రూ. 2,000 నోటు మార్పిడి నేటి నుంచే.. మీ దగ్గరున్న నోట్లను ఇలా మార్చుకోవాలి

ఫొటో సోర్స్, Getty Images
దేశంలో రూ. 2,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 19న ప్రకటించింది. మే 23 నుంచి ఏదైనా బ్యాంకు శాఖను సందర్శించి ఈ నోట్లను మార్చుకోవచ్చని ఒక ప్రకటనలో చెప్పింది.
రూ.2,000 నోట్లు చెల్లుబాటు అవుతాయని, అయితే ప్రజలు 2023 సెప్టెంబర్ 30 వరకు వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది.
బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయడానికి ఎటువంటి పరిమితినీ ఆర్‌బీఐ పెట్టలేదు. ఇప్పటికే ఉన్న చట్టాలు మాత్రమే వర్తిస్తాయి. కానీ, నోట్లు మార్చుకోవడానికి షరతులను విధించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, AFP
ఆర్‌బీఐ షరతులేంటి?
రూ. 2 వేల నోట్లను మీ బ్యాంక్ ఖాతా నుంచి లేదా ఏదైనా బ్యాంక్‌లో మార్చుకోవచ్చు.
ఏ బ్యాంకు శాఖలోనైనా ఒకసారి రూ.20,000 వరకు మాత్రమే రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు.
2023 మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
ఇందుకు సంబంధించి ఆర్‌బీఐ అన్ని బ్యాంకులకు మార్గదర్శకాలు పంపింది.
ఈ నేపథ్యంలో 2000 రూపాయల నోట్ల జారీని వెంటనే నిలిపివేయాలని ఆర్‌బీఐ బ్యాంకులను కోరింది.
దీని గురించి మరింత తెలుసుకోవడానికి తన వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు అందించినట్లు ఆర్‌బీఐ తెలిపింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లోని సెక్షన్ 24 (1) ప్రకారం 2016 నవంబర్‌లో తొలిసారిగా రూ. 2000 నోట్లను విడుదల చేసినట్లు ఆర్‌బీఐ తెలిపింది.
గతంలో పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన తర్వాత ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ అవసరాలను తీర్చేందుకు రూ.2000 నోట్లను విడుదల చేసినట్లు చెప్పింది.
చిన్న నోట్ల సరఫరా సజావుగా ఉండటంతో 2018-19లోనే రూ. 2000 నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు ఆర్బీఐ తెలిపింది.
ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం రూ. 2000 నోట్లలో 89 శాతం మార్చి 2017 కంటే ముందే జారీ అయ్యాయి.
2018 మార్చి 31న అత్యధికంగా రూ. 6.73 లక్షల కోట్ల విలువైన 2వేల నోట్లు చలామణిలో ఉన్నాయి.
అయితే 2023 మార్చి 31న రూ. 3.62 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయని ఆర్‌బీఐ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
రూ.2 వేల నోట్ల కొరతపై ప్రభుత్వం ఏమంది?
నోట్ల రద్దు తర్వాత రూ. 2000 నోటు తెరపైకి వచ్చింది.
2016 నవంబర్ 8న అకస్మాత్తుగా 500, 1000 రూపాయల నోట్లను దేశంలో రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు.
రాత్రి 12 గంటల తర్వాత రూ.500, రూ. 1000 నోట్ల ప్రింటింగ్ నిలిపివేస్తున్నామని వాటి స్థానంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త నోట్లను విడుదల చేస్తుందని చెప్పారు.
అనంతరం ఆర్‌బీఐ కొత్త రూ.500, రూ.2000 నోట్లను విడుదల చేసింది.
గత కొన్నేళ్లలో రూ. 500 నోటు చలామణి పెరిగినప్పటికీ, ఏటీఎం, బ్యాంకుల్లో రూ. 2000 నోట్ల కొరతపై ప్రశ్నలు తలెత్తాయి.
2019, 2020 సంవత్సరాల్లో ఆర్‌బీఐ 2 వేల రూపాయల కొత్త నోట్లను ముద్రించలేదని 2021లో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.
“2019 మార్చిలో రూ. 329.10 కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లు మార్కెట్లో చలామణిలో ఉన్నాయి.
అయితే 2020 మార్చిలో వాటి విలువ రూ.273.98 కోట్లకు తగ్గింది'' అని అనురాగ్ ఠాకూర్ 2020లో అన్నారు.
ఇవి కూడా చదవండి
- నాసిక్: త్రయంబకేశ్వర ఆలయంలో ముస్లింలు ధూపం సమర్పించారా... వైరల్ వీడియోలో ఏముంది, అసలేం జరిగింది?
- చైనా మిలటరీపై జోక్ వేసినందుకు 17 కోట్ల జరిమానా
- హైపర్టెన్షన్ డే: అధిక రక్తపోటు ఎందుకు వస్తుంది, తగ్గాలంటే ఏం చేయాలి?
- సూడాన్: 'గుర్రాలపై వచ్చే దెయ్యాల'ను ఎదుర్కోవడానికి ఏకే-47 పట్టుకున్న అకౌంటెంట్
- హమీదా బానో: మగ కుస్తీ యోధులు కూడా ఓడించలేని పహిల్వాన్ ఈమె, చివరకు బూందీ అమ్ముకుంటూ ఎందుకు బతికారంటే....
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















