కర్ణాటక: సిద్ధరామయ్య x డీకే శివకుమార్.. కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?

- రచయిత, రాజేశ్ పెదగాడి
- హోదా, బీబీసీ ప్రతినిధి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరవుతారనే అంశం చుట్టూ చర్చ జరుగుతోంది.
ఈ పదవి కోసం పోటీ పడుతున్న సీనియర్ నాయకుల్లో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్షుడు డీకే శివ కుమార్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
సీఎం కుర్చీ చుట్టూ ప్రధానంగా వీరిద్దరే తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు వీరికి ఉన్న అనుకూలతలు/ప్రతికూలతలు చూద్దాం. సీఎం పీఠంపై ఈ ఇద్దరు నాయకుల తరపు వాదనలు ఏమిటో కూడా చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
సిద్ధరామయ్య సానుకూలతలు ఏమిటి?
ఎన్నికల ప్రచారంలో బలంగా వినిపించిన రాష్ట్ర నాయకుల పేర్లలో బీఎస్ యెడియూరప్ప, బసవరాజ బొమ్మై, సిద్ధరామయ్య, డీకే శివ కుమార్, హెచ్‌డీ కుమారస్వామి పేర్లు మొదటి వరుసలో ఉంటాయి.
వీరిలో తర్వాత సీఎంగా ప్రజలు ఎవరిని చూడబోతున్నారనే దానిపై ఎన్నికలకు ముందుగా లోక్‌నీతి-సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్), ఎన్‌డీటీవీ కలిసి ఒక సర్వే నిర్వహించాయి.
మిగతవారితో పోల్చినప్పుడు సిద్ధరామయ్య చాలా ముందంజలో ఉన్నారు. 18 నుంచి 25 ఏళ్ల వయసున్న ఓటర్లలో 40 శాతం మంది ఆయన వైపు మొగ్గుచూపగా, 56 ఏళ్లకు పైబడిన వారిలో ఇది 44 శాతంగా ఉంది.
ఆయన తర్వాత స్థానంలో బసవరాజ బొమ్మై ఉన్నారు. ఆయనకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసువారిలో 28 శాతం మంది, 56 ఏళ్లకు పైబడిన వారిలో 22 శాతం మంది మద్దతు పలికారు.

ఫొటో సోర్స్, Getty Images
వీరిద్దరి తర్వాత జనతా దళ్(సెక్యులర్) నాయకుడు కుమార స్వామి, ఆ తర్వాత డీకే శివకుమార్ పేర్లు కనిపించాయి. ఈ సర్వేలో బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప ఐదో స్థానంలో నిలిచారు.
‘‘కాంగ్రెస్ సామాజిక సమీకరణాలను చూసినా సిద్ధరామయ్య పేరు ముందంజలో ఉంటుంది. ఎందుకంటే మైనారిటీలు, వెనుకబడిన కులాలు, దళితులను కూడగట్టడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు’’ అని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ చెప్పారు.
‘‘అయితే, ఇక్కడ మనం ఆయనకున్న ప్రతికూలతలను కూడా చెప్పుకోవాలి. 76 ఏళ్ల ఆయన కురుబ వర్గానికి అతి ప్రాధాన్యం ఇస్తారని, దీని వల్ల లింగాయత్, వొక్కలిగలకు పార్టీ దూరం అవుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, టిప్పు సుల్తాన్‌ను పొగుడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పమయ్యాయి. నేరారోపణలు ఎదుర్కొంటున్న కొందరు పీఎఫ్ఐ, ఎస్‌డీపీఐ నాయకులను విడిచిపెట్టాలనే ఆయన నిర్ణయం కూడా వివాదాస్పదం అయ్యింది’’ అని ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటే ఈ ప్రతికూలతలేవీ పెద్ద అడ్డంకి కాబోవన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సిద్ధరామయ్య దగ్గరవారని, అందుకే అధినాయకత్వం ఆయన వైపు మొగ్గు చూపొచ్చని ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, TWITTER
డీకే శివ కుమార్ సానుకూలతలు ఏమిటి?
కాంగ్రెస్‌కు విజయం తెచ్చిపెట్టడానికి తీవ్రంగా కష్టపడిన నాయకుల్లో డీకే శివ కుమార్ ఒకరు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత పార్టీ పగ్గాలను ఆయన తీసుకున్నారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28న స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది ఒక్కటే. అది కూడా శివ కుమార్ సోదరుడు డీకే సురేశ్.
ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ను ఓటమి వెంటాడింది. దీంతో కర్ణాటక పీసీసీ అధ్యక్ష పదవికి దినేశ్ గుండూ రావ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడే శివ కుమార్ అధ్యక్షుడిగా తెరపైకి వచ్చారు.
అయితే, ఆ తర్వాత రెండేళ్లలో అరెస్టులు, సోదాలు లాంటి చాలా సమస్యలు శివ కుమార్‌ను వెంటాడాయి. వాటన్నింటినీ దాటుకొని ఆయన పార్టీ కోసం కృషి చేశారు.
పార్టీకి భారీగా నిధులు సమకూర్చే సామర్థ్యమున్న నాయకుల్లో శివకుమార్ ఒకరని, స్వయంగా ఆయన కూడా సంపన్న శాసన సభ్యుల జాబితాలో మొదటి వరుసలో ఉంటారని ఘంటా చక్రపాణి చెప్పారు.
‘‘ఈడీ, సీబీఐ కేసులతో ఆయనకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ జాగ్రత్తగా నడిపించడం అంటే ఆషామాషీ కాదు. ఈ ఎన్నికల్లో పీసీసీ చీఫ్‌గా, పార్టీ ప్రచారానికి కోఆర్డినేటర్‌గానూ ఆయనే పనిచేశారు. వొక్కలిగ ఓట్లను కూడగట్టడంలో శివ కుమార్ ప్రధాన పాత్ర పోషించారు. అందుకే ముఖ్యమంత్రి పీఠాన్ని తనకే ఇవ్వాలని ఆయన అడగొచ్చు’’ అని చక్రపాణి అన్నారు.
ఎవరు ఏమంటున్నారు?
ఇటు సిద్ధరామయ్య, అటు డీకే శివకుమార్ ఇద్దరూ తాము ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్లు చెబుతున్నారు.
దీనిపై సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘కర్ణాటక ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మా నాన్నను పార్టీ ముఖ్యమంత్రి చేయాలి’’ అన్నారు.
"కర్ణాటక ముఖ్యమంత్రిగా సుపరిపాలన ఎలా ఉంటుందో మానాన్న చూపించారు. ఇప్పుడు మళ్లీ ఆయన ముఖ్యమంత్రి అయితే, బీజేపీ చేసిన తప్పులు, కుంభకోణాల దుష్ప్రభావాలను ఆయన పూర్తిగా తొలగించగలరు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెంచుకొని ఆయన సీఎం కావాలి ’’ అని ఆయన అన్నారు.
వొక్కలిగ నాయకుడు, ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డీకే శివకుమార్ కూడా ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన ఉన్నట్లు బయటపెట్టారు. 60 ఏళ్ల శివకుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
‘‘నేను పార్టీ కోసం చాలా కష్టపడ్డాను. అందుకే పార్టీ నాకు అండగా నిలుస్తుంది. దినేశ్ రావు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా తప్పుకున్నప్పుడు నేను బాధ్యతలు తీసుకున్నాను. ఆ తర్వాత నేను ప్రశాంతంగా నిద్రపోయిన రోజంటూ లేదు. పార్టీకి ఏం కావాలో అన్నీ చేశాను. నేను మంచి పాలనను కూడా అందించగలను’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇప్పుడు ఏం జరగొచ్చు?
కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలోనే ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయం తీసుకోవచ్చని ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు.
‘‘ముఖ్యమంత్రి ఎవరో మీరే నిర్ణయించాలని పార్టీ హైకమాండ్‌ను ఎమ్మెల్యేలు కోరవచ్చు. ప్రజాదరణను దృష్టిలో ఉంచుకొని పార్టీ సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపొచ్చు. లేదా శివ కుమార్‌ను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ శాసనసభ్యులు ప్రతిపాదించొచ్చు. పార్టీ హైకమాండ్ ఆమోదిస్తే ఆయన సీఎం కావచ్చు. లేదా ఇద్దరికీ న్యాయం జరిగేలా ఒక్కొక్కరు రెండున్నరేళ్ల చొప్పున ముఖ్యమంత్రిగా కొనసాగేలా అధికారాన్ని పంచుకొనే విధానాన్ని తెరపైకి తీసుకురావచ్చు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
అధికారాన్ని పంచుకునే దిశగా ఇప్పటికే సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య ఒప్పందం కుదరిందని కాంగ్రెస్ వర్గాల నుంచి తమకు సమాచారం అందినట్లు సీనియర్ జర్నలిస్టు నాగభూషణం చెప్పారు.
‘‘కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం, మొదట రెండున్నర ఏళ్లు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పనిచేస్తారు. అప్పుడు డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ఉంటారు. ఆ మిగతా కాలంలో సీఎంగా శివకుమార్, డిప్యూటీ సీఎంగా సిద్ధరామయ్య ఉంటారు’’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- చార్ధామ్: ఎత్తైన ప్రాంతాలలో ఊపిరి ఆడనప్పుడు ఏం చేయాలి?
- ది కేరళ స్టోరీ: ఇది వాస్తవాల ఆధారంగా తీసిన సినిమానా, లేక ప్రచారాస్త్రమా?
- పోఖ్రాన్ II: అమెరికా కళ్లుగప్పి వాజ్‌పేయి అణు పరీక్షలు ఎలా నిర్వహించారు?
- మైసూర్ శాండల్ సబ్బు చరిత్ర ఏంటి? దాని పుట్టుకకు మొదటి ప్రపంచయుద్ధం ఎలా కారణమైంది?
- ‘కస్టడీ’ రివ్యూ: నాగచైతన్య సినిమా ఎలా ఉందంటే..
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















