కేసీఆర్ వారంలో ‘సమస్య తీరుస్తా’ అన్నారు. ఏడేళ్లయినా పోస్టింగులు రాలేదు. ఎందుకు?

కేసీఆర్

ఫొటో సోర్స్, @TELANGANACMO

ఫొటో క్యాప్షన్, ఎంపికైన అభ్యర్థులకు 2016 జనవరిలో కేసీఆర్ ఇచ్చిన హామీ ఏడేళ్లయినా అమలు కాలేదు.
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘మీకు అన్యాయం జరిగింది. వెంటనే సమస్య ఏమిటో తెలుసుకుంటా. వారం రోజుల్లో సమస్యను పరిష్కరించాలని అధికారులకు చెబుతున్నా.’’

- 2008 డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు 2016 జనవరి 3న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌లో ఇచ్చిన హామీ ఇది.

అంతకుముందు 2015 నవంబరులో వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ- ‘‘1998, 2008 డీఎస్సీ అభ్యర్థుల విషయంలో సమస్య ఉంది. వారికి పోస్టింగులు ఇవ్వాలని నిర్ణయించాం. వారిని కూడా త్వరలో ఉద్యోగాల్లోకి తీసుకుంటాం’’ అన్నారు.

ఎంపికైన అభ్యర్థుల సంఘం ప్రతినిధులను 2016 జనవరి 3న హైదరాబాద్ పిలిపించుకుని ఆయన మాట్లాడారు. వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇది జరిగి ఏడేళ్లు గడిచిపోయాయి. ఇప్పటికీ డీఎస్సీ-2008లో ఎంపికైన బీఈడీ మెరిట్ అభ్యర్థుల సమస్య పరిష్కారం కాలేదు.

డీఎస్సీ

ఫొటో సోర్స్, Getty Images

టీచర్ పోస్టుకు ఎంపికై 14 ఏళ్లు గడిచినా నేటికీ పోస్టింగ్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘‘నేను ఓ పాఠశాలలో మూడేళ్లు ఉద్యోగం చేశా. ఆ తర్వాత అక్కడ ఉద్యోగం పోయింది. ప్రైవేటు స్కూళ్లలో ఉద్యోగం కోసం వెళితే, మీరు డీఎస్సీలో ఎంపికయ్యారు. మీకు ముఖ్యమంత్రి నుంచి హామీ ఉందని అంటున్నారు. ఎప్పుడైనా జాబ్ ఇస్తే వెళ్లిపోతారు, అప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది కదా అంటూ యాజమాన్యాలు ఉద్యోగం ఇవ్వడం లేదు. డీఎస్సీకి ఎంపికై అటు ప్రభుత్వం ఉద్యోగం రాక, ఇటు ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునేందుకు వీల్లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం.

హైకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయడంలేదు. 14 ఏళ్లుగా ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూనే ఉన్నాం. ఎంతో మంది నాయకులను కలిశాం.. ఎన్నోసార్లు ఆందోళనలు చేశాం. అయినా సరే మా విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదు’’ అని 2008 డీఎస్సీలో ఎంపికైన హైదరాబాద్‌ వనస్థలిపురానికి చెందిన కె.విజయలక్ష్మి బీబీసీకి చెప్పారు.

డీఎస్సీ

ఫొటో సోర్స్, Getty Images

ఎస్జీటీ పోస్టులకు అర్హతపై జీవోతో వివాదం మొదలు

2008 డిసెంబరు 6న 52,655 ఉపాధ్యాయ పోస్టులకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇందులో 30,558 సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులున్నాయి.

నోటిఫికేషన్ ప్రకారం ఎస్జీటీ పోస్టులకు బీఈడీ, డీఎడ్ చేసిన వారు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది.

ఆ తర్వాత నోటిఫై చేసిన ఎస్జీటీ పోస్టులలో 30 శాతం అంటే 10,200 పోస్టులను డీఎడ్ అభ్యర్థులకు కేటాయించింది అప్పటి ప్రభుత్వం.

దీని కోసం 2009 జనవరి 29న జీవో నంబరు 28ని తీసుకువచ్చింది.

మిగిలిన 70 శాతం పోస్టులలో బీఈడీ, డీఎడ్ అభ్యర్థులకు అవకాశాం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

పరీక్ష నోటిఫికేషన్ విడుదలైన నెలన్నర తర్వాత డీఎడ్ అభ్యర్థులకు పోస్టులు రిజర్వ్ చేయడంతో వివాదం మొదలైంది.

డీఎస్సీ

ఆ వివాదాస్పద జీవోపై హైకోర్టు ఏం చెప్పింది?

జీవో అన్యాయమని, తమ ఉద్యోగావకాశాలకు ఇబ్బంది ఏర్పడుతుందని బీఈడీ అభ్యర్థులు 2009 ఆగస్టు 31 అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌కు వెళ్లారు. జీవోను ట్రైబ్యునల్ సమర్థించింది.

ట్రైబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ బీఈడీ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

కామన్ మెరిట్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది.

అనంతరం ప్రభుత్వం వేసిన కేబినెట్ సబ్ కమిటీ కూడా అప్పట్లో ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనిపై 2010 జూన్ 21న అప్పటి ప్రభుత్వం జీవో నం.27ను తీసుకువచ్చింది.

నోటిఫికేషన్ ప్రకారమే పోస్టులు భర్తీ చేస్తామని అందులో ప్రకటించింది.

దీనికి తగ్గట్టుగా బీఈడీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియను విద్యా శాఖ చేపట్టింది.

ఇదే సమయంలో తమకు కల్పించిన 30 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డీఎడ్ అభ్యర్థులు ట్రైబ్యునల్‌లో కేసు వేశారు.

ఆ తర్వాత 30 శాతం రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దానికి తగ్గట్టుగా మెరిట్ జాబితా ప్రకటించింది.

దీనిపై బీఈడీ మెరిట్ అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. తమకు ఎక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగానికి ఎంపిక కాలేకపోయామని పిటిషన్‌లో పేర్కొన్నారు.

కేసుపై వాదనలు విన్న తర్వాత నిరుడు సెప్టెంబరు 27న డీఎస్సీ 2008లో ఎంపికైన అభ్యర్థులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. బీఈడీ మెరిట్ అభ్యర్థులను క్యారీ ఫార్వర్డ్ అయ్యాయని ప్రభుత్వం చెప్పిన 1,1815 పోస్టుల్లో సర్దుబాటు చెయ్యాలని ఆదేశించింది.

ఈ విషయంపై డీఎస్సీకి ఎంపికైన సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన రమేశ్ బీబీసీతో మాట్లాడుతూ- ‘‘2008 డీఎస్సీ తర్వాత 1,815 పోస్టులు మిగిలాయని ప్రభుత్వం చెబుతోంది. అలా మిగిలిన ఖాళీల్లో బీఈడీ మెరిట్ అభ్యర్థులను సర్దుబాటు చేయాలని హైకోర్టు చెప్పింది. అయితే అప్పటి పోస్టుల భర్తీకి వీలవ్వదంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. జీవో నం.28 చెల్లుబాటుపై మరోసారి విచారించాలని హైకోర్టును ఆదేశిస్తూ సుప్రీంకోర్టు కేసును బదిలీ చేసింది. దీనిపై వేసవి సెలవుల తర్వాత హైకోర్టులో విచారణ ప్రారంభమయ్యే అవకాశముంది’’ అని చెప్పారు.

బీఈడీ అభ్యర్థుల ఆందోళన (పాతచిత్రం)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బీఈడీ అభ్యర్థుల ఆందోళన (పాతచిత్రం)

పోస్టింగ్ ఇవ్వడం సాధ్యమేనా?

అయితే 2008 డీఎస్సీ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేయడం కుదరదని ప్రభుత్వం ఇప్పుడు చెబుతోంది. అప్పుడు మిగిలిన 1,815 పోస్టులను గుర్తించి సర్దుబాటు చేయాలని హైకోర్టు చెప్పింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విద్యావేత్తలు చెబుతున్నారు.

ఈ విషయంపై టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్ రెడ్డి హర్షవర్దన్ రెడ్డి బీబీసీతో మాట్లాడారు.

‘‘డీఎస్సీ 2008 అభ్యర్థులకు న్యాయం చేస్తామని 2016 జనవరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. అప్పట్లో హైదరాబాద్ పిలిపించుకుని అభ్యర్థులతో మాట్లాడి వారం రోజుల్లో నియామకపత్రాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు వారికి న్యాయం జరగలేదు. ఎంతో కష్టపడి చదువుకుని వేల మందితో పోటీ పడి పరీక్ష రాసి ఎంపికయ్యారు. 2008 నుంచి పోస్టింగుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. వారికి ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలి’’ అని ఆయన కోరారు.

డీఎస్సీ, తెలంగాణ

ఫొటో సోర్స్, Getty Images

బీఈడీ మెరిట్ అభ్యర్థుల కంటే ఆ పోస్టుల సంఖ్య ఎక్కువ

హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 1,815 పోస్టులలో ఎంపికైన అభ్యర్థులను సర్దుబాటు చేయాలి.

గతంలో రెండు వేల మంది ఉంటారని అంచనా వేశారు.

గత 14 ఏళ్లలో చాలా మంది వేర్వేరు ఉద్యోగాలకు వెళ్లిపోయారని అభ్యర్థులు చెబుతున్నారు.

హైకోర్టులో పిటిషన్ వేసిన వారిలో 815 మంది ఇంకా పోస్టింగ్ కోసం చూస్తున్నట్టు 2008 డీఎస్సీ బీఈడీ మెరిట్ అభ్యర్థుల అసోసియేషన్ నేతలు బీబీసీకి చెప్పారు. వీరు కాకుండా మరో 300 మంది వరకు పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. ఈ లెక్క ప్రకారం చూస్తే బీఈడీ మెరిట్ అభ్యర్థుల కంటే ‘క్యారీ ఫార్వర్డ్ అయిన’ పోస్టుల సంఖ్య ఎక్కువ.

‘‘ఏళ్ల తరబడిగా ఎదురుచూడలేక వేర్వేరు ఉద్యోగాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం వేయి మంది అభ్యర్థులు ఉండవచ్చని మా అంచనా. ఆంధ్రప్రదేశ్ సర్దుబాటు చేసినట్లుగా మాకు ఉద్యోగాలు ఇవ్వాలి’’ అని విజయలక్ష్మి బీబీసీతో అన్నారు.

డీఎస్సీ, తెలంగాణ

ఏపీ తరహాలోనైనా ఇవ్వాలి: అభ్యర్థులు

ఆంధ్రప్రదేశ్‌లో 2008 డీఎస్సీలో ఎంపికైన బీఈడీ అభ్యర్థులకు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం రెండేళ్ల కిందట పోస్టింగులు ఇచ్చింది. పోస్టింగులు ఇవ్వడానికి ముందు, ఏపీలో 4,657 మంది మెరిట్ అభ్యర్థులు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది.

గతంలో వారికి పోస్టింగులు ఇచ్చే విషయంపై టీడీపీ హయాంలో ఆరుగురు ఎమ్మెల్సీలతో ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ ప్రభుత్వానికి తన నివేదిక అందించింది. మినిమం టైం స్కేల్(ఎంటీఎస్) ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలని సూచించింది.

కమిటీ మార్గదర్శకాల ప్రకారం వైసీపీ ప్రభుత్వం 2,193 మందిని అర్హులుగా గుర్తించింది. వారికి 2021 జూన్‌లో కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగాలు ఇస్తూ జీవో నం.39 ఇచ్చింది.

కనీసం ఏపీ తరహాలో తమకు ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణలోని అభ్యర్థులు కోరుతున్నారు.

2008 డీఎస్సీ బీఈడీ మెరిట్ అభ్యర్థుల నియామకాల అంశంపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బీబీసీ సంప్రదించింది. అయితే, ఈ విషయంపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు.

వీడియో క్యాప్షన్, ‘కేజీ టు పీజీ’ ఉచిత విద్య అమలు ఎంత వరకు వచ్చింది?

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)