కర్ణాటక: కాంగ్రెస్‌కు అపూర్వ విజయాన్ని అందించిన వ్యూహకర్తలు ఎవరు?

రాహుల్ గాంధీ
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు క్రెడిట్ అంతా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా సమన్వయంలోని వ్యూహాత్మక బృందానికి దక్కింది.

ఈ ఎన్నికల వ్యూహ రచన బృందంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఉన్నారు.

వీరితో పాటు ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు, మాజీ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ కూడా ఈ బృందంలో కీలక సభ్యులు.

‘‘గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు ప్రధాన తేడా సూర్జేవాలా, సునీల్ కనుగోలు’’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఒకరు బీబీసీతో అన్నారు. ఆయన తన పేరును బహిరంగ పరిచేందుకు ఇష్టపడలేదు.

ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి పదవి నుంచి సూర్జేవాలా, కర్ణాటక జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జిగా మారిన వెంటనే తీసుకున్న తొలి నిర్ణయం ఏంటంటే కర్ణాటక ప్రజల నాడిని తెలుసుకోవడం.

ఈ అధ్యయనమే, కర్ణాటక ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పార్టీకి తెలిసేలా చేసింది. సిద్ధరామయ్య, శివకుమార్, సూర్జేవాలా కలిసి అయిదు హామీల రూపకల్పన చేసేందుకు దారి తీసింది.

బెంగళూరులోకి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

‘‘పార్టీ మేనిఫెస్టో ఏం చెబుతుందనే విషయాన్ని ప్రజలు ఎప్పుడూ పట్టించుకోరనే కీలక పాయింట్‌ను సూర్జేవాలా గ్రహించారు. అందుకే ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై నిర్ణయం తీసుకొని, ప్రచారంలో ఆ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేయగలదో వివరించాలని ఆయన సూచించారు’’ అని బీబీసీతో కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సలీమ్ అహ్మద్ చెప్పారు.

ఆ విధంగా, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలనే కాంగ్రెస్ మొదటి హామీ పుట్టుకొచ్చింది. ఆ తర్వాత సిద్ధరామయ్య, ప్రతినెలా 10 కేజీల బియ్యాన్ని అందిస్తామనే హామీని రూపొందించారు.

‘‘2013-18 మధ్యకాలంలో సిద్ధరామయ్య సీఎంగా ఉన్నప్పుడు పేదవారికి 7 కిలోల బియ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ‘అన్న భాగ్య’ పథకాన్ని తీసుకొచ్చారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీన్ని 4 కిలోలకు తగ్గించిన సంగతి మీకు తెలిసి ఉండొచ్చు. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం పేదవారిని చాలా బాధించింది’’ అని అహ్మద్ వివరించారు.

వీటి తర్వాత, మహిళల కోసం హామీలపై దృష్టి సారించింది. కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు నెలకు రూ. 2000, నిరుద్యోగులైన గ్రాడ్యుయేట్లకు రెండేళ్ల కాలం పాటు ప్రతీ నెలా రూ. 2000, డిప్లొమా చదివిన వారికి రెండేళ్ల కాలం పాటు ప్రతీ నెలా రూ. 1,500 ఇస్తామనే హామీతో పాటు మహిళలకు ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కల్పిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు.

కర్ణాటక కీలక నేతలు

ఫొటో సోర్స్, ANI/GETTY

‘‘మరీ ముఖ్యంగా సిద్ధరామయ్య, శివకుమార్ వంటి శక్తిమంతమైన నాయకుల మధ్య సూర్జేవాలా చక్కని సమన్వయాన్ని కనబరిచారు. సమష్టి నాయకత్వం, సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడింది’’ అని బీబీసీతో సీనియర్ కాంగ్రెస్ నాయకుడొకరు అన్నారు. ఆయన కూడా తన వివరాలను గోప్యంగా ఉంచారు.

తొలి నాలుగు హామీలను ప్రకటించడంపై ఒక దశలో జి. పరమేశ్వరన్ అభ్యంతరం వ్యక్తం చేశారని మరో నేత చెప్పారు. అయితే సుదీర్ఘమైన మేనిఫెస్టోను ప్రజలు ఎవరూ పట్టించుకోరనే సూర్జేవాలా వాదనతో పార్టీ నాయకులందరూ ఏకీభవించారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా జి. పరమేశ్వరన్ పనిచేశారు.

సునీల్ కనుగోలు, శశికాంత్ సెంథిల్‌లతో చర్చించిన తర్వాతే చాలా నిర్ణయాలు తీసుకున్నట్లు మరో నాయకుడు చెప్పారు.

అయితే, సునీల్ కనుగోలు నాయకత్వంలో ఈ వ్యూహకర్తల బృందం చేపట్టిన ‘‘అవినీతి ప్రచార కార్యక్రమం’’, బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వాన్ని బలహీనపరిచింది.

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం రాసిన ఒక లేఖ ఆధారంగా ఈ బృందం ఈ ప్రచారాన్ని నిర్వహించింది.

టెండర్లు దక్కాలంటే 40 శాతం కమిషన్ చెల్లించాలని తమపై ఒత్తిడి తెస్తున్నారంటూ కాంట్రాక్టర్ల సంఘం, ప్రధాని మోదీకి లేఖ రాసింది.

దీని ఆధారంగా అధికార ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం అనే పాయింట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ‘‘పే సీఎం’’ అనే క్యాంపెయిన్‌ను ఈ బృందం నడిపింది.

బెంగళూరు అంతటా పోస్టర్లను అంటించారు. పార్టీ కార్యకర్తలు అరెస్ట్ అయినప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలు, ప్రభుత్వానికి సవాళ్లు విసిరారు.

అంతేకాకుండా శివకుమార్, సిద్ధరామయ్య వంటి నేతలు స్వయంగా పోస్టర్లు అంటిస్తూ అరెస్ట్‌లను నిరసించారు.

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్

ఫొటో సోర్స్, @DKSHIVAKUMAR

ఫొటో క్యాప్షన్, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్

తమపై వచ్చిన అవినీతి అరోపణలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను బీజేపీ సమర్థంగా ఎదుర్కోలేకపోయింది.

ప్రధాని నరేంద్ర మోదీ ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీది తాయిలాల సంస్కృతి అని వ్యాఖ్యానించారు.

కానీ, బీజేపీ కూడా తన మేనిఫెస్టోలో ఉగాది, వినాయక చవితి, దీపావళి పండుగలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తామనే హామీని పొందుపరిచింది.

2014లో ప్రధాని మోదీ విజయానికి వ్యూహరచన చేసిన ప్రశాంత్ కిషోర్ జట్టులో సునీల్ కనుగోలు కూడా ఒక సభ్యుడు.

సెంథిల్, దక్షిణ కన్నడ జిల్లాకు డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. తర్వాత ఆయన సివిల్ సర్వీసెస్ నుంచి తప్పుకున్నారు.

‘‘మన ప్రజాస్వామ్యంలోని ప్రాథమిక సూత్రాలు, భావనల విషయంలో రాజీ పడుతూ సివిల్ సర్వెంట్‌గా ప్రభుత్వంలో కొనసాగడం అనైతికం’’ అని ఆయన అనేవారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)