రిటైర్మెంట్ ప్లానింగ్: మంచి వడ్డీ, జీరో ట్యాక్స్, ద్రవ్యోల్బణాన్నిఎదుర్కొనే దీమా ఇచ్చే ప్రభుత్వ బాండ్ల గురించి మీకు తెలుసా?

పొదుపు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఐవీబీ కార్తికేయ
    • హోదా, బీబీసీ కోసం

పర్సనల్ ఫైనాన్స్ పరంగా మనం ఎక్కువగా నిర్లక్ష్యం చేసే అంశం రిటైర్మెంట్ ప్లానింగ్.

పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో వారి లెక్కల ప్రకారం, ప్రస్తుతం మన దేశంలో 65 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్నవారు 6 శాతం ఉన్నారు.

2050 నాటికి వీరి సంఖ్య 14 శాతానికి చేరుకుంటుంది.

జనాభా ప్రకారం చూస్తే వచ్చే 30 ఏళ్ళల్లో రిటైర్మెంట్ వయస్సుకు చేరుకునేవారి సంఖ్య దాదాపు 14 కోట్లు పెరుగుతుంది.

వీళ్లలో ఎక్కువ భాగానికి పెన్షన్ సౌకర్యం ఉండదు. పెన్షన్ లేని తొలి తరం, ప్రస్తుతం ఉద్యోగులుగా ఉన్న తరం కావడం గమనార్హం.

ఈ గణాంకాలన్నీ కూడా ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్లానింగ్ ఎంత కీలకమో చెబుతున్నాయి.

రిటైర్మెంట్ ప్లానింగ్ విషయాన్ని మూడు భాగాలుగా విభజించుకోవచ్చు:

1. ఆరోగ్య బీమా

2. కనీస ఆదాయం

3. ద్రవ్యోల్బణం కంటే అధిక రాబడి ఇచ్చే మదుపు మార్గాలు

ఆరోగ్య బీమా

ఫొటో సోర్స్, GETTY IMAGES/PETER DAZELEY

1. ఆరోగ్య బీమా

బీమా అనేది పర్సనల్ ఫైనాన్స్ పరంగా తొలి అడుగు అని ఎంతో మంది నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎందుకంటే వైద్యానికి అయ్యే ఖర్చులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.

ఉద్యోగంలో పని చేసినప్పుడు కంపెనీ ఇచ్చే బీమా కొంత ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత ఆ సదుపాయం కూడా ఉండదు.

బీమా ప్రీమియం మొత్తం వయసుతో పాటూ పెరుగుతూ ఉంటుంది. ఒక వయసు దాటాక ఆరోగ్య బీమా దొరకడం కూడా ఇబ్బందే. అలాగే కొన్ని రుగ్మతలు ఉన్నవారికి కూడా ఆరోగ్య బీమా దొరకదు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య బీమా అవసరం గురించి ఎంత చెప్పినా తక్కువే.

మనీ

ఫొటో సోర్స్, Getty Images

2. కనీస ఆదాయం

కనీస ఆదాయం అంటే మన రోజువారీ ఖర్చులకు అవసరం అయ్యే మొత్తం. ఈ ఆదాయం ఎలాంటి రిస్క్ లేని మదుపు మార్గాల నుంచి రావాలి.

ఇలాంటి అవసరాలకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చాలా ప్రాచుర్యం పొందిన మదుపు మార్గం.

ఇలా ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా వచ్చే ఆదాయం రిస్క్ లేని మొత్తమే. కానీ దానీ మీద వచ్చే వడ్డీ చాలా తక్కువ.

అంతేకాకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వచ్చే ఆదాయం మీద మన ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. ప్రభుత్వ బాండ్లు ఈ సమస్యను కొంత వరకు తీరుస్తాయి.

అసలు ప్రభుత్వ బాండ్లు అంటే ఏమిటి? ప్రభుత్వం ఇలాంటి బాండ్లను ఎందుకు ఇస్తుంది?

బహిరంగ మార్కెట్ ద్వారా నిధులు సమీకరించుకోవడానికి ప్రభుత్వాలు బాండ్లను విడుదల చేస్తాయి.

ఏదో ఒక ప్రత్యేక లక్ష్యం కోసం ప్రభుత్వాలు చేసే ప్రయత్నంలో నిధుల కొరత లేకుండా బాండ్ల ద్వారా వచ్చే నిధులను వాడుకుంటాయి.

ఈ బాండ్లలో మదుపు చేసిన వారికి ప్రతీ ఆరునెలలకు ఒకసారి నిర్ణీత వడ్డీ వస్తుంది.

ప్రభుత్వమే పూచీ ఉంటుంది కనుక ఎలాంటి రిస్క్ లేని మదుపు మార్గం ఇది.

మరోవైపు ప్రభుత్వానికి కూడా ఇలా బాండ్ల నుంచీ వచ్చిన మొత్తం అభివృధ్ధి కార్యక్రమాలకు వినియోగించడానికి ఉపయుక్తంగా ఉంటుంది.

అలా అని ప్రతీ అవసరానికి ప్రభుత్వాలు, బాండ్ల ద్వారా నిధులు సమీకరించుకునే అవకాశం లేదు.

ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు బాండ్లు విడుదల చేసే అవకాశం లేదు.

కానీ, హైవే నిర్మాణం లేదా హడ్కో లాంటి ప్రత్యేక ప్రాజెక్టులకు బాండ్లు విడుదల చేయవచ్చు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ బాండ్లను చూద్దాం:

గోల్డ్ బాండ్లు

ఫొటో సోర్స్, AFP

సావరిన్ గోల్డ్ బాండ్:

ఈ రకమైన బాండ్లు పూర్తిగా బంగారం మీద ఆధారపడినవి. ఇందులో వడ్డీ ప్రస్తుతం ఉన్న బంగారం ధర కంటే 2.5% అధికంగా వస్తుంది.

బంగారం ధర పెరుగుతున్న ఈ రోజుల్లో ఇది చాలా మంచి అవకాశం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్వారా విడుదల చేసిన ఈ బాండ్ల మీద వచ్చే ఆదాయం ప్రతీ ఆరునెలలకు ఒకసారి మదుపరుల బ్యాంక్ ఖాతాలలో జమ అవుతుంది.

ఈ బాండ్లలో వచ్చిన ఆదాయం, ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచీ వీటిని కొనవచ్చు.

ఆదాయపు పన్ను నుంచి ఊరట ఇచ్చే బాండ్లు:

ఆదాయపు పన్ను అధికంగా ఉండేవారి కోసం రెండు రకాల బాండ్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని బాండ్లలో మదుపు చేస్తే ఆ మొత్తాన్ని 80సి ద్వారా పన్ను రాయితీ పొందవచ్చు. మరోవైపు జీరో టాక్స్ బాండ్లు అని ప్రాచుర్యంలో ఉన్న బాండ్ల నుంచి వచ్చే ఆదాయం ఆదాయపు పన్ను పరిధిలోకి రాదు. ఆదాయపు పన్ను పరిధిలోకి రాని ఈ బాండ్లకు సహజంగానే గిరాకీ ఎక్కువగా ఉంటుంది.

ప్రభుత్వ బాండ్లు

ద్రవ్యోల్బణాన్ని అధిగమించే బాండ్లు

ఈ తరహా బాండ్లలో ద్రవ్యోల్బణం కంటే ఒక నిర్ణీత శాతం ఎక్కువ వడ్డీ వస్తుంది.

ఇలాంటి వాటి వల్ల ద్రవోల్బణాన్ని ఎప్పుడూ అధిగమించే అవకాశం ఉంటుంది.

టోకు ద్రవ్యోల్బణం లేదా వినియోగదారుల ద్రవ్యోల్బణాన్ని ప్రామాణికంగా తీసుకుని వడ్డీని నిర్ణయిస్తారు.

ఈ బాండ్ల మీద వచ్చే ఆదాయం ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది.

జీరో కూపన్ బాండ్:

ఇది కూడా వడ్డీ ఇచ్చే బాండ్ అయినా పనితీరు కొంత తేడాగా ఉంటుంది.

మదుపరులు ఈ బాండ్ కొనుగోలు చేసే సమయంలో బాండ్ విలువ కంటే తక్కువ మొత్తం చెల్లిస్తారు.

ఇలా చెల్లించిన మొత్తానికి బాండ్ విలువకు మధ్య వ్యత్యాసం వడ్డీ లాగా మదుపరులకు అందుతుంది.

వీడియో క్యాప్షన్, భవిష్యత్ కోసం మదుపు చేసుకుంటున్నారా? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..

3. ద్రవ్యోల్బణం కంటే అధిక రాబడి ఇచ్చే మదుపు మార్గాలు

కనీస ఆదాయం ద్వారా మన అవసరాలు తీరాక ఎప్పటికప్పుడు పెరిగే ఖర్చుల కోసం తగిన మదుపు మార్గాన్ని ఎన్నుకోవాలి.

ఉదాహరణకు 60 సంవత్సరాలకు రిటైర్ అయిన వ్యక్తి ఖర్చులు అయిదేళ్ళ తర్వాత ఎంతో కొంత పెరుగుతాయి.

ఇలా ద్రవ్యోల్బణం వల్ల వచ్చే ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలం మదుపు ద్వారా ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ చాలా మంచి మదుపు మార్గం.

బ్యాంకింగ్, నిత్యావసరాలు లాంటి రంగాలలో మదుపు చేయడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అధిగమించగలం.

(నోట్: ఈ కథనం నిర్దిష్టమైన అంశంపై స్థూలమైన అవగాహన కోసం మాత్రమే. నిర్ణయాలు మీ వ్యక్తిగత ఆర్థిక సలహాదారులను సంప్రదించి తీసుకోవాలి.)

వీడియో క్యాప్షన్, డిజిటల్ హెల్త్ ఐడీ కార్డు ఎలా తీసుకోవాలి?

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)