విశాఖలో రహస్యంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు.. ఇది ఏ స్థాయిలో ఉంది?

వినయ్ కుమార్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, వినయ్ కుమార్ ఆర్థిక ఇబ్బందులతో దళారుల మాటలు నమ్మి కిడ్నీ అమ్ముకున్నారు.
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

“కిడ్నీ అమ్ముకుంటే ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయని ఆశ పెట్టారు, నాకు భయమేసింది. ఆ తర్వాత నేను ఏడాది పాటు వేరే రాష్ట్రానికి పనికి వెళ్లిపోయాను. ఏడాది తర్వాత తిరిగి వచ్చిన నాకు ఎక్కువ డబ్బులు ఆశ చూపి కిడ్నీ ఇచ్చేటట్లు చేశారు” అని విశాఖపట్నానికి చెందిన శ్రీనివాస్ చెప్పారు.

ఇలాగే విశాఖకు చెందిన వినయ్ కుమార్ కూడా ఆర్థిక ఇబ్బందులతో దళారుల మాటలు నమ్మి మూత్రపిండం అమ్ముకున్నారు. ఇస్తానన్న డబ్బులు ఇవ్వకుండా దళారులు మోసం చేశారంటూ ఆయన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వినయ్‌తో మాట్లాడేందుకు ఆయనుండే మధురవాడ వాంబే కాలనీకి వెళ్లిన బీబీసీ బృందానికి ఆటోడ్రైవర్లు, దినసరి కూలీలుగా పని చేసుకునే మరో ముగ్గురు తారసపడ్డారు. వీరు కూడా తమ కిడ్నీలను అమ్ముకున్నారు.

విశాఖపట్నంలో చట్టవిరుద్ధంగా 10 శాతం మేర కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయని నగర పోలీసు కమిషనర్ కూడా ఇటీవల మీడియా సమావేశంలో చెప్పారు.

ఇక్కడ కిడ్నీల వ్యాపారం ఎలా జరుగుతోంది? వాటిని ‘కొనేందుకు’ దళారులు ఎలా వల వేస్తున్నారు?

వినయ్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, డబ్బులు ఇవ్వకుండా దళారులు మోసం చేశారని వినయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు

అవసరంలో ఉన్నవారికి ఆశ చూపుతారు

అద్దె ఆటో మానేసి సొంత ఆటో ఉంటే బాగుణ్ణు అని వినయ్ కుమార్‌ ఆలోచించారు. కిడ్నీ అమ్ముకుంటే కొత్త ఆటో కొనుక్కోవచ్చని తనకు దళారులు కామరాజు, ఇలియానా ఆశ పెట్టారని ఆయన చెప్పారు.

మరి కొందరిని కూడా ఆర్థిక అవసరాలు తీరాలంటే కిడ్నీ అమ్ముకుంటే సరిపోతుందని ప్రలోభపెట్టారు. అలా చేసేందుకు భయపడిన వారిని నిరంతరం ట్రాక్ చేస్తూ, వారిని ఎలాగోలా ఒప్పించేవారు. మధురవాడ వాంబే కాలనీలో బీబీసీతో మాట్లాడిన కొందరు ఈ విషయం చెప్పారు.

ఇలానే కిడ్నీ ఇచ్చిన శ్రీనివాస్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘డబ్బుల విషయంలో మా ఇంట్లో చిన్న గొడవ జరిగింది. ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. ఆ సమయంలో నా వద్దకు వచ్చి డబ్బులిచ్చి, మందు పట్టించారు. కిడ్నీ అమ్ముకుంటే కష్టాలు తీరిపోతాయన్నారు. భయంతో వాళ్లతో మాట్లాడటం మానేశాను’’ అని చెప్పారు.

“కానీ, కొన్ని రోజుల తర్వాత మళ్లీ కిడ్నీ ఇచ్చేలా నన్ను వారు ఒప్పించారు. పెందుర్తిలోని తిరుమల ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి కిడ్నీ తీసేశారు. అప్పుడు నాతో పాటు మరో నలుగురు పేషెంట్లు అక్కడ ఉన్నారు. నాకు రూ. 15 లక్షలు ఇస్తామని చెప్పి, ఒక లక్ష రూపాయలు, ఒక ద్విచక్ర వాహనం ఇచ్చారు. మిగతా డబ్బులు అడిగితే, ఎక్కువ మాట్లాడితే ఇచ్చినవి కూడా లాక్కుంటామని బెదిరించారు” అని శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.

అలాగే రూ. 8.5 లక్షలు ఇస్తామని చెప్పి, రూ. 2.5 లక్షలు మాత్రమే ఇచ్చారని, మిగతా డబ్బులడిగితే అమ్మనాన్నలను ఏదైనా చేస్తామని బెదిరించారని వినయ్ కుమార్ చెప్పారు.

పెందుర్తిలోని తిరుమల ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి కిడ్నీ తీసేశారని శ్రీనివాస్ చెప్పారు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పెందుర్తిలోని తిరుమల ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి కిడ్నీ తీసేశారని శ్రీనివాస్ చెప్పారు

నిబంధనలకు విరుద్ధంగా అవయవదానం జరిగితే శిక్ష ఏమిటి?

విశాఖలో నిబంధనలకు విరుద్ధంగా అవయవాల మార్పిడి జరుగుతోందనే విషయం ఇక్కడి వారితో మాట్లాడిన తర్వాత స్పష్టమవుతోంది.

అవయవాల మార్పిడిలో కిడ్నీల‌కు డిమాండ్ ఉంటుందని, ఈ డిమాండ్ వల్లే మిగతా అవయవాల కంటే అక్రమ అవయవాల మార్పిడిలో కిడ్నీలదే ప్రథమ స్థానమని ఆంధ్రప్రదేశ్ జీవన్ దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు బీబీసీతో చెప్పారు.

‘‘మన దేశంలో చక్కెర వ్యాధిగ్రస్థులు ఎక్కువ. షుగర్ పేషెంట్లలో నలుగురిలో ఒకరికి కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ కిడ్నీలకే ఎక్కువ డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ జీవన్ దాన్ వెబ్ సైట్లో 2,800 మంది అవయవదానం కోసం ఎదురు చూస్తుంటే వాటిలో కిడ్నీల కోసం ఎదురు చూస్తున్నవారే 1800 మంది ఉన్నారు. దీనిని బట్టి కిడ్నీలకు ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు’’ అని ఆయన వివరించారు.

అవయవాలు అవసరమైన వారు, దానం చేద్దామని ముందుకు వచ్చేవారు జీవన్ దాన్ వైబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇక్కడ అవసరమైనవారు ఎక్కువ, దాతలు తక్కువగా ఉంటున్నారు.

అవయవాలకు డిమాండ్ పెరగడం వల్ల డబ్బులు ఆశ చూపి అక్రమ మార్గంలో వాటిని పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, విశాఖపట్నంలో అలాంటి కేసులే బయటపడ్డాయని రాంబాబు చెప్పారు.

జీవన్ దాన్‌లో రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరైనా అవయవదానం చేస్తే అది చాలా పెద్ద నేరం. వారికి ఐదు నుంచి పది సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష పడుతుంది. నిబంధనలు ఉల్లంఘించి ఆపరేషన్ చేసిన డాక్టర్ల రిజిస్ట్రేషన్, ఆపరేషన్ జరిగిన ఆసుపత్రి రిజిస్ట్రేషన్ రద్దవుతాయని అవయవ మార్పిడి చట్టం-1994 చెప్తోంది.

తనను దళారులు మోసం చేశారని వినయ్ కమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, తనను దళారులు మోసం చేశారని వినయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు

"డబ్బులు అవసరం ఉంది, మా అవయవాలు అమ్మి పెట్టండి, మేడం" అంటూ తనకు రోజూ ఫోన్ కాల్స్ వస్తుంటాయని గూడూరు సీతామహాలక్ష్మి చెప్పారు.

ఆమె అఖిల భారత శరీర అవయవదాతల సంఘం స్థాపించి, అవయవదానంపై 17 ఏళ్లుగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

“పేదవాళ్లు నేడు మొబైల్ ఆర్గాన్ బ్యాంక్స్ అయిపోయారు. వారి ఆర్థిక అవసరాలు వారిని అవయవాలు అమ్ముకునేలా చేస్తున్నాయి. అవయవాల కోసం ఎదురు చూస్తున్న కొందరు సంపన్నుల కోసం దళారులు రంగంలోకి దిగుతున్నారు. అవయవాలు అమ్ముతామని నాకు నెలకు 30, 40 ఫోన్ కాల్స్ వస్తాయి. నేను వాళ్లకు డబ్బులకి అవయవాలు అమ్ముకోవడం తప్పు అని చెప్తుంటాను. నా వల్ల పని జరగలేదు కాబట్టి, నాకు ఫోన్ చేసిన వారే ఇతర మార్గాలలో దళారులను, ఆసుపత్రులను ఆశ్రయిస్తుంటారు’’ అని ఆమె బీబీసీతో చెప్పారు.

‘‘నాకు తెలిసి విశాఖ జిల్లాలో అనధికారికంగా ఏడాదికి వందైనా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయి. బాధితులుగా మారిన తర్వాత మళ్లీ మమ్మల్ని సంప్రదిస్తారు. కానీ అప్పటీకే చేయిదాటిపోతుంది” అన్నారు.

‘‘అక్రమ అవయవాల మార్పిడి కోసం గ్రహీతకు, దాతకు మధ్య తప్పుడు ఆధార్ కార్డులతో బంధుత్వాలని సృష్టిస్తున్నారు. వీరికి అధికారుల అండదండలు కూడా ఉంటున్నాయి’’ అని సీతామహాలక్ష్మి అన్నారు.

పేదల ఆర్థిక అవసరమే అవయవాల అక్రమ వ్యాపారానికి పెట్టుబడిగా మారిందని, విశాఖలో పేదల కాలనీలు, మురికివాడలపై దళారులు దృష్టి పెట్టారని ఆమె తెలిపారు.

పెళ్లిలో గూడూరు సీతామహాలక్ష్మికి అవయవదాన పత్రాలు అందజేసిన కొత్త జంట సజీవ రాణి, సతీష్ కుమార్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పెళ్లిలో గూడూరు సీతామహాలక్ష్మికి అవయవదాన పత్రాలు అందజేసిన కొత్త జంట సజీవ రాణి, సతీష్ కుమార్

కిడ్నీ మార్పిడి కోసం లక్షల మంది ఎదురుచూపులు

ఎవరికైనా బ్రెయిన్ డెడ్ అయితే... వారి బంధువుల అనుమతితో అతని/ఆమె అవయవదానం చేయవచ్చు. అలాగే రక్త సంబంధీకులు వారి కుటుంబ సభ్యులకు అవయవదానం చేయవచ్చు. రెండు కిడ్నీలు, రెండు కళ్లు, రెండు ఊపిరితిత్తులు, కాలేయం, గుండె ఇలా ఒక మనిషి అవయవదానం చేస్తే ఎనిమిది మందికి ప్రాణం పోయవచ్చు.

అయితే అవయవదానంపై అవగాహన లేకపోవడంతో ప్రమాదాల్లో మరణించినవారు, బ్రెయిన్ డెడ్ అయినవాయిన వారి శరీరంలోని అవయవాలు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయని నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజ్ అన్నారు.

ఉద్దానం కిడ్నీ రోగులపై రెండు దశాబ్దాలు పరిశోధనలు చేసిన డాక్టర్ రవిరాజ్, జీవన్ దాన్ ప్రారంభించడంలో కీలకపాత్ర పోషించారు. డాక్టర్ రవిరాజ్ చెప్పిన లెక్కలు చూస్తే...

  • కిడ్నీ మార్పిడి అవసరమైన వాళ్లు దేశంలో ఏటా సుమారు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది పెరుగుతున్నారు.
  • పాతవాళ్లందరిని కలుపుకుంటే దేశంలో సుమారు 7 లక్షల నుంచి 8 లక్షల మంది కిడ్నీ మార్పిడి కోసం ఎదురు చూస్తున్నారు.
  • దేశంలో వివిధ ప్రమాదాల్లో 2 లక్షల నుంచి 3 లక్షల మంది మరణిస్తున్నారని అంచనా.
  • వీరి శరీరాలను అవయవదానానికి ఇచ్చేది చాలా తక్కువ.
  • జీవన్ దాన్ ద్వారా జరిగే అవయవాల దానంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది.
  • ఆంధ్రప్రదేశ్‌లో నెలకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో అధికారికంగా 5 నుంచి 10 అవయవ మార్పిడి అపరేషన్లు జరుగుతుంటాయి.
  • వీటిలో విశాఖలో నెలకు రెండు లేదా మూడు జరుగుతాయి.
వీడియో క్యాప్షన్, లక్షలిస్తామంటూ పేదవారి కిడ్నీలు మాయం చేస్తున్న హైటెక్ మాయగాళ్లు

నిబంధనలు ఏం చెప్తున్నాయి?

అవయవ మార్పిడి నిపుణులైన వారి ఆధ్వర్యంలో జరగకపోతే గ్రహీత, దాత ఇద్దరూ తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని జీవన్ దాన్ స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు బీబీసీతో చెప్పారు. అవయవాల మార్పిడిలో ఆసుపత్రులు ఎలాంటి నిబంధనలు పాటించాలో ఆయన వివరించారు.

  • ముందు అవయవ గ్రహీత, దాతల మధ్య ఎలాంటి నగదు లావాదేవీలు లేకుండా పరస్పర అంగీకారం ఉండాలి.
  • అవయవ మార్పిడి ఆపరేషన్ చేసే ఆసుపత్రి ముందుగా ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
  • ఒక్కో అవయవానికి ఒక్కో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి
  • అప్పుడు విశాఖ, గుంటూరు, కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న అవయవదాన కమిటీ సభ్యులు ఆ ఆసుపత్రులను పరిశీలిస్తారు.
  • అక్కడున్న సౌకర్యాలు, వైద్యపరికరాలు, సిబ్బంది, సర్టిఫికేట్స్ పరిశీలన చేస్తారు.
  • అన్నీ సరిగా ఉంటే అనుమతి ఇస్తారు. అప్పుడే అవయవ మార్పిడి ఆపరేషన్లు చేయాలి.
  • ఇటువంటివి పాటించకుండా అపరేషన్లు చేస్తే చట్టరీత్యా నేరం, ఐదు నుంచి పదేళ్లు కారాగార శిక్ష ఉంటుంది.
  • వైద్యులు, ఆసుపత్రుల అనుమతి కూడా రద్దు చేస్తారు.

‘‘ఇటువంటి నిబంధనలు పాటించకుండా కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో అనధికారికంగా అవయవమార్పిడి అపరేషన్లు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని అవయవాల మార్పిడికి ఒప్పిస్తున్నారు. ఆ తర్వాత వారికి అనుకున్న డబ్బులు ఇవ్వడం లేదు. అటువంటి సమయంలోనే అక్రమ అవయవ మార్పిడి వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయి’’ అని రాంబాబు చెప్పారు.

కిడ్నీలు

ఫొటో సోర్స్, Thinkstock

పోలీసుల విచారణలో ఏం తేలింది?

2019లో విశాఖలో అక్రమంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగిన తర్వాత.. మరోసారి ‘కిడ్నీ రాకెట్’ అంటూ అలజడి రేగింది. ఈసారి మాత్రం ఒకే చోట నలుగురు బాధితులు ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది.

ఇటువంటి కేసులు చాలా వరకు కొత్తగా ఏర్పాటు చేసిన ఆసుపత్రులలో జరుగుతున్నాయి, భారీ పెట్టుబడి తర్వాత లేదా ఆదాయం బాగా లేని ఆసుపత్రుల్లో ఇవి వెలుగులోకి వస్తున్నాయి.

వేగంగా డబ్బు సంపాదించడానికి కొన్ని ఆసుపత్రుల వారు ఇలా చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

‘‘కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగిన విశాఖ పెందుర్తి తిరుమల ఆసుపత్రిలో కూడా ఇదే జరిగింది. ఇంకా నిర్వహణకు అనుమతులే రాని ఈ ఆసుపత్రిలోని రెండో అంతస్తులో అపరేషన్‌కు సిద్ధం చేసి ఇచ్చినందుకు రోజుకు రూ. 60 వేలు తీసుకున్నట్లు విచారణలో తేలింది’’ అని నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ ఇటీవల మీడియా సమావేశంలో చెప్పారు.

విశాఖ కిడ్నీల అక్రమ మార్పిడి వ్యవహారంలో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో వైద్యులు, దళారులు ఉన్నారు.

“విశాఖలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయి. అది కిడ్నీ రాకెట్ కాదు. కిడ్నీ అవసరం ఉన్న వాళ్లు, వారి బంధువుల వద్ద నుంచో, జీవన్ దాన్ ద్వారానో పొందుతున్నారు. 90 శాతం అధికారికంగానే జరుగుతున్నాయి. మిగతా 10 శాతమే చట్టవిరుద్ధంగా జరుగుతున్నాయి. 2019లో అక్రమ అవయవల మార్పిడి వ్యవహారంలో పట్టుబడిన వ్యక్తే మళ్లీ ఈసారి కూడా దొరికాడు. ఇటువంటి వారితో పాటు అవయవాల మార్పిడిన వ్యాపారంగా చేస్తున్న దళారులపై దృష్టి పెట్టాం” అని విశాఖ నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)