నాసిక్‌: త్రయంబకేశ్వర ఆలయంలో ముస్లింలు ధూపం సమర్పించారా... వైరల్ వీడియోలో ఏముంది, అసలేం జరిగింది?

నాసిక్‌లోని త్రయంబకేశ్వరాలయం

ఫొటో సోర్స్, PRAVIN THAKARE

ఫొటో క్యాప్షన్, నాసిక్‌లోని త్రయంబకేశ్వరాలయం
    • రచయిత, ప్రవీణ్ ఠాక్రే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నాసిక్‌లోని త్రయంబకేశ్వరాలయంలోకి ముస్లింలు ప్రవేశించి ధూపం వేసి, పూలు జల్లి, చాదర్ సమర్పించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియాలో వాడివేడి చర్చలు జరుగుతున్నాయి.

ఈ ఘటన నిజంగా జరిగిందో లేదో తెలుసుకునేందుకు మహరాష్ట్ర ప్రభుత్వం సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్) కూడా ఏర్పాటు చేసింది.

శివుడు కొలువున్న త్రయంబకేశ్వర్ పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి. హిందువులకు పుణ్యక్షేత్రం. ఆలయ ట్రస్టు నిర్వహణ నిబంధనల ప్రకారం, ఇతర మతాల వారికి ఆలయంలోకి ప్రవేశం లేదు.

కాగా, ముస్లింలు ఆలయంలోకి ప్రవేశించారన్న ఆరోపణలను ముస్లిం సంఘాలు తోసిపుచ్చాయి.

ఆలయ ప్రాంగణంలో ధూపం సమర్పించే సంప్రదాయం తరతరాలుగా వస్తోందని, అందులో భాగంగానే సంబంధిత వ్యక్తులు అక్కడికి వెళ్లారని వారు చెబుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్త సర్వత్రా చర్చనీయాంశమైంది. పలువురు రాజకీయ నాయకులు వ్యాఖ్యానాలు చేయడంతో అటువైపు మలుపు తిరుగుతున్నట్టు కనిపిస్తోంది.

ఇంతకీ, త్రయంబకేశ్వరాలయ ప్రాంగణంలో ముస్లింలు ధూపం సమర్పించే సంప్రదాయం ఉందా లేదా? అసలు ఏం జరిగింది? తెలుసుకుందాం.

ముస్లింలు

ఆరోజు ఏం జరిగింది?

మే 13వ తేదీ శనివారం త్రయంబక్ గ్రామం నుంచి గంధం ఊరేగింపు జరిగింది. అందులో 25-30 మంది పాల్గొన్నారు.

రాత్రి 10:50 గంటలకు ఆలయంలోని ఉత్తర మహాద్వారానికి సమీపంలో ఊరేగింపు ఆగింది. ఆలయం మూసివేసే సమయం కావడంతో భక్తులు ఆ ద్వారం నుంచి బయటకు వస్తున్నారు.

ఆ ఊరేగింపులో ఒక యువకుడి తలపై బుట్టలో పువ్వులు ఉన్నాయి. అతనితో పాటు మరికొందరు ఆలయం ఆవరణలో ధూపం వేయడానికి ముందుకు వెళ్లారు. సెక్యూరిటీ గార్డులు వారిని అడ్డుకున్నారు.

ఊరేగింపులో పాల్గొన్న కొందరు ఈ ఘటనను సెల్ ఫోన్‌లో షూట్ చేశారు. విషయం తెలిసిన వెంటనే స్థానికులు గుమికూడారు.

ఆలయ ప్రవేశంపై కొంత గందరగోళం తరువాత ఊరేగింపు కొనసాగిందని మరాఠీ దినపత్రిక లోక్‌సత్తా ఒక కథనంలో తెలిపింది.

ఈ ఘటనపై ఆలయ పూజారి, ఆలయ అధికారులు ఫిర్యాదు చేశారు. ధూపం వేయడం లాంటి పనుల ద్వారా సామాజిక వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని దేవస్థానం డిమాండ్ చేసింది.

ఈ కేసులో అకీల్ యూసుఫ్ సయ్యద్, సల్మాన్ అకీల్ సయ్యద్, మతీన్ రాజు సయ్యద్, సలీం బక్షు సయ్యద్ అనే నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

దీనిపై విచారణ జరుపుతున్నామని, తదుపరి చర్యలు తీసుకుంటున్నామని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బీజీ శేఖర్ తెలిపారు.

ముస్లింలు

ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు

త్రయంబకేశ్వరాలయంలో జరిగిన ఘటన తీవ్రమైందని అర్చక సంఘం ఫిర్యాదు చేయడంతో, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు ఆదేశించారు. ఆ మేరకు ఫడ్నవీస్‌ అధికారిక ట్విట్టర్‌ ఖాతా నుంచి ఒక ప్రకటన వెలువడింది.

ఈ ఘటనపై విచారణకు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఈ ఏడాది జరిగిన ఘటనపైనే కాకుండా కిందటి ఏడాది జరిగిన ఘటనపై కూడా ఈ సిట్ దర్యాప్తు చేస్తుందని ఫడ్నవీస్ తెలిపారు.

నిరుడు కూడా త్రయంబకేశ్వరాలయ ప్రధాన ద్వారం గుండా కొందరు ప్రవేశించడానికి ప్రయత్నించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఈ రెండు ఘటనలపై సిట్‌ దర్యాప్తు చేస్తుంది.

ధూపం సమర్పించడానికి సంబంధించిన వాదనలు, ప్రతివాదనలు

సురేశ్ గంగపుత్ర

ఫొటో సోర్స్, PRAVIN THAKARE

ఫొటో క్యాప్షన్, సురేశ్ గంగపుత్ర

త్రయంబకేశ్వరాలయం ట్రస్ట్ పోలీసులకు ఘటనపై లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది.

ఆలయ ప్రాంగణంలో హిందూయేతరులకు ప్రవేశం లేదని బోర్డు పెట్టినట్లు ఆలయ ట్రస్టు నిర్వాహకులు తెలిపారు.

మరోవైపు ఈ విషయంలో భిన్నమైన వాదన వినిపిస్తోంది. ఆ ఊర్లోని ఓ దర్గాలో ప్రతి ఏటా గంధం ఊరేగింపు నిర్వహిస్తారు.

ఊరేగింపు త్రయంబకేశ్వరాలయం మెట్ల వద్ద ఆగుతుంది. కొందరు మెట్లపై ధూపం వేస్తారు. ఆ తరువాతే ఊరేగింపు ముందుకు కదులుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.

ఈ సంప్రదాయం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోందని, ధూపం వేయడానికే ఆలయ ద్వారం వద్ద ఆగామని, ఆలయంలోకి ప్రవేశించే ఉద్దేశం లేదని ముస్లిం సంఘాలు చెబుతున్నాయి.

"ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంది. గంధం ఊరేగింపులో ఆలయ ద్వారం దగ్గర ఆగుతాం. మాలో ఇద్దరు ముగ్గురు ముందుకు వచ్చి ధుపం వేస్తారు. త్రయంబకేశ్వరుడిని మేమూ నమ్ముతాం. అందుకే ఈ ఆచారం పాటిస్తాం. ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించే అవసరం మాకేముంది?" అని ఊరేగింపు నిర్వాహకులలో ఒకరైన మతీన్ సయ్యద్ అన్నారు.

ఇలాంటి వివాదాలు సమాజానికి తప్పుడు సందేశం అందిస్తాయని, అలాంటి పనులు చేయవద్దని వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాని సయ్యద్ అన్నారు.

"త్రయంబకేశ్వరాలయ నియమాలు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మా నాన్న కూడా ఊరేగింపులో పాల్గొని గుడి మెట్లపై ధూపం వేసి ముందుకు సాగేవారు. ఇప్పటివరకు ఇలాగే చేస్తున్నాం కానీ, ఈసారి కొత్త ట్రెండ్‌ వచ్చింది. మాలో ఎవరికీ ఆలయంలోకి ప్రవేశించాలనే ఉద్దేశం లేదా శివుడికి చాదర్ సమర్పించే ఉద్దేశ్యం లేదు" అని సయ్యద్ అన్నారు.

అయితే, అలాంటి సంప్రదాయం లేనే లేదని ఆలయ ప్రధాన పూజారి, ధర్మకర్త డాక్టర్ సత్యప్రియ శుక్లా అన్నారు.

నిరుడు కూడా గంధం ఊరేగింపులో ఇలాంటి ఘటనే జరిగిందని, ఈ కేసులో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆన్నారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని శుక్లా అన్నారు.

ఆలయ పరిసరాల్లో నారాయణ నాగబలికి కావాల్సిన పూజ సామాగ్రి, బట్టలు, ప్రసాదం, పాత్రలు విక్రయించే అనేక దుకాణాలు ఉన్నాయని, గంధం ఊరేగింపులు, ఉర్సు ఊరేగింపులు ఏడాదికి రెండు మూడు జరుగుతాయని, ఇంతకుముందెన్నడూ ఇలాంటి ఘటన జరగలేదని త్రయంబకేశ్వర్ పురోహిత్ సంఘ్ మాజీ అధ్యక్షుడు, ఆలయ ధర్మకర్త ప్రశాంత్ గయాధాని అన్నారు.

ఈ మొత్తం విషయంపై స్థానిక నివాసి, సురేశ్ గంగపుత్ర అసహనం వ్యక్తం చేశారు.

“ఆలయ ప్రాంగణంలో మాకు చిన్న, పెద్ద దుకాణాలు ఉన్నాయి. మేం చిన్నప్పటి నుంచి ఇది చూస్తున్నాం. ముస్లింలు త్రయంబకేశ్వరుడిని మహారాజుగా భావిస్తారు. మెట్ల వద్ద ధూపం వేస్తారు. ఇది వారి సంప్రదాయం" అని ఆయన చెప్పారు.

"ఈసారి కూడా అలాగే చేశారు. కానీ ద్వారం దగ్గర రద్దీగా ఉండడంతో కొందరు లోపలికి వెళ్లారు. అయితే, పోలీసులు వారిని లోపలికి రానివ్వకుండా, చౌరస్తా గుండా వెళ్లి ధూపం వేయమని చెప్పారు" అని వివరించారు.

"ఈ విషయంలో హిందువులు, ముస్లింలపై నిందలు మోపుతున్నారు. అసలు దోషులు ఎవరో తెలుసుకుని, వారిపై చర్యలు తీసుకోవాలి. సయ్యద్ కుటుంబానికి త్రయంబకేశ్వర్‌తో సన్నిహిత సంబంధం ఉంది. నారాయణ నాగబలికి కావాల్సిన ధోతి, బట్టలు అమ్మే వ్యాపారం చేస్తున్నారు. వారి జీవనాధారం ఆలయంపైనే ఆధారపడి ఉందని" గంగపుత్ర సురేష్ అన్నారు.

అక్కడి శాంతి కమిటీ సభ్యుడు నబీయున్ షేక్ కూడా ఇదే మాట అన్నాదు.

"త్రయంబకేశ్వర్‌లో ఏళ్ల తరబడి హిందూ, ముస్లింలు సామరస్యంగా జీవిస్తున్నారు. ఇలాంటి వివాదం గతంలో ఎప్పుడూ తలెత్తలేదు. దీన్ని సంచలనం చేస్తున్నారు. త్రయంబకేశ్వర్ చరిత్రలో మతపరమైన వివాదాలు ఎప్పుడూ లేవు. ధూపం వేయడం అనాదిగా వస్తున్న ఆచారం అని కొందరు అంటుంటే, మరికొందరు అలాంటి సంప్రదాయం లేదని అంటున్నారు. దీని చుట్టూ అనవసర వివాదాలు అల్లుతున్నారు" అని నబీయున్ షేక్ అన్నారు.

"గంధం ఊరేగింపు సమయంలో గుడి మెట్ల వద్ద ధూపం వేసే ఆచారంపై ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే దాన్ని నిలిపివేస్తామని ఊరేగింపు నిర్వాహకులు తెలిపారు. నాకు తెలిసినంతవరకు కొంతమంది గుడి బయట, కొంతమంది మెట్ల వద్ద ధూపం వేస్తారు. గత కొన్నేళ్లుగా కరోనా కారణంగా ఊరేగింపు జరగలేదు. ఇప్పుడు అది మళ్లీ ప్రారంభమైంది. కానీ, పూజారులు అందుకు ఒప్పుకోకపోతే ఈ ఆచారాన్ని మానుకుంటామని ఊరేగింపు నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనపై అనవసరంగా అతిశయోక్తితో కూడిన కథనాలు ప్రచారం చేస్తున్నారు. మీడియా కూడా స్వీయ నియంత్రణ పాటించడం అవసరం" అని నబీయున్ షేక్ అభిప్రాయపడ్డారు.

నబీయున్ షేక్

ఫొటో సోర్స్, PRAVIN THAKARE

ఫొటో క్యాప్షన్, నబీయున్ షేక్

వివాదానికి రాజకీయ రంగు..

ఈ వివాదం తెరపైకి రాగానే రకరకాల స్పందనలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ, విశ్వహిందూ సంఘటన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

“హిందువులు పవిత్ర స్థలంగా భావించే, 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వరాలయంలోకి జిహాదీ భావజాలంతో కొందరు ముస్లిం యువకులు ప్రవేశించేందుకు ప్రయత్నించారు. సెక్యూరిటీ గార్డులు అప్రమత్తంగా ఉండబట్టి ఆ ప్రయత్నం విఫలమై పెను ప్రమాదం తప్పింది. నిరుడు కూడా ఇలాంటి విఫలయత్నమే జరిగింది.

దేశవ్యాప్తంగా చాలా దేవాలయాలలో వివాదాలు సృష్టించి, వాటిని స్వాధీనం చేసుకునేందుకు ముస్లింలు ప్రయత్నాలు చేస్తున్నారు. జిహాదీ మనస్తత్వంతో దేవాలయాలే కాకుండా హిందువుల ఆస్తులను కూడా కబ్జా చేసే ప్రయత్నాలు కూడా చాలా చోట్ల జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది పెద్ద కుట్ర అని మేం భావిస్తున్నాం" అని విశ్వహిందూ పరిషత్ కేంద్ర అధికార ప్రతినిధి శ్రీరాజ్ నాయర్ ఆ ప్రకటనలో తెలిపారు.

త్రయంబకేశ్వర్ ఘటనకు బాధ్యులైన యువకులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది.

మరోవైపు, నాసిక్ మాజీ మంత్రి, ఎన్సీపీ నేత ఛగన్ భుజ్‌బల్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, బీజేపీని విమర్శించారు.

ఇది అనాదిగా వస్తున్న ఆచారమని, అయితే ఈసారి దానికి భిన్నమైన ట్విస్ట్ ఇచ్చారని అన్నారు. రెండు మతాల మధ్య సామరస్యం పెంపొందించాలి కానీ, ఓట్ల కోసం రెండు వర్గాలుగా విడదీయడం సరికాదని అన్నారు. కర్ణాటకలో కూడా బీజేపీ ఇదే వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు.

శివసేన (ఉద్ధవ్ ఠాక్రే పార్టీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ కూడా బీజేపీని తీవ్రంగా విమర్శించారు.

"త్రయంబకేశ్వరంలో ఏమీ తప్పు జరగలేదు. ఊరేగింపు సమయంలో ధూపం సమర్పించే సంప్రదాయం ఉంది. ముస్లింలు గుడి ద్వారం దగ్గరకు వెళ్లి ధూపం వేసస్తారు. నాకు అందిన సమాచారం ప్రకారం, ఎవరూ ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించలేదని" అన్నారు.

సిట్‌ ఏర్పాటుకు దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆదేశాలను కూడా సంజయ్‌ రౌత్‌ విమర్శించారు.

"పాకిస్తాన్ హనీ ట్రాప్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకర్త చిక్కుకున్నారు. కురుల్కర్‌ కేసు అంతా బీజేపీకి సంబంధించినది. అక్కడ సిట్‌ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాని నుంచి భారత ప్రజల దృష్టి మరల్చడానికి త్రయంబకేశ్వర్‌, షెవ్‌గావ్‌ వంటి అల్లర్లు సృష్టిస్తున్నారు. ముస్లింలను అణచివేయడం మన సంప్రదాయం కాదు" అని రౌత్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)