‘నియంత’ కూతురి అవినీతి సంపాదన: రూ. 2 వేల కోట్ల ఆస్తుల్ని ఎలా కొన్నారు? ఎవరు సహకరించారు

గుల్నారా కరిమోవా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2012 లో మొనాకోలో గుల్నారా కరిమోవా
    • రచయిత, ఆండీ వెరిటీ
    • హోదా, బీబీసీ ఎకనమిక్స్ ప్రతినిధి

పాప్ స్టార్‌గా, దౌత్యవేత్తగా పనిచేసిన ఒక నియంత కూతురు, లండన్ నుంచి హాంకాంగ్ వరకు రూ. 2 వేల కోట్లకు పైగా ఆస్తులను అక్రమ మార్గంలో కొన్నట్లు నివేదికలు వచ్చాయి.

లంచం, అవినీతి ద్వారా సంపాదించిన సొమ్ముతో ఇల్లు, ఒక జెట్‌ను కొనడానికి యూకేకు చెందిన కంపెనీలను గుల్నారా కరిమోవా ఉపయోగించారని ద ఫ్రీడమ్ ఫర్ యురేసియా అధ్యయనం వెల్లడించింది.

ఈ డీల్స్‌తో ప్రమేయం ఉన్న యూకే కంపెనీల తరఫున లండన్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లోని అకౌంటింగ్ సంస్థలు కూడా పనిచేశాయని ఆ అధ్యయనం తెలిపింది.

తాజా నివేదికతో అక్రమ సంపద నిర్వహణలో యూకే ప్రమేయంపై మరోసారి అనుమానాలు తలెత్తుతున్నాయి.

మనీ లాండరింగ్ వ్యవహారాల్లో విదేశీ నేరస్థులు, యూకే ఆస్తులను ఉపయోగించకుండా నిరోధించడానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని బ్రిటిష్ అధికారులపై ఎంతో కాలంగా ఆరోపణలు ఉన్నాయి.

యూకే ఆస్తులను గుల్నారా కరిమోవా వాడుకున్న తీరు ఆందోళనకరంగా ఉందని రిపోర్టు పేర్కొంది.

ఆమె కంపెనీల తరఫున పని చేసిన వారికి ఆమెతో గానీ, ఆ డబ్బు అక్రమమైనది అయ్యుండొచ్చనే దానిపై గానీ అవగాహన ఉన్నట్లు ఎలాంటి సూచనలు లేవు.

కరిమోవా ప్రాపర్టీ

ఫొటో సోర్స్, FREEDOM FOR EURASIA

ఫొటో క్యాప్షన్, మేఫయర్‌లోని కరిమోవా ఆస్తులను సీరియర్ ఫ్రాడ్ ఆఫీసర్ సీజ్ చేశారు

యూకేలో ఆమెకు సేవలు అందించిన ఎవరిపైనా ఎలాంటి దర్యాప్తు జరగలేదు. జరిమానాలు విధించలేదు.

గుల్నారా కరిమోవా తండ్రి ఇస్లామ్ కరిమోవ్ 1989 నుంచి 2016 వరకు ఉజ్బెకిస్తాన్ అధ్యక్షునిగా పనిచేశారు. ఆయన తదుపరి వారసులిగా ఆమెను అనుకున్నారు. ఇస్లామ్ కరిమోవ్ 2016లో మరణించారు.

గుల్నారా ఒక జ్యూయెలరీ కంపెనీని నడపడంతో పాటు స్పెయిన్‌కు అంబాసిడర్‌గానూ పనిచేశారు. అలాగే ‘‘గూగూషా’’ అనే పాప్ వీడియోలలో ఆమె సింగర్‌గా కూడా కనిపించారు.

కానీ, 2014 నుంచి ఆమె ప్రజా జీవితం నుంచి కనిపించకుండాపోయారు. ఆమెను అవినీతి ఆరోపణల కింద నిర్బంధించినట్లు తర్వాత తెలిసింది. అప్పుడు ఆమె తండ్రి అధికారంలోనే ఉన్నారు.

2017 డిసెంబర్‌లో ఆమెకు శిక్ష విధించారు. 2019లో గృహ నిర్బంధానికి సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించినందుకు గుల్నారాను జైలుకు పంపించారు.

రష్యా, యూకే, యూఏఈ సహా 12 దేశాల్లో ఒక బిలియన్ డాలర్ల (రూ. 8,241 కోట్లు)కు పైగా ఆస్తులను కొల్లగొట్టిన ఒక నేరస్థుల ముఠాలో గుల్నారా కూడా భాగమని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.

‘‘ఆల్‌టైమ్ అతిపెద్ద అవినీతి, లంచం కేసుల్లో కరిమోవా కేసు కూడా ఒకటి’’ అని టామ్ మేనే అన్నారు. ఫ్రీడమ్ ఫర్ యురేషియా నివేదికకు పనిచేసిన పరిశోధకుల్లో టామ్ కూడా ఉన్నారు. ఆయన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థి.

గుల్నారా కరిమోవా

ఫొటో సోర్స్, Getty Images

అయితే అవినీతి సొమ్ముతో సంపాదించిన ఆస్తుల్లో కొన్నింటిని కరిమోవా, ఆమె సహచరులు అమ్మేశారు.

ఆమె అరెస్ట్ కావడానికి ముందే యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, దుబయ్, హాంకాంగ్ వంటి వివిధ దేశాల్లో అనుమానాస్పద నిధులతో 14కు పైగా ప్రాపర్టీలను కొన్నట్లు ఫ్రీడమ్ ఫర్ యూరేషియా గుర్తించింది. ఈమేరకు ‘ప్రాపర్టీ అండ్ రిజిస్ట్రీ’ రికార్డులను ఫ్రీడమ్ ఫర్ యూరేషియా పరిశోధించి ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

గుల్నారా కరిమోవాపై ‘‘ హూ ఎనబుల్డ్ ద ఉజ్బెక్ ప్రిన్సెస్?’’ పేరిట ఫ్రీడమ్ ఫర్ యూరేషియా రూపొందించిన ఈ నివేదిక మార్చి 14న విడుదలైంది.

లండన్‌తో పాటు దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో ఆమె కొనుగోలు చేసిన 50 మిలియన్ పౌండ్ల (రూ. 501 కోట్లు) ఖరీదైన 5 ప్రాపర్టీలపై ఈ నివేదిక దృష్టి సారించింది.

వీటిలో మూడు ఫ్లాట్లు, బల్‌గ్రేవియాలో అంటే బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు పశ్చిమాన ఉన్నాయి. మేఫయర్‌లో ఒక ఇల్లుతో పాటు ప్రైవేట్ బోటింగ్ సరస్సుతో కూడిన సర్రే మేనర్ హౌజ్‌ ఉన్నాయి

కరిమోవా నిర్బంధానికి ముందు బల్‌గ్రేవియాలోని మూడు ఫ్లాట్లలో రెండింటిని 2013లో అమ్మేశారు. అక్కడి మరో ఫ్లాట్‌తో పాటు మేఫయర్‌లోని ఇల్లు, సర్రే మేనర్ భవనాన్ని 2017లో సీరియస్ ఫ్రాడ్ ఆఫీసు తమ ఆధీనంలోకి తీసుకుంది.

గుల్నారా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గుల్నారా సొంతంగా ఆభరణాల వ్యాపారం నిర్వహించడంతో పాటు పాప్ గీతాలు కూడా పాడారు

‘ఫ్రీడమ్ ఫర్ యూరేషియా’ నివేదికలో లండన్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌కు చెందిన సంస్థల పేర్లను కూడా ప్రస్తావించారు.

నేరాల ద్వారా వచ్చిన ఆదాయంతో ప్రాపర్టీలు, ఒక ప్రైవేట్ జెట్‌లైనర్‌ను కొనుగోలు చేయడానికి కరిమోవా లేదా ఆమె సహచరులు ఈ సంస్థలను ఉపయోగించుకున్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

కరిమోవా ప్రియుడు రుస్తమ్ మడుమరోవ్. రుస్తమ్‌తో పాటు ఇతరులు ఇప్పుడు కరిమోవా భాగస్వాములుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారిని యూకే, జిబ్రాల్టర్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో ఉన్న కంపెనీలకు ‘బెనిఫీషియల్ ఓనర్స్’గా అధికారిక పత్రాల్లో పేర్కొన్నారు.

అయితే, లక్షలాది డాలర్ల మనీ లాండరింగ్‌కు పాల్పడిన కరిమోవాకు వారు కేవలం ప్రాక్సీలు మాత్రమే అని ఈ నివేదిక పేర్కొంది.

కరిమోవాతో సంబంధాలు ఉన్న యూకేలోని ప్యానల్లీ లిమిటెడ్, ఒడెంటాన్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలకు ఎస్‌హెచ్ లాండెస్ ఎల్‌ఎల్‌పీ అనే సంస్థ అకౌంటింగ్ సేవలను అందించింది.

2010 జూలై చివరలో ఎస్‌హెచ్ లాండెస్ సంస్థ మరో కంపెనీని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది.

మడుమరోవ్ పేరు మీద 40 మిలియన్ డాలర్ల విలువైన ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేయడమే వారి ఉద్దేశం. అయితే, ఈవిషయంలో కరిమోవా ప్రమేయం పెద్దగా లేదని రిపోర్టు అభిప్రాయపడింది.

గుల్నారా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2012 పారిస్ ఫ్యాషన్ వీక్‌లో గుల్నారా

మడుమరోవ్‌కు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం అడిగినప్పుడు ఎస్‌హెచ్ లాండెస్ ఇలా బదులు ఇచ్చింది.

‘‘ఈ పరిస్థితిలో అతని వ్యక్తిగత సంపదకు సంబంధించిన ప్రశ్నలు అడగడం సముచితం కాదని మేం అనుకుంటున్నాం. ఎందుకంటే జెట్‌ను కొనడానికి మడుమరోవ్ తన వ్యక్తిగత నిధులు వెచ్చించలేదని మాకు అనిపిస్తోంది’’ అని వారు చెప్పారు.

మడుమరోవ్ సంపదలో కొంతభాగం ఉజ్బెకిస్తాన్‌లోని ‘ఉజ్డోరోబిటా’ అనే ఒక మొబైల్ ఫోన్ కంపెనీ నుంచి వచ్చినట్లు లండన్‌కు చెందిన ఎస్‌హెచ్ లాండెస్ తర్వాత చెప్పింది.

ఆ మొబైల్ కంపెనీతో కరిమోవా సంబంధాలపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.

కరిమోవా నకిలీ పత్రాలతో ఉజ్డోరోబిటా నుంచి 20 మిలియన్ డాలర్ల (రూ. 164 కోట్లు)ను దారి మళ్లించారని ఆరోపిస్తూ 2004లో మాస్కో టైమ్స్‌లో ఆర్టికల్ వచ్చింది.

కరిమోవా నిజాయతీపరురాలు కాదని ఒక మాజీ సలహాదారు కూడా ఆరోపించారు.

ప్యానల్లీ లిమిటెడ్ 2012 ఆర్థిక లావాదేవీలను ఎస్‌హెచ్ లాండెస్ సంస్థ సమర్పించింది.

కరిమోవా సన్నిహితుడు గయానె అవక్యాన్ దానిపై సంతకం చేసినట్లు రిపోర్టు పేర్కింది.

ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఒక మల్టీ మిలియన్ డాలర్ ఫ్రాడ్, అవినీతి కుంభకోణంలో కేంద్రంగా ఉన్న జిబ్రాల్టర్‌కు చెందిన టకిలాంట్ అనే కంపెనీకి అవక్యాన్, బెనిఫీషియల్ ఓనర్‌గా ఉన్నారంటూ వచ్చిన వార్తల్ని అంతకుముందే బీబీసీ ప్రచురించింది.

‘‘ఎస్‌హెచ్ లాండెస్ ఎల్‌ఎల్‌పీ ఎప్పుడూ కూడా గుల్నారా కరిమోవాతో పని చేయలేదు. ఎస్‌హెచ్ లాండెస్ కేవలం రుస్తమ్ మడుమరోవ్ తరఫునే పని చేసింది’’ అని బీబీసీతో స్టీవెన్ లాండెస్ చెప్పారు.

‘‘యూకేలోని ఆస్తులను కొనడానికి కరిమోవా నెరిపిన వ్యూహం చాలా ఆందోళకరమైనది. ఆమెపై 2017 వరకు అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదు. దీనికంటే సంవత్సరాల ముందే ఇతర దేశాలు, ఆమెకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను, ఆస్తులను స్తంభింపచేశాయి’’ అని ఫ్రీడమ్ ఫర్ యూరేషియాకు చెందిన టామ్ అన్నారు.

వీడియో క్యాప్షన్, ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి వివిధ వస్తువులను తయారుచేస్తోన్న రీఛర్ఖా ఇకోసోషల్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)