవీణ్ సూద్ తాజాగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ స్థానాన్ని ప్రవీణ్ సూద్ భర్తీ చేయనున్నారు.

మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్ మే 25న రిటైర్ అవుతున్నారు.

ఈ నేపథ్యంలో సీబీఐ కొత్త డెరెక్టర్‌గా ప్రవీణ్ సూద్ నియమితులయ్యారు. సూద్ రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు.

‘ద హిందూ’ వార్తాపత్రికలో వచ్చిన కథనం ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, లోక్‌సభ ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌధరీలతో కూడిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ సీబీఐ కొత్త డెరెక్టర్‌గా ప్రవీణ్ సూద్‌ పేరును శనివారం ఆమోదించింది.

అయితే, అధీర్ రంజన్ చౌధరీ తొలుత సూద్ విషయంలో మిగతా సభ్యులతో విభేదించినట్లు కూడా హిందూ కథనంలో పేర్కొంది.

ఆ కథనంలో రాసిన దాని ప్రకారం, సీబీఐ డెరెక్టర్ పదవికి షార్ట్ లిస్ట్ చేసిన అధికారుల జాబితాలో ప్రవీణ్ సూద్ పేరు లేదని అధీర్ రంజన్ చౌధరీ అన్నారు. ఆయన పేరును చివర్లో జాబితాలో చేర్చారు. మీటింగ్‌కు ముందు ఈ అభ్యర్థుల పేర్లను సెలెక్టర్ల ప్యానెల్‌కు చూపించారని అధీర్ వ్యాఖ్యానించినట్లు హిందూ కథనం తెలిపింది.

‘‘ద హిందూ’’ పత్రిక ప్రకారం, సీబీఐ డైరెక్టర్ పదవి రేసులో మధ్యప్రదేశ్ డీజీపీ సుధీర్ సక్సేనా కూడా నిలిచారు.

యడియూరప్పతో సూద్

ఫొటో సోర్స్, ANI

ప్రవీణ్ సూద్ ఎవరు?

ప్రవీణ్ సూద్ 1986 బ్యాచ్, కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.

మూడేళ్ల క్రితమే ఆయన కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. ప్రవీణ్ సూద్ స్వస్థలం హిమాచల్ ప్రదేశ్.

ఐఐటీ-దిల్లీలో చదువును పూర్తి చేశారు. 2024లో ఆయన రిటైర్ కావాల్సి ఉంది. అయితే, సీబీఐ డైరెక్టర్‌గా ఎంపిక కావడంతో ఆయన వచ్చే రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన రోజునే, సూద్ ఎంపిక కోసం సెలక్షన్ కమిటీ సమావేశం కావడం కూడా ఆసక్తికరమని ‘‘ద హిందూ’’ పేర్కొంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూద్‌కు వ్యతిరేకంగా చర్య తీసుకోవచ్చని అందరూ భావించారు. బహుశా ఆయనను రక్షించేందుకే సరైన సమయంలో కర్ణాటక నుంచి బయటకు పంపించారని అనుకుంటున్నారు.

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ వ్యాఖ్యల ప్రకారం చూస్తే ఇలాంటి అనుమానాలు కలుగుతున్నాయి.

డీకే శివ కుమార్

ఫొటో సోర్స్, @DKSHIVAKUMAR

ఫొటో క్యాప్షన్, డీకే శివ కుమార్

డీకే శివకుమార్ ఆరోపణలు

హిందుస్థాన్ టైమ్స్‌లో వచ్చిన ఒక కథనం ప్రకారం, ప్రవీణ్ సూద్ పనితీరుపై గత నెలలో డీకే శివకుమార్ ప్రశ్నలు లేవనెత్తారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయనపై తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.

ప్రవీణ్ సూద్ కర్ణాటకలో బీజేపీ కోసం పనిచేస్తున్నారని శివకుమార్ ఆరోపించారు.

‘‘మన డీజీపీ, ఆ పదవికి సరైన వ్యక్తి కాదు. ఆయన గత మూడేళ్లుగా బీజేపీకి సేవ చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజుల వరకు బీజేపీ కార్యకర్తలా పని చేస్తారు. కాంగ్రెస్ నాయకులపై ప్రవీణ్ సూద్ 25 కేసులు నమోదు చేశారు. బీజేపీ నాయకులపై ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఆయన పనితీరు, ప్రవర్తన గురించి ఎన్నికల సంఘానికి మేం లేఖ రాశాం. డీజీపీగా తన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించనందుకు ఆయనపై కేసు పెట్టాలి’’ అని విలేఖరుల సమావేశంలో శివకుమార్ అన్నారు.

సిద్ధరామయ్య

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవీణ్ సూద్ సీనియారిటీని తగ్గించారు

సూద్ సీనియారిటీని తగ్గించినప్పుడు

కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఉన్న సమయంలో 2017లో ప్రవీణ్ సూద్ వివాదాల్లో చిక్కుకున్నారు. ఆ సమయంలో సూద్, బెంగళూరు పోలీస్ కమిషనర్‌గా ఉన్నారు.

కన్నడ అనుకూల ఆందోళనకారులను అరెస్ట్ చేశారనే ఆరోపణలతో ఆయనను పోలీస్ కమిషనర్ హోదా నుంచి తప్పించి దానికంటే దిగువ స్థాయి పదవికి బదిలీ చేశారు.

అయితే, అది సాధారణ బదిలీల్లో భాగమని పేర్కొన్న అప్పటి సర్కారు, ఆయనకు లాజిస్టిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఏడీజీపీగా కొత్త పోస్టింగ్‌ను ఇచ్చింది.

హిందీ బిల్‌బోర్డులు, సైన్ బోర్డులను చెరిపేసి నలుపు రంగును పులిమారంటూ కన్నడ అనుకూల ఆందోళనకారులను సూద్ అరెస్ట్ చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

మరో మూడు నెలల్లో డీజీపీ కాబోతున్న సమయంలోనే కమిషనర్ స్థాయి నుంచి ఆయన ర్యాంకును తగ్గించారు.

సూద్ అరెస్ట్ చేసిన వారిపై మత అల్లర్లను వ్యాప్తి చేశారనే ఆరోపణలతో కేసులు నమోదు చేశారు.

హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకించామని, ఇది ఏ రకంగా కూడా మత అల్లర్ల కిందకు రాదని బాధితులు చెప్పారు.

సూద్

ఫొటో సోర్స్, @COPSVIEW

బీజేపీ హయాంలో డీజీపీగా పదోన్నతి

ప్రవీణ్ సూద్ 2020 జనవరిలో కర్ణాటక డీజీపీ అయ్యారు.

ఆ సమయంలో అసిత్ మోహన్ ప్రసాద్ పేరు కూడా డీజీపీ బరిలో నిలిచింది. కానీ, 2020 అక్టోబర్‌లో ప్రసాద్ రిటైర్ కావాల్సి ఉంది. దీంతో అధిక సమయం పాటు సూద్ సేవల్ని పొందే అవకాశం ఉండటంతో డీజీపీగా సూద్‌ను ఎంపిక చేశారు.

దీని ప్రకారం, సూద్‌కు నాలుగేళ్ల సుదీర్ఘ సమయం పాటు డీజీపీ పదవిలో కొనసాగే అవకాశం వచ్చింది.

2024 మే నెలలో సూద్ రిటైర్ అవ్వాల్సి ఉండగా, దాని కంటే ముందే ఆయనను సీబీఐ డైరెక్టర్ జనరల్ పదవి వరించింది.

సూద్

ఫొటో సోర్స్, @COPSVIEW

సూద్ ఘనతలు

బీజేపీ కోసమే సూద్ పనిచేస్తున్నారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉండొచ్చు. కానీ, ఆయన సమర్థకులు మాత్రం సూద్ ఒక సమర్థుడైన అధికారి అని అంటున్నారు.

హిందూస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం, సూద్ 2013లో కర్ణాటక పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఎండీగా నియమితులయ్యారు.

ఆ సమయంలో కేవలం 9 నెలల కాలంలోనే ఆయన కార్పొరేషన్ టర్నోవర్‌ను రూ.160 కోట్ల నుంచి రూ. 282 కోట్లకు పెంచారు.

పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో బెంగళూరులో ‘‘నమ్మ100’’ అనే సర్వీసును ప్రారంభించారు. కష్టాల్లో ఉన్న ప్రజల కోసం ఈ సర్వీసును తీసుకొచ్చారు.

తన హయాంలో మెరుగైన పనితీరు కనబరిచింనందుకు 1996లో ముఖ్యమంత్రి నుంచి సూద్‌కు బంగారు పతకాన్ని అందజేశారు.

పోలీసు విధుల్లో అత్యుత్తమ సేవలు అందించినందుకు గానూ 2002లో పోలీస్ మెడల్‌ను అదే విధంగా 2011లో ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్‌లను గెలుచుకున్నారు.

అలోక్ వర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అలోక్ వర్మ (కుర్చీలో కూర్చున్న వ్యక్తి), రాకేశ్ ఆస్థానా

సీబీఐ డైరెక్టర్ నియామకంపై వివాదం ఎందుకు?

2013 నాటి లోక్‌పాల్, లోకాయుక్తా చట్టం ప్రకారం, సీబీఐ డైరెక్టర్‌ను ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్‌లతో కూడిన ప్యానెల్ నియమిస్తుంది.

సీబీఐ డైరెక్టర్ నియామకంలో పారదర్శకతను తీసుకురావడం కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ ద్వారా నియామకం అనే పద్ధతిని ప్రవేశపెట్టారు.

సాధారణంగా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా నుంచి ఈ పదవి కోసం ఒక అభ్యర్థిని ఎంపిక చేస్తారు.

అభ్యర్థుల ఎంపికకు సీనియారిటీ, పని పట్ల నిజాయతీ, అవినీతి దర్యాప్తులో అనుభవం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు.

అయితే, జూనియర్ అధికారులు కూడా సీబీఐ డైరెక్టర్లుగా పదవిని పొందడంతో తాజాగా అనుసరిస్తున్న ఎంపిక ప్రక్రియపై విమర్శలు వచ్చాయి.

అంతేకాకుండా, ప్రభుత్వం తరఫు నుంచే అనేక సార్లు సీబీఐ పదవుల ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది.

2018లో అప్పటి సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా మధ్య చాలాకాలం పాటు వివాదం కొనసాగింది.

రాకేశ్ అస్థానాను, ప్రభుత్వానికి సన్నిహితుడిగా పరిగణిస్తారు. ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌ను చేశారంటూ ఆలోక్ వర్మ ఆరోపించారు.

దీని తర్వాత ఆస్థానా కూడా వర్మపై అవినీతి ఆరోపణలు చేశారు.

2018 అక్టోబర్ 23న వర్మ, ఆస్థానా ఇద్దరినీ సెలవుపై పంపించారు. వారికి బదులుగా నాగేశ్వర్ రావును తాత్కాలిక డైరెక్టర్‌ను చేశారు.

రావు అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ బీజేపీకి సన్నిహితుడు అయినందున ఆ పదవికి ఎంపికయ్యారని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)