కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవీ

ఫొటో సోర్స్, Getty Images
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం ముగిసింది. తర్వాత ఈవీఎంలు, వీవీప్యాట్లను ఎన్నికల అధికారులు సీల్ చేశారు.
రాష్ట్రంలో 65.7 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల కమిషన్(ఈసీ) తెలిపినట్టు ఏఎన్‌ఐ వార్తాసంస్థ చెప్పింది.
పోలింగ్ ముగియగానే వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేశాయి.
టీవీ9 భారత్ వర్ష్, పీపుల్స్ పల్స్, రిపబ్లిక్ టీవీ, ఏబీపీ సీ-ఓటర్ సంస్థల ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు దక్కనున్నట్లు వెల్లడించగా, బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుస్తుందని న్యూస్ నేషన్ సీజీఎస్ చెప్పింది.
ఈ అయిదు సర్వేల ఉమ్మడి ఫలితాల ప్రకారమైతే కాంగ్రెస్ పార్టీకి కనీసం 86 స్థానాల నుంచి గరిష్ఠంగా 119 స్థానాలు వచ్చే అవకాశం ఉంది.
బీజేపీకి కనిష్ఠంగా 78 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సర్వే చెప్పింది. బీజేపీ గరిష్ఠంగా 114 స్థానాలు గెలవచ్చని న్యూస్ నేషన్ సీజీఎస్ వెల్లడించింది.
జేడీఎస్ గరిష్ఠంగా 32 స్థానాలు గెలవొచ్చని రిపబ్లిక్ టీవీ చెప్పింది.
ఇతరుల ఖాతాలో గరిష్ఠంగా 6 సీట్లు చేరే అవకాశం ఉన్నట్లు ఈ పోల్స్ తెలుపుతున్నాయి.

మే 13న ఫలితాల వెల్లడి
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 5 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఫలితాలు మే 13న విడుదల కానున్నాయి.
ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అధికారాన్ని చేపట్టడం కోసం భారీగా ప్రచారం నిర్వహించాయి.
కర్ణాటకలో అధికారం చేపట్టడానికి కావాల్సిన మెజారిటీ సీట్ల సంఖ్య 113.

చేతులు మారుతున్న అధికారం
కర్ణాటకలో 1999 నుంచి బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే అధికారాన్ని దక్కించుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ రెండు పార్టీల మధ్యే పోరు నడుస్తోంది. 1994 వరకు ఈ రెండు పార్టీలకు పోటీ ఇచ్చిన జనతాదళ్, 1999 నుంచి వెనుకబడింది.
గత ఎన్నికల ఫలితాలను చూస్తే- 2004లో బీజేపీ 79 సీట్లు, కాంగ్రెస్ 65 సీట్లు నెగ్గాయి. 2008 ఎన్నికల్లో బీజేపీ 110 సీట్లతో కాంగ్రెస్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది.
అయితే, 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనంగా పునరాగమనం చేసింది. 122 సీట్లను గెలుచుకొని బీజేపీని 44 సీట్లకే పరిమితం చేసింది.
2018 ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు గెలుపొంది అత్యధిక స్థానాలు దక్కించుకున్న పార్టీగా నిలిచింది. రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 78 సీట్లలో విజయం సాధించింది.

ఫొటో సోర్స్, Getty Images
స్థిరంగా పెరుగుతున్న కాంగ్రెస్ ఓట్లు
2018 ఎన్నికల్లో అక్కడ బీజేపీ అత్యధికంగా 36.24 శాతం ఓట్లను సాధించింది. 2013లో ఇది కేవలం 19.89 శాతంగా ఉంది. అయినప్పటికీ, కాంగ్రెస్ ఓట్ల సంఖ్యతో పోలిస్తే బీజేపీ ఓట్ల శాతం తక్కువే.
2018 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ 38 శాతం ఓట్లను సాధించగలిగింది. 2008 నుంచి కాంగ్రెస్ ఓట్ల శాతం స్థిరంగా పెరుగుతోంది.

ఫొటో సోర్స్, INCTELANGANA/FACEBOOK
ఎగ్జిట్ పోల్స్ సర్వేను ఎలా నిర్వహిస్తారు?
పోలింగ్ జరిగిన రోజునే ఎగ్జిట్ పోల్స్‌ను చేపడతారు. ఓటింగ్‌లో పాల్గొన్నవారినే ఎగ్జిట్ పోల్‌లో నిర్వాహకులు ప్రశ్నిస్తారు.
అయితే, ఎగ్జిట్ పోల్ నిర్వహించే తీరు ఎప్పటికప్పుడు మారుతూ వస్తోంది.
ప్రిపోల్ సర్వేలో ఎవరిని ప్రశ్నించాలనేది నిర్వాహకులు చాలా వరకు ముందే నిర్ణయించుకుంటారు.
రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, వికలాంగులు, వృద్ధులు, మహిళలు, కులం, మతం, పేదలు, మధ్యతరగతి ఇలా వివిధ వర్గాల వారీగా ఓటర్లను ఎంచుకొంటారు.
సాధారణంగా జనాభాలో ఆయా వర్గాల నిష్పత్తికి అనుగుణంగా వారిని ఎంచుకొంటారు.
కానీ ఎగ్జిట్ పోల్‌లో ఇలాంటి వెసులుబాటు తక్కువని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) వ్యవస్థాపక ఛైర్‌పర్సన్ భాస్కరరావు అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
కచ్చితత్వం ఎంత?
ప్రిపోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్‌లో కచ్చితత్వానికి అవకాశం ఎక్కువ.
"ఎగ్జిట్ పోల్ అంచనాలు, తుది ఫలితాలకు కనీసం 95 శాతం దగ్గరగా ఉంటే అంచనాల్లో కచ్చితత్వం ఉన్నట్లు భావించవచ్చని, కానీ చాలా సంస్థలు తుది ఫలితాలకు 60 శాతం దగ్గరగా ఉన్నా తమ అంచనాలే నిజమయ్యాయని చెప్పుకొంటున్నాయి" అని భాస్కరరావు చెప్పారు.
"పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. ఎగ్జిట్ పోల్ నిర్వాహకులు దాదాపు అన్ని వర్గాల ఓటర్లు కవర్ అయ్యేలా వేర్వేరు సమయాల్లో ఓటర్ల స్పందనను తెలుసుకోవాల్సి ఉంటుంది అని ఆయతెలిపారు.
కానీ ఈ ప్రక్రియను ఎంత మంది పకడ్బందీగా, విస్తృతంగా చేస్తున్నారన్నది ప్రశ్నార్థకమేనని భాస్కరరావు చెప్పారు.
ఈ అంశంపై గతంలో బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సామాజికవేత్త, సెఫాలజిస్టు యోగేంద్ర యాదవ్ - "సర్వే నిర్వహించిన సమయం, ప్రాంతం, ఓటరు మూడ్, శాంపిల్, శాంపిల్ పరిమాణం, ఇతర అంశాలను బట్టి ప్రిపోల్, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆధారపడి ఉంటాయి" అన్నారు.
ఎగ్జిట్ పోల్స్‌లో మార్జిన్ ఆఫ్ ఎర్రర్‌పై సీవోటర్‌కు చెందిన మనుశర్మ మాట్లాడుతూ, ‘‘ఇది సాధారణంగా 5 శాతం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 3 శాతమే ఉంటుంది’’ అని అన్నారు.
"అత్యధిక సందర్భాల్లో దాదాపు అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో పార్టీల ఓటింగ్ శాతాలు, సీట్ల సంఖ్యలు వేర్వేరుగా ఉన్నా, అన్నీ ఒకే దిశలో ఉంటాయి" అని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- 2023లో మానవ జీవితాల్ని మార్చబోయే 5 శాస్త్రీయ పరిశోధనలు
- ప్రేమ-సెక్స్: 2022లో వచ్చిన కొత్త మార్పులు ఏంటి?
- ఆనాటి కారు యాక్సిడెంట్లో ఓ క్రికెటర్ చనిపోయాడు, ప్రాణాలతో బయటపడ్డవారు ప్రపంచ ప్రఖ్యాత ఆల్‌రౌండర్స్ అయ్యారు
- న్యూయార్క్ మహా నగరం ‘ఖాళీ’ అయిపోతోంది... ఎందుకు?
- క్యాథలిక్: చర్చిలో మతాధికారి హోదా కోసం మహిళల పోరాటం... ససేమిరా అంటున్న వాటికన్ వర్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














